Friday, March 31, 2017

వన పర్వము తృతీయాశ్వాసము

ధధీచి వృత్తాంతం
- ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కథను సవిస్తరంగా వివరించసాగారు. కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరుడైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు " మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి " అని చెప్పాడు. దేవతలు దధీచి మహర్షి ఎముకలను దానంగా అడగగానే ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలను దానంగా ఇచ్చాడు. వాటితో త్వష్ట ప్రజాపతి వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని సంహరించాడు. వృత్తాసురుని అనుచరులైన కాలకేయులు సముద్రగర్భంలో దాగి రాత్రివేళలో బయటకు వచ్చి జనులను ఋషులను బాధిస్తుండే వాళ్ళు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలతో " కాలకేయులు మహా బలవంతులు. పైగా సముద్ర గర్భంలో ఉన్నారు కనుక సంహరించడం వీలు కాదు. సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కనుక మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళి తరుణోపాయం అడగండి " అని చెప్పాడు. దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి " పూర్వం వింధ్య పర్వతం పెరిగి జగత్తుకు విపత్తుగా పరిణమించినప్పుడు తమరి వలన ఆ కీడు తొలగింది. అలాగే ఇప్పుడు కూడా మా కష్టాన్ని మీరే పోగొట్టాలి " అని అడిగారు.

వింధ్యపర్వతం పెరుగుట


సముద్రజలములను త్రాగుచున్న ఆగస్త్యుడు
అగస్త్యుని గురించి వింటున్న ధర్మరాజు రోమశుని చూసి " అయ్యా! వింధ్య పర్వతం పెరగటం ఏమిటి? వివరించండి " అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో " ప్రతి రోజు సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాడు. అది చూసి వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. " సూర్యదేవా! నేను పర్వతాలకు రాజును, నువ్వు నాకు ప్రదక్షిణం చేయకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తావు? " అని అడిగాడు. సూర్యుడు " బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నాను " అని పలికాడు. ఆ మాటకు వింధ్యపర్వతానికి ఆగ్రహం కలిగింది. అలా అలా పైపైకి ఎదుగుతూనే ఉన్నాడు. అలా సూర్యచంద్రుల మార్గాలను నిరోధించాడు. లోకాలు అంధకారంలో మునిగి పోయాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో వింధ్యపర్వతం వద్దకు వెళ్ళి " వింధ్యపర్వతమా ! నేను దక్షిణదిక్కుగా వెళుతున్నాము మాకు దారి ఇచ్చి తిరిగి వచ్చేవరకు అలాగే ఉండు " అన్నాడు. అలాగేనని అంగీకరించిన వింధ్య పర్వతం భూమికి సమానంగా దిగి వచ్చాడు. అప్పటి నుండి పెరగడం ఆపివేసాడు. తరువాత రోమశుడు కథను పొడిగిస్తూ " అగస్త్యుడు దేవతల కోరికపై సముద్ర జలాలను త్రాగి వేసాడు. దేవతలు కాలకేయుడు మొదలైన వారిని సంహరించారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారి పోయారు.దేవతలు " మహర్షీ! మీ దయ వలన మాకు రాక్షస బాధ తప్పింది. మరల సముద్రాలను జలంతో నింపండి " అని ప్రార్థించారు. అగస్త్యుడు " దేవతలారా! అది నాకు సాధ్యం కాదు. సముద్రజలం నా పొట్టలో ఇంకి పోయాయి " అన్నాడు. అగస్త్యుడు సముద్ర జలాలను తిరిగి ఇవ్వలేనని చెప్పడంతో దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు " సముద్ర జలాలను రప్పించడం ఇప్పుడు సాధ్యం కాని పని. చాలా కాలం తరువాత భగీరధుడు ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు, అని బ్రహ్మదేవుడు చెప్పాడు " అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.

భాగీరధుడు

రోమశుని మాటలు విని ధర్మరాజు " మహర్షీ ! భగీరధుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు? " అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో " ధర్మజా! పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్బి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసు కున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుని కోరాడు. శివుడు అలాగే వరమిచ్చాడు. సగరుని భార్యలు ఇద్దరు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలబూఫలం (ఆనపకాయ) పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి " రాజా ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే నీకు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు " అని పలికింది. సగరునికి అరవై వేల మంది కుమారులు జన్మించారు. సగరుని కుమారులు లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో " వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వారు చనిపోతారు " అని చెప్పాడు.

సగరుని అశ్వమేధయాగ సంకల్పం


తప్పిపోయిన యాగాశ్వాన్ని కపిలుని ఆశ్రమ సమీపన చూసిన సగర కుమారులు
సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మంచేసాడు. నారదుని వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుని చూసి " నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి " అని కోరాడు. అలాగే అని

సగర కుమారులను భస్మము చేయువచున్న కపిలుడు
అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని " అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు " అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధం పూర్తిచేసాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరం అనేపేరు వచ్చింది.

భాగీరధుని తపసు


ఆకాశము నుండి భూమికి వచ్చుచున్న గంగను తన జటాఝూటముతో బందిస్తున్న శివుడు
అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరధుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరధుడు జనరంకంగా రాజ్యం చేసాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరధుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోరతపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరధుడు గంగాదేవిని " అమ్మా! నీవు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి సాగరాన్ని జలంతో నింపాలి. సగర పుత్రులకు మోక్షం కలిగించాలి " అని కోరాడు. గంగాదేవి " అలాగే, వస్తాను కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి ఒక్క పరమ శివునికే ఉంది. కనుక నువ్వు శివుడిని ప్రసన్నుని చేసుకో " అని చెప్పింది. తరువాత భగీరధుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్ధించాడు. శివుడు భగీరధుని కోరిక మన్నించి " నీవు గంగను తీసుకురా నేను భరిస్తాను " అన్నాడు. మరల భగీరధుడు గంగను ప్రార్ధించాడు. గంగ భగీరధుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగానదికి భాగీరధి అనే నామం వచ్చింది " రోమశుడు గంగావతరణం గురించి ధర్మరాజుకు వివరించాడు. తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద, నదులలో స్నానం చేసాడు. తరువాత వారు హేమకూట పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమౌతున్నాయి. ఆ తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూసారు.

ఋష్యశృంగుడు

రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. " ధర్మరాజా ! కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరసులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవ వేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహ పీడితుడైన కారణంగా రేతఃపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భందాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు " రాజా! ఋష్యశృంగుని నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి " అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని రాజ్యాన్ని రప్పించటానికి కొంత మంది వేశ్యలను పంపాడు. ఒకరోజు విభాంకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు, సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషి కుమారుడు అనుకుని ఆమెకు అతిధి సత్కారం చేసాడు. ఆమె ఋష్యశృంగుని తనతో స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళుతూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహారపానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు " నాయనా! ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతుంటారు. జాగ్రత్తగా ఉండు " అన్నాడు. మరునాడు కూడా వేశ్య విభాంకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగ రాజ్యంలో వానలు కురిసాయి. రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసాడు. విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేక పోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు " అని చెప్పాడు.

పరశురాముడు

ఆ తరువాత ధర్మరాజు కళింగదేశంలో ఉన్న వైతరణి నదిని దర్శించారు. అక్కడి నుండి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులను " మునులారా! ఇక్కడ పరశురాముడు ఉంటాడు కదా మీరెప్పుడైనా చూసారా? " అని అడిగాడు. పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు అనే ముని " ధర్మజా! రేపు చతుర్ధశి మనం ఇక్కడ పరశురాముని చూడవచ్చు" అన్నాడు. ధర్మరాజు " మహర్షీ! నాకు పరశురాముని గురించి వనాలని ఉంది వివరిస్తారా? " అన్నాడు. అకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు " మహాత్మా! ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో " అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు వరుణుని ప్రాంర్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్థం అనే పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు. ఒక సారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు " మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది " అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో " అమ్మా! నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు " అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. ఆ జమదగ్ని ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు.

జమదగ్ని ఆగ్రహం

ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి " నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు. రాముడు " తండ్రీ ! ముందు నా తల్లిని బ్రతికించండి. తరువాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు.

కార్తవీర్యార్జునుడిని సమ్హరించుట


అర్జునుడు చేసిన దారుణములను రామునికి చెప్పుచున్న జమదగ్ని
ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంశం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై " అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను " అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు " అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు. చతుర్ధశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణదిశగా ప్రయాణం అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస తీర్థం చేరాడు.

ప్రభాస తీర్థం


పాండవులను చూడటానికి ప్రభాస తీర్థానికి వచ్చిన యాదవులు
పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులను వెంటపెట్టుకుని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళడం వారికి వివరించాడు. బలరాముడు " ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడి గట్టాడు. కనుక మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం " అని తనతో వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి " అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగటం భావ్యమా? భయంకర మైన యాదసేనల ధాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం. అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాం ఏమంటారు " అని ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు " అయ్యా! మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి మీరు శాంతించండి " అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలు దేరి పయోష్ణి నదిలో స్నానం చేసాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరాడు. అక్కడ వారు వైడూర్య పర్వతాన్ని చూసారు. రోమశుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని చెప్పసాగాడు.

చ్యవనుడు

రోమశుడు ధర్మరాజుతో " ధర్మరాజా! భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేసాడు. దీర్ఘకాల తపస్సు కారణంలేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు వాటి పై తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకుని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేసాడు. సుకన్య చ్యవనుడికి సేవలు చేస్తూ ఉంది.

అశ్వినీదేవతల ఆగమనం


అశ్వినీదేవతల ఆగమనం
ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను " అమ్మా!నీవెవరు? " అని అడిగారు. సుకన్య " అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను " అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి " నీ వంటి అందెగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త. ఇంకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము " అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి " నాకు నా భర్త మీద ప్రేమ ఉంది " అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి చెప్పింది. చ్యవనుడు సుకన్యతో " వారు చెప్పినట్లు చేయవచ్చు కదా " అన్నాడు. సుకన్య చ్యవనునితో " మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను " అన్నది. ఆమె అశ్వినులతో " నాకు నవయవ్వన వంతుడైన వరుని ప్రసాదించండి " అని అడిగింది. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి ముగ్గురు నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో " మాలో ఎవరు కావాలో కోరుకో " అన్నారు. సుకన్య వారిలో చ్యవనుని గుర్తించి ఆయనను వరించింది. చ్యవనుడు అశ్వినులతో " మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం తాగిస్తాను " అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు.

అశ్వినులకు సోమపానము కలిగించుట

తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడటానికి వచ్చాడు. చ్యవనుడు శర్యాతితో " రాజా! నేను నీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను " అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చ్యవనునితో " వారు దేవ వైద్యులే కాని దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు " అన్నాడు. చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చ్యవనుడు హోమంచేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతిచెందాడు. ఇంద్రుడు చ్యవనుడితో " మహర్షీ ! మీ తపశక్తి తెలియక అపరాధం చేసాను క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు " అని అంగీకరించాడు. చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోను, మద్యం లోనూ, పాచికలలోను, మృగములలోను ప్రవేశించాడు " అన్నాడు.

మాంధాత

ఆ తరువాత ధర్మరాజు సైంధవారన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునా నదిని చూసి రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా ఇది యమునా నది గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేసాడు. ఆయన చరిత్ర చెపుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడూ అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండే వాడు. అతనికి సంతానం లేదు. అతడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్ధించాడు. అతని కోరిక మన్నించి భృగుమఝర్షి పుత్రకామేష్టి యాగం చేసాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్విక్కులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి యవనాశ్వుడు దాహంవేసి తెలియక ఆ మంత్రజలం త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో " రాజా ! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీకు ఒక కుమారుడు పుడతాడు " అని చెప్పాడు. యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమభాగాన్ని చీల్చుకుని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వ్రేలిని పెట్టి " ఇది అమృతమయము దీనిని త్రాగుము " అని అన్నాడు. అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేసాడు. మాంధాత ఎన్నో ఏళ్ళు రాజ్యపాలన చేసాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేసాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేసాడు. మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మజా! సోమకుడు మహర్షి యాగం చేసిన ప్రదేశం. ఇది నహుషుడు యజ్ఞం చేసిన ప్రదేశం. ఇది అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి.ఇది సరస్వతీ వది నిషధ దేశంలో మాయమై ఇక్కడ చమసోద్భేదం అనే చోట బయటపడింది. ధర్మజా ఇది విష్ణుప్రద తీర్థం, ఇది కాశ్మీర మండలం, ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు నిర్మించాడు.

శిబిచక్రవర్తి


శిబిచక్రవర్తి వృత్తాంతం
ఒకరోజు ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలసి తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు. డేగ రూపం లోని ఇంద్రుడు పావురంరూపంలో అగ్నిదేవుని తరముతూ ఉన్నాడు. ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబి చక్రవర్తిని చూసి " రాజా! ఇది నాకు ఆహారం. దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను " అని అడిగింది. శిబి చక్రవర్తి " ఈ పావురం నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మంకాదు. నీవు వేరే ఆహారం చూసుకో " అన్నాడు. డేగ శిబితో " రాజా! ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం. దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో " అని చెప్పింది. అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేసాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి ఆశ్చర్య పడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు. అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి " రాజా! నీ త్యాగనిరతికి సంతోషించాము. నీకీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది " అన్నారు.

అష్టావక్రుడు

ఆ తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావకృడిని గురించి చెప్పసాగాడు. పూర్వం ఏకపాదుడనే ముని ఉండే వాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విధ్యాబుద్ధులు నేర్పుతుండే వాడు. కొంత కాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు. " మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది. వారికి నిద్ర లేక పోవడం చేత విశ్రాంతి లేక జఢులౌతారు. ఇది మంచిదా? " అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి " నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టా వక్రడిగా పుట్టు " అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు. సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి " మీరు బాలురు ఇది విద్వాంసులు, పెద్దలు, రుత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు " అని అడ్డగించారు. అష్టావక్రుడు " అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే? మేము ఈ మహారాఉజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము " అని అన్నాడు. ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులంధర్ని ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చెర నుండి విడిపించాడు. జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు. అష్టావక్రుడు తన తండ్రితో కలసి స్వస్థలానికి వెళ్ళాడు.

యువక్రీతుడు

ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రోమశుడు ధర్మరాజుకు రైభ్యాశ్రమం, భరద్వాజాశ్రమం చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు. రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రిని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై "ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? " అని అడిగాడు. యువక్రీతుడు " నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి " అని కోరాడు. ఇంద్రుడు " ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవడం ఉత్తమం " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు. ఇంద్రుడు వెళ్ళి పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి " వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది " అన్నాడు. ఆ వృద్ధుడు " నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను " అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి " యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందే నని పట్టు పట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు.

యువక్రీతుడు వధిమ్చబడుట

ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి " మీరు యువక్రీతుని వధించండి " అని పంపాడు. ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు.

పరావసు తంద్రిని చంపుట

తరువాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావాసు ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని పొరపాటు ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి పరావసు తన అన్నఅర్ధవసుతో " అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆ యాగాన్ని పోయి ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి " అన్నాడు. అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు " మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు " అన్నాడు. రాజు అనుచరులు అర్ధావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు.

అర్ధావసు కోరిక మీద రైభ్యాదులు బ్రతుకుట

అర్ధావసు రాజును చూసి " రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను ప్రాయశ్చిత కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను " అని సత్యం చెప్పాడు. అందుకు దేవతలు సంతోషించి " అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగారు. అర్ధవసుడు " అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నా తమ్మునికి దోషం కూడా పరిహరించండి " అని కోరుకున్నాడు. దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి " దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? " అని అడిగాడు. దేవతలు " యువక్రీతా! గురుముఖత॰ నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు. అని పలికి స్వర్గాలికి వెళ్ళారు.

గంధమాధన పర్వతం

ఆ తరువాత ధర్మరాజు తమ్ములతోనూ, ద్రౌపదితోనూ కలసి ఎన్నో ప్రయాసలకోర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్ళతూనూ ముళ్ళతోనూ చేరి దుర్గమంగా ఉంది. భీముడు తనకుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందుకు వచ్చి నులబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరిని వీపుమీద ఎక్కించుకుని ఆకాశమార్గంలో బదరికావనం చేర్చాడు. రోమశుడు తన మంత్ర మహిమతో ఆకాశమార్గాన బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరారు.

భీముడు ఆంజనేయుని కలుసుకొనుట


భీమునికి సౌగంధికా పుష్పాలను చూపుచున్న ద్రౌపది
ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు. ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి " ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు " అన్నాడు హనుమంతుడు. భీముడు " నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజూ తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు " అన్నాడు. హనుమంతుడు " నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు " అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు.భీముడు హనుమంతునితో " అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి " అన్నాడు. హనుమంతుడు భీమునితో " భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు " అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను " అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించి " ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? " అని అడిగాడు. హనుమంతుడు " భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా , త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది " అన్నాడు.

హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు

భీముడు " అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? " అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు " భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం . ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి " అని హనుమంతుడు చెప్పాడు. భీముడు " ఆంజనేయా ! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను " అన్నాడు.

హనుమంతుడి బృహద్రూపం

ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి " భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నున్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి కావాలో అడుగు. భీమా! నీకు, నీ వారికి అపకారం చేసిన కౌరవులు, దృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్థినా పురం నేల మట్టం చెయ్యమంటావా ? " అన్నాడు. భీముడు " అమిత బలశాలివి అయిన నూకు అది అసాధ్యంకాదు. కాని మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా " అన్నాడు. హనుమంతుడు " భీమా! యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునిని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను " అన్నాడు. తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు.

భీముడు సౌగంధికా పుష్పములు తెచ్చుట

హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధికా పుష్పముల తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు.వారు భీమునితో " అయ్యా ఇది కుబేరుని తోట కుబేరుడు ఇందులో విహరిస్తున్నాడు. ఇక్కడ ఉండటం ప్రమాదం " అని హెచ్చరించారు. భీముడు " నేను పాండు రాజు కుమారుడిని. నాపేరు భీమసేనుడు. నా భార్య ద్రౌపది ఈ సౌగంధికా పుష్పములు కావాలని కోరింది. వీట్ని తీసుకు పోవడానికి వచ్చాను " అన్నాడు. వనరక్షకులు భీమునితో " అయ్యా! నూవు ధర్మరాజు సోదరుడివి ధర్మం తెలిసి నడచుకో. నీవు కుబేరుని అడిగి ఈ పుష్పములను తీసుకు పో " అన్నారు. భీముడు " ప్రకృతి స్సిద్దమైన ఈ కొలను కుబేరునికి మాత్రమే స్వంతం కాదు అందరిది. నేను క్షత్రియుడను, ఎవ్వరినీ యాచించను, నా భుజ బలంతో తీసుకువెళతాను " అని చెప్పి కొలనులో దిగి పుష్పములు కోయసాగాడు. వనరక్షకులు భీమునితో యుద్ధానికి దిగారు. భీముడు వారినందరిని జయించాడు.వారు కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుడు భీముని పరాక్రమం గురించి విని ఉన్నాడు కనుక ఉదారంగా విడిచి పెట్టాడు. భీముడు సౌగంధికా పుష్పాలతో తిరిగి వెళుతున్న సమయంలో ధర్మరాజు నకులసహదేవులు, ద్రౌపదితో కలసి భీమునికి ఎదురు వచ్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధికా పుష్పాలను ఇచ్చాడు. ఇంతలో కొంత మంది యక్షులు వారి వద్దకు వచ్చి " అయ్యా! ఈ ప్రదేశంలో యక్షులు రాక్షసులు తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు " అని చెప్పారు. అందుకు అంగీకరించి ధర్మరాజాదులు అక్కడి నుండి కొంతదూరం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నారు.

జటాసురుడు

ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరకు వచ్చారు. అతడు పాండవులతో " నేను వేదాలను చదువుకున్నాను పరశురాముని శిష్యుడను " అని చెప్పి వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒక రోజు భీముడు వేటకు వెళ్ళాడు. జటాసురుడు ఇదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు. ధర్మరాజూ, ద్రౌపదిని, నకులసహదేవులను తీసుకుని ఆకాశమార్గంలో పరుగెత్తసాగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు అది చూసి భీతి చెందారు. నకులుడు రాక్షసునితో " అయ్యా! ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలపెట్టడం భావ్యమా? " అని అడిగాడు. ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. " అయితే నాతో యుద్ధం చెయ్యి " అని నకులుడు అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయు వేగంతో అక్కడికి వచ్చాడు. భీముడు రాక్షసునితో " మర్యాదగా ధర్మరాజును, ద్రౌపదిని, నకులసహదేవులను విడిచి పెట్టు లేకుంటే బకాసురుడు, హిడింబుడు చచ్చినట్లు చస్తావు " అని హెచ్చరించాడు. జటాసురుడు " ఓయి భీమా! నిన్ను యుద్ధంలో చంపి బకాసురునికి, హిడింబునకు, కిమ్మీరునకు రక్త తర్పణం చేస్తాను " అని భీమునితో యుద్ధానికి దిగాడు. ఇద్దర్కి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు అలసిపోవడం గ్రహించిన భీముడు అదనుగా తీసుకుని జటాసురుని పై విజృంభించి అతనిని వధించాడు. రోమశుడు, ధౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి ప్రశంసించారు.


NEXT
  • వన పర్వము చతుర్థాశ్వాసము

    • 1.1 ద్రౌపది భీమసేనుని పంచవర్ణ పుష్పములు కోరుట
    • 1.2 అర్జునుని రాక
      • 1.2.1 నివాతకవచులు
    • 1.3 నహుషుడు
      • 1.3.1 నహుషుని ప్రశ్నలు
    • 1.4 శ్రీకృష్ణ సత్యభామల విజయం
    • 1.5 మార్కండేయ మహర్షి రాక
      • 1.5.1 కాలధర్మాలు
      • 1.5.2 పాపుణ్యాలు ఫలితాలు
      • 1.5.3 బ్రాహ్మణ ప్రభావం
      • 1.5.4 బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు
      • 1.5.5 సనత్కుమారుని తీర్పు
      • 1.5.6 సరస్వతీ గీత
      • 1.5.7 వైవస్వత మనువు
      • 1.5.8 కల్పాంతం
      • 1.5.9 వటపత్రశాయి
        • 1.5.9.1 నారాయణ తత్వం
      • 1.5.10 కలియుగ ధర్మం
    • 1.6 కల్కి అవతారము
      • 1.6.1 పరీక్షిత్తు వృత్తాంతము
        • 1.6.1.1 వామదేవుడు
      • 1.6.2 శలుడి గర్వభంగము
      • 1.6.3 ఇంద్రద్యుమ్నుడు
      • 1.6.4 దుంధుమారుడు
      • 1.6.5 ఉదంకుడి కోరిక
      • 1.6.6 మధు కైటబులు

Thursday, March 30, 2017

వన పర్వము ద్వితీయాశ్వాసము


- ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు.

నలదమయంతులు

బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే అనేరాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.

నలదమయంతుల మధ్య హంస రాయబారం


అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి ముచ్చట పడుతున్న దమయంతి
ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నులునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

దమయంతి స్వయంవరం


నల దమయంతుల వివాహం
నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్ద్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. నలుడు "అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నాభర్త, కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేని వారు, వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి "దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

నలదమయంతులపై కలిప్రభావం


రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు
దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా, దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. "భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు. అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగింది. ఆమె నలుని వివాహమాడింది" అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు, కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని, నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తనరాజ్యాన్ని, సందలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు అయినా ఆడటం మానక, సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రసేనను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి, నగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేక పోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. ఇది, నీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది, దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం.. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము" అని చెప్పింది. నులుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే, ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు.

నలదమయంతుల వియోగం


దమయంతిని అడవిలో వదిలి పోతున్న నలుడు
ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగు తున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, దమయంతి అతనిని భస్మం చేసింది.

దమయంతి తేజస్సు వలన దగ్ధమవుతున్న కిరాతుడు
భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించ లేను" అని అడిగింది. మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము" అని చెప్పి, వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి చూసారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు. దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. ఆ

అడవిలో ఒంటరిగా మిగిలిన దమయంతి
వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతుంది. నీవు ఎవరు?" అని అడిగింది. దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళుపట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది.

నలుడు వికృతరూపుడగుట

దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా, అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగ కుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేసానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాముకాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా, నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను.. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విధ్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు", అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి, విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా. నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు.

దమయంతి విదర్భ దేశానికి చేరుట

విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడు, దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య? ఎవరి కూతురు? ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు. అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను, నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.

దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట

రాజ సౌధంలో ఉన్నా దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని, నీ సతిని వంచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? నాపై కరుణ చూపు" అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే, నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది. అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా, వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది' అన్నాడు" అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. "సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు" అని చెప్పు" అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

నలుడు స్వయంవరానికి బయలుదేరుట

దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. అని దుఃఖించాడు. "అయినా దమయంతి పతివ్రత. ఇద్దరుపిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో? ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు. అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శాపం ఏముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.
నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని, దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

నలదమయంతుల కలయిక


తిరిగి కలుసుకున్న నల దమయంతులు
దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. వారు నాకు తెలుసు, కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనస పరవశించి పోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది. నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు "అన్నాడు. "మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది. నలుడు "అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు. దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది. నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసికి తెలియ కూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో "సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయే వరకు అలా మండు తున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు, ఇవి నలుని వంటలే" అని గ్రహించి, దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిధులం మాతో నీకేం పని?" అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను? అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేసాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేక, నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేసావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మమ్మలిని రప్పించుటకే ఇలా చేసాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు.

నలదమయంతులు రాజ్యాన్ని పొందుట


సభలో నల దమయంతులు
నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను, నీబలం వలన కాదు. నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు.

ధర్మరాజు వద్దకు నారదుని రాక

మహాముని బృహదశ్వుడు నలచరిత్రను ధర్మరాజుకు తెలిపి "ధర్మరాజా! జూదంలో కోల్పోయానని బాధపడకు. నీవు దైవ సహాయంతో, నీ స్వప్రయత్నంతో విజయం సాధిస్తావు " అని ధైర్య వచనాలు పలికి తన వద్ద ఉన్న అక్షవిధ్యను ధర్మరాజుకు చెప్పి వెళ్ళి పోయాడు. ధర్మరాజు అర్జుని కోసం నిరీక్షిస్తున్న సమయంలో అతని వద్దకు నారద మహర్షి వచ్చాడు.ధర్మరాజు నారదునికి అతిథి మర్యాద చేసాడు. ఆ యనను చూసి ధర్మరాజు " మునీంద్రా నాకు ఒక ధర్మ సందేహం ఉంది. తీర్చగలరా ?" అని అడిగాడు. నారదుడు నవ్వి అలాగే అడగమన్నాడు.ధర్మరాజు " ఈ భూమిలో తీర్ధములు సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలితం కలుగుతాయి " అని నారదుని అడిగాడు.నారదుడు ధర్మరాజా చెబుతాను విను " పూర్వం భీష్ముడు గంగాతీరంలో వేదాధ్యనం చేస్తూ చాలా మంచి పనులు చేసూ ఉండే వాడు. భీష్ముని వద్దకు ఒక సారి పులస్త్యుడు అనే ముని వచ్చాడు. అతనికి అతిధి మర్యాదలు చేసిన పిమ్మట భీష్ముడు పులస్త్యుని చూసి నీవు నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ మహర్షి భీష్మునితో చెప్పిన విషయాలు నీకు చెప్తాను " అని ధర్మరాజుతో అన్నాడు.

తీర్ధ మహిమ

ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరుల నుండి ఏమీ ఆశించని వారు మిత భోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారుఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎన్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతారు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు. కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్థం ప్రశిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యం, యయాతి పతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్థం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నానం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది. వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నానం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్థంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్థం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్థంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది. శివుడు నివసించే దేవికా క్షేత్రాన్ని, కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్థం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్థం, పుష్కర తీర్థం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు. కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉంది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణుమూర్తిని పూజించినా, పారిప్లవ తీర్థంలో, శాలుకినీ తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అ శ్వినీ తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్థంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. "ధర్మజా! జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజులను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచకం పవిత్రత సంతరించు కోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభనం, శంఖినీ తీర్థం, యక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్థం, ఆపగ నదీ తీర్థం, సప్తఋషి కుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి . నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్థంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సుదినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానమాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పోతారు. పావన తీర్థంలో స్నానమాచరించిన వంశం పవిత్రమౌతుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్థంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కులుగుతుంది. ఔశనశం, కపాలమోచనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వదు॰ఖ విముక్తి కలుగు తుంది. స్వస్తి పురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్య్డిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దధీచి తీర్థంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్థంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుండి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగమ్ ఛెశీణా ఫాళామ్ వ్స్తుంది. శాకంబరీ తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రథావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తులౌతారు. అందరూ పుణ్య తీర్ధాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, ఉపవాసాలు చేయని వారు, శుచిత్వం లేని వారు తీర్ధయాత్రలు చేయలేరు. కనుక నీవు తీర్ధ యాత్రలకు వెళ్ళి రమ్ము. రోమశుడు అనే మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీర్ధయాత్రలు చెయ్యమని ఆదేశిస్తాడు. నీవు ధౌమ్యుని అనుమతితో తీర్ధయాత్రలు చేసి రా " అని చెప్పి నారదుడు వెళ్ళాడు.

రోమశుని రాక

నారదుముని వెళ్ళిన తరువాత ధర్మరాజు ధౌమ్యునితో "అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించటానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. అర్జునుడు లేని కామ్యకవనం శోభించడం లేదు. మేమంతా అర్జునిని రాక కొరకు నిరీక్షిస్తున్నాం " అన్నాడు. ధౌమ్యుడు "ధర్మజా నీకు మేలు జరుగుతుంది. అర్జునుడు విజయుడై తిరిగి వస్తాడు. నారదుడు చెప్పినట్లు మనం తీర్ధయాత్రలు చేద్దాం " అన్నాడు. ఇంతలో రోమశ మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మరాజుతో రోమర్శమహర్షి "ధర్మజా! నేను ఇంద్రలోకం వెళ్ళినపుడు అక్కడ దేవేంద్రుని పూజలందుకుంటున్న అర్జునిని చూసాను. పరమశివుడు, దేవతలు అర్జునినికి దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునిని విషయం నీకు చెప్పమని దేవేంద్రుడు నన్ను పంపాడు. అలాగే నిన్ను తీర్ధయాత్రలు చేయమని ఆదేశించాడు " అన్నాడు . ఆ మాటలకు ధర్మరాజు ఆనందపడి "మహర్షీ! అర్జునిని క్షేమవార్తకు దేవేంద్రుని తీర్ధయాత్రలు చెయ్యమని దేవేంద్రుడు ఆదేశించినందుకు ఆనందంగా ఉంది. నారద మహర్షి ఆదేశం అదే కనుక నేను ఇప్పుడు తీర్ధయాత్ర చేయాలను కుంటున్నాను " అన్నాడు. ధర్మరాజు వెంటనే తీర్ధయాత్రకు బయలు దేరాడు. విప్రులందరూ వెంట వస్తామని అన్నారు. ధర్మరాజు అంగీకరించాడు. ఆ సమయంలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు.వ్యాసుడు ధర్మరాజుతో " ధర్మజా ! మనో బుద్ది సౌచం, శ్రీర నియమాలు ఆచరిస్తూ సన్మార్గంలో తీర్ధాలు సేవించండి. నీ పూర్వులైన మహాభిషుడు, నా భాగుడు, భరతుడు, భగీరధుడు, ముచుకుందుడు, మాంధాత , సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు మొదలైన చక్రవర్తులు తీర్ధయాత్రలు చేసి సుఖాలు పొందారు. వారి వలెనె నువ్వు తీర్ధయాత్రలు చేసి సుఖించు " అని ఆశీర్వదించాడు. ధర్మరాజు రోమశుని చూసి "మహర్షీ! లోకంలో అధర్మపరులకు, దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది. కాని ధర్మం ఆచరించే వారికి కష్టాలు ప్రాప్తిస్తున్నాయి ఎందుకు?" అని అడిగాడు.రోమశుడు "ధర్మరాజా! అధర్మపరులకు అభ్యుదయం ఎల్లకాలం ఉండదు. త్వరలో నశిస్తుంది. రాక్షసులు అధర్మవర్తనులై నాశనమైనారు. దేవతలు ధర్మాచరణులై వృద్ధి పొందుతున్నారు.కౌరవులు వారి అధర్మవర్తనం వలన అచిరకాలంలో నశిస్తారు. అధర్మవర్తనం వలన గర్వం పుడుతుంది గర్వం వలన అహంకారం పుడుతుంది అహంకారం క్రోధానికి మూలం క్రోధ వలన సిగ్గు విడుస్తుంది అలాంటి వారిని లక్ష్మి వదిలి వెడుతుంది. మీరు ధర్మపరులు మీకు జయం కలుగుతుంది " అన్నాడు.ఆ తరువాత ధర్మరాజు తీర్ధయాత్ర్కు బయలు దేరాడు. అన్నీ తీత్ర్ధాలు సేవిస్తూ గయ చేరుకున్నాడు. అక్కడి నుండి అగస్త్యాశ్రమం చేరుకున్నాడు.

ఆగస్త్యమహాముని వృత్తాంతం

అగస్త్యాశ్రమం చేరిన తరువాత రోమశుడు అగస్త్య్సుని గురించి వివరించసాగాడు. "ధర్మజా పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండే వారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అయ్యా అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరువాత వాతాపి తమ్ముడైన వాతాపిని మేకకా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తరువాత ఇల్వలుడు "వాతాపి బయటకురా " అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు. ఒక రోజు బ్రహ్మ చర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచిగురుటాకులను ఆధారం చేసుకుని వ్రేలాడుతున్న తన పితరులను చూసాడు. అగస్త్యుడు వారితో "అయ్యా! మీరెవరు? ఇలా ఎందుకు వ్రేలాడుతున్నారు " అని అడిగాడు. బదులుగా వారు "నయనా!మేము నీపితరులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతాన హీనుడవ్వావు. కనుక మేము ఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు " అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు.ఆ సమయంలో విదర్భ రాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపో మహిమతో అతనికి ఒక కూతురిని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు " ఈ నిరుపేద బ్రాహ్మణుడా నాకుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరెలు ధరించవలసినదేనా? " అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది. గత్యంరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునకిచ్చి వివాహం చేసాడు. ఆమె నారచీరెలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్య్డుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర "నాధా! సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి " అన్నది. అగస్త్య్డుడు " నా వద్ద ధనం, ఆభరణములు లేవు వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్ధం " అనుకుని ధనం కొరకు అగస్త్య్డు శతర్వురుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతర్వురుడు తనవద్ద ధనం లేదని చెప్పాడు. అగస్త్య్డుడు, శతర్వురుడు బృహదశ్వుని వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు. ఆ తరువాత ఆ ముగ్గురూ ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి "మునీద్రా! ఇల్వలుడు ధనవంతుడు. అతడిని అడిగితే మీకోరిక తీరుతుంది " అన్నాడు.వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్య్డు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్య్ని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్ర్హించిన రాజఋషులు "మునీంద్రా! ఇల్వవుడు తన తమ్ముని మేకగా మార్చి వండి మ్రాహ్మణులచే త్నిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్ట్ను చీల్చుకుని ఆబ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు. కనుక మీరు భుజించరాదు " అన్నారు అగస్త్య్డుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు. అగస్త్య్డుడు పొట్టను తడుముకుని తేన్చాడు. అంతే వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు "వాతాపీ బయటకు రా " అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో "అయ్యా మీరు కోరిన ధనం ఇస్తాను " అన్నాడు. ఆ ధనంతో అగస్త్య్డు లోపాముద్ర కోరికను తీర్చాడు. అగస్త్య్డుడు లోపాముద్రతో "నీకు పది మందితో సమానమన నూరుగురు కొడుకులు కావాలా? లేక నూరుగురుతో సమానమైన ఒక్క కొడుకు కావాలా? లేక నూరుగురు కొడుకులతో సమానమైన వెయ్యి మంది కొడుకులు కావాలా లేక వెయ్యి మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా ? " అని అడిగాడు.అందుకు లోపాముద్ర "నాకు వేయి మందితో సమాన మైన బల వంతుడూ, బుద్ధి మంతుడూ అయిన ఒక్క కుమారుని ప్రసాదంచండి " అని కోరింది. లోపాముద్ర గర్భందాల్చి తేజోవంతుడూ, గుణ వంతుడూ అయిన దృఢస్యుడు అనే కొడుకును కన్నది.ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగించాడు.

NEXT
  • వన పర్వము తృతీయాశ్వాసము

    • 1.1 వింధ్యపర్వతం పెరుగుట
    • 1.2 భాగీరధుడు
      • 1.2.1 సగరుని అశ్వమేధయాగ సంకల్పం
      • 1.2.2 భాగీరధుని తపసు
    • 1.3 ఋష్యశృంగుడు
    • 1.4 పరశురాముడు
      • 1.4.1 జమదగ్ని ఆగ్రహం
      • 1.4.2 కార్తవీర్యార్జునుడిని సమ్హరించుట
    • 1.5 ప్రభాస తీర్థం
    • 1.6 చ్యవనుడు
      • 1.6.1 అశ్వినీదేవతల ఆగమనం
      • 1.6.2 అశ్వినులకు సోమపానము కలిగించుట
    • 1.7 మాంధాత
    • 1.8 శిబిచక్రవర్తి
    • 1.9 అష్టావక్రుడు
    • 1.10 యువక్రీతుడు
      • 1.10.1 యువక్రీతుడు వధిమ్చబడుట
      • 1.10.2 పరావసు తంద్రిని చంపుట
      • 1.10.3 అర్ధావసు కోరిక మీద రైభ్యాదులు బ్రతుకుట
    • 1.11 గంధమాధన పర్వతం
      • 1.11.1 భీముడు ఆంజనేయుని కలుసుకొనుట
      • 1.11.2 హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు
      • 1.11.3 హనుమంతుడి బృహద్రూపం
      • 1.11.4 భీముడు సౌగంధికా పుష్పములు తెచ్చుట
    • 1.12 జటాసురుడు

Wednesday, March 29, 2017

వన పర్వము ప్రథమాశ్వాసము

అరణ్యానికి వెళుతున్న పాండవులు
- ఆ ప్రకారం పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంటరాగా అరణ్వానికి బయలు దేరి ఉత్తర దిక్కుగా పయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు పధ్నాలుగు వేల రథాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు " ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జూదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపడం భావ్యమా " అనుకుని కంట తడి పెట్టారు " భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు కౄరులైన దుర్యోదనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది. కనుక మేము మీతో అరణ్యాలకు వస్తాము " అని పౌరులు పాండవుల వెంట బయలు దేరారు. ధర్మరాజు " ఆయ్యలారా మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వన క్లేశం భరించ లేరు. మీరు మా వెంట రా వద్దు మరలి పొండి " అన్నాడు. ధర్మరాజు మన్నించి పౌరులు వెనుకకు మరలి వెళ్ళారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కాని వారి వెంట నిత్యాగ్ని హోత్రులు వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు " బ్రాహ్మణోత్తములారా! మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలములు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్ట పడటం ఎందుకు? మరలి వెళ్ళండి " అన్నాడు. అందుకు వారు " అయ్యా మీరు లేక మేము బ్రతుక జాలము మీ వలె మేము కంద మూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్థినలో మేము ఉండజాలము " అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ " మంచి భోజనం తినే వీరు కందమూలాలను ఎలా తినగలరు? " అన్నాడు.

శౌనకుడు


సూర్యుని ప్రార్థించి అక్షయపాత్రను వరముగా పొదుతున్న ధర్మరాజు
అది విని శౌనకుడు " ధర్మరాజా ! ఇందుకు ఇంత చింతించ తగునా. వివేకులు ఎందుకూ దు॰ఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు " అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు " అయ్యా! ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్తు ధర్మం. తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిధి సత్కారం చేయడం నా ధర్మం" అన్నాడు. అందుకు శౌనకుడు " ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం . అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో " అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడితో " అయ్యా ! ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను " అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో " ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో " అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి " ధర్మరాజా ! ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి " అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు.

హస్థినా పురం

హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా పాండవులు ఏమి చేస్తుంటారు " అని అడిగాడు. దానికి విదురుడు " పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి " సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం " అన్నాడు. వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. దృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు " విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు " అన్నాడు. విదురుడు "దృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు " అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ " పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, దృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? " అన్నాడు. శకుని " సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు " అన్నాడు. కర్ణుడు " ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం " అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు దృతరాష్ట్రుని వద్దకు వచ్చి " నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను " అన్నాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.ధృతరాష్ట్రుడు " అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి " అన్నాడు. వ్యాసుడు " మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు " అని వెళ్ళి పోయాడు.

మైత్రేయుడు

వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్థినాపురం వచ్చాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు " నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు " అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా " అని దృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు " ఓ రాజా! పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందు వలన క్షేమమే " అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి " కుమారా! నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులుము. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి ఔతావు. పాండవులు వజ్ర శరీరులు. భీముడు హిడింబుని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాడ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది. కనుక నీవు పాండవులతో స్నేహం చేయటం మంచిది " అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి " సుయోధనా ! యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు " అని మైత్రేయుడు అన్నాడు. దృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు "మహారాజా! నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ది కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు " అన్నాడు.

కిమ్మీర వధ

దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత ధృతరాష్ట్రుడు " మహాత్మా! కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వవరిస్తారా? " అని అడిగాడు. మైత్రేయుడు " నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి విదురుని అడిగి తెలుసుకో " అని చెప్పి వెళ్ళి పోయాడు. విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించ సాగాడు. " పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు " నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు " అని ఆడిగాడు. దానికి ఆ రాక్షసుడు " నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవెరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవెరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? " అని అడిగాడు. ధర్మరాజు " నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము " అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు " నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను " అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళ్తోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు " అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు.

కామ్యకవనానికి శ్రీకృష్ణుని విజయం


ద్రౌపది ఓదార్చుచున్న శ్రీకృష్ణుడు
అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమాదన పర్వతం మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేసావు. పుష్కరంలో పదుకొండు వేల సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో పన్నెండు సంవత్సరాలు వ్రతం చేసావు. దితి కుమారులను దనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేసావు. నీవు అదితి కుమారుడివి. ఇంద్రుని తమ్ముడవు ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా తరువాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు.లోక కంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతార మూర్తివి. అనృతం ,మదము, కోపం, మత్సరం నీ దగ్గరకు రావు " అని స్తుతించాడు. అప్పడు శ్రీకృష్ణుడు అర్జునినితో " అర్జునా! నీవు నరుడవు. నేను నారాయణుడను. మనం ఒకరికి ఒకరం మిత్రులం " అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి " దేవా! నీవు యజ్ఞ పురుషుడివి. సర్వవ్యాపివి. సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని. పాండవుల భార్యను. మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాశనుడు వెండ్రుకలు పట్టి ఈడ్పించాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించ లేదు. వీరి పరక్రమమెందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేనిదానిని అయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు. లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరచి ఉన్నారు. కాని నేను మరువలేకున్నాను " అన్నది. కృష్ణుడు " అమ్మా! అర్జునిని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తధ్యం ఊరడిల్లుము " అన్నాడు . శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! జరిగినదంతా యుయుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆసమయంలో నేను మీదగ్గర లేను. ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను " అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఆ వృత్తాంతం వివరించు " అన్నాడు.

సాల్వునితో శ్రీకృష్ణుని యుద్ధం

శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు " రాజసూయయాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాళ్వుడు. అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించి నగరం వెలుపలి వనాలను నాశనం చేసాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబుడు, ప్రద్యుమ్నుడు సాళ్వునితో ఘోరంగా యుద్ధం చేసారు. ప్రద్యుమ్నుడు సాళ్వునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాళ్వుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాళ్వుని చంపబోగా నారదుడు అడ్డుపడి " కుమారా ! ఇతనిని నువ్వు చంపరాదు. ఇతడు నారాయణుని చేతిలో హతుడు కావలసి ఉంది " అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాళ్వుడు తిరిగి వెళ్ళాడు. నేను ద్వారకకు వెళ్ళగానే సాళ్వుడు ధ్వంశం చేసిన వనాలను చూసాక నాకు కోపం వచ్చింది సాళ్వుని మీదకు యుద్ధానికి వెళ్ళాను. సాళ్వునికి నాకు ఘోర యుద్ధం జరిగినది. సాళ్వుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలు పెట్టాడు. నేను వాడి మాయలు వమ్ము చేసాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాళ్వుని చేతిలో చిక్కాడని నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది." ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాళ్వునికి ఎలా చిక్కాడు? " అనుకున్నాను. ఇంతలో సౌంభకమను సాళ్వుని రథం నుండి వసుదేవుడు దిగటం చూసి నా చేతిలో ధనస్సు జారి కింద పడింది. నాకు కొంత సేపు స్పృహ తప్పింది. తెలివి వచ్చి చూసేసరికి సౌంభకంలో వసుదేవుడు లేక పోవడం చూసి అది రాక్షస మాయ అని గ్రహించాను. మరల నాకు సాళ్వునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరికి సాళ్వునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతడిని వధించాను " అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ద్వైత వనం

తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు ఉపపాండవులను తీసుకుని పాంచాలదేశం వెళ్ళాడు. బ్రాహ్మణులు తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుని, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులని తీసుకుని ద్వైతవనానికి వెళ్ళారు. ధర్మరాజు " ఈ అడవిలో కౄరమృగాలు ఉన్నాయి.రాక్షసులు ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి " అని మిగిలిన వారితో అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కడేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగురీతి సత్కరించాడు. " ధర్మరాజా ! నాడు తండ్రి ఆజ్ఞమేరకు అడవులకు వెళ్ళిన రాముడిని , సీతను, లక్ష్మణుని చూసాను తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, నలుడు, భరతుడు, యయాతి, వైన్యుడు, నభాగుడు మొదలైన వారు సత్య ధర్మాలు పాటించు ఉత్తమ లోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది " అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు.

ద్రౌపది ధర్మరాజు సంభాషణ


యుధిష్టురినితో ద్రౌపది భీమసేనుల సంవాదము
ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని చూసి " దృతరాష్ట్రుడు తన కొడుకు మాటవిని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాని అతనికి మీ మీద కోపం పోయిందా. పోదు ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్టూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించ లేదు. రాజభోగాలు అనుభవించ వలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ దృతరాష్ట్రుడి లాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి? " అని బాధపడి మళ్ళీ " నీ ఆజ్ఞానువర్తనులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడుచి ఉన్నారు. నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండ రాళ్ళ మీద నడచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచి పెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కి పోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నారు. వారిని చూసి కూడా ఓర్పు వహిస్తున్నారా? క్షమను తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు అనే కథ మన ఇతిహాసంలో ఉంది . పూర్వం బలి చక్రవర్తి క్షమ గొప్పదా ? తేజస్సు గొప్పదా ? అని తన తాత అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు అన్ని సమయాలలో క్షమ పనికిరాదు. అలాగే సదా ప్రతాపం చూపకూడదు రెండూ సమపాళ్ళలో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు యజమానిని గౌరవించరు. ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజా కంటకుడౌతాడు " అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ అదేపనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించ వచ్చునా? కనుక ఇది పరాక్రమం, తేజస్సు చూపింఛ వలసిన సమయం " అన్నది. అందుకు ధర్మరాజు " ద్రౌపదీ! కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు. చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలిన వాడు తేజోవంతుడు ఔతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమా గుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు " అన్నాడు. అందుకు ద్రౌపది " ఓ అజాత శత్రువా! నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు. కానీ క్షమ శత్రువుల వద్ద తగునా? వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి ఓ బ్రహ్మదేవా! నీవు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి, ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా? " అని నిర్వేదంతో పలికింది. ధర్మరాజు " ద్రౌపదీ! నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. అది తప్పు కదా? ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహా మునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు. నీవు దుష్టద్యుమ్నుడు పుణ్య ఫలమున పుట్టిన వాళ్ళు కదా " అన్నాడు. ద్రౌపది " కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానిని కాదు. కాని కర్మ చేయడం మానవ ధర్మం కదా? కర్మ ఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తరువాత దైవ బలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తరువాత ప్రయత్నం చేయాలి అప్పుడు దైవం సాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా పురుష ప్రయత్నం లేని ఎడల నూనె రాదు, నిప్పు పుట్టదు కదా? పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందా? కనుక మీ తమ్ముల పరాక్రమం ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్ర్తార్ధన " అన్నది.

భీముని ఆవేదన

ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు. " అన్నయ్యా! రాజ్యం మన తండ్రి తాతలది దానిని నీవు అన్యుల పరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు. చెడ్డ వారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా ? పరాక్రమంతో శత్రువులను జయించాలి కాని ధర్మం ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమం లేని వాడు కృంగి పోవాలి కాని నీ వంటి వారు కాదు. ఆ నాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు. ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేక పోవడం కౌరవులకు చులకన అయింది అది మన పిరికితనం అనుకుంటున్నారు. నీవు అనుసరిస్తున్న ధర్మం మనకు, మన బంధు వర్గాలకు బాధ కలిగిస్తుంది. శత్రువులను జయించడం, ప్రజల భయాన్ని పోగొట్టడం, దానధర్మాలు చేయడం, యజ్ఞయాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మం. కేవలం ధర్మాచరణతో శత్రువులను జయించ లేము. మోసాన్ని మోసంతో జయించాలి. ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్ళను జయిద్దాం. రాజులంతా మనకు సాయం చేస్తారు. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు " అని భీముడన్నాడు. ధర్మరాజు " భీమా ! నీ మాటలు ధర్మ సమ్మతమే కానీ నేను సభలో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలకు ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకూ వేచి ఉంటాను " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు ఆశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగునా ? మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా? " అన్నాడు." శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయం తపిస్తుంది. నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కుండా ధర్మం, దయా అంటూ కూర్చోవడం తగునా? నీవనుసరించే మార్గం బ్రాహ్మణులకు తగును కానీ క్షత్రియులకు కాదు. క్షాత్ర ధర్మం ప్రకారం యుద్ధం చేస్తాము. అడవిలో పన్నెండేళ్ళు గడప వచ్చు. కానీ జనపదాలలో పన్నెండు నెలలు గడపడం అసాధ్యం. జగత్ప్రసిద్ధులమైన మనం దాగుట అసాధ్యం కనుక తిరిగి అరణ్యవాసం అజ్ఞాత వాసం ఇలా ఎన్నాళ్ళు. కనుక ఇప్పటి మన పదమూడు నెలల వనవాసం పదమూడేళ్ళుగా భావించడంలో తప్పేమి లేదు " అని భీముడన్నాడు. ధర్మరాజు భీమునితో " భీమా ! నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి. కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. దృతరాష్ట్రుని కుమారులు మహావీరులు పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుల అండ ఉంది. రాజసూయయాంలో మనచేత ఓడింపబడిన రాజులంతా కౌరవ పక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండల ధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహా యోధులకు మనపట్ల విరోధం లేకున్న ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కాని దుర్యోధనుని జయించ లేము . కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు " అని చెబుతుండగా వ్యాసుడు అక్కడకు వచ్చాడు.

అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించుట

ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు." ధర్మరాజా! నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తారు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి " అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వ నానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో " అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు " అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని చూసి " వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు " అన్నాడు. ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. " అర్జునా నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో " అని అన్నాడు. అర్జునుడు " నాకు దివ్యాస్త్రాలు కావాలి " అన్నాడు. ఇంద్రుడు " ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా? " అని అడిగాడు. అర్జునుడు " ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి " అన్నాడు. ఇంద్రుడు " అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి " అన్నాడు.

అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట


అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట, శివునితో అర్జునుని యుధ్ధము
వెంటనే అర్జునుడు ఇంద్రకిలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుడుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆపంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో " నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా " అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా " అన్నాడు శివుడు.

పందికి గురిపెడుతున్న అర్జునుడు
అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జుననకు ఆశ్చర్యం వేసింది " ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి " అని కున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి " అని మనసులో అనుకున్నాడు. మరల బాణం వేయడానికి గాండీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాడీవం అదృశ్యం అయింది. ఇక ఇరువురు ద్వంద యుద్దానుకి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు. శివుడు తన నిజ రూపం ధరించాడు. అర్జునుడు కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్థితించాడు. " పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు " అన్నాడు. అందుకు శివుడు " అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి . ఇదిగో నీ గాడీవం .ఇంకా ఎదైనా వరం కోరుకో " అన్నాడు. అర్జునుడు " త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు " అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం , సంధానం, మోక్షణము,

అర్జునుడికి పాశుపతాన్ని ఉపదేశిస్తున్న ఈశ్వరుడు
సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.శివుడు అర్జునుడితో " అర్జునా! ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము " అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.

ఇంద్రలోకంలో అర్జునుడు


అర్జునికి ఊర్వశి శాపం
దానిపై అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి " అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా? " అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. " అర్జునా ! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను " అన్నది. " మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్ఛా శృంగారం దోషం, పాపం " అన్నాడు. ఊర్వశి కోపించి " కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు " అని శపించి వెళ్ళి పోయింది. ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో " అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది " అని ఊరడించాడు. తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి " ఎవరీతుడు ? " అని ఇంద్రుని అడిగాడు. దానికి దేవేంద్రుడు " మహర్షీ ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధ్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు " అని రోమశునితో చెప్పాడు.

ధృతరాష్ట్రుని చింత

భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి " సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది " అన్నాడు . సంజయుడు " సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారథ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? " అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు " నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును " అని పరితపించాడు. ధరమరాజు కామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు " అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను, అర్జునిని ఎదిరించే వారు లేరు" అన్నాడు. అందుకు ధర్మరాజు " భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను " అన్నాడు ధర్మరాజు.


NEXT
  • వన పర్వము ద్వితీయాశ్వాసము

    • 1.1 నలదమయంతులు
    • 1.2 నలదమయంతుల మధ్య హంస రాయబారం
    • 1.3 దమయంతి స్వయంవరం
    • 1.4 నలదమయంతులపై కలిప్రభావం
    • 1.5 నలదమయంతుల వియోగం
    • 1.6 నలుడు వికృతరూపుడగుట
    • 1.7 దమయంతి విదర్భ దేశానికి చేరుట
    • 1.8 దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట
    • 1.9 నలుడు స్వయంవరానికి బయలుదేరుట
    • 1.10 నలదమయంతుల కలయిక
    • 1.11 నలదమయంతులు రాజ్యాన్ని పొందుట
    • 1.12 ధర్మరాజు వద్దకు నారదుని రాక
      • 1.12.1 తీర్ధ మహిమ
    • 1.13 రోమశుని రాక
    • 1.14 ఆగస్త్యమహాముని వృత్తాంతం

Featured Post

RAMAYANAM - రామాయణము