Sunday, April 30, 2017

స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము


- వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.

కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు


దృతరాష్ట్రుని విలాపం
తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద ప్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.

ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము

సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.

ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు

అతడిని చూసి సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ! ఇంతకు ముందు నీవు సృంజయుడి కథ విన్నావు కదా ! అభిమన్యుడి మరణానికి ధర్మరాజు దుఃఖిస్తుంటే నారదుడు ఈ కథ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా ! నీ మంచికోరే మంత్రుల మాట వినలేదని అన్నావు కదా ! నీకూ, నీ కుమారుడికీ శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు వీరే కదా మంత్రులు ! వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి. నీ కొడుకు ఎదుటి వాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా ! విదురుడు చెప్పింది విన్నాడా ! నీవు అతడికి బుద్ధిచెప్పి అతడిని కట్టడి చేసి అతడి అకృత్యాలను ఆపగలిగావా ! నీకూ నీ కుమారుడికీ లోభత్వం బాగా వంటబట్టి ఎవరి మాటా వినలేదు. కనుక నీ దు:ఖం మాను. నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట పెట్టుకుని మధ్యలో కూర్చుని అయ్యో కాలిపోతున్నాను అని గొంతెండి పోయేలా అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి చూపుతారా ! నీ కుమారుడి పరుషవాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం అయ్యారు. ఇక విచారించడం ఎందుకు " అన్నాడు.

ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట

ఇంతలో అక్కడకు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని చూసి " చేసింది చాలక ఇంకా నేల మీద పడి దొర్లిదొర్లి ఏడుస్తున్నావా ! ఏడిచింది చాలు కాని ఇక లే ! " అన్నాడు. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు లేచి కూర్చున్నాడు. దుఃఖమును ఆపుకున్న ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు " ధృతరాష్ట్ర మహారాజా ! పెరుగుట విరుగుట కొరకే కొత్తకొత్త రుచుల కొరకు అర్రులు చాస్తే ఉన్న రుచే పోతుంది పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఎంత దగ్గరైతే అంత దూరం కావడమే ప్రకృతి సహజం. దీనిని తప్పుకొనుట ఎవరికైనా సాధ్యమా ! యమధర్మరాజు తన పాశముతో ప్రాణుల ప్రాణమును హరించునప్పుడు వీడు మంచి వాడా, చెడ్డ వాడా, ధనికుడా, పేద వాడా, వీరుడా పిరికి వాడా అని చూడడు ఎలాంటి వాడైనా చావు తప్పదు. యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా ! ఎక్కడ ఉన్నా చావును తప్పించుకో లేడు. కనుక చావును గురించి చచ్చినవారి గురించి దుఃఖించడం దండగ. నీ కుమారులందరూ యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొంది స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు. నువ్వు వారికొరకు దుఃఖిస్తున్నావు. అయినా ! పండితుడవు జ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏముంది. మనిషి పుట్టిన తరువాత బాల్యము, యవ్వనము, అందచందాలు, ఈ ప్రకృతి, అందున్న పదార్ధములు అన్నీ మిద్య, అశాశ్వితమైన స్థిరము కాని వాటి కొరకు దుఃఖించుట తగదు. తెలివి కలిగిన వారు దుఃఖించరు. దుఃఖం సర్వ అనర్ధములకు హేతువు. కాగల కార్యము మీద మనసు నిలుపు. మహారాజా ! మామూలు మనుషుల ఆలోచనాపరిధి చిన్నది. కనుక వారు చిన్న దుఃఖమునకు, కూడా తట్టుకోలేరు. తమకు ప్రియమైనది దూరమైనా కోల్పోయినా వారి జ్ఞానం నశించి దుఃఖిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు. కాని జ్ఞానులకు పండితులకు ప్రియము అప్రియము ఉండదు. అన్నీ సమానంగా చూస్తారు.

ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట

విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొంది " విదురా ! నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింప చేసాయి. విదురా ! నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా ! వారు అలా ఎలా ఉండగలరు " అని అడిగాడు. విదురుడు " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! సంసారమనే వృక్షము అరటి చెట్టు వలె దుర్బలమైంది, నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారం అందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురి ఔతున్నాడు. ప్రస్థుతం మనకు లభించిన ఈ శరీరం పతనమై మరొక శరీరం లభిస్తుంది అంతేకాని ఈ శరీరం శాశ్వతం కాదుకదా ! అది తెలుసుకున్న వాడు నీ మాదిరి వ్యధచెందడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి జీర్ణమైన ఒక వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రమును ధరించిన మాదిరి ఒక శరీరం వదిలి వేరొక శరారాన్ని ధరిస్తాడు. కుమ్మరి వాడు కుండను చేసే సమయంలో మధ్యలోనే విరుగ వచ్చు, లేకున్న కుండగా తయారైన తరువాత విరుగవచ్చు, దానిని కాల్చే సమయాన విరిగి పోవచ్చు, వాడుకునే సమయాన కింద పడి విరిగి పోవచ్చు. కనుక ఈ మట్టి కుండ ఏ దశలో విరుగుతుందో చెప్ప లేము కదా ! మానవుడూ అంతే ! పురుషుడి తేజస్సు స్త్రీ అండముతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అది అండ దశలో విచ్ఛిత్తి కావచ్చు, ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కాని ప్రసవ సమయంలో కాని, శిశువుగా జన్మించిన తరువాత గాని, బాల్యంలో కాని, యవ్వనంలో కాని, వృద్ధాప్యంలోగాని ఎప్పుడైనా సంభవించ వచ్చు. కనుక ఈ శరీరం ఎప్పుడైనా మరణించ వచ్చు. కనుక మరణానంతరం మనం చేసే సుకృత, దుష్కృత ఫలితంగా స్వర్గనరకములు ప్రాప్తిస్తాయి. కనుక మరణించిన వారి కొరకు దుఃఖించడం అవివేకం. వివేకం కల వారు ఈ సంసారం దుఃఖభూయిష్టం అని ఎరిగి దాని అందు చిక్కుకొనరు. కనుక నీవూ చచ్చిన పుత్రులకొరకు విచారించక నీవు ముక్తి పొందే మార్గం ఆలోచించు " అని చెప్పాడు విదురుడు.

ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట

విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో " విదురా ! అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది. దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి " అని అడిగాడు. విదురుడు " మహారాజా ! పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరుగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆశిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభ విస్తుంది. ఆ శిశువు వేదనను భరించ లేక గర్భముఖద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది. ఆశిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి, అశుచి తెలియదు. వివేకము తెలియదు. ఆట పాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశిసించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగాడే ఇంద్రియ లోలత్వం వలన సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనమూ గడిచి పోతుంది. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగి పోయి వ్యాధి పీడితుడు ఔతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యములను చేస్తాడు. వ్యాధిప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించి పోతాడు. అప్పుడు యముడు వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ, క్రోధ, మదోన్మత్తులై లోభంతో అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులౌతారు. చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున పయనిస్తారు.

సంసారమును అధిగమించుట

విదురుడు తన మాటలను కొన సాగిస్తూ ధృతరాష్ట్రమహారాజా ! నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దలవలన విని యున్నాను అది నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను. దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నాంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో ఆడ్డదారిలో పరుగెడగా ఆ కౄర జంతువులు అతడిని వదిలి వెళ్ళి పోయాయి. ఇంతక్లో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది. ఆ బ్రాహ్మహ్మణుడు ప్రాణ భయంతో కాళ్ళు గజగజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారి పోసాగాడు. వెనుక నుండి దొంగలు ముందు నుండి కౄరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒకస్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. అయిదు తలలు కలిగిన ఏనుగులను చూసాడు. ఆస్త్రీని విడిపించుకుని పరుగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడ సాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగి పోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొరకడంతో ఏనిముషమైనా పాడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలు ఔతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావ లేదు " అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా ! ఈ కథ నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు " అన్నాడు.

సన్మార్గ బోధన

విదురుడు " మహారాజా ! ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ మన జీవితంలాంటిది. ఈ కథని వివరిస్తే కాని అర్ధంకాదు. ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం. అందు ఉన్న క్రూరమృగములు, దొంగలు, మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలి తనము, అయిదు తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు, దాని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు, పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు. ఆచెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝోంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు. పూలనుండి స్రవిస్తున్న మకరందం సుఖసంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసారచక్రంలో బంధించ బడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వితమైన ఆనందాన్ని పొందుతారు. .

విదురుని జ్ఞానబోధ

ఓ ధృతరాష్ట్ర మహారాజా ! నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈ బురద గుంటలో మునుగుతూ తేలుతూ తననుతాను మరచి పోతాడు మానవుడు. శరీరబలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది. సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా ! ఈ దేహమే ఒక రథము. బుద్ధి రథ సారథి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలు పఠిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్ఛవచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. వివేక వంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా ! నీ కుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధుమిత్రులకు దహనసంస్కారం జరిపించు " అని అన్నాడు విదురుడు.

వ్యాసుడి రాక

విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహామునీ ! చూసితివా ! నా దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు " కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా ! అసలు నీకుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా ! కురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను.

ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట

ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహా మునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది " దేవతలారా ! ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు. నాకు రోజు రోజుకు భారం పెరిగి పోతుంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి " అని అడిగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరు నవ్వుతో " భూదేవీ ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్టుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. సోదరసమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గ కలదు " అని పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళి పోయింది. విష్ణువు ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహా బలిష్టుడు, కోపిష్టి పరుల ఉన్నతిని సహించ లేడు. అతడు ఎవరిని లక్ష్యపెట్టక అందరితో వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధు మిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు.

వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యంచెప్పుట

కానీ నీ మనసులో ఒక సందేహం ఉంది. పాండుసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్భుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక అపకారబుద్ధిని ప్రదర్శించ లేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక విధముల సంధి చేసుకొనుట మంచిదని నీకుమారునకు చెప్పాను నీ కుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం ఎవరూ తప్పించ లేరుకనుక కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు. అతడు సాటి మనుష్యుల అందే కాదు పశుపక్షులందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకూ తెలుసు. ధర్మరాజుకు నీ అందు విముఖత లేదు. కనుక పాడవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞావివైన నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధంచెయ్యి. ప్రశాంతిని పొందు " అని పలికాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో " మహానుభావా ! అమృతతుల్యమైన నీ మాటలు నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను " అని పలికాడు. ఆమాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి " సంజయా ! మనం యుద్ధ భూమికి వెళదాము అందుకు కావలసిన సన్నాహములు కావించండి. గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం కమ్మని చెప్పు " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేసాడు.

ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట

పుత్రశోకంతో గాంధారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారికోడళ్ళు కంటికిమంటికి ఏకథారగా ఏడుస్తున్నారు. దుఃఖభారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా పట్టించికునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తుంది. అందరూ ఓదారుస్తున్నారు. హస్థినాపరంలో ఉన్న సాధారణ స్త్రీలపని అలాగే ఉంది. వారిని ఓదార్చే వారే కరువైయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యాబిడ్డలు అనాధలవలె మిగిలారు. వాళ్ళలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అందరి ఇళ్ళు అర్తనాదాలతో నిండి పోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత చెందింది. యుద్ధపరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా ! ఎంత మందిని అని ఓదార్చగలడు. కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి " మహారాజా ! నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము ముగ్గురం తప్ప మిగిలిన కురుసైన్యమంతా మరణించింది " అన్నారు.

కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట

గాంధారిని చూసిన కృపాచార్యుడు దుఃఖం ఆగక " అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా ! నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు సుయోధనుడిని అధర్మంగా నాభి కిందభాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజములను హయములను దారుణంగా చంపాము. కనుక పాండవులవిజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు. లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపినవిషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు శలవిప్పించండి వెళతాము " అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయ మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత ధృతరాష్ట్రుడు అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట

ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను అంరదినీ పోగొట్టుకుని మనసంతా దహించుకు పోతున్న మనసుతో వస్తున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవర పడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, ద్రౌపది వెళ్ళారు.

కురుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట

ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేసారు. మరి కొంత మంది ధర్మరాజును తిట్ట సాగారు " ఇతడు ధర్మరాజట ! ఇతడికి ధర్మం తెలుసా ! ఇతడికి జాలి దయా ఉన్నాయా ! ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులనూ చంపాడు. వీడికి కనికరమేమిటి ! " అని ఈసడించుకొనగా ! మరి కొంత మంది ధర్మరాజుకు వెళ్ళి " ఓ ధర్మరాజా ! చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు మనసెలా ఒప్పింది " అని అడిగాడు. మరికొంత మంది " ఓయీ ధర్మరాజా ! చెల్లెలి భర్త అని చూడక జయధ్రధుడిని చంపించావే ! శ్మశానం లాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టకట్టుకుని ఊరేగు " అన్నారు. ఎవరేమన్నా ! పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అయినా వారు తిట్టడం ఆపలేదు. ఇంకొంత మంది పాండవులకు అడ్డంగా వచ్చి " ఒయీ ! ధర్మరాజా ! నీ వలన కాదా ! అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది. నీ మరుదులందరినీ వధించినా నీ రక్త దాహం తీరలేదా ! " అన్నారు. అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు.

ధృతరాష్ట్ర హృదయం


భీముని లోహ విగ్రహాన్ని ముక్కలు చేస్తున్న ధృతరాష్ట్రుడు
తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారు వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహవిగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు ఘాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా ! అతడు మూర్చిల్లాడు. తరువాత " నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను " అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు. నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని నీ ముందుంచాను. నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలం ముందు ఈ భీముడెంత ! ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు ! కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా ! అయినా మహారాజా ! భీముడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా ! అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప " అన్నాడు.

శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట


బాధపడుతున్న ధృతరాష్టుడిని ఓదారుస్తున్న కృష్ణుడు
ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తనవంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు " ధృతరాష్ట్ర మహారాజా ! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు నీకు పరి పరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా ! అది నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు. జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా ధర్మమా ! నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు " అని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు " కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను " అని పలికి. తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.

వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట


గాంధారి వారిస్తున్న వ్యాసుడు
ధృతరాష్ట్రుడు పాండవులతో " పాండుకుమారులారా ! మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చండి " అన్నాడు. ధర్మరాజాదులు తమ పెదతల్లి గాంధారి వద్దకు వెళ్ళారు. ఆమెకు నమస్కరించారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ " అమ్మా గాంధారీ ! ధర్మరాజును శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం ఎందుకు. సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా ! " ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది " అన్నావు. అదేనిజమైంది. ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా ! అసూయను వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు. నిదానించి యోచించిన నీకే అర్ధం ఔతుంది. అమ్మా ! గాంధారి ! జరిగి పోయిన విషయం తలచి బాధపడిన ఫలితమేమి ! కనుక పాండవుల మీద కోపం మాను " అన్నాడు. .

గాంధారి శాంతించుట

ఆ మాటలకు శాంతించిన గాంధారి " మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ కీడు తపపెట్ట లేదు. కుమారులను పోప్గొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే నా కుమారుడి దుర్బుద్ధి దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దొర్బోధలు కురు వంశ నాశనానినికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నా మారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా ! " అని పలికింది. ఆ మాటలు విన్న భీముడు గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు " అమ్మా గంధారీ దేవీ ! నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా ! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది. నీ కుమారుడు ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమిని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మమం కాదా ! నేను క్షత్రుయుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కురుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్న మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కురుసభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను " సుయోధనా ! అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము " అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు, చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు " అన్నాడు.

గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట

గాంధారి కొంత సేపు ఆలోచించింది " భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తోడలు విరుచుట ధమమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే ! కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా ! ఇది ధర్మమా ! " అని అడిగింది. భీముడు " సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా ! నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ చేసుకోవడానికి నేను అలా చేసాను. కాని నెత్తురు నోటికి తాగించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కురువీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా చేయకుంటే కురు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగెపాతకం చేసేంత దుర్మార్గుడినా ! నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు " అన్నాడు.

గాంధారి ఆగ్రహం

గాంధారి అంతటితో ఊరుకోలేదు " భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే ! ఇది ధర్మమా ! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించ లేదా ! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా ! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా ! " అని పక్కకు తిరిగి " ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు " అని కోపంగా అరిచింది. ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ " అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును. నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా ! నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాజ్ఞిలో నన్ను ధగ్ధం చెయ్యి. అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను అనుభవిస్తాను. బంధు మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల ఈ శరీరంలో ప్రాణం ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు " అని భోరున ఏడ్చాడు. ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి " నాయనలారా ! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి " అన్నది. హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు వెళ్ళారు.

పాండవులు కుంతీ దేవిని చూచుట

చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా స్పందించింది. పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాడవులను చూసి వారి తలలు నిమిరి భోరుమంది. " పాండు కుమారులార ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా ! అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక మూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి " అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి వెళ్ళారమ్మా ! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరుపేరు వరుసనా పిలిచింది.

గాంధారి ద్రౌపదిని ఓదార్చుట

ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని ద్రౌపది ఓదార్చింది.

స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

  • 1.1 గాంధారి బాధ
  • 1.2 గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట
  • 1.3 గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట
  • 1.4 గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట
  • 1.5 గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట
    • 1.5.1 గాంధారి భీముని నిందించుట
    • 1.5.2 గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట
    • 1.5.3 గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట
    • 1.5.4 గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట
    • 1.5.5 గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట
  • 1.6 గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట
  • 1.7 గాంధారి అర్జునసాత్యకులను నిందించుట
    • 1.7.1 గాంధారి శకునిని నిందించుట
    • 1.7.2 గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట
    • 1.7.3 గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట
    • 1.7.4 గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట
  • 1.8 ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట
    • 1.8.1 యోధులకు దహన క్రియలు జరిపించుట
  • 1.9 కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట
    • 1.9.1 ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట

Saturday, April 29, 2017

సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము


-పాండవశిబిరంలో జరిగిన మారణ కాండను ధర్మరాజుకు ఎరిగించుట

నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంగా సూతుడు శౌనకాది మహామునులకు వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన భారతకథను సవిస్తరంగా చెప్పసాగాడు. మరునాడు తెల్లవారగానే ధర్మరాజు తన సోదరులు భీమార్జున నకులసహదేవులు, కృష్ణుడు, సాత్యకి పరివేష్టించి ఉండగా ధృష్టద్యుమ్నుని రథసారథి పరుగెత్తుకుని వచ్చి సాష్టాంగ దండప్రమాణం ఆచరించి చేతులు కట్టుకుని " ధర్మరాజా ! నిన్న అర్ధరాత్రి మన శిబిరాలలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ప్రవేశించారు. కృతవర్మ, కృపాచార్యుడు ముఖద్వారమున ఉండగా అశ్వత్థామ మాత్రం ధృష్టద్యుమ్నుడిని అతి దారుణంగా చంపాడు. ఆ తరువాత అతడి సోదరులను, కుమారులను పాంచాలరాకుమారులను, అర్ధరాత్రివేళ అతి క్రూరంగా చంపాడు. తరువాత ప్రభద్రక, మత్స్య, చేది సైన్యములను నిశ్శేషంగా చంపాడు. ఆ తురువాత అతడిని ఎదుర్కొన్న శిఖండి, ఉపపాండవులను ఒక్క తృటిలో వధించాడు. అసురుడి వలె చెలరేగిన అశ్వత్థామ ఎదుట మన సైన్యములు గజములు, హయములు ఆగలేక పోయాయి. అశ్వత్థామ దయాదాక్షిణ్య రహితంగా అందరిని చంపాడు. అతడి చేతిలో తప్పించుకుని వెళ్ళిన వారిని కృపాచార్య, కృతవర్మలు చిత్రవధ చేసారు. ముగ్గురూ అతి క్రూరంగా మన శిబిరాలను పీనుగుల పెంటగా చేసారు. నేను కృతవర్మ చేతికి చిక్కాను. నేను అతడి కాళ్ళు పట్టి వేడగా నన్ను కనికరించి వదిలాడు. ఈ విషయం మీకు విన్నవించడానికి నేను మీ వద్దకు వచ్చాను " అన్నాడు.

ధర్మరాజు విలపించుట

ఈ విషయం విని ధర్మరాజు మూర్ఛ పోయాడు. అందరూ అతడికి శైత్యోపచారాలు చేసారు. మూర్ఛ నుండి తేరుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ " యుద్ధంలో మరణించడం సహజమే ! కాని నేన్ము విజయంసాధించి విజయోత్సాహంలో ఉన్న తరుణంలో ఈ దారుణం ఏమిటి ? సముద్రం దాటి పిల్ల కాలువలో పడి మరణించి నట్లయింది నా పరిస్థితి. అసలే తండ్రిని పోగొట్టుకున్న ద్రౌపది, తన కుమారుల మరణం, సోదరుల మరణం తట్టుకుని జీవించ కలదా. ద్రౌపదికి ఈ విషయం ఎరుక చెయ్యండి.

ద్రౌపదికి సందేశం పంపుట

ఆ సమయంలో ద్రౌపది సుభద్రతో సహా విరాటనగరంలో ఉంది. ముందు ద్రౌపది తన తండ్రి మరణానికి చింతిస్తున్న తన తల్లిని ఓదార్చుటకు పాంచాల నగరానికి వెళ్ళింది. తరువాత సుభద్రా సహితంగా విరాటరాజు, ఉత్తరుల మరణానికి కుమిలి పోతున్న సుధేష్ణను ఓదార్చడానికి విరాట నగరం వెళ్ళింది. అక్కడి నుండి ద్వారకకు వెళ్ళాలని విరాటనగరంలోనే ఉంది. ద్రౌపది విరాటనగరం నుండి ఉపప్లావ్యం వచ్చింది. ధర్మరాజు " నకులుడిని చూసి నీవు తక్షణం ఉపప్లావ్యం వెళ్ళి ద్రౌపదిని మిగిలిన స్త్రీలను నీ వెంట తీసుకురా " అని ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞ నకులుడు అనుసరించి ఉపప్లావ్యం వెళ్ళాడు. ధర్మరాజు అమిత దుఃఖంతో రోదిస్తూ కృష్ణ, సాత్యకులు వెంట రాగా పాండవశిబిరాలకు వెళ్ళాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న తన కుమారుల బంధువుల శవాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కృష్ణార్జునులు ఎంత ఓదార్చినా అతడి దుఃఖం ఆగ లేదు. కొంతసేపటికి తేరుకుని తన కొడుకులకూ, బంధు మిత్రులకూ దహనకార్యములు నెరవేర్చాడు. ద్రౌపది కొరకు నిరీక్షిస్తూ ఒక ప్రదేశంలో కూర్చున్నాడు.

ద్రౌపది విలపించుట

ధర్మరాజు ఆదేశము మేరకు నకులుడు ఉపప్లావ్యం వెళ్ళి ద్రౌపదికి ఈ విషయం చెప్పాడు. తన సోదరుల, కుమారుల మరణానికి ద్రౌపది కుప్పకూలి పోయింది. వెంటనే నకులుడి రథం ఎక్కి పాండవ శిబిరాలకు వచ్చింది. రథం దిగింది కాని నడవ లేక పోయింది. దుఃఖభారంతో ఆగలేక నేల మీద కూర్చుండి పోయింది. భీముడు దగ్గరగా వచ్చి ద్రౌపదిని పట్టుకుని ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చాడు. మహారాజా ధర్మనందనా ! ఏమిటీ విధి వైపరీత్యం. రాజ్యలక్ష్మిని కైవశం చేసుకున్న మీకు కుమారుల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం లేదా ! నాడు అభిమన్యుడు, నేడు కుమారులు ఈ గర్భశోకానికి అంతం లేదా ! " అంటూ బిగ్గరగా ఏడ్చింది. ఇంతలో అశ్వత్థామ తన కుమారులను అర్ధరాత్రి సమయాన గాఢ నిద్రలో ఉండగా చంపాడని గుర్తుకు వచ్చి కోపంతో ఊగి పోయింది. " మహారాజా ! నా కుమారులు గాఢ నిద్రలో ఉన్న సమయాన గురుపుత్రుడు అశ్వత్థామ అత్యంత క్రూరంగా చంపాడు. అది నా మనస్సులో ఆరనిచిచ్చును రేపింది. అశ్వత్థామను చంపుటకంటే వేరు మార్గం లేదు. మహారాజా ! ధర్మనందనా ! ఇప్పుడే నేను భీముడిని పంపి క్రూరాత్ముడైన అశ్వత్థామను చంపిస్తాను. లేని ఎడల ప్రాయోపవేశం చేసి నా ప్రాణత్యాగం చేయడం కంటే వేరు మార్గం లేదు " అని ఘోరమైన ప్రతిజ్ఞ చేసింది. వెంటనే ధర్మరాజు ఆమెను ఓదార్చాడు. " ద్రౌపదీ ! క్షత్రియులు యుద్ధంలో మరణించడం సహజమే కదా ! అలాగే నీ సోదరులూ కుమారులూ మరణించి వీరస్వర్గం అలంకరించాడు. అందుకు నీవు ఇంతటి కఠోరనిర్ణయం తీసుకొన వచ్చునా ! మనశ్వినీ ! శాంతించు, నీ శోకం తగ్గించుకో . నీ కోపం, శోకం అశ్వత్థామను చంపితే కాని పోదని నాకు తెలుసు. కాని అశ్వత్థామ అడవుల పాలై ఉంటాడు. అతడిని చంపినా మనకు ఎలా తెలుస్తుంది " అన్నాడు లౌక్యంగా.

అశ్వత్థామను చంపమని ద్రౌపది భీమసేనుని పంపుట

ధర్మరాజు మాటలు విన్న ద్రౌపది " అశ్వత్థామకు సహజ శిరోభూషణమైన రత్నమును తీసుకు వచ్చి చూపిన నేను విశ్వసించి బ్రతుకగలను " అన్నది. పక్కనే ఉన్న భీమసేనుడిని చూసి " భీమసేనా ! నీవు క్షత్రియ ధర్మమును గుర్తు తెచ్చుకుని వెంటనే ఆ పాపాత్ముడు అశ్వత్థామను పట్టిచంపి నా మనసుకు శాంతి చేకూర్చు. నాడు లక్క ఇంట్లో మిమ్ము పెట్టినపుడు ఉన్న పౌరుషం, హిండింబాసురుడిని చంపినప్పుడు ఉన్న శౌర్యమూ, యక్షులతో యుద్ధం చేసినప్పుడు ఉన్న ధైర్యము, కీచకుడిని వధించినప్పుడు ఉన్న పరాక్రమము గుర్తు తెచ్చుకో జనులందరూ నిన్ను పొగిడేలా ఆ హంతకుని హతమార్చు " అన్నది క్రోధంతో. ఆమాటలకు భీముడు పౌరుషంతో బుసలు కొడుతూ వెంటనే తనరథం తీసుకుని బయలుదేరాడు. నకులుడు భీమునికి సారథిగా రథం తోలుతున్నాడు. ఇద్దరూ కురుక్షేత్రం వైపు వెళ్ళారు. అక్కడ ఉన్న వారిని అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి హస్థినాపురం వెళ్ళాడని కాని మరలా తిరిగి వచ్చి గంగానది వైపు వెళ్ళారని, దారి మధ్యలో కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామను విడిచి ఎటో వెళ్ళారని అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వెళ్ళాడని చెప్పారు. వెంటనే భీముడు వ్యాసాశ్రమానికి బయలుదేరాడు.

కృష్ణుడు భీముని కాపాడమని ధర్మజునికి చెప్పుట

భీముడు వెళ్ళిన తరువాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా పలికాడు " ధర్మనందనా ! భీముడు ఒక్కడే అశ్వత్థామ ను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. భీముడు ఒక్కడే అశ్వత్థామ పరాక్రమం ముందు చాలడు. మీరందరూ వెళ్ళడం మంచిది. మరొక్క మాట ద్రోణుడు తన కుమారునికి బ్రహ్మశిరోనామాస్త్రమును తన కుమారుడు అయిన అశ్వత్థామకు ప్రీతితో ఇచ్చాడు. ఆ అస్త్రం అశ్వద్దామ వద్ద ఉన్నది. అశ్వత్థామకు ద్రోణుడు దానిని ప్రయోగించడమే కాని ఉపసంహారం చెప్ప లేదు. ద్రోణుడు దానిని జనావాసాల మీద ప్రయోగించవద్దని ఎంత ఆపద వచ్చినా వేరు అస్త్రముల సాయంతో కాపాడుకొమ్మని కట్టడి చేసాడు. అశ్వత్థామ మహా కోపిష్టి, గర్విష్టి, దురహంకారి, పొగరుబోతు ఎంతటి వారైనా లక్ష్యం లేదు ఇక తండ్రి మాట వింటాడా ! " అన్నాడు.

అశ్వత్థామ కృష్ణుని చక్రాయుధము అడుగుట

కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ గురించి ఇంకా చెప్తూ " మీరు వనవాసంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక సారి నా వద్దకు వచ్చి " కృష్ణా ! పూర్వం అగస్త్యుడు తాను బ్రహ్మ వద్ద నుండి పొందిన బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని నా తడ్రి ద్రోణుడికి ఇచ్చాడు. నా తండ్రి దానిని నాకు ఇచ్చాడు. కృష్ణా ! నేను దానిని నీకు ఇస్తాను నీ చక్రా యుధమును నాకు ఇస్తావా !" అని అడిగాడు. నాకు అతడి అహంకారం అర్ధమైనా " నేను నా వద్ద ఉన్న ఆయుధములు గధ, ఖడ్గం, ధనస్సు, చక్రము చూపి వీటిలో నీకు ఏది కావాలో నీకు దేనిని ధరించి ప్రయోగించడానికి శక్తి ఉన్నదో దానిని తీసుకో అన్నాను. నీవు నాకు మిత్రుడవు నీవద్ద నుండి నేను ఏదీ తీసుకొనుట ధర్మం కాదు " అన్నాను. సమాధానంగా అశ్వత్థామ " నాకు చక్రాయుధం కావాలి అన్నాడు. నేను " సరే తీసుకో " అన్నాను. అశ్వథ్థామ అమితమైన గర్వంతో ముందు ఏడమచేత్తో సుదర్శనచక్రాన్ని ఎత్తాడు అది కదల లేదు. తరువాత కుడి చేత్తో ఎత్తాడు అది ఇసుమంతైనా లేవ లేదు. చివరకు రెండు చేతులతో ఎత్తి ప్రయత్నించి లేపలేక అలసి పోయి విఫలమై నిలబడ్డాడు.

చక్రాయుధ మహిమ

నేను అశ్వత్థామను చూసి " అశ్వత్థామా ! నేను హిమవత్పర్వతాల మీద రిక్మిణీసమేతంగా ఉండి కూడా కఠోరబ్రహ్మచర్యం అవలంబించి, పన్నెండు సంవత్సరాలు ఉగ్ర తపమాచరించి అత్యంత మహిమాన్వితమైన ఈ చక్రాయుధమును పొందాను. దీని ప్రభావం ముందు దేవ, దానవ, గంధర్వాది సమస్త భూతములు సాటి రావు. నా వద్ద ఉన్న చక్రాయుధమును నా అన్న బలబద్రుడు కాని, నా కుమారుడు ప్రద్యుమ్న సాంబులు కాని మిగిలిన యాదవ శ్రేష్టులు కాని అడుగ లేదు. తన తపోదీక్షతో అర్జునుడు గాండీవము, శ్వేతాశ్వములు, కపిధ్వజం పొందాడు. తరువాత పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అటువంటి అర్జునుడు నాకు ప్రాణ సమానుడు అడిగిన నేను ఇవ్వనిది ఏమీ లేదు. అర్జునుడు కూడా ఈ చక్రాయుధమును తనకు ఇమ్మని అడగ లేదు. భరతవంశసంజాతులకు గురువైన ద్రోణుడి కుమారుడవైన నీవు దీనిని అడుగ వచ్చా ! అయినా ఈ చక్రాయుధముతో నీవు ఎవరితో యుద్ధం చేయనెంచి నన్ను అడిగావు " అని అడిగాను.

అశ్వత్థామ మనోగతం

అశ్వత్థామ " కృష్ణా ! నీవు ఈ చక్రాయుధమును నాకు ఇచ్చిన ఏడల నేను ఎలాగైనా నీకాళ్ళు పట్టి అయినా నిన్ను పోరుకు పిలిచి దీనిని నీ మీద ప్రయోగించాలని అనుకున్నాను. కాని ఈ చక్రాయుధమును నీవు నాకు ఇచ్చుట లేదు కదా ! నాకు ఎటువంటి హాని లేదులే. దీనిని నీ దగ్గరే ఉంచుకో. ఎలాగూ మహాభారతయుద్ధంలో నువ్వు నాతో యుద్ధం చేస్తావు కదా ! " అన్నాడు. నాకు నవ్వు వచ్చింది కాని బ్రాహ్మణుడు అడిగాడు కదా అని నేను అతడికి నాకు తోచిన బహుమానములు ఇచ్చి పంపాను. అతడి అహంకారముకు కారణం అతడి వద్ద ఉన్న బ్రహ్మశిరోనామాస్త్రం. క్రూరుడైన అశ్వత్థామ చేతిలో మన భీముడు బాధపడకూడదన్నదే నా కోరిక " అన్నాడు కృష్ణుడు.

కృష్ణాదులు అశ్వత్థామ వద్దకు వెళ్ళుట

కృష్ణుడు సహదేవుడిని, సాత్యకిని ద్రౌపదికి తోడుగా ఉంచి తానూ ధర్మరాజూ, అర్జునుడూ కలిసి భీముడు వెళ్ళిన వైపు వెళ్ళాడు. దారిలో వారు భీముని కలుసుకున్నారు. భీముని అడిగి అశ్వత్థామ ఉన్న చోటు తెలుసుకున్నారు. అందరూ వ్యాసాశ్రమం వెళ్ళి అక్కడ ఒంటినిండా విభూది పూసుకుని నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామను చూసి భీముడు మిన్నంటిన కోపంతో " ఓరీ అశ్వత్థామా ! కపటసన్యాసీ ! బ్రాహ్మణాధమా ! క్రూరాత్ముడా ! నిన్న రాత్రి అంతటి దారుణమారణకాండ జరిపి ఏమీ ఎరుగని విధమున ఇంత త్వరగా తాపసవృత్తిని ఎలా అవలంభించావు. తాపసివైనంత మాత్రాన చావుతప్పదు. చేసిన తపస్సు చాలు లేచి నాతో యుద్ధానికి రా ! " అని సింహం వలె భీముడు గద్దించాడు. అశ్వత్థామ భీముని అతడి పక్కన ఉన్న అర్జునుడిని చేసాడు. అర్జునుడి శస్త్రసంపద ఎరిగిన వాడు కావున పక్కన ఉన్న రెల్లుగడ్డిని తీసుకుని అభిమంత్రించి బ్రహ్మశిరోనామును దాని మీద ఆవహింప చేసి " అపాండవ మగుకాక " అని సంకల్పించి భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్పోటం జరిగింది.

అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించుట

కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇది బ్రహ్మశిరోనామాస్త్రం. ఇది అత్యంత భయంకర మైంది. దీనికి సాటి మరియొకటి లేదు. దీనిని మరే అస్త్రం నిరోధించ లేదు. నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో ! " అని తొందర పెట్టాడు. వెంటనే అర్జునుడు రధము దిగి తన గురువు ద్రోణాచార్యుని మనసులో తలచి గాండీవమును తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామాస్త్రమును ఎక్కు పెట్టాడు. అర్జునుడు తనలో " ఈ మహాస్త్రమును నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించుటకు మాత్రమే ప్రయోగిస్తున్నాను. ఈ అస్త్రము వలన నాకు కాని, నా సోదరులకు కాని, గురుపుత్రుడు అశ్వత్థామకు కాని హాని కలుగకుండు గాక " అని ప్రార్ధించి అస్త్రప్రయోగం చేసాడు. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించ ప్రయత్నించింది. రెండు అస్త్రాలు ఒక దానిని ఒకటి ఢీ కొట్టడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి, భూమి కంపించింది, సూర్యుడు కాంతిని కోల్పోయాడు, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయి, రాళ్ళ వర్షం పడుతుంది. ఈ ఉత్పాతాలు చూసి జనం భయంతో కంపించి పోతూ అటూ ఇటూ పరుగులెత్త సాగారు. ప్రజల ముఖాలలో ఆశ్చర్యాందోళనలు, భయం భీతి కనిపిస్తున్నాయి.

నారదుడి రాక


అర్జున అశ్వత్థామలు ప్రయోగించిన అస్త్రాలను చూచి వచ్చిన వ్యాసనారదులు
ఈ ఉత్పాదనలు చూసి నారదుడు పరుగు పరుగున వ్యాసుడి వద్దకు వచ్చాడు. నారదుడు వ్యాసుడితో కలిసి కృష్ణార్జునులు ఉన్న చోటుకు వచ్చి అర్జున అశ్వత్థాల మధ్య నిలిచి " ఓ అకల్మషులారా ! ఇంతకు ముందు ఎంతో మంది వీరులు, భుజబలసంపన్నులు, శూరులు ఈ పుడమి మీద జన్మించారు గతించారు. వారెవ్వరూ బ్రహ్మశిరోనామాస్త్రమును జనావాసాల మీద ప్రయోగించ లేదు. మీరెందుకు ఈ సాహసానికి ఒడి గట్టారు. " అని ఆడిగాడు వ్యాసుడు. అర్జునుడు వ్యాసుడు నారదులకు నమస్కరించి " ఓ మహాత్ములారా ! అశ్వత్థామ పాండవవంశ నిర్మూలనకై సంకల్పించి బ్రహ్మశిరోనామాస్త్రము ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆ అస్త్రమును నిరోధించుటకు మాత్రమే నేను అదే అస్త్రమును ప్రయోగించాను కాని జనావాసాల మీద ప్రయోగించాలన్న క్రూరమైన తలంపు నాకు లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను నా అస్త్రమును ఉపసంహరిస్తాను. కాని అలా చేస్తే ఆదుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రముతో మమ్ములను అందరినీ దహిస్తాడు మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి " అని వినయంగా పలికి అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును అవలీలగా ఉపసంహరించాడు.

వ్యాసుడు అశ్వత్థామ అస్త్రమును ఉపసంహరించమని కోరుట

వ్యాసుడు అశ్వత్థామను చూసి " అశ్వత్థామా నీవు కూడా నీవు ప్రయోగించిన మహాస్త్రమును నిరోధించు " అన్నాడు. అశ్వత్తామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరమును ఉపసంహరించాలని ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుడితో " మహాత్మా ! ఈ భీమసేనుడు సిగ్గు లేకుండా సుయోధనుడిని అక్రమ మార్గమున చంపాడు. అంతటితో ఆగక మునివృత్తి అవలంబించిన నాతో యుద్ధానికి దిగాడు. అందుకని కోపంతో ప్రాణభీతితో వివేకం కోల్పోయి ఈ అస్త్ర ప్రయోగం చేసాను కాని నాకు ఈ అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. ఇది పాపం పాండవులను దహించి వేస్తుంది అని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో దాన్ని నేను ప్రయోగించాను " అన్నాడు. అశ్వత్థామ మాటలను సావదానంగా విన్న వ్యాసుడు " అశ్వత్థామా ! నీ తండ్రి ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ప్రీతితో బ్రహ్మశిరమును ఇచ్చాడు. కనుక అర్జునుడు నీకు కీడు తలపెట్టడు. నీవు ప్రయోగించిన అస్త్రమును ఆపడానికే తాను అస్త్ర ప్రయోగం చేసానని చెప్పాడు. మేము కోరినంతనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్యా వైభవం కలిగిన అర్జునుడిని వధించడానికి నీ తరం కాదు. ఈ బ్రహ్మశిరోనామాస్త్రమును గురించి చెప్తాను విను " ఇది ప్రయోగించిన దేశంలో పన్నెండేళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కనుక నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కనుక తాపస వృత్తిని అవలంబించానని అంటున్నావు కనుక ఈ మహాస్త్రమును ఉపసంహరించి కోపం విడిచి నీ వద్ద ఉన్న శిరోణ్మణిని ఇతడికి ఇవ్వు నిన్ను సంహరించినంతగా సంతోషపడి నిన్ను విడిచిపెడతారు. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది. ఆ ప్రకారం చెయ్యి " అన్నాడు.

అశ్వత్థామ మాట నెగ్గించుకొనుట

అశ్వత్థామ వ్యాసుని చూసి " పాండవులకు రత్నములు కొత్తా ! కౌరవనాధుడి భండాగారమంతా కొల్లగొట్టాడు కదా ! ఇంకా వాళ్ళకు నా రత్నం కావలసి వచ్చిందా మహాత్మా ! ఈ రత్నము ఎవరి దగ్గర ఉందో వారికి చోరభయము, రాక్షస భయము, దేవతల భయము లేదు. అదిగాక అది కలిగిన వారికి ఆకలి, దప్పిక, నిద్ర, రోగము మొదలైనవి ఉండవు. ఏ రత్నమును ఎలా ఇవ్వగలను. కాని నీ మాటను మన్నించి ఈ రత్నమును మీకు సమర్పిస్తున్నాను. కాని ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ప్రయోగించిన అస్త్రం పాండవపత్నుల గర్భములను విచ్ఛిత్తిచేసి పిదప శాంతి చెందుతుంది " అన్నాడు. వ్యాసుడు " అశ్వత్థామా ! తథాస్తు, అంతటితో తృపిపడు వేరే దానికి ఆశించకు " అన్నాడు. అశ్వత్థామ ఆలోచనలో పడ్డాడు. " ప్రస్తుతం పాండవపత్నులు ఎవ్వరూ గర్భం ధరించి లేరు. కనుక తన మాటలు వృధా ఔతాయి " అని ఎంచి వెంటనే మాట మార్చి " మహాత్మా ! పాండవేయ రాగపాత్రల గర్భములనిన తత్సంతాన గర్భములని నా అభిప్రాయం. కనుక పాండవ సంతానముల వలన కలిగిన గర్భములన్నింటినీ విచ్ఛితి చేసి శాంతి పొందుతుంది " అన్నాడు. అది విన్న వ్యాసుడు హతాసుడు అయ్యాడు.

పాండవ వంశమున ఒక్కరిని నిలుపమని కృష్ణుడు అశ్వథ్థామకు చెప్పుట

వారి సంభాషణ విలాసంగా తిలకిస్తున్న కృష్ణుడు " ఈ అశ్వత్థామ వ్యాసుడి మాట అబద్ధం చేసి తన మాటను నెగ్గించుకున్నాడు. ఇప్పుడు నేను వీడి అడ్డుపడక తప్పదు " అనుకున్నాడు. కృష్ణుడి ఆంతర్యం అర్ధం చేసుకున్న వ్యాసుడు మిన్నకుండి పోయాడు. కృష్ణుడు అశ్వత్థామతో " అశ్వత్థామా ! పాండుకుమారులను చంపి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు వారి సంతానం వారి వారి సంతానముల గర్భవిచ్ఛిత్తికి పాల్పడ్డావు. ఇది మహాపాపం. కాని నేను వారి సంతానంలో ఒకే ఒక్క గర్భమును కాపాడాలని నిశ్చయించాను. పాండవ వంశాన్ని నిలబెట్టడానికి ఒకేఒక్క గర్భమును నిలిపి మిగిలిన గర్భములను దహించు " అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామకు కోపంవచ్చి " కృష్ణా ! పాండవ పక్షపాతివి కనుక అలా మాట్లాడావు. కాని నేను అలా ఎందుకు చేస్తాను. నీవు విరాట రాజకుమారి ఉత్తరా గర్భాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు ఆ పని చేస్తే నేను ఆ గర్భమును కూడా విచ్ఛిత్తి చేస్తాను " అన్నాడు. అందుకు కృష్ణుడు " అసంభవం అశ్వత్థామా ! అది ఎన్నటికీ జరగదు. అభిమన్యుని మహాతేజము ఉత్తర గర్భములో దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది. నీవే కనుక ఆ గర్భముకు హాని కలిగిస్తే నేను దానికి దీర్ఘాయువు ఇస్తాను " అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ " అస్త్ర దగ్ధుడికి నీవు దీర్గాయువు ప్రసాదిస్తావా ! అది అసంభవం కాని మీరిరువురు ప్రయత్నించండి " అంటూ విలాసంగా నవ్వాడు. కృష్ణుడు " ఇందులో నా ప్రమేయం ఏముంది. ఒక నాడు త్రికాల వేదుడైన బ్రాహ్మణుడు ఉపప్లావ్యంలో ఉన్న ఉత్తర వద్దకు వచ్చి ఆమెను చూసి అమ్మా ! నీపూర్వ పుణ్య ఫలము వలన నీకు ప్రాణములు పరీక్షీణమైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ కారణంగా అతడు పరీక్షిత్తు అను నామంతో ఈ భూమిని పాలిస్తాడు. అని పలికాడు. కనుక అశ్వత్థామా ! ఆ బ్రాహ్మణుడి మాటలు అసత్యములు కావు కదా ! కనుక పాండవ వంశమును నీవు నిర్మూలించ లేవు. ఉత్తర గర్భమున జన్మించే వాడు వంశకరుడు ఔతాడు " అన్నాడు.

కృష్ణుడు అశ్వత్థామను శపించుట


తన శిరోరత్నాన్ని కోల్పోయిన అశ్వత్థామ
ఉత్తర గర్భమును రక్షించాండు కాని కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు " అశ్వత్థామా ! బాల ఘాతకా ! బాలురూ యువకులూ అని లేకుండా అర్ధరాత్రి సమయంలో ఘాఢనిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం అనుభవించు నేటి నుండి నీకు అన్నం దొరకదు నీకు ఎవరూ సహాయం చేయరు. నీ ఒంటి నిండా చీమూ నెత్తురు కారుతుంటుంది. ఈ ప్రకారం 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుదువు గాక ! కాని నా చేత రక్షింపబడిన ఉత్తరా గర్భ సంజాతుడు కృపాచార్యుడి వద్ద ధనుద్విద్య నేర్చుకుని అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. అతడి కుమారుడు జనమేజయుడు నీ కళ్ళ ముందే జనరంజకంగా రాజ్య పాలన చేస్తాడు. ఇది సత్యం " అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు " గురుకుమారా ! నీవు బ్రాహ్మణవంశంలో జన్మించినా క్షాత్రం అవలంబించావు. దారుణమారణ కాండకు పాల్పడ్డావు. ధర్మాధర్మ విచక్షణ మరచి బ్రహ్మశిరోనామాస్త్రమును ప్రయోగించావు. నా మాట కూడా లక్ష్య పెట్ట లేదు. కనుక కృష్ణుడి మాటలు అక్షరాల జరిగి తీరుతాయి " అని పలికాడు. అందుకు అశ్వత్థామ కోపించి " వ్యాస మునీంద్రా ! నీవు కూడా మా లాంటి మనుష్యుల మధ్యనే జీవించు. ఇది నా ప్రతి శాపం " అని చెప్పి తన శిరోరత్నమును పాండవులకు ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. పాండవులు కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి ద్రౌపది ఉన్న చోటుకు వచ్చారు. భీముడు అశ్వత్థామ శిరోరత్నమును ద్రౌపదికి ఇచ్చి " ద్రౌపదీ ! శత్రుకార్యం పూర్తి అయింది. గురుపుత్రుడు అయినందున అర్జునుడు అశ్వత్థామ ను చంపనిచ్చగించ లేదు. అందుకని అతడి శిరోరత్నమును తీసుకొని అతడి కీర్తిశరీరమును పడగొట్టాము. ఇక అతడు బ్రతికీ చచ్చినట్లే. ఇక నీ దుఃఖమును మాని ధర్మరాజు దుఃఖమును పోగొట్టుము " అన్నాడు. ద్రౌపది మహిమాన్వితమైన ఆ రత్నమును చేత పట్టుకుని ధర్మరాజుతో " ఈ రత్నమును పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని పొందుటకు మీరు అర్హులు అని ఆ రత్నమును ధర్మరాజు కు ఇచ్చింది. ధర్మరాజు కూడా తనకు అశ్వత్థామ మీద ఉన్న గౌరవప్రపత్తులకు నిదర్శనంగా ఆ రత్నమును శిరస్సున ధరించాడు. అప్పుడు ధర్మరాజు అందరూ వినేలా తాము అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత జరిగినది అంతా ద్రౌపది కి, సహదేవుడికి మిగిలిన వారికి వివరించాడు. బ్రహ్మశిరోనామాస్త్ర ప్రభావం చేత అప్పటి వరకు నిలిచిన పాండవకుమారుల పత్నుల గర్భములు విచ్ఛిన్నమయ్యాయి. కాని ఉత్తరగర్భము యధాతధంగా ఉన్నది. ఈ విషయం ఉత్తరకు తెలియదు.

ధర్మరాజు సందేహం

అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో " కృష్ణా ! బలంలో శౌర్యంలో ద్రౌపదీ పుత్రులు అత్యంత బలవంతులు కదా ! అశ్వత్థామ ఒక్కడే వారినందరిని ఎలా చంపగలిగాడు. అతడికి అంతటి శక్తి సామర్ధ్యాలు ఎలా వచ్చాయి. అజేయబలవందతుడు శక్తిసంపన్నుడైన దృష్టద్యుమ్నుడు అశ్వథ్థామ చేతిలో దారుణంగా చని పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించవా ! " అని అడిగాడు. కృష్ణుడు ధర్మనందనా ! ప్రాణికోటి జన్మించుటకు, జీవించుటకు, లయించుటకు కారణ భూతుడైన పరమశివుని తత్వం నాకు బాగాతెలుసు అతడు సంకల్ప మాత్రమున ఈ జీవకోటిని జన్మింప చేయగలడు లయింప చేయగలడు. కాని అతడు భక్త సులభుడు. భక్తితో తప్ప ఇతర మార్గమున అతడిని ప్రసన్నుడుని చేసుకొనుట అసాధ్యము. కనుక అతడి శక్తి ఇంత అని చెప్పుట అసాధ్యము.

బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించుట

తొలుత బ్రహ్మదేవుడు ఈ ప్రాణి కోటిని సృష్టించ వలెనన్న తలంపుతో మహాశివుని వద్దకు వెళ్ళి తన కోరికను చెప్పాడు. అప్పుడు మహాశివుడు " బ్రహ్మదేవా ! ఏకార్యం సిద్ధించుటకైనా తపస్సు ముఖ్యం. తపస్సుతో సాధించ లేని కార్యం ఈ జగతిన ఏదీ లేదు. అందుకని ముందు నేను తపస్సు చేస్తాను " అన్నాడు. తరువాత శివుడు నీటిలో మునిగి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయినా పరమ శివుడు ఎంతకీ బయటకు రాలేదు. బ్రహ్మదేవుడికి విసుగు పుట్టి తుదకు శివుడి సహాయం లేకుండా తన తపః ప్రభావంతో దక్షప్రజాపతిని సృష్టించాడు. బ్రహ్మ " దక్షప్రజాపతీ ! నీవు నా ఆజ్ఞ మీద ప్రజోత్పత్తిని సాగించు " అన్నాడు. దక్షుడు " నా కంటే అధికులు లేకున్న నీవు చెప్పినట్లే సృష్టి కార్యం నిర్వహిస్తాను " అన్నాడు. " దక్షప్రజాపతీ ! శివుడు జలమున మునిగి అనేక వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాడు. కనుక నీవే ఈ సృష్టిని సాగించు అన్నాడు. తరువాత దక్షుడు దేవతలను, అసురులను, తిర్యగ్జాతులను మొదలగు భూతములను సృష్టించాడు. కాని వాటికి ఆహారం సృష్టించ లేదు. అప్పుడు ప్రాణులు ఆకలితో దక్షుని భక్షించుటకు ప్రయత్నించాయి.

ప్రాణికోటికి బ్రహ్మ ఆహారం సృష్టించుట

అప్పుడు దక్షుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి " ప్రాణి కోటి అంతా ఆహారం కొరకు అలమటిస్తూ నా వెంట పడుతున్నాయి. వీటికి ఆహారం సృష్టించి నన్ను వీటి భారి నుండి రక్షించు " అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓషధులను, ఫలములు, కందమూలములు మొదలైన భక్ష్య ములకు మూలమైన వృక్షములను, పొదలను, లతలను సృష్టించి ప్రాణి కోటికి ఆహారం సమకూర్చాడు. మరియు బహీనమైన జంతువులను బలవంతమైన ప్రాణులకు ఆహారంగా సమకూర్చాడు. ప్రాణులన్నీ ఆనందంగా వెళ్ళి పోయాయి. అప్పటి నుండి సృష్టి నిరాఘాటంగా కొనసాగుతుంది. అప్పటికే సృష్టించబడిన ప్రాణులకు సంతానోత్పత్తి జరుగుతుంది.

మహాశివుడి ఆగ్రహం

ఈ ప్రకారం సృష్టి క్రమం జరుగుతుండగా మహాశివుడు తపస్సు ముగించుకుని జలము నుండి బయటకు వచ్చి లోకమంతా సృష్టి జరగటం, ప్రాణులకు సంతానం కలగడం సృష్టి నిరాఘాటంగా జరగడం చూసాడు. మహాశివుడికి కోపం వచ్చింది సృష్టించడానికి పనికి రాని లింగం నాకెందుకని లింగము తీసి భూమి మీద పెట్టాడు. అది చూసిన బ్రహ్మ " మహాదేవా ! ఏమిటిది ఎందుకు ఇలా చేసావు " అని అడిగాడు. " బ్రహ్మదేవా ! నేను ప్రాణులను సృష్టించడానికి నేను నీళ్ళలో మునిగి అత్యంత ఉగ్రమైన తపస్సు చేసాను. ప్రాణులను సృష్టించడానికి పనికిరాని ఈ లింగం నాకేల " అని పలికి కోపంతో ఊగి పోతూ మాల్యవంతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. మహాశివుని చేత భూమి మీద పెట్టబడిన లింగం బ్రహ్మాది దేవతలకు మహా ప్రకాశవంతంగా సుందరంగా కనిపించింది. ఇంద్రాది దేవతలు దానికి పూజాదికాలు చేయసాగారు. అలాచాలా కాలం గడిచింది.

దేవతల నిరీశ్వర యాగం

దేవతలంతా ఒక యాగం తలపెట్టారు. యజ్ఞముకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. యజ్ఞభాగం అందుకోవడానికి తగిన దేవతలను నియమించారు. కాని ఈశ్వరుడికి మాత్రం యజ్ఞభాగం కల్పించ లేదు. యజ్ఞం మొదలైంది. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి ఒక పొడవైన వింటిని సృష్టించాడు. ఆ వింటిని ధరించి మహోగ్రుడై దేవతలు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. మహాశివుని కోపానికి భూమి దద్ధరిల్లింది. ఆకాశం ఘర్జించింది. పర్వతాలు పెకిలించబడ్డాయి. సూర్యచంద్రులు కళ కోల్పోయారు. దేవతలంతా పరుగులు తీసారు. యజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తున్న దేవతలు చిత్తరువులయ్యారు. మహాశివుడు ఊగ్రంగా ఆ యజ్ఞమును కొట్టాడు. అక్కడ వేల్చుతున్న అగ్ని పారిపోయింది. యజ్ఞం ఆగిపోయింది. మహాదేవుడు పూషుని పళ్ళు విరుగకొట్టాడు, సవిత్రుని చేతులు విరిచాడు. భృగుడి కళ్ళు పొడిచాడు. అక్కడ ఉన్న దేవతలు భయభ్రాంతులై అక్కడ ఉన్న యజ్ఞోపకరణములు తీసుకుని తలా ఒక దిక్కుకు పారి పోయారు. కాని మహాశివుడు వారిని పారిపోకుండా అన్ని వైపులా తానే అయి విల్లు సంధించి నిరోధించాడు. దేవతలు చేసేది లేక మహాశివుడి కాళ్ళ మీద పడ్డారు. పారిపోయిన యజ్ఞం అగ్నితోసహా వచ్చి మహాశివుని కాళ్ళ మీద పడింది. మహాశివుడు శాంతించాడు. తన కోపమును ఒక సరస్సులో వేసాడు. ఆ కోపానికి ఆ సరస్సు ఎండి పోయింది. పరమేశ్వరుడి దయ వలన సవితకు చేతులు, పూషుడికి పళ్ళు, భృగుడికి కళ్ళు వచ్చాయి. దేవతలంతా పరమశివుని భక్తితో కొలిచి అతడికి ఆ యజ్ఞంలో భాగం ఇచ్చారు. దేవతల యజ్ఞం నిర్విజ్ఞంగా నెరవేరింది.

పరమ శివుని మహత్యం

ధరరాజా ! పరమేశ్వరుడి లీలలు ఇలా ఉంటాయి. ఆ మహాదేవుడు కోపిస్తే ముల్లోకాలు భస్మం ఔతాయి. ఆ దేవదేవుడు కరుణిస్తే లోకాలు సుభిక్షంగా ఉంటాయి. అశ్వత్థామకు దేవదేవుడు తోడుగా ఉండబట్టి ఉపపాండవులను, శిఖండిని, ధృష్టద్యుమ్నుడిని సంహరించగలిగాడు. కాని ఇది అశ్వత్థామ పరాక్రమం కాదు. ఈ యుద్ధంలో మీరు భీష్ముడిని పడగొట్టడం, ద్రోణ, కర్ణ, శల్యులను చంపడం, సుయోధనుడిని చంపడం, భీముడు తన ప్రతిజ్ఞ నెరవృచుకోవడం ఈశ్వర లీల. అంతే కాని మీ పరాక్రమం కాదు. కనుక సాధించిన విజయానికి ఆనందపడు. కారణాలు వెతక్కు " అన్నాడు కృష్ణుడు.

స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము

  • 1.1 కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు
  • 1.2 ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము
  • 1.3 ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు
  • 1.4 ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట
  • 1.5 ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట
  • 1.6 ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట
  • 1.7 సంసారమును అధిగమించుట
  • 1.8 సన్మార్గ బోధన
  • 1.9 విదురుని జ్ఞానబోధ
  • 1.10 వ్యాసుడి రాక
  • 1.11 ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట
  • 1.12 వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యంచెప్పుట
  • 1.13 ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట
  • 1.14 కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట
  • 1.15 ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట
  • 1.16 కురుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట
  • 1.17 ధృతరాష్ట్ర హృదయం
  • 1.18 శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట
    • 1.18.1 వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట
    • 1.18.2 గాంధారి శాంతించుట
    • 1.18.3 గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట
    • 1.18.4 గాంధారి ఆగ్రహం
    • 1.18.5 పాండవులు కుంతీ దేవిని చూచుట
    • 1.18.6 గాంధారి ద్రౌపదిని ఓదార్చుట

Friday, April 28, 2017

సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము


- వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహా మునులకు ఈ విదంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! రధికత్రయం నా కుమారుడి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు. ఏమి చేసారు " అని అడిగాడు. సంజయుడు" మహారాజా ! అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవశిబిరాల వైపు వెళ్ళారు. ఆ సమయంలో పాండవశిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుధిలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడకు వెళితే వారి చేతిలో చావు తప్పదని రధిక త్రయం అక్కడినుండి తూర్పు దిక్కుగా వెళ్ళి కొంతదూరం వెళ్ళి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రధములు ఆపారు. సాయం సంధ్యా కార్య క్రమాలు ముగించుకుని వారు ముగ్గురూ భూమి మీద శయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు.

కాకులు గుడ్లగూబలు

కృపాచార్యుడు నిద్రపోయినా అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది, మరికొన్నిటిని కాళ్ళు చేతులు విరిచింది, కొన్నింటి పొట్టలు చీల్చింది, మరికొన్నింటి రెక్కలు విరిచింది ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తళుక్కున ఒక మెరుపు మెరిసింది. " నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను, బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమ వంతులైన వారందరిని సంహరించ లేను. అది మంచిది కాదు. ఏమాత్రం సంశయించక పాడవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బొందిలో ప్రాణముడగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్నుమూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయమే ముఖ్యము అది శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. శత్రురాజుల మీద దండెత్తినపుడు, శత్రురాజులు విడిది చేసినపుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తున్నదని పెద్దలు చెప్తారు కదా ! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాడవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా ! వారు అధర్మం పాటించినపుడు నేను అధర్మంగా నడచుకున్న ఏమి దోషం. కనుక కల్మషహృదయులగు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందార్హం కాదు " అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు.

అశ్వత్థామ తన నిశ్చయమును కృపాచార్యునకు వినిపించుట

అశ్వత్థామ తననిశ్చయమును చెప్పడానికి కృపాచార్య, కృతవర్మలను లేపి " మిత్రమా కృతవర్మా ! మామా కృపాచార్యా ! రారాజును ఒక్కడిని చేసి ఆ పాడవులు సుయోధనుడిని అధర్మంగా కూల్చాడు. పదకొండు అక్షౌహినుల సైన్యములకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేల పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ సుయోధనుడు దిక్కు లేని వాడు అయ్యాడు. మనమిప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి " అన్నాడు.

కృపాచార్యుడు అశ్వత్థామకు ధర్మాధర్మములు చెప్పుట

కృపాచార్యుడు " అశ్వత్థామా ! నీమసులో మాట చెపితే విని మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవసహాయం కావాలి. ఏ ఒక్కదానితో కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా రైతు విత్తనదే మొలకెత్తదు కదా ! అలాగే రైతు విత్తినా దైవం అనుకూలించి వర్షం కురిపించకున్న మొలకెత్తి ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్జ్ఞం, దైవసాయం రెండూ చేరి కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏపనికైనా దైవసాయము ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేయు పనులు ప్రారంభంలో సుఖములు ఇచ్చినా తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో ద్రౌపదిని సభకీడ్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. మూందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి గాంధారికి విషయం చెప్పి వారు ఏమి చెప్పిన అది చేస్తాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కాని ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో " అన్నాడు.

అశ్వత్థామ శపధం

అశ్వత్థామ కృపాచార్యునితో " మామా ! ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది ధనవంతుడుగా అధర్మం ఔతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంబించాను. ఇంత కాలం తరువాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం నాకు చేత కాదు. అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను. ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి భూతములకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా గజాశ్వకళేబరాలతో పడి ఉండటం నేను కళ్ళార చూడాలి " అన్నాడు అశ్వత్థామ. అంతా శాంతంగా విన్న కృపాచార్యుడు " అశ్వత్థామా ! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిస్తాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిన నిలిచిన నిన్ను గెలువగల వారు ఎవ్వరు. ఇక నాగురించి చెప్పపని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపుట లేక వారి చేతిలో మడయుట ఏదో ఒకటి నిశ్చయం " అన్నాడు కృపాచార్యుడు.

అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట

అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. " ఈలోకంలో కోపంలో ఉన్న వాడికి, ధనసంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది. నా తండ్రి మరణాన్ని తలచుకొని దహించుకు పోతున్న నా హృదయాన్ని శత్రుసంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటాడు కనుక ఎదిరించ లేము. కనుక రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను . దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధు మిత్రులు, సైనికులు గాఢనిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆతరువాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను " అన్నాడు.

కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట

అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు " అశ్వత్థామా ! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మమార్గాన నడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడివీడిపడిన వాడిని వాహనవైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. పాండవులు వారి సమస్తసైన్యము, పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి నరకముకు ఏల పోయేవు. మహాస్త్రకోవిదుడవు, మహారధులలో ప్రథముడవు, అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా ! కనుక రేపు యుద్ధములో మనం పాండువీరులతో పోరు సల్పుతాము " అన్నాడు.

అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపచేయుట

అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! నీవు పెద్ద వాడవు నన్ను శాసించ తగిన వాడవు. నీవు చెప్పింది సత్యము కాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాకుమారుడు ధృష్టద్యుమ్నుడు అది పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేసాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మయుద్ధమున కూలత్రోయించారు. ఇన్ని విధముల యుద్ధధర్మాన్ని మీరి యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా ! " అన్నాడు. మామా ! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగ లేదా ! అందుకనే నేను చేసేది అధర్మమైనా అధర్మమార్గాన నా తడ్రిని చంపిన ధృష్టద్యుమ్నిడిని నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను " అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. " అశ్వత్థామా ! నువ్వూ నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను " అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ " మామా ! చాలా సంతోషం నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది రండి " అన్నాడు.

అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట

రథికత్రయం పాండవశిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ, కృపాచార్యులు కొంచం వెనుక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేసాడు. వాటిని అన్నింటిని ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆభూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆభూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గధను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గధను మింగింది. వెనకకు తిరిగి చూసాడు కృతవర్మ, కృపాచార్యుడు కను చూపు మేరలో లేరు. కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యమూ నేను చేయవచ్చునా ! అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు " అని చింతించాడు.

అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించుట


పాండవ శిబిరముపై దాడి చేయకముందు శివుని ప్రార్థిస్తున్న అశ్వత్థామ
చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు. అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ద్యానించాడు. ఈశ్వరా ! నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్తవిధంగా అర్చిస్తాను. నీకు ప్రీతి కలిగిస్తాను " అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడ లేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్ని గుండంలో దూకబోయాడు అశ్వత్థామ కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్ల లేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసాడు. అశ్వత్థామ పరమేశ్వరా ! నాకు ఏమిచేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు లేని ఏడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హర హర మహాదేవ " అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై " అశ్వత్థామా ! ఆగు నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను నీవు కోరినవరం ఇచ్చాను. కాని ఒక్క మాట నేనూ విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడూ ఒక్కటే . కృష్ణుడు నన్ను పూజిస్తాడు, కృష్ణుడంటే నాకు ఇష్టం, ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాడవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు, ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు " అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యదాతధంగా రధములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు.

అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని వధించుట

రధిక త్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమదగణాలు అదృశ్యరూపంలో వెంబడించ సాగాయి. కృపాచార్యుడు, కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాడవశిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకొని, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా ధృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి ధృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్ళతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హటాత్పరిణామానికి ధృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి ధృష్టద్యుమ్నుడి కంటానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని " అశ్వత్థామా ! నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు ఇలా నీచంగా చంపకు " అని ప్రార్ధించాడు. అశ్వత్థామ " వీలు లేదు నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను " అని పిడికిలితో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్నా ! అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్ళతో పిడికిలితో తన్నితన్ని మోదిమోది ధృష్టద్యుమ్నుడిని అతి కౄరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. ధృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు.

అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట

అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నకాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేసారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. " వాడిని పోనీయకండి పట్టుకోండి పొడవండి " అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టుపట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వారు లేక పోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులనూ గుర్రములనూ తెగనరికాడు. మనిషాపశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింప చేస్తున్నాడు అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం అందులో నిద్రిస్తున్న వారిని నరకడం మరియొక శిబిరంలో ప్రవేశించడం ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా " ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు " అని భీతి చెందుతున్నాడు.

అశ్వత్థామ ఉపపాడవులను సంహరించుట


ప్రతివింద్యుని చంపిన అశ్వత్థామ
ఈ కలకలం విని శిఖండి ఉపపాండవులు ఒక వ్యూహంగా నిలిచి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడు విజృంభించి వారందరిని పరమేశ్వర ప్రసాదిత ఖడ్గంతో తృటిలో నరికి వేసాడు. అడ్డం వచ్చిన ప్రతివింద్యుడిని రెండు ముక్కలు చేసాడు. ఇంతలో భీమసేనుడి కుమారుడైన శ్రుతసోముడు భయంకరంగా అరుస్తూ అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శ్రుతసోముని ఖడ్గమును ఖండించి అతడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. అంతలో నకులుడి కుమారుడైన శతానీకుడు అశ్వత్థామను ఎదుర్కొని చక్రాయుధమును ప్రయోగించి అశ్వత్థామను గాయపరిచాడు. అశ్వత్థామ శతానీకుడిని క్రింద పడవేసి అతడి శిరస్సు ఖండించాడు. ఇది చూసిన సహదేవుడి కుమారుడు శ్రుతసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని తనగధతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ తన చేతితో శ్రుతసేనుడి ముఖం మీద చరిచాడు. శ్రుతసేనుడు ముఖం పగిలి చనిపోయాడు. తన సోదరుల మరణం చూసిన అర్జునుడి కుమారుడు శ్రుతకీర్తి అశ్వత్థామను ఎదుర్కొని అతని కత్తికి బలి అయ్యాడు. ఈ విధంగా ద్రౌపదీ పుత్రులంతా అశ్వత్థామ చేతిలో మరణించారు.

అశ్వత్థామ శిఖండిని చంపుట

శిఖండి వెంట ఉన్న ప్రభద్రకులు అశ్వత్థామను ఎదుర్కొని కొంచెం సమయం యుద్ధం సాగించినా అతడి మానవాతీత శక్తి కారణంగా అతడి చేతిలో నిలువ లేక పోయారు. తరువాత అశ్వత్థామ శిఖండిని రెండు ముక్కలుగా నరికి మిగిలిన వారిని కూడా తెగనరికాడు. ఈశ్వరదత్త ఖడ్గం అడ్డులేకుండా నరికి వేస్తుంది. ఒక్క వేటు వృధా కావడం లేదు. వేటుకు ఒక తల తెగిపడుతుంది. పాంచాలురు, వారి సేనలు, మిగిలిన పాండవ సేనలు, ప్రభద్రకులు, ద్రౌపదీ కుమారులు, ఏనుగులూ, హయములు నిశ్శేషంగా మరణించారు. కాని అశ్వత్థామకు పాండవులు కాని కృష్ణుడు కాని సాత్యకి కాని కనిపించ లేదు. అయినా కొంత మంది పాంచాలసేనలు, పాండవసేనలూ తప్పించుకుని పారిపోతున్నారు. అశ్వత్థామ వారిని కూడా తన శరములతో తరిమి తరిమి చంపుతున్నాడు. అశ్వత్థామ చేతి నుండి తప్పించుకు పారిపోతున్న వారు కొంతమంది ఏనుగులు హయముల కాళ్ళ కింద పడి చనిపోతున్నారు. ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు పాండవ, పాంచాల శిబిరాలలో ఏమి జరుగుతుందో తెలవనంతగా అల్ల కల్లోలితమైంది. తప్పించుకున్న రాజులు సైనికులు ముఖద్వారం వద్దకు రాగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారుని నిర్ధాక్షిణ్యంగా చంపారు.

రధికత్రయం తృప్తి చెందుట

ఇంతలో తెల తెల వారుతుంది ఆ సౌప్తికవేళలో దారుణ మారణకాండను ముగించుకున్న అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను కలసి " మామా ! సకల పాంచాలురు చచ్చారు. పాంచాలి కుమారులంతా యమసదనానికి వెళ్ళారు. మత్స్య, ప్రభద్రక సైన్యములు ఒక్కరూ మిగల లేదు. హయములు, ఏనుగులూ చచ్చాయి కాని పాండవులు, కృష్ణుడు, సాత్యకి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియ లేదు " అన్నాడు అశ్వత్థామ. కృతవర్మ, కృపాచార్యుడు అశ్వత్థామ బలపరాక్రమాలను పొగిడారు. అశ్వత్థామ మామా ! పాండవులను తప్ప మిగిలిన వాళ్ళనంతా చంపాను ఫలితం ఏముంది చెప్పు. అపాండవం చేస్తే రారాజు మనసుకు శాంతి కాని తక్కిన వారిని ఎంత మందిని చంపితే ఏమి ఫలము చెప్పు " అన్నాడు. కృపాచార్యుడు " అదేమిటి అశ్వత్థామా ! ఒకే రాత్రిలో ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలురను, ద్రౌపదీ సుతులను వారి వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా చంపావు. అది సామాన్యమైన విషయమా చెప్పు " అని కీర్తించారు. " మామా ! కృతవర్మా ! మనమిప్పుడు రారాజు వద్దకు వెళ్ళి జరిగినదంతా అతడికి చెప్పి అతడి మనస్సుకు శాంతి చేకూరుస్తాము " అన్నాడు. రధికత్రయం ముగ్గురూ సుయోధనుడి వద్దకు వెళ్ళారు.

సుయోధనుడికి వార్త ఎరిగించుట

ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేలపైపడి దొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు . చాలా అవస్థ పడుతున్నాడు. మరణయాతన పడుతున్నాడు. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో రధికత్రయం అక్కడకు వచ్చారు. " రారాజా ! ధరణీతలంబు అంతయూ ఏకఛత్రంగా పాంలించిన నీవు ఇప్పుడిలా కటిక నేల మీద పడి దొర్లుతున్నావా ! ఏమి విధి వైపరీత్యం, నీ ధైర్యం, ధీరత్వం, గధాయుద్ద సాధనా ఎందుకూ కొరగాకుండా పోయాయా రారాజా ! సుయోధనా. అయినా నీవు ఇప్పుడు పవిత్రమైన శమంతక పంచకంకంలో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. బలరాముడి శిష్యులలో అగ్రగణ్యుడవు, అటువంటి నిన్ను అక్రమంగా చంపిన భీముడు ఏమి బాగుపడుతాడు. వాడికీర్తి అంతా నాశనం అయిపోదా ! సుయోధనా ! నాకు కూడూగుడ్డా ఇచ్చి ఆదరించావు. యజ్ఞ యాగాదులకు కావలసిన ధనం సమకూర్చావు. కాని ఇప్పుడు నాకు కొండంత అండగా ఉన్న నీవు చనిపోతూ ఉంటే నేను బ్రతికి ఉన్నాను. సుయోధనా ! నీకు నేనేమి సేవచెయ్యగలను. నీవు న్యాయంగా యుద్ధం చేసి వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరి కోర్కె తీర్చే అదృష్టం మాకు దక్కింది.

అశ్వత్థామ తన తండ్రికి సందేశం పంపుట

రారాజా ! నీవు పుణ్యలోకముకు పోయినప్పుడు నా తండ్రిని చూసి ఆయనతో నా మాటగా చెప్పు " ద్రోణాచార్యా ! నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు ధృష్టద్యుమ్నుడిని నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్లు అతి దారుణంగా చంపాడు అని చెప్పు . నా తండ్రిని నాకు మారుగా నీవు కౌగలించుకో సుయోధనా ! ఇప్పటికే వీరస్వర్గం అలంకరించిన సోమదత్త బాహ్లికులను భూరిశ్రవసుడిని, సైంధవుని నేను అడిగినట్లు చెప్పు. అయ్యో సుయోధనా ! నిన్ను ఈ స్థితిలో చూసి వచ్చిన విషయం మరిచాను. నీ చెవులకు అమృతోపమయంగా రాత్రి జరిగినది చెప్తాను విను. నేను నిన్న సౌప్తికవేళలో పాండవశిబిరాలలో ప్రవేశించాను. ముందుగా ధృష్టద్యుమ్నుడిని పశువును చంపినట్లు చంపి తరువాత అతడి బంధువులను అందరిని కసితీరా చంపాను , ద్రౌపదీ పుత్రులను పేరుపేరునా వరుసగా చంపాను పాండవ సైన్యాలను ఊచకోత కోసాను. గజములను, హయములను చంపాను. వారి శిబిరాలను పీనుగుల పెంట చేసాను . కాని సుయోధనా ! పాండవులు, కృష్ణుడు, సాత్యకి నా పాలపడ లేదు. నేను వస్తానని ముందుగా ఊహించి కృష్ణుడు వారిని అక్కడ నుండి తప్పించినట్లు ఉన్నాడు. పోనీలే అందరూ చచ్చిన తరువాత వారు ఉండి ఏమి ప్రయోజనములే ! సుయోధనా ! నా మామ కృపాచార్యుడు, కృతవర్మ తోడు లేకున్న ఈ కార్యం సిద్ధించేది కాదు " అన్నాడు.

సుయోధనుడు కృతజ్ఞతలు చెప్పుట

ఆ మాటలు విన్న సుయోధనుడికి నోట మాట రాకున్నా ! ఎలాగో నోరు పెగల్చుకొని " అశ్వత్థామా ! భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈ రోజు మీరు ముగ్గురూ చేసిన వీరోచిత కార్యం గొప్పది. ఇది చాలా కష్ట సాధ్యమైన కార్యం. భీష్ముడు, కర్ణుడు గొప్పవాళ్ళని పొగుడుతాము కాని ఈ అవసాన దశలో మీరు చేసిన కార్యము మరువరానిది. మీరు సుఖంగా ఉండండి అందరమూ తిరిగి స్వర్గలోకంలో కలుసుకుంటాము " పలికి సుయోధనుడు ప్రాణములు విడుచాడు. సుయోధనుడి శరీరం అనంత వాయువుల్లో కలిసాయి అతడి పార్ధివ శరీరం నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ సుయోధనుడి శరీరానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్కడి నుండి తమతమ రథములు ఎక్కి వెళ్ళారు. మరునాడు సూర్యోదయం అయ్యింది. ఇవన్నీ చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను " అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.

సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము

  • 1.1 పాండవశిబిరంలో జరిగిన మారణ కాండను ధర్మరాజుకు ఎరిగించుట
    • 1.1.1 ధర్మరాజు విలపించుట
    • 1.1.2 ద్రౌపదికి సందేశం పంపుట
    • 1.1.3 ద్రౌపది విలపించుట
    • 1.1.4 అశ్వత్థామను చంపమని ద్రౌపది భీమసేనుని పంపుట
  • 1.2 కృష్ణుడు భీముని కాపాడమని ధర్మజునికి చెప్పుట
    • 1.2.1 అశ్వత్థామ కృష్ణుని చక్రాయుధము అడుగుట
    • 1.2.2 చక్రాయుధ మహిమ
    • 1.2.3 అశ్వత్థామ మనోగతం
  • 1.3 కృష్ణాదులు అశ్వత్థామ వద్దకు వెళ్ళుట
    • 1.3.1 అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించుట
    • 1.3.2 నారదుడి రాక
    • 1.3.3 వ్యాసుడు అశ్వత్థామ అస్త్రమును ఉపసంహరించమని కోరుట
    • 1.3.4 అశ్వత్థామ మాట నెగ్గించుకొనుట
    • 1.3.5 పాండవ వంశమున ఒక్కరిని నిలుపమని కృష్ణుడు అశ్వథ్థామకు చెప్పుట
  • 1.4 కృష్ణుడు అశ్వత్థామను శపించుట
  • 1.5 ధర్మరాజు సందేహం
    • 1.5.1 బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించుట
    • 1.5.2 ప్రాణికోటికి బ్రహ్మ ఆహారం సృష్టించుట
    • 1.5.3 మహాశివుడి ఆగ్రహం
  • 1.6 దేవతల నిరీశ్వర యాగం
  • 1.7 పరమ శివుని మహత్యం

Featured Post

RAMAYANAM - రామాయణము