Friday, June 30, 2017

అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము


- అశ్వమేధయాగము ముహూర్తము సమీపింగానే వ్యాసుడు మొదలైన ఋత్విక్కులు వేదహితముగా ధర్మరాజు చేత యాగదీక్ష చేయించారు. ధర్మరాజు దండము ధరించి కృష్ణాజినము మీద కూర్చున్నాడు. తరువాత యాగాశ్వమును పూజించి యాగాశ్వమును వదిలి పెట్టాడు. యాగాశ్వము బయలు దేరింది. అర్జునుడు గాడీవము చేతబూని తన సైన్యముతో యాగాశ్వముకు రక్షణగా వెంబడించాడు. హస్థినాపుర ప్రజలందరూ పురవీధులలో రెండు వైపులా నిలిచి అర్జునుడిని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదాలు వినయంగా స్వీకరిస్తూ అర్జునుడు యాగశ్వముకు రక్షణగా బయలుదేరాడు. అర్జునుడి వెంట యజ్ఞవల్క్య శిష్యుడు మరికొంత మంది బ్రాహ్మణులతో అర్జునుడి వెంట బయలుదేరాడు.

అశ్వమేధయాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు

ఆశ్వము త్రిగర్త దేశములో ప్రవేశించుట

యాగాశ్వము ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ త్రిగర్తదేశంలో ప్రవేశించింది. త్రిగర్తాధీశుని కుమారులు, మనుమలు ఉత్సాహవంతులై అశ్వమును పట్టడానికి ముందుకు ఉరికారు. అర్జునుడు వారితో అనునయంగా ఇలా చెప్పాడు. " రాకుమారులారా ! ఇది ధర్మరాజుతో విడువబడిన యాగాశ్వము. దీనికి కీడుతలపెట్టిన అది ధర్మరాజుకు కీడుతలపెట్టిన దానితో సమానము. మనలో మనకు వైరము ఎందుకు సఖ్యతతో ఉంటాము. ధర్మరాజు నాతో " మహాభారత యుద్ధములో రాజులందరూ మరణించారు. ప్రస్తుతము వారి కుమారులు మాత్రమే ఉన్నారు. నీవు వారిమీద దయ చూపించు. వారిని చంపవద్దు. వారికి మనమధ్య కల బంధమును వివరించి వారితో స్నేహబంధాన్ని వృద్ధి చేయ ప్రయత్నించు " అని చెప్పాడు. కనుక నేను మీతో పోరాడను. మీరు కూడా ధర్మరాజుతో సఖ్యతను ఏర్పరచుకుని మీ ప్రాణములు రక్షించుకోండి. అని వినయంగా పలికిన అర్జునుడి మాటలను పెడచెవిన పెట్టిన త్రిగర్తాదీశుడు సూర్యవర్మ అర్జునుడి మీద శరవర్షము కురిపించాడు. అర్జునుడికి యుద్ధము చేయక తప్పలేదు కనుక సూర్యవర్మ బాణాలను మధ్యలోనే తుంచి వేసాడు. సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ అన్నకు తోడుగా యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు అతడి బాణములను కూడా మధ్యలోనే తుంచివేసి వారిని యుద్ధరంగము నుండి తరిమివేసాడు. తరువాత కేతువర్మ తమ్ముడు ధృతవర్మ అర్జునుడిని ఎదిరించి తన బాణకౌశలముతో అర్జునుడిని మెప్పించాడు. అర్జునుడు అతడి బాణములను మధ్యలో తుంచుతూ అతడిని వదిలివేసినా అతడు అర్జునుడి మీద వాడి అయిన బాణములు వేసి బాధించాడు. అర్జునుడు కోపించి అతడిమీద వాడి అయిన బాణ ప్రయోగము చేసాడు. అతడు అర్జునుడి చేతి మీద వేసిన బాణము దెబ్బకు అర్జునుడు గాండీవమును జారవిడిచాడు. అది చూసిన త్రిగర్తసేనలు హర్షధ్వానాలు చేసినా సైన్యాధీశులు మాత్రము " అర్జునుడు ధర్మరాజు మాట మీద గాండీవము జారిపడినా ఊరుకున్నాడు కాని అర్జునుడు కోపించిన మనమంతా భస్మముకాక తప్పదు " అని చెప్పి అర్జునుడికి ఎదురుగా వారంతా నిలిచారు. ఇంతలో అర్జునుడు కింద పడిన గాండీవమును చేత పట్టుకుని పిడుగుల వంటి బాణములను ప్రయోగించి త్రిగర్త సైన్యాలను పీనుగుపెంట చేసాడు. త్రిగర్తదేశ సైన్యాలు చెదిరిపోగా మిగిలిన వారు అర్జునుడిని శరణువేడారు. అర్జునుడు వారిని వెంబడించక వదిలివేసాడు. ఇలా అర్జునుడు త్రిగర్తసైన్యాలను జయించాడు.

అశ్వము ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించుట

తరువాత అశ్వము ప్రాగ్జ్యోతిషపురములో ప్రవేశించింది. భగదత్తుడికుమారుడు వజ్రదత్తుడు ప్రాగ్జ్యోతిషపురమును పాలిస్తున్నాడు. అతడు హయమును అడ్డగించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి వాడి అయిన బాణముల ధాటికి తాళలేక పారి పోయిన వజ్రదత్తుడు హయమును వదిలి పారిపోయి తిరిగి ఏనుగు ఎక్కి వచ్చాడు. అర్జునుడు ముందు వజ్రదత్తుడి బాణములను మధ్యలో తుంచినా అతడి మీద వాడి అయిన బాణ ప్రయోగము చేయ లేదు. వజ్రదత్తుడు అర్జునుడి మీద ప్రయోగించిన వాడి అయిన బాణములకు ప్రతిగా అర్జునుడు కూడా వాడి అయిన బాణములు ప్రయోగించి వజ్రదత్తుడిని కింద పడవేసాడు. కింద పడిన వజ్రదత్తుడు తిరిగి ఏనుగు ఎక్కి అర్జునుడిని తన బాణములతో కప్పి వేసాడు. ఇలా వారి మధ్య మూడు రోజులపాటు హోరాహోరీగా యుద్ధము సాగింది. నాలుగవ రోజున వజ్రదత్తుడు విజృంబించి " అర్జునా ! నా తండ్రి వృద్ధుడు కనుక అతడు యుద్ధములో మీ చేత మరణించాడు. కాని యువకుడిని అయిన నన్ను జయించడము అసాధ్యము " అన్నడు. అంటూ అర్జునుడి మీదకు కొండవంటి ఏనుగును తోలి అర్జునుడి మీద బాణవర్షము కురిపించాడు. అర్జునుడు ఒకే బాణముతో ఆ ఏనుగును పడగొట్టి వజ్రదత్తుడిని కింద పడవేసి అతడిని చూసి " వజ్రదత్తా ! ఈ యాగాశ్వమును వదులుతూ ధర్మరాజు నన్ను ఈ యాగాశ్వముకు రక్షకుడిగా నియమించి " అర్జునా ! ఈ అశ్వమును అడ్డగించిన వారిని వధించక వారిమీద కరుణ వహించు" అని చెప్పాడు. కనుక నేను నిన్ను చంపను. నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ధర్మరాజు తరఫున నేను నిన్ను బంధుమిత్ర సమేతంగా వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి నాటికి ధర్మరాజు నిర్వహిస్తున్న అశ్వమేధయాగానికి ఆహ్వానిస్తున్నాను. నీవూ అ యాగముకు వచ్చి యాగమును జయప్రథము చెయ్యి " అని పలికాడు. వజ్రదత్తుడు కూడా అందుకు సమ్మతించి యాగాశ్వమును వదిలి అర్జునుడితో సంధి చేసుకున్నాడు.

అశ్వము సింధుదేశములో ప్రవేశించుట

తరువాత యాగాశ్వము సింధుదేశములో ప్రవేశించింది. సింధుదేశపురాజు సైంధవుడు మహాభారతయుద్ధములో మరణించగా అతడి కుమారులు మనుమలు మాత్రము రాజ్యముచేస్తున్నారు. వారంతా అర్జునుడి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి ధాటికి అర్జునుడు తట్టుకోలేక గాడీవమును జారవిడిచి తిరిగి శక్తిని కూడతీసుకుని వారిమీద విరుచుకు పడి సింధురాజుల మీద వారి సైన్యాలను చీల్చిచెండాడి రణభూమిని శవాల పెంటకుప్పగా మార్చాడు. సైన్యము చెల్లాచెదురు అయినా సింధురాజులు సైన్యాలను కూడదీసుకుని యుద్ధానికి తలపడ్డారు. అర్జునుడు వారితో ధర్మరాజు చెప్పిన శాంతి వచనాలు చెప్పాడు. అయినా సింధురాజులు వాటిని పెడచెవిన పెట్టి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు చేసేది ఏమి లేక వారి వీరులను సంహరించారు. అప్పుడు దుస్సల రోదిస్తూ వారి వద్దకు వచ్చింది. అర్జునుడు దుస్సలను చూడగానే రధము దిగి ఆమెను సమీపించాడు. దుస్సల అర్జునుడితో " అన్నయ్యా ! వీడు నీ మేనల్లుడి కుమారుడు. నీ మనుమడు. వీడిని రక్షించు " అన్నది. అర్జునుడు " అమ్మా దుస్సలా ! నా మేనల్లుడు ఎక్కడ? " అని అడిగాడు. దుస్సల " అన్నా ! తన తండ్రి సైంధవుడు నీ చేతిలో భారతయుద్ధములో మరణించిన విషయము తెలిసి నా కుమారుడు చాలా దుఃఖించాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన విషయము తెలిసి గుండె ఆగి మరణించాడు. ఇప్పుడు వీడొక్కడే వంశాంకురము మిగిలాడు " అని చెప్పింది. ఆ మాటాలకు అర్జునుడు కూడా దుఃఖించాడు. తిరిగి దుస్సల " అన్నయ్యా అర్జునా ! ధృతరాష్ట్రులు మీకు చేసిన అపకారములు, సైంధవుని అనుచిత ప్రవర్తన మనసులో పెట్టుకోకు. తండ్రి లేని వాడైన నా మనుమడిని రక్షించు " అని మనుమడితో అర్జునుడికి పాదాభివందనము చేయించింది. అర్జునుడు " అమ్మా ! నీ సోదరుడు సుయోధనుడు దుర్మార్గుడే కాని మేము మాత్రము తక్కువా చెప్పు. ఇంతటి ఘోరయుద్ధానికి మేము కూడా కారణం అయ్యాము. రాచకులములో పుట్టడం ఎంతటి మహాపాపము. దుస్సలా ! నీ మనుమడికి హానిచెయ్యను నీవూ భయపడవలసిన పని లేదు " అని పలికాడు. ఆ మాటలకు దుస్సల సంతోషించిన దుస్సల మనుమడిని తీసుకుని వెళ్ళింది. అర్జునుడు అశ్వాన్ని విడిపించుకుని జయిత్రయాత్ర సాగించాడు.

అశ్వము మణిపూర్వక నగరంలో ప్రవేశించుట

ఆ తరువాత యాగాశ్వము నిరాఘాటంగా పయనిస్తూ మణీపూర రాజ్యములో ప్రవేశించింది. మణిపూరాజ్యాన్ని అర్జున చిత్రాంగధల కుమారుడైన బభ్రువాహనుడు పాలిస్తున్నాడు. బభ్రువాహనుడు తనతండ్రి అర్జునుడు యాగాశ్వరక్షకుడిగా రాజ్యంలో ప్రవేశించాడన్న విషయము తెలుసుకుని అర్జునుడికి స్వాగతము చెప్పడానికి తగిన ఏర్పాటుతో ఎదురు వచ్చాడు. కాని అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుడు వీరమును ప్రదర్శిస్తూ అశ్వమును పట్టకుండా తనకు స్వాగతము పలకడము భీరుత్వములా అనిపించింది. అందుకని అర్జునుడు " బభ్రువాహనా ! నీవు నా కుమారుడివి పైగా వీరుడివి. నీవిలా పిరికివాడిలా స్వాగతము పలుకక నీ వీరమును ప్రదర్శించి నన్ను ఎదుర్కొనడమే క్షత్రియ ధర్మము. అలా ఎదిరించినప్పుడే ఉత్తమక్షత్రియుడవు అనిపించుకుంటావు. అప్పుడే నీకు రాజయ్యే అర్హత ఉంటుంది " అంటూ బభ్రువాహనుడిని రెచ్చగొట్టాడు. అయినా బభ్రువాహనుడికి అర్జునుడిని ఎదుర్కొనడానికి మనస్కరించక తిరిగి రాజ్యానికిపోసాగాడు. మార్గమధ్యంలో బభ్రువాహనుడిని కలుసుకున్న నాగరాజ కుమార్తె అయిన ఉలూపి అతడిని కలుసుకుని " బభ్రువాహనా నేను అర్జునుడి పత్నిని నీకు తల్లిని. అర్జునుడు తనకుమారుడైన నిన్ను వీరుడిలా చూడాలని అనికుంటాడే కాని పిరికివాడిలా స్వాగతం చెప్పాలని ఎదురు చూడడు. కనుక యాగాశ్వమును అడ్డగించి నీ తండ్రి అర్జునుడి ముందు నీ వీరమును ప్రదర్శించి అతడికి ఆనందము కలిగించు. ఇది ఉత్తమ క్షత్రియధర్మము " అని ఉలూపి బభ్రువాహనుడితో చెప్పింది. బభ్రువాహనుడు ఉలూపికి నమస్కరించి " అమ్మా ఉలూపి ! నేను నా తండ్రి అయిన అర్జుడితో యుద్ధము చేయ మనస్కరించక తిరిగి పోతున్నాను. కన్న తండ్రితో యుద్ధము చేయడము ధర్మము కాదని అకున్నాను. లేకున్న నేను యుద్ధము చేయలేక కాదు ఇక నేను యుద్ధముచేయక తిరిగి రాను. ఇప్పుడు నా తల్లివైన నీ అనుమతి లభించింది. కనుక నాకిక ఎవరి అనుమతితో పని లేదు. నేను నా తండ్రి అర్జునుడిని ఎదుర్కొని యుద్ధము చేసి నా తల్లి తండ్రులను ఆనందపరుస్తాను " అని చెప్పాడు.

బభ్రువాహనుడు అర్జునుడిని ఎదుర్కొనుట


బబ్రువాహనుని చేతిలో అర్జునుని మరణము
బభ్రువాహనుడు తల్లికి నమస్కరించి తనతండ్రి అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధము అయ్యాడు. ముందుగా అశ్వాన్ని బంధించి తరువాత అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ముందుగా బభ్రువాహనుడు అర్జునుడి మీద బాణప్రయోగము చేసాడు. అర్జునుడు కుమారుడు వేసిన బాణములను మధ్యలోనె తుంచివేసి బభ్రువాహనుడి శరీరములో నాటేలా పదునారు బాణములు ప్రయోగించాడు. బభ్రువాహనుడు బదులుగా ఇరువది బాణములు అర్జునుడి శరీరములో నాటాడు. కుమారుడి యుద్ధకౌశలానికి మురిసిపోయిన అర్జునుడు ముండూఘమను శరమువేసి బభ్రువాహనుడి ధ్వజమును విరిచాడు. బభ్రువాహనుడు బెదరక అర్జునుడి భుజములో గుచ్చేలా ఒక బాణమును ప్రయోగించాడు. అర్జునుడు ఆదెబ్బకు దిమ్మతిరిగినా అంతలోనే తేరుకుని కుమారుడి యుద్ధకౌశలానికి మెచ్చుకుని తిరిగి బభ్రువాహనుడి మీద శరప్రయోగము చేసాడు. బభ్రువాహనుడు వాటిని అన్నింటినీ మధ్యలోనే తుంచాడు. కుమారుడి యుద్ధకౌశలానికి అర్జునుడిలో ఒకింత కోపము వచ్చింది బదులుగా బభ్రువాహనుడి శరీరము అంతా బాణములు గుచ్చాడు. బభ్రువాహనుడు కూడా పట్టరాని కోపంతో ఒక బాణాన్ని అర్జునుడి గుండెలలో సూటిగా గుచ్చాడు. ఆ బాణము అర్జునుడి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్ళింది. అర్జునుడు నేలకు ఒరుగుతూ బభ్రువాహనుడి మీద బాణాలను ప్రయీగించాడు. ఆ బాణముల ధాటికి బభ్రువాహనుడు కూడా నేలకు ఒరిగాడు.

చిత్రాంగద దుఃఖించుట

చిత్రాంగదకు అర్జునుడు, బభ్రువాహనుడు నేలకొరిగిన విషయము తెలిసి పరుగు పరుగున యుద్ధభూమికి తరలి వచ్చింది. ఉలూపీ కూడా యుద్ధభూమికి వచ్చింది. ఉలూపీణీ ఛుసిన చిత్రాంగద " ఉలూపీ ! నీ వలన ఎంత ఘోరము జరిగిందో చూసావా ! తండ్రి కొడుకులను యుద్ధానికి పురికొలిపిన ఫలితంగా వారిరువురు ఇలా అచేతనులయ్యారు. నీవూ పతివ్రతవు కాదా ! నీకు ధర్మము తెలియదా ! నీవు ఈ పసివాడిని తండ్రిమీద ఎందుకు యుద్ధానికి పురికొల్పావు. నీవె మనభర్త అర్జునుడిని పునరుజ్జీవితుడిని చెయ్యాలి. నీ వలననే ఈ ఘోరము జరిగింది కనుక అర్జునుడిని పునరుజ్జీవితుడిని చేయవలసిన బాధ్యత నీదే " అన్నది చిత్రాంగద. తరువాత చిత్రాంగద అర్జునుడిని చూసి " నాధా మహావీరా ! ఎందరి ప్రాణాలనో కాపాడిన నీవిలా నీ ప్రాణాలు కాపాడ లేక పోయావు. ప్రాణనాధా ! ఎన్ని రోజులైంది నిన్ను చూసి. కళ్ళు తెరచి చూడండి నేను మీ చిత్రాంగదను వచ్చాను. మీరు మీ అన్న గారి యాగాశ్వమును కాపాడాలి. లేవండి యాగాశ్వము వెంట వెళ్ళండి " అని శోకించింది చిత్రాంగద. మరలా ఉలూపిని చూసి ఇతడు మన ఇద్దరికి భర్త. నాకుమారుడి చేతిలోనే నా భర్త ప్రాణాలు పోయేలా చేసావు. నీవు ముందు నా భర్తను బ్రతికించక పోయినచో నేను ప్రాయోపవేశము చేస్తాను " అని దృఢంగా చెప్పింది.

బభ్రువాహనుడు విలపించుట

ఇంతలో మూర్చ నుండి లేచిన బభ్రువాహనుడు ఏడుస్తున్నా చిత్రాంగదను చూసి " అమ్మా ! నీవు శోకించడము నేను ఎన్నెడూ చూడ లేదు. ఇది కూడదు తగదు అని చూడక కన్నతండ్రిని యుద్ధములో చంపిన మహాపాపిని నేను. నా పాపానికి నిష్కృతి లేదు " అని తల్లి పక్కన కూర్చుని బభ్రువాహనుడు విలపించసాగాడు. ఇంతలో అక్కడకు వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యులు మిగిలిన బ్రాహ్మణులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన బభ్రువాహనుడు " అయ్యో ! ఈ బ్రాహ్మణులు అర్జునుడిని అనుసరించి వచ్చారు. ఇక్కడ అర్జునుడు విగతజీవుడై పడి ఉన్నాడు " అని శోకించసాగాడు. తిరిగి ఉలూపిని చూసి " అమ్మా ! నీ మాట మీద నిన్ను సంతోషపరచాలని కదా నా తండ్రి అర్జునుడితో యుద్ధము చేసాను. నా తండ్రి మరణానికి నేనే కారణమయ్యాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ! తండ్రినిచంపిన నా పాపానికిక నిష్కృతిలేదు. నాకిక మనశ్శాంతి లేదు ఉత్తమలోక ప్రాప్తిలేదు " అని విలపించసాగాడు. తరువాత పైకి లేచిన బభ్రువాహనుడు తల్లి చిత్రాంగద అక్కడ చేరిన జనులు వినేలా " నా తండ్రి లేని లోకంలో నేనిక బ్రతుకలేను. నేనిక నా తండ్రితో కలసి ప్రాయోపవేశము చేస్తాను. వీరుడు, రాజు, ధార్మీకుడు, మీదు మిక్కిలి నా తండ్రి అయిన అర్జునుడిని చంపిన నాకిక ప్రాయోపవేశమే గతి " అని నేల మీద మౌనంగా కూర్చున్నాడు.

ఉలూపి బభ్రువాహనుడిని ఓదార్చుట


అర్జునుని కలసిన బబ్రువాహనుడు
అప్పటి వరకు ఒక్క మాట మాట్లాడక ఊరక ఉన్న ఉలూపి కళ్ళు మూసుకుని తన మనసులో నాగజాతికి ప్రియమైన సంజీవమణిని స్మరించింది. వెంటనే ఉలూపి చేతిలో సంజీవనీ మణి ప్రత్యక్షము అయింది. ఉలూపి బభ్రువాహనుడిని చూసి " కుమారా ! ఏమిటయ్యా ఈ వెర్రి. మీ అందరికి పిచ్చి ఏమైనా పట్టిందా ! లేకున్న అర్జునుడు ఏమిటి చావడము ఏమిటి సాక్షాత్తు దేవేంద్రుడికి కుమారుడైన అర్జునుడు యుద్ధమున మరణిస్తాడా ! అతడిని చంపకలిగిన వీరుడు ఈ లోకంలో ఉన్నాడా ! నీ శక్తిని పరీక్షించడానికి అర్జునుడితో పోరాడమని చెప్పి అర్జునుడి అభిమతము నెరవేర్చాను. మీలో ఎవరూ చావలేదు. కేవలము మూర్చపోయేలా చేసాను. అర్జునుడు చనిపోయాడని అనుకోవడము కేవలము నీ భ్రమ. నీ తండ్రి అర్జునుడు ఇప్పుడే లేచి కూర్చుంటాడు చూడు " అని పలికింది. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా ఆనందాశ్చర్యచకితులు అయ్యారు. ఉలూపి బభ్రువాహనుడి చేతిలో ఆమణిని పెట్టి " కుమారా ! ఈ మణిని అర్జునుడి గుండెల మీద పెట్టు " అని చెప్పింది. బభ్రువాహనుడు ఆ మణిని అర్జునుడి గుండెల మీద పెట్టగానే అర్జునుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి బభ్రువాహనుడిని చూసి " కుమారా ! కుశలమా " అని అడిగాడు. అప్పుడు బభ్రువాహనుడు " మీ దయ వలన అంతా క్షేమమే " అని అర్జునుడి కాళ్ళకు మొక్కాడు. అర్జునుడు తన చుట్టూ చిత్రాంగద, ఉలూపి, బ్రాహ్మణులను వారి ముఖాలలోని ఆశ్చర్యానందాలను చూసి " కుమారా ! వీ రందరి ముఖాలలో ఆనందము ఆశ్చర్యము విషాదము ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. పైగా మన ఇరువురి మధ్య యుద్ధము జరుగుతున్న సమయంలో చిత్రాంగద, ఉలూపి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు బభ్రువాహనుడు ఉలూపిని చూపి " తండ్రీ ! ఈమెను అడగండి ఈ మహానుభావురాలు జరిగినది అంతా మీకు వివరిస్తుంది " అని సవివరంగా చెప్పాడు.

ఉలూపి ఎరిగించిన రహస్యము

అర్జునుడు ఉలూపిని చూసి " ఉలూపీ ! ఏమి జరిగింది. కుమారుడు బభ్రువాహనుడు కాని అతడి తల్లి చిత్రాంగద కాని నీ పట్ల అనుచితంగా ప్రవర్తించారా ! నీ రాకకు కారణము ఏమిటి ? " అని అడిగాడు. ఉలూపి చిరునవ్వు నవ్వి నాధా ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరూ నాపట్ల అనుచితముగా ప్రవర్తించ లేదు. మీరు కాని, కుమారుడైన బభ్రువాహనుడు కాని, చిత్రాంగద కాని అనుచితంగా ప్రవర్తిస్తారా ! తాము నా పట్ల దయ వహించి నేను చెప్పేది శరద్ధగా వినండి. బభ్రువాహనుడు మీతో యుద్ధము చేస్తున్న తరుణంలో కుమారుడు వలన మీకు అశుభం జరిగింది. ఇందుకు ఒక కారణము ఉంది. మీరు భారతయుద్ధములో శిఖండిని ముందు పెట్టుకుని తాతగారైన గంగాపుత్రుడు అయిన భీష్ముడిని పడగొట్టారు. అందు వలన మీకు సంక్రమించిన పాపపరిహారము చేయకున్న మీకు నరకప్రాప్తి కలుగుతుంది. అందు వలన నేను పాతాళము నుండి వచ్చి మీ పాపముకు నివృత్తి చేసాను. ఇది నాకు ఎలా తెలిసింది అంటే ఒకరోజు నేను గంగానదిలో స్నానము చేస్తున్న తరుణములో వసువులు కూడా వచ్చి గంగా నదిలో స్నానము చేస్తున్నారు. అప్పుడు గంగాదేవి తన నిజరూపములో వచ్చి వసువులతో మాట్లాడసాగింది. అప్పుడు వసువులు గంగాదేవితో " అమ్మా ! భీష్ముడు నీ కుమారుడు, వసువులలో ఒకడు. అలాంటి భీష్ముడిని అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని పడకొట్టాడు. అయినా భీష్ముడు తనకుతాను ఏర్పరుచుకున్న నియమము ప్రకారము శరసంధానము చేయలేదు. ఆ కారణముగా భీష్ముడు అంపశయ్య మీద పడి పరమపదించాడు. నిరాయుధుడైన భీష్ముడిని కుత్సితంగా, నీచంగా జయించాడు. అలాంటి అర్జునుడిని మేము శపించాలని అనుకున్నాము " అన్నారు. అందుకు గంగాదేవి తన ఆమోదము తెలిపింది. ఇది విన్న నేను నాగలోకముపోయి జరిగిన విషయము నా తండ్రి నాగరాజుకు వివరించాను. నా తండ్రి వసువుల వద్దకు వెళ్ళి అర్జునుడిని క్షమించమని పలు విధముల ప్రాధేయపడ్డాడు. చివరకు వారు కరుణించి ఒక నియమము పెట్టారు. అది ఏమంటే అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుడి చేతిలో యుద్ధము చేసి నేలకు ఒరిగిన ఆ పాపము పోతుంది అని చెప్పారు. నా తండ్రి ఈ విషయము నాకు చెప్పారు. నేను తగిన సమయము కొరకు వేచి చూస్తున్నాను. ఇప్పుడు మీరు యాగాశ్వరక్షణ నిమిత్తము ఇక్కడకు వచ్చి బభ్రువాహనుడిని తమతో యుద్ధము చేమని చెప్పడమూ బభ్రువాహనుడు తమతో యుద్ధము చేయ మనస్కరించక తిరిగి పోవాడమూ తెలుసుకుని నేను బభ్రువాహనుడిని మార్గ మధ్యములో ఆపి తమతో యుద్ధానికి ప్రోత్సహించాను. కుమారుడి చేతిలో తమరు ఓడి పోయారు. అందువలన నీ పాపము నశించినది. నేను సంజీవమణిని బభ్రువానుడికి ఇచ్చి మిమ్ము పునరుజ్జీవితుడిని చేసాను. తరువాత జరిగినది మీకు అందరికీ తెలిసినదే " అని ఉలూపి అర్జునుడితో సహా అందరికీ తెలిపింది.

అర్జునుడు చింత్రాంగాదులను విడిచి వెళ్ళుట

ఉలూపి మాటలకు అర్జునుడు సంతోషించాడు. అర్జునుడు అక్కడ ఉన్న వారిని అందరినీ చూసి " రాబోవు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హస్థినాపురములో వ్యాసుడు చెప్పిన విధంగానే అశ్వమేధయాగము చేస్తాము. ధర్మరాజు ఆధ్వర్యములో అశ్వమేధయాగము చేస్తున్నారు. తమరు అందరూ బంధుమిత్ర సమేతంగా విచ్చేయమని ధర్మరాజు తరఫున ఆహ్వానము అందచేస్తున్నాను " అని చెప్పాడు. బభ్రువాహనుడు " తండ్రిగారూ ! తమరు మా నగరముకు విచ్చేసి మా ఆతిధ్యము స్వీకరించాలని కోరుతున్నాను " అని బభ్రువాహనుడు ప్రార్థిచాడు. అర్జునుడు " కుమారా ! యాగదీక్షాలో ఉన్న నేను నగరప్రవేశము చేయకూడదు " అని అర్జునుడు బభ్రువాహనుడికి చెప్పి ఉలూపి, చిత్రాంగదల వద్ద శలవు తీసుకుని యాగాశ్వమును అనుసరించాడు.

అశ్వం రాజగృహనగరంలో ప్రవేశించుట

యాగాశ్వము రాజగృహము అనే నగరములో ప్రవేశించింది. రాజగృహనగరాన్ని పరిపాలిస్తున్న జరాసంధుడి మనుమడు మేఘసంధి యాగాశవమును పట్టి బంధించి అర్జునుడితో " అర్జునా ! ఇదేమన్నా విరాటనగర అంతఃపురము అనుకున్నావా ! ఆడవాళ్ళ మధ్య తిరగడానికి. ఇది రణరంగము ఇక్కడ యుద్ధము చేయాలి . నేను హయమును పట్టుకున్నాను నువ్వు నాతో యుద్ధము చెయ్యాలి " అని అర్జునుడిని రెచ్చగొట్టాడు. అర్జునుడు నవ్వి " రాజా ! నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ఇది యాగాశ్వము దీనిని పట్టుకున్న వారిని చంపవద్దని ధర్మరాజు నన్ను యాగాశ్వరక్షకుడిగా పంపుతూ చెప్పాడు. ఉన్న విషయము నీకు చెప్పాను. తరువాత నీ ఇష్టము " అని అన్నాడు. అర్జునుడి మాటలను అలుసుగా తీసుకుని మేఘసంధి అర్జుడి మీద శరవర్షము కురిపించాడు. అర్జునుడు తనను తాను రక్షించుకుంటూ మేఘంధి బాణములను ఖండించస్తూ మేఘసంధి సారథిని కాని మేఘసంధి సారథినిగాని గాయపరచ లేదు. మేఘసంధి అది అలుసుగా తీసుకుని అర్జునుడి శరీరము అంతా బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కోపించి ఇక మేఘసంధిని వదిలితే ప్రయోజనము లేదని ముందుగా మేఘసంధి హయములను కొట్టి చంపాడు, తరువాత సారథిని చంపాడు, తరువాత పతాకమును కూల్చాడు, తరువాత రథమును కూలగొట్టాడు. రథము నుండి కిందకు దిగిన మేఘసంధి గధను తిప్పుతూ అర్జునుడితో తలపడ్డాడు. అప్పుడు కూడా అర్జునుడు మేఘసంధిని గాయపరచక అతడి గధను మాత్రము పడగొట్టి అతడిని నిరాయుధుడిని చేసి " మేఘసంధీ ! ధర్మరాజు మాటను మన్నించి నేను నిన్ను చంప లేదు. అందు వలన ఇంతవరకు నాతో యుద్ధముచేసి జీవించి ఉన్నావు. క్షత్రియధర్మము పాటించి అశ్వమును పట్టావు. నాతో యుద్ధము చేసావు. ఇక శాంతము వహించి యుద్ధము మానుము " అన్నాడు. మేఘసంధి అలోచించి అర్జుడి మాటను మన్నించడమే మేలనుకుని అర్జునుడికి నమస్కరించాడు. అర్జునుడు మేఘసంధిని కౌగలించుకుని అశ్వమేధయాగముకు మేఘసంధిని ధర్మరాజు తరఫున ఆహ్వానించాడు. మేఘసంధి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించాడు. అర్జునుడు యాగాశ్వమును అనుసరించి ముందుకు సాగాడు.

యాగాశ్వదిగ్విజయ యాత్ర


వింధ్య పర్వతాలలో రాతిపై నిలబడిపోయిన యాగాశ్వం
యాగాశ్వము ఆ తరువాత వంగదేశము, పౌండ్రదేశము, మ్లేచ్చదేశము మొదలైన రాజ్యములలో ప్రవేశించింది. అర్జునుడు ఆయా రాజులను జయించి వారిని ధర్మరాజు తరఫున అశ్వమేధయాగముకు ఆహ్వానించాడు. తరువాత అశ్వము చేధిరాజ్యములో ప్రవేశించింది. చేధిరాజ్యాన్ని శిశుపాలుడి కుమారుడు శరభుడు పాలిస్తున్నాడు. శరభుడు ముందు అశ్వమును బంధించినా తరువాత తెలివి తెచ్చుకుని అర్జునుడితో సంధి చేసుకున్నాడు. అర్జునుడు చేధిరాజుకు ధర్మరాజు తరఫున అశ్వమేధయాగానికి ఆహ్వానము తెలిపాడు. తరువాత అర్జునుడు టెంకణ దేశ రాజైన కిరాతరాజును జయించాడు. తరువాత కోసల, కాశీ రాజ్యాలను జయించాడు. తరువాత దశార్ణదేశాధీశుడు చిత్రాంగధుడు కూడా మొదట ఎదిరించినా తరువాత లొంగి పోయాడు. తరువాత అశ్వము నిషాదదేశము చేరింది. ఆ దేశమును ఏకలవ్యుడి కుమారుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడి మీదకు ససైన్యముగా యుద్ధానికి వచ్చాడు. కాని ఎంతో కాలము అర్జునుడి ముందు నిలువ లేక తుదకు అర్జునుడికి లొంగి పోయాడు. తరువాత అశ్వము దక్షిణంగా పయనించిది. పౌండ్రదేశము, ఆంధ్రదేశము, ద్రవిడదేశము, కేరళదేశము, కర్నాటకదేశములలో సంచరించింది. అర్జునుడు ఆయా దేశాధీశులను యుద్ధము చేసి ఓడించాడు. తరువాత అశ్వము సౌరాష్ట్రదేశములో ప్రవేశించింది. గోకర్ణము చేరి తరువాత ద్వారక చేరింది. అర్జునుడి రాక విన్న యాదవులు అర్జునుడికి ఘనమైన సత్కారాలు చేసారు. తరువాత అశ్వము పశ్చిమ సముద్రతీరాన పయనించి పాంచాలదేశంలో ప్రవేశించింది.

అశ్వము గాంధారదేశంలో ప్రవేశించుట

తరువాత గాంధారదేశములో ప్రవేశించింది. గాంధారదేశమును శకుని కుమారుడు పాలిస్తున్నాడు. అతడు కూడా బాల్యచాపల్యము చేత అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు తన అన్న ధర్మరాజు సందేశము ఎరిగించాడు. కాని శకుని కుమారుడు మొండిగా అర్జునితో యుద్ధము చేసాడు. గాంధారసేన అంతా అర్జునుడి చేతిలో మరణించినా శకుని కుమారుడు విడువక యుద్ధము కొనసాగించాడు. అతడి బలపరాక్రమాలకు అర్జునుడు ముచ్చటపడి " కుమారా ! మా అన్న ధర్మరాజు నన్ను యాగరక్షకుడిగా నియమించి జయిత్రయాత్రలో ఎవరిని చంపవద్దని అశ్వమేధయాగానికి ఆహ్వానము మాత్రము తెలియచెయ్యమని చెప్పాడు. కనుక ఇక యుద్ధము కొనసాగించుట అనవసరము " అనునయంగా పలికాడు. అయినా శకుని కుమారుడు వినక పదునైన బాణములను అర్జునుడి మీద ప్రయోగించాడు. విధిలేక అర్జునుడు శకుని కుమారుడి కిరీటమును పడగొట్టాడు. అక్కడ ఉన్నవారు అందరూ " అర్జునుడు తలచుకుంటే శకుని కుమారుడి తల ఎగురకొట్టే వాడు. కాని అర్జునుడు దయతలచి విడిచిపెట్టాడు " అన్నాడు. అయినా శకుని కుమారుడు వినక తిరిగి అర్జునుడి మీద బాణప్రయోగము చేసాడు. అర్జునుడు కేవలము ఆబాణములను మాత్రమే తిప్పికొట్టాడు. అది చూసిన గాంధారసేనలు పారిపోయాయి. శకుని కుమారుడు అర్జునుడితో యుద్ధము చేస్తున్నాడని తెలిసి అతడి తల్లి, మంత్రులు యుద్ధభూమికి వచ్చారు. వారు శకుని కుమారుడిని విడువమని అర్జునుడిని వేడుకున్నారు. అర్జునుడు వెంటనే యుద్ధము ఆపి శకుని భార్యకు నమస్కారము చేసి శకుని కుమారుడితో " కుమారా ! నీవు నాతో యుద్ధము చేయడము నాకు బాధ కలిగించింది. నాకు ధర్మరాజు ఎవరిని చంపవద్దని చెప్పాడు. ఆ విషయము నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. అయినా నేను నిన్ను చంపలేదు. నీవు మా పెదనాన ధృతరాష్ట్రుడికి, మా పెదమ్మ గాంధారికి దగ్గర బంధువువు. యుద్ధముచెయ్యడానికి మనమేమైనా శత్రువులమా ! ఇకనైనా శాంతించి యుద్ధముమాను " అన్నాడు. ఆ మాటలకు శాంతించిన శకుని కుమారుడితో అర్జునుడు " కుమారా నీవు బంధుమిత్ర సమేతంగా ధర్మరాజు చేస్తున్న అశ్వమేధ యాగముకు రావలసిందని ధర్మరాజు ఆహ్వానము తెలియజేయమని నాకు చెప్పాడు " అని యాగముకు ఆహ్వానించాడు. తరువాత అర్జునుడు అశ్వమును వెంబడించాడు. అశ్వము తరువాత హస్థినాపురానికి తిరుగు ప్రయాణము అయ్యింది.

యాగశాల నిర్మాణం

అర్జునుడు యాగాశ్వాన్ని వెంబడిస్తూ ఆయారాజులను జయిస్తూ దిగ్విజయయాత్ర చేస్తున్న విషయము ఎప్పటికప్పుడు చారులద్వారా వింటూ ధర్మరాజు పరమాందభరితుడు అవుతున్నాడు. ఇంతలో మాఘశుద్ధపౌర్ణమి రానే వచ్చింది. ధర్మరాజు కొలువు తీర్చి తమ్ములను కొలువుకు ఆహ్వానించి " భీమసేనా ! నీ తమ్ముడు అర్జునుడు యాగాశ్వము వెంట జైత్రయాత్ర ముగించుకుని హస్థినకు తిరిగి వస్తున్నాడని వర్తమానము అందింది. ఇక చైత్రమాసము రావడానికి అధిక సమయము లేదు. మహామునులను, రాజులను ఆహ్వానించాలి కనుక వార్తాహరులను సిద్ధము చెయ్యి. అలాగే యాగనిర్వహణకు ఒక యాగశాలను నిర్మించడానికి సన్నాహాలు చెయ్యి. యాగముకు వచ్చు రాజులకు, మునులకు, ప్రముఖులకు తగిన ఏర్పాట్లు చెయ్యండి. తగిన అతిథి గృహములను నిర్మించడానికి ఏర్పాటు చెయ్యండి " ఆదేశించాడు. భీముడు వెంటనే వాస్తుశిల్పులను పిలిపించి యాగశాలను విడిది గృహములను వెనువెంటనే నిర్మింపజేసాడు. భూమండలము అంతాతిరిగి రాజులను మునులను ఆహ్వానించడానికి బ్రాహ్మణులను పంపాడు. ధర్మరాజు ఆహ్వానాన్ని అందుకున్న రాజులు తమతమ సైన్యములతో మునులు తమ శిష్యబృందముతో హస్థినాపురము చేరుకున్నారు. వారందరిని చూసిన ధర్మరాజు పరమానందభరితుడు అయ్యాడు. వారి, వారి అంతస్తులను అనుసరించి వారికి అతిథిమర్యాదలు, భోజనసదుపాయాలు, విడుదులు ఏర్పాటు చేయించాడు. ఈ ఏర్పాట్లన్నీ సేవకులకు అప్పగించక ధర్మరాజు తానే స్వయముగా పర్యవేక్షించ సాగాడు. భీముని ఆధ్వర్యంలో నిర్మింపజేసిన యాగశాలను, అతిథిగృహాలను చూసిన శ్రీకృష్ణుడు, వచ్చిన అతిథులు ఎంతో సంతోషించారు. జనమేజయమహారాజా ! అతిథిసత్కారాలు ఎలా జరుగుతున్నాయని అంటే లక్షమంది ఒకసారి భోజనము చేస్తే ఒక నగారా మోగుతుంది. ఆ నగారా ఎడతెరిపి లేకుండా అలా మోగుతూనే ఉంది. అంటే అన్ని లక్షల మంది భోజనము చేస్తున్నారన్నమాట " అని వైశంపాయానుడు జనమేజయుడికి చెప్పాడు.

అర్జునుడు హస్థినకు వచ్చుట

భీముడి ఆధ్వర్యములో నిర్మింపబడిన యాగశాలను, అతిథిగృహములను చూసి శ్రీకృష్ణుడు, వచ్చిన అతిథులు, ఎంతో సంతోషించారు. జనమేజయ మహారాజా ! లక్షమంది ఒకసారి భోజనము చేస్తే ఒకసారి నగారా మ్రోగుతుంది. అలా నగారా ఎడతెరపి లేకుండా మ్రోగుతూనే ఉంది. అంటే ఎడతెరపి లేకుండా లక్షల మంది భోజనము చేస్తునారన్న మాట " వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ధర్మరాజు భీమసేనుడి సహాయంతో వచ్చిన అతిధులను పూజించాడు. ఆ పూజలు అందుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి, యాదవప్రముఖులు మొదలగు వారు ఎంతో సంతోషించారు. ఇంతలో అర్జునుని దగ్గర నుండి వర్తమానము వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. " ధర్మనందనా ! అర్జునుడు తాను కలసిన రాజులందరిని అశ్వమేధయాగానికి ఆహ్వానించాడట. వారందరూ యాగముకు వస్తున్నారట. వారు మన విరోధులైనా ప్రస్థుతము మన ఆహ్వానము మన్నించి వస్తున్నారు. కనుక వారిని పూజించడము మన కర్తవ్యము. అదీ కాక " మణీపురాధీశుడు నా కుమారుడైన బభ్రువాహనుడు యాగముకు వస్తున్నాడు. అతడికి తగిన మర్యాదలు చెయ్యండి " అని అర్జునుడు నీకు చెప్పమని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు " శ్రీకృష్ణా ! నేనూ విన్నాను. అర్జునుడు అనేక మందిని యుద్ధమున జయించి వారితో మిత్రత్వము వహించి యాగముకు ఆహ్వానము తెలిపాడు. కృష్ణా ! అర్జునుడు మొన్న జరిగిన యుద్ధములో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహాయోధులతో యుద్ధముచేసి ఎంతో శ్రమపడ్డాడు. అంతలోనే తిరిగి అశ్వమేధయాగము కొరకు యుద్ధములో పాల్గొన్నాడు. అయ్యో ! నా వలన అర్జునుడికి ఎన్ని కష్టాలు దాపురించాయి. కృష్ణా ! నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అర్జునుడి దేహము అనేక శుభలక్షణములతో కూడి ఉన్నది కదా ! మరి ఈ యుద్ధములు ఒకదాని వెంట ఒకటిగా ఈ యుద్ధములు అతడికి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి . అతడి అంగాలలో ఎదైనా దోషము ఉందా ! నీకేమైనా తెసుసా " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవు చెప్పినది నిజమే. అర్జునుడు సకలలక్షణ సమన్వితుడు. కానీ ఒక లోపము ఉంది. అతడికి శరీరముకు తగినట్లు కాక కొంచము అధికముగా అతడి పిక్కలు ఉన్నాయి. అందువలననే అతడికి ఈ కష్టాలు కలుగుతున్నాయి. ఇప్పుడు అర్జునుడి కష్టాలు అన్నీ తొలగి పోయాయి " అని అన్నాడు.

అర్జునుడు హస్థినలో ప్రవేశించుట

ఇంతలో అక్కడకు అర్జునుడి వద్ద నుండి ఒకదూత వచ్చాడు. ఆ దూత ధర్మరాజుకు నమస్కరించి " మహారా ! అర్జునుల వారు హస్థినాపుర సమీపానికి విచ్చేసారు. రేపు తమరిదర్శనము చేసుకుంటారు అని తమరికి మనవి చేయమన్నారు " అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు, శ్రీకృష్ణుడు పరమానందభరితులయ్యారు. అర్జునుడి రాక కొరకు ఎదురుచూస్తున్నారు. మరునాడు అర్జునుడు యాగాశ్వమును అనుసరిస్తూ హస్థినాపురప్రవేశము చేసాడు. వంధిమాగధులు, హస్థినాపురప్రజలు అర్జునుడిని వేనోళ్ళ కొనియాడసాగారు. అర్జునుడు యాగశాలను సమీపించగానే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు అర్జునుడికి ఎదురు వెళ్ళి స్వాగతము పలికి సాదరంగా యాగశాలకు తీసుకుని వెళ్ళారు. అర్జునుడు ముందుగా ధృతరాష్ట్ర గాంధారులను తరువాత కుంతీదేవిని దర్శించి వారి ఆశీర్వాదములు అందుకున్నాడు. ఇంతలో అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగధలు బభ్రువాహనుడు హస్థినకు వచ్చి చేరారు. అర్జునుడు తన భార్యలను, కుమారుడిని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళి పరిచయము చేసాడు. తరువాత ధృతరాష్ట్ర, గాంధారీల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదము అందుకున్నాడు. తరువాత తల్లి కుంతీదేవికి కోడళ్ళను మనుమడిని చూపించాడు. కుంతీదేవి వారిని ఆనందముతో ఆదరించి ఆశీర్వదించింది. తరువాత చిత్రాంగధ, ఉలూపి ద్రౌపదిని సుభద్రను కలిసారు. అందరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. ఈ విధంగా అశ్వమేధయాగ సన్నాహాలు పూర్తి అయ్యాయి.

యాగదీక్ష


అశ్వమేధ యాగములో అశ్వమును ముక్కలుగా చేస్తున్న ద్రౌపది.
వ్యాసుడు ధర్మరాజుతో " ధర్మనందనా ! ఈ యజ్ఞము గొప్పది. నీవు యజ్ఞముకు కావలసిన ధనము సంపాదించావు. కనుక యాగమును నిర్విజ్ఞముగా నిర్వహించు. అశ్వమేధయాగము సమాప్తి అయ్యేరోజున చేసే స్నానము పవిత్రమైనది. ఆ స్నానముతో సమస్త పాపములు తొలగి పోతాయి. నీవు భారతయుద్ధములో అన్నదమ్ములను, గురువులను, బంధువులను, మిత్రులను చంపిన పాపము అంతా ఆ స్నానము వలన పోతుంది. నీకిక శుభములు కలుగుతాయి. వ్యాసుడి ఆదేశానుసారము ధర్మరాజు యాగదీక్ష పునాడు. ఋత్విక్కులు యజ్ఞకాండ నిర్వహిస్తున్నారు. మంత్రాలు పఠిస్తూ అగ్నిలో హోమద్రవ్యాలు వేలుస్తున్నారు. వేదమంత్రాలను ఉచ్ఛారణ చేస్తూ సోమలతల నుండి సోమరసముపిండుతున్నారు. యజ్ఞముకు వచ్చిన వారికి భీముడు భోజన సదుపాయలు చూసే పనిని నిర్వహిస్తున్నాడు. అందరి చేత కొసరి కొసరి తినిపిస్తున్నాడు. లేదు అనకుండా సంతర్పణలు చేయిస్తున్నాడు. యజ్ఞముకు వచ్చిన వారు అందరూ వట్టిచేతులతో తిరిగి వెళ్ళడము లేదు. ఆ యజ్ఞవాటిక దేవయజ్ఞమును తలపించ చేస్తుంది. భూలోకములో ధర్మరాజుతో నిర్వహించ పడుతున్న ఈ యజ్ఞమును దివి నుండి దేవతలు సహితము ఆసక్తితో తిలకిస్తున్నారు. ప్రధాన యజ్ఞవాటికను చతురస్రాకారముగా బంగారు ఇటుకలతో నిర్మించారు. యజ్ఞవాటిక ఎటు చూసినా 18 మూరలు పొడవు ఉండేలా నిర్మాణము జరిగింది. గరుడుని ఆకారముతో యజ్ఞవాటిక నిర్మాణము జరిగింది. ఋత్విక్కులు ఊపస్తంభాలు పాతారు. మొత్తము 21 ఊపస్తంభాలు పాతబడ్డాయి. వీటిలో ఖాదిరములతో చేసిన స్తంభములు 6, మోగుతో చేసిన స్తంభాలు 6, దేదారు కర్రలతో చేసిన స్తంభాలు 2, శ్లేషాతక చెట్టు కొయ్యతో చేయబడిన స్తంభం 1 స్తంభము ఒకటి 21. ఇవి కాక అలంకరణార్ధము పాతిన బంగారుస్తంభాలు అనేకము. ఆ ఉపస్తంభాలకు నాలుగుకాళ్ళ జంతువులు, పక్షులు, జలచరములను కట్టారు. ఆ ప్రాణులు మొత్తము 300. ప్రధాన ఊపస్తంభానికి యాగాశ్వమును కట్టారు. ఆ యజ్ఞముకు విచ్చేసిన వేదవ్యాసుడి శిష్యబృందము అందరిలో ప్రత్యేకముగా వెలిగి పోతున్నారు. తరువాత ఊపస్తంభాలకు కట్టిన 300 జంతువులను, పక్షులను, జలచరాలను బలి ఇచ్చారు. తరువాత యజ్ఞాశ్వమును బలి ఇచ్చే తరుణము ఆసన్నము కాగానే ద్రౌపదిని యజ్ఞాశ్వముకు సమీపముగా రమ్మని చెప్పి యజ్ఞాశ్వమును వధించారు. ద్రౌపది స్వహస్థాలతో ఆ అశ్వము యొక్క వివిధావయవములను హోమములో వేల్చి దేవతలకు హవిస్సు రూపములో అందజేసింది. యజ్ఞాశ్వము యొక్క ప్రధాన భాగాలు ఆ మాంసము హోమములో కాలుతుంటే వచ్చే వాసనను పాండవులు ద్రౌపది ఆస్వాదించి ఎంతో ఆనందించారు. ఋత్విక్కులు మిగిలిన మాంసమును శాస్త్ర విధిగా హోమములో వేసారు. ఆ విధముగా అశ్వమేధయాగము సమాప్తము అయ్యింది.

యాగములో జరిగిన దానధర్మాలు

ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

యాగానంతరం రాజులను సత్కరించుట


అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు
వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.

అశ్వమేధయాగములో జరిగిన విశ్మయం

జనమేజయుడు ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము గురించి వింటూ వైశపాయనుడితో " వైశంపాయన మహర్షీ ! అత్యంత వైభవోపేతంగా జరిగిన అశ్వమేధయాగములో విస్మయం కలిగించే విషయము ఏదైనా జరిగిందా వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు బదులుగా " జనమేజయమహారాజా ! మీ తాతగారైన ధర్మరాజు యాగము చేస్తున్న సమయంలో ఒక ముంగిస యాగశాలకు వచ్చింది. అక్కడ ఉన్న ఋత్విక్కులను సదస్యులను బ్రాహ్మణులను చూసి " ఈ అశ్వమేధయాగము సక్తుప్రస్థుని ధర్మమును కొంచము కూడా పోలదు " అని ప్రకటించింది. ఆ మాటలు విన్న అక్కడ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఋత్విక్కులు ముంగిసతో " ఈ యాగములో మంత్రపఠనము, కర్మకాండ, వివిధ దానధర్మాలు పలువురి ప్రశంసలను పొందాయి. ధర్మరాజు ఈ యాగమును నిర్వహించిన తీరు, శ్రద్ధ, భక్తి, అందరికీ యోగ్యము అయింది. ఇందులో జరిగిన ధర్మవిరుద్ధ కార్యము ఏమి ? " అని అడిగారు.

అశ్వమేధయాగములోకి వచ్చిన ముంగీస

బ్రాహ్మణుడి కథ

ఆందుకు ఆ ముంగిస " ధర్మక్షేత్రము అని పిలువబడుతున్న ఈ కురుక్షేత్రములో ఒక బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు మానము, అభిమానము, కామములను జయించిన వాడు అతి సౌమ్యుడు. అతడు భార్య, కుమారుడు, కోడలుతో గృహస్థజీవనము సాగించే వాడు. అతడు ఊంఛవృత్తి సాగిస్తూ పొలములో రాలిపడిన గింజలను ఏరుకుని తృప్తిగా జీవనం సాగించే వాడు. ఒకసారి తీవృమైన అనావృష్టి వచ్చి ఎక్కడ చూసినా ఆహారము లభించడము కష్టము అయింది. ఒక రోజు వారు నలుగురూ పొలముకు వెళ్ళి గింజలు ఏరుకుని వచ్చి వాటితో పేలపిండి చేసి దేవతారాధనా సంధ్యా వందనము చేసి పేలపిండిని నలుగురూ సమానంగా పంచుకున్నారు. వారు ఆ పేలపిండిని తినడానికి సిద్ధము ఔతున్న తరుణములో వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు. వారు నలుగురూ ఆ అతిథికి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించి కుటీరము లోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేసారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " మహానుభావా ! ఈ పేలపిండి అన్యార్జితము కాదు. ధర్మముగా సంపాదించింది కనుక మీరు దీనిని తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి " అని అన్నాడు. ఆ పేలపిండిని తిన్న తరువాత కూడా అతడి ఆకలి తీరలేదు. అప్పుడు ఆ బ్రాహ్మనుడి భార్య ముందుకు వచ్చి " నాధా ! నా వంతుకు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతడి ఆకలి తీర్చండి " అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " నోరులేని పక్షులు కూడా తమ భార్యలకు ఆహారము తెచ్చి ఇస్తాయి. అలాంటప్పుడు నేను నీ అహారమును ఎలా తీసుకొనగలను ? " అన్నాడు. ఆ మాటలకు అతడి భార్య " నాధా ! భార్యకు భర్తయే దైవము, చుట్టము, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు అన్నీ. కనుక భర్తకర్తవ్యము నెరవేర్చడము భార్య ధర్మము కదా ! మీరు మీ భాగము పేలపిండిని ఇచ్చారు కనుక తరువాత ఇవ్వవలసిన బాధ్యత నాది. అదీ కాక మీరు తినకుండా నేను మాత్రము ఎలా తినగలను. కనుక పేలపిండిని అతిథికి ఇవ్వడములో సంకోచించవలసిన అవసరము లేదు " అన్నది. బ్రాహ్మణుడు ఇక తప్పదనుకుని పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఆ పేలపిండి అతిథి ఆకలి తీర్చలేదు. అతడు ఇంకా విచారముగా ఉన్నాడు. బ్రాహ్మణుడు అతిథిని సంతోషపెట్ట లేకపోయినందుకు చింతించసాగాడు. తండ్రి బాధను చూసిన తనయుడు " తండ్రీ ! ఇందు కొరకు ఇలా చింతించ తగునా ! నా వంతు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతడిని తృప్తి పరచండి " అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు " కుమారా ! ఎంతైనా పెద్ద వాళ్ళకంటే చిన్న వాళ్ళకు ఆకలి ఎక్కువ. నీ నోటి వద్దనుండి ఆహారమును నేను ఎలా తీసుకొనగలను ? " అన్నాడు. ఆ మాటలకు కుమారుడు " తండ్రీ ! కుమారుడు అంటే తండ్రికి ప్రతిరూపము కదా ! మీ దుఃఖము తీర్చడము కుమారుడిగా నా కర్తవ్యము కాదా ! కనుక సంకోచము వదిలి ఈ పేలపిండిని అతిథికి ఇవ్వండి " అన్నాడు. కుమారుడి మాటలకు తృప్తిచెంది బ్రాహ్మణుడు కుమారుడి వంతు పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అంతటితో అతిథి ఆకలి తీరలేదు. అది చూసి బ్రాహ్మణుడు చింతించసాగాడు. అది చూసిన కోడలు తన వంతు పేలపిండిని మామగారి ముందు పెట్టి " మామగారూ ! ఈ పేల పిండిని కూడా పెట్టి అతిథి ఆకలి తీర్చండి " అన్నది. అది విని బ్రాహ్మణుడు " అమ్మా ! నీవు కోడలివి. మా దరిద్రములో భాగము పంచుకున్నావు. సరి అయిన ఆహారము లేక సుకుమారమైన నీ శరీరము శుష్కించి పోయింది. దొరక్క దొరక్క ఈ రోజు పేలపిండి దొరికింది. ఇది కూడా ఇచ్చి నీవు ఆకలితో ఎలా ఉండగలవు నీవు ఆకలితో అలమటిస్తూ ఉంటే నేను ఎలా ఉండగలను ? " అని బాధపడ్డాడు. అందుకు కోడలు " మామగారూ ! మీరు నాకు గురువులు. ఈ దేహములో ప్రాణమ్ములు ఉన్నంత వరకు గురువుకు శుశ్రూష చేయడము శిష్యుని కర్తవ్యము. కనుక ఈ పేలపిండిని అతిథికి సమర్పించి మీకు సేవ చేసుకునే భాగ్యము నాకు ప్రసాదించండి " అని బదులిచ్చింది. ఆ మాటలకు సంతోషించిన బ్రాహ్మణుడు ఆ పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అతిథి ఆ పేలపిండిని తిని అమ్మయ్యా నా ఆకలి తీరింది అన్నాడు. అది విని నలుగురూ సంతోషించారు. అప్పుడు ఆ అతిథి బ్రాహ్మణుడితో " మిత్రమా ! నేను యమధర్మరాజును మిమ్ము పరిక్షించడానికి మీ ఇంటికి అతిధిగా వచ్చాను. నీ యొక్క , మీ కుటుంబము యొక్క ధర్మనిరతిని సద్గుణ సంపత్తిని చూసి ఆనందించాను. నీ అందు పెద్దల ఎడ భక్తి, అతిథుల పట్ల వినయము, చేసే పనిమీద శ్రద్ధ మిక్కుటముగా ఉన్నవి. నీవు చేసిన దానము దేవతలు పై నుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు " అన్నాడు. దేవేంద్రుడు వారి మీద పూలవాన కురిపించాడు.

యముని ప్రశంస

యమధర్మరాజు " బ్రాహ్మణోత్తమా ! దేవలోకములో సప్తఋషులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు నీ భార్య, కుమారుడు, కోడలితో స్వర్గానికి రా " అని తిరిగి " మహాభాగా ! ఆకలి అన్నింటి కంటే చెడ్డది. ఆకలి బుద్ధిని, వివేకమును మట్టు పెడుతుంది. ఆశ దయాగుణమును నాశనము చేస్తుంది. నీవు, నీ భార్య, కుమారుడు, కోడలు, ఆశను జయించారు. అతిథి పూజ చేసి దివ్యత్వము సాధించారు. నీ దానగుణముకు మెచ్చిన బ్రహ్మ తమ లోకానికి మిమ్ము ఆహ్వానించారు. బ్రహ్మలోకము నుండి త్వరలో విమానము వచ్చింది. బ్రాహ్మణోత్తమా! తనకు ఉన్న సంపదలో దానము ధర్మము చెయ్యడము గొప్ప విషయము కాదు. ధర్మముగా సంపాదించినది కొంచమైనా తమకంటూ ఏమీ మిగల్చకోకుండా యోగ్యుడైన వాడికి దానము చెయ్యడం ఉత్తమోత్తమము " అని పలికి యమధర్మరాజు తన దివ్యమైన రూపమును వారికి చూపించాడు. ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యమైన విమానము కనపడింది. అది చూసిన దేవతలు ఆశ్చర్య పోయారు. బ్రాహ్మణుడు, ఆయన భార్య, కుమారుడు, కోడలు యముడికి సాష్టాంగప్రమాణము ఆచరించారు. " బ్రాహ్మణోత్తమా ! అదుగో బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానము మీరంతా ఆదివ్య విమానము ఎక్కి బ్రహ్మలోకము వెళ్ళండి. అని యమధర్మరాజు చెప్పాడు. అప్పుడు ఆబ్రాహ్మణుడు, భార్య, కుమారుడు, కోడలుతో సహా ఆ దివ్య విమానము ఎక్కి బ్రహ్మ లోకము వెళ్ళాడు. ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూసాను. నేను వెంటనే సక్తుప్రస్థుడు, యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటూ ఇటూ పొర్లినప్పుడు నా శరీరానికి ఒక వైపు మాత్రమే ఆ నీరు అంటుకుంది. ఆ నీటి ప్రభావంతో నా శరీరము సువర్ణమయము అయ్యింది. ఆ రోజు నుండి నేను ఎక్కడ యజ్ఞ యాగములు జరుగుతున్నా అక్కడకు వెడుతుంటాను. ఎందుకంటే నా శరీరము రెండవ వైపు కూడా సువర్ణమయము ఔతుందని నా ఆశ. కాని ఇంతవరకు జరగ లేదు. ధర్మరాజు లోకోత్తరమైన యాగము చేస్తున్నాడని విని ఇక్కడకు వచ్చాను కాని ఇక్కడ ఉన్న నీటిలో ఎంత పొర్లినా నా శరీరము నా మిగిలిన శరీరము సువర్ణము కాలేదు. ఎందు కంటే కేవలము పొలములో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడు చేసే దానముకు ధర్మరాజు చేసే ఈ అశ్వమేధయాగము సాటిరాదు అని తెలుసుకున్నాను " అని ముంగిస అక్కడనుండి వెళ్ళింది.

యాగము జంతుబలి

జనమేజయమహారాజు " వైశంపాయనమహర్షీ ! రాజులు యజ్ఞములు చెయ్యడంలో, మునులకు తపస్సు చేసుకొనడము, బ్రాహ్మణులు మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహములలోఆసక్తి చూపుతారు కదా ! రాజులు ఎన్నో యజ్ఞ యాగములు చేసి కీర్తిగడించి పుణ్యలోకాలకు పోతారని విన్నాము కదా ! ధర్మరాజు అశ్వమేధయాగమును అత్యంత ఉదాత్తరీతిలో నిర్వహించాడు కదా ! ఇంతకు ముందు రాజులకంటే సత్యము, శౌచమూ, భక్తి, శ్రద్ధలతో నిర్వహించాడు కదా ! అతడు చేసిన యాగమును వ్యాసుడి వంటి మహర్షులు కూడా మెచ్చుకున్నారు కదా ! దేవేంద్రుడు చేసినట్లు అశ్వమేధయాగము చేసాడు కదా ! అటువంటి యాగమును ముంగిస గర్హించి ఆవహేళన చేయడానికి కల కారణము ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమెజయమహఅరాజా ! ధర్మరాజు నిర్వహించినశ్వమేధయాగములో ఎంతో జీవహింస జరిగింది. దేశమంతాతిరిగివచ్చిన అశ్వాన్నికూడా బలి ఇచ్చారు. 300 మూగజీవులను కూడా చంపారు. ఇంతటి జీవహింసతో కూడుకున్న అశ్వమేధయాగము కంటే ఆ బ్రాహ్మణుడు చేసిన తపోయజ్ఞము ఎంతో మేలైనది అని ఆ ముంగిస చెప్పింది. ఆ బ్రాహ్మణుడు చేసిన సాత్విక , తపోయజ్ఞము వలన తన శరీరము సగభాగము సువర్ణమయము అయింది అని చెప్పింది కనుక అది అబద్ధము అని త్రోసిపుచ్చ లేము " అన్నాడు వైశంపాయనుడు.

అగస్త్యుని యాగం

ఈ విషయమును వివరించడానికి ఒక ఇతిహాసము చెప్తాను " పూర్వము ఒక సారి దేవేంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞముకు అనేక వేల మంది ఋత్విక్కులు, మునులు, దేవతలు వచ్చారు. యజ్ఞవాటికను తయారు చేసారు. అగ్నిని వేల్చారు. యజ్ఞములో బలి ఇవ్వడానికి అనేక జంతువులను సమకూర్చారు. అది చూసిన మునులు దేవేంద్రుడితో " దేవేంద్రా ! నీవు చేసిన యజ్ఞములో ఇన్ని జంతువులను బలి ఇవ్వాలా ! యజ్ఞముకు ఇంత జీవ హింస చేయాలా ! జంతువులకు బదులుగా మూడు సంవత్సరాలు నివువ ఉంచిన విత్తనములను యజ్ఞద్రవ్యములుగా వాడ వచ్చును కదా ! ఇది కృతయుగధర్మమని వేదము చెప్తుంది కదా ! కనుక వేదోక్తముగా యజ్ఞము చెయ్యి. కన్నీరు కారుస్తున్న జంతువులను చూసి కనికరించి ఈ యజ్ఞములో జీవ హింస మానుకో " అన్నారు. కాని దేవేంద్రుడు వారి మాట విన లేదు. మునులు కూడా జీవహింస వద్దని పట్టుబట్టారు. దేవ లోకము ఈ వాదనతో రెండు ముక్కలు అయ్యింది. దేవతలు దేవేంద్రుని పక్షము వహించారు. ఆ యాగమును చూడడానికి వచ్చిన దేవేంద్రుడి స్నేహితుడు ఉపరిచరమనువు ఇరు పక్షముల కోరికమీద మధ్యవర్తిత్వము వహించాడు. అందరూ కలసి విషయము వివరించి యజ్ఞములో జీవహింస మంచిదా కాదా అని చెప్పమన్నారు. దేవేంద్రుడి మిత్రుడైన ఉపరిచర మనువు యజ్ఞములో జీవహింస సరి అయినదే అని చెప్పాడు. అలా చెప్పినందుకు అతడు నరకానికి వెళ్ళాడు. కనుక జనమేజయ మహారాజా ! జీవహింస లేని యజ్ఞము ఉత్తమమైనది అనుటలో ఇసుమంత అయినా సందేహము లేదు " అని వైశంపాయనుడు చెప్పాడు.

దానము ధనము

జనమేజయుడు " మహర్షీ ! మీరు చెప్పినది నిజమే. ఆ బ్రాహ్మణుడి త్యాగము కొనియాడతగినది. దానము చెయ్యడానికి ధర్మమార్గములో సంపాదించిన ధనము మాత్రమే యోగ్యమైనది అని ఇంకా వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! ఈ విషయము వివరించడానికి నీకు ఒక కథ చెప్తాను. పూర్వము అగస్త్యుడు 12 సంవత్సరాలు నిరాఘంటముగా సాగే ఒక యాగము చేయడానికి పూనుకున్నాడు. ఆ యాగమునకు అనువజ్ఞులు అయిన మునులు, ఋత్విక్కులు వచ్చారు. యజ్ఞముకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కాని ఇంద్రుడు మాత్రం వర్షం కురిపించలేదు. కనుక ఓషధులు లభించలేదు. కనుక బ్రాహ్మణులకు, ఆహుతులకు దానధ్ర్మమములు చెయ్యడానికి భోజనము పెట్టడానికి ధనము, ధాన్యము లేదు. ఈ యాగము ఎలా నిర్వహిస్తాడో అని అందరూ ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఎందు కంటే అగస్త్యుడు 12 సంవత్సరాలు దీక్షలో ఉన్నాడు. ధర్మమార్గములో వచ్చినది తప్ప వేరొకటి ముట్టడు. ధర్మమార్గములో ధాన్యము రావలంటే వర్షాలు పడాలి. పంటలు పండాలి. ఏమి జరుగనున్నదో అని అందరూ విచారంగా ఎదురు చూస్తున్నారు.

అగస్త్యుడు మునులకు ధైర్యము చెప్పుట


యజ్ఞ సమయములో పతిజ్ఞ చేయుచున్న ఆగస్త్యుడు
ఆ మాటలు విన్న అగస్త్యుడు " మహామునులారా ఋత్విక్కులారా ! నేను చేయబోవు ధర్మయజ్ఞముకు దేవేంద్రుడు సహకరించి వర్షములు కురిపిస్తే సరి, లేకున్న నేను ఇంద్రపదవిని స్వీకరించి లోకములను పాలిస్తాను. మీరిక నిశ్చింతగా ఉండండి. అదీ కాకపోతే ఈ మూడు లోకాలలో ఉన్న యజ్ఞద్రవ్యాలను తీసుకువచ్చి యజ్ఞము చేస్తాను. ఈ సంవత్సరము ఉత్తర కురుభూములలో వర్షములు సమృద్ధిగా పడ్డాయి. ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. యాగసమయంలో అన్నదానము చేయడానికి అక్కడ నుండి ధాన్యము తెప్పిస్తాను. నేను యజ్ఞములో విత్తనములు వేసి వేల్చడము వలన లోకానికి ఏమన్నా కీడు జరుగుతుందా ! విత్తనములతో యజ్ఞము చేస్తే యజ్ఞముకు ఆటంకము జరుగుతుందా ! కనుక ఈ విషయములో మీరు ఇక చింతించ పని లేదు " అన్నాడు. ఆ మాటలకు అక్కడ చేరిన మునులు " మహార్షీ ! ఇంత చిన్న విషయానికి మీరు మీ తపోశక్తిని ఎందుకు వ్యర్ధము చేసుకుంటారు. ఇతరుల వద్ద నుండి ధనము తీసుకొనడము ఎందుకు, ఉత్తర కురుభూముల నుండి ధాన్యము తెప్పించిడము ఎందుకు, పంటలు పండించడానికి ఉపయోగించే విత్తనములతో యజ్ఞము చెయ్యడము ఎందుకు. మాకు కావలసిన వస్తువులు, యజ్ఞముకు కావలసిన వస్తువులు మేము మా ఆశ్రమాల నుండి తీసుకు వచ్చి యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపిస్తాము " అన్నారు. ఈ విషయము అంతా తెలుసుకున్న ఇంద్రుడు తన పదవి ఎక్కడ ఊడుతుందో అని భయపడి వర్షములు పుష్కలముగా కురిపించి బృహస్పతిని తోడు తీసుకుని భయభక్తులతో అగస్త్యుడి వద్దకు వచ్చాడు. అగస్త్యుడు ఇంద్రుడిని సాదరంగా ఆహ్వానించాడు. యజ్ఞము నిర్విజ్ఞముగా జరిగింది. దేవేంద్రుడిని సాదరంగా స్వర్గలోకముకు పంపాడు. యజ్ఞముకు వచ్చిన మునులకు, ఋత్విక్కులను భక్తితో పూజించి తగినసత్కారము చేసి పంపాడు. ఈ విధంగా అగస్త్యుడు హింసకు తావు లేని యజ్ఞము చేసి కీర్తి గడించాడు. కనుక జనమేజయ మహారాజా ! ధర్మమార్గమున సంపాదించిన ధనముతో చేసే యజ్ఞము హింసకు తావు లేకుండా చేసే యజ్ఞము మనోజ్ఞమై వెలుగుతుంది " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ముంగిస పూర్వ కథ

జనమేజయుడు వైశంపాయనుడిని " మహర్షీ ! ఇది వరకు మీరు ఒక ముంగిస మనుషభాషలో మాట్లాడింది అని చెప్పారు కదా ! ఆ ముంగిస పూర్వజన్మలో ఎవరో ఒక మహానుభావుడు అయి ఉంటాడు. ఆ విషయము వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు ఒకసారి పితృకార్యము చేయ సంకల్పించి ఒక కొత్తకుండలో తమ ఇంటిలో ఉన్న హోమధేనువు పాలుపితికి ఒక ప్రదేశములో పదిలంగా పెట్టాడు. అప్పుడు అతడిలోని క్రోధదేవత సాకారముగా వచ్చి పొరపాటున చేసినట్లు ఆ పాలకుండను పడగొట్టింది. పాలు అన్ని నేలపాలు అయ్యాయి. అది చూసిన జమదగ్ని కోపించ లేదు. అప్పుడు కోపదేవత " జమదగ్నీ ! సాధారణంగా భృగు వంశస్తులు మహాకోపిష్టులు కదా ! అది నిజము కాదు అని నీవు నిరూపించావు. నేను ఓడి పోయాను. నీ పట్ల అపరాధము చేసినందుకు నన్ను క్షమించు " అన్నది. జమదగ్ని " అదేమిటి నీవేమి తప్పు చేసావు. ఒక వేళ నీవు తప్పు చేవని భావిస్తే దానిని నీ మనసు నుండి తీసి వెయ్యి. అయినా నీవు మా పితృదేవతలకు చేయు శ్రాద్ధకర్మలకు విజ్ఞము కలిగించావు. అందువలన పితృదేవతలు నిన్ను శపించగలరు. కనుక నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో " అన్నాడు. జమదగ్ని మాట మన్నించి క్రోధదేవత అక్కడ నుండి వెళ్ళి పోయింది. తరువాత జమదగ్ని ఆహ్వానము మీద అక్కడకు వచ్చిన పితృదేవతలు జరిగిన విషయము తెలుసుకున్నారు. వారు జరిగినదానికి కోపించి " నీవు చేయబోవు శ్రాద్ధకర్మకు విజ్ఞము కలిగించిన క్రోధదేవతను నీవు శపించక విడిచి క్షమించరాని శాంతము వహించావు. అందువలన నీవు ముంగిసవై పుట్టు " అని శపించారు. అప్పుడు జమదగ్ని " పితృదేవతలారా ! బ్రాహ్మణులకు కోపము తగదు అంటారు కదా ! అందుకని క్రోధదేవతను శపించ లేదు. నా అపరాధము మన్నించి నాకు శాపవిమిక్తి కలిగించండి " అని వేడుకున్నాడు. పితృదేవతలు శాంతించి " కుమారా ! మహా పండితులు ఉన్న సభలో ఒక మహాధర్మమును అధర్మము అని నిరూపించి శాపవిముక్తుడవై మోక్షపదవిని పొందు " అన్నారు. జనమేజయమహారాజా ! ఆ ముంగిస గతజన్మలో జమదగ్ని. మరుజన్మలో ముంగిసగా జన్మించి ధర్మరాజు చేసిన అశ్వమేధయాగాన్ని అధర్మమని నిరూపించి శాపవిముక్తి పొందింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము

  • 1.1 ధర్మరాజు ధృతరాష్ట్రుడి పట్ల వహించిన శ్రద్ధ
  • 1.2 ధృతరాష్ట్రుడి పట్ల భీముడి ప్రవర్తన
  • 1.3 ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము
  • 1.4 ధృతరాష్ట్రుడి వానప్రస్థ ప్రస్తావన
  • 1.5 ధర్మరాజు ఆవేదన చెందుట
  • 1.6 ధృతరాష్ట్ర గాంధారులు ధర్మరాజును ఓదార్చుట
  • 1.7 వ్యాసుడు ధృతరాష్ట్రుడి ప్రస్థావనను బలపరచుట
  • 1.8 ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతిని బోధించుట
  • 1.9 శత్రుజయము
  • 1.10 రాజధర్మము
  • 1.11 ధృతరాష్ట్రుడు హస్థినాపుర వాసుల వద్ద అనుమతి తీసుకొనుట
  • 1.12 హస్థినాపుర వాసుల ప్రతి స్పందన
  • 1.13 ధృతరాష్ట్రుడి దానధర్మాల ప్రస్తావనను భీముడు అడ్డగించుట
  • 1.14 ధృతరాష్ట్రుడు శ్రాద్ధకర్మలు నిర్వహించుట
  • 1.15 ధృతరాష్ట్రుడు అరణ్యవాసముకు బయలు దేరుట
  • 1.16 ధర్మరాజు శోకించుట
  • 1.17 కుంతీ నిర్ణయమును భీములు వారించుట
  • 1.18 కుంతీ పరుషవాక్యములతో భీముని నివారించుట
  • 1.19 ధర్మరాజు కుంతిని ధృతరాష్ట్ర గాంధారులకు అప్పగించుట
  • 1.20 ధృతరాష్ట్రాదులు గంగాతీరము చేరుట

Thursday, June 29, 2017

అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము


- శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ విద్య బోధంచిన తరువాత " అర్జునా ! నా చిత్తము నా తండ్రి వసుదేవుడిని చూడాలని ఆరాట పడుతుంది. నేను త్వరగా ద్వారకకు వెళ్ళాలి. మీ అనుమతి కొరకు ఎదురు చూస్తున్నాను " అని అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అయితే మనము వెంటనే హస్థినకు వెడదాము. నేను నీ ద్వారక ప్రయాణము గురించి ధర్మరాజుకు చెప్పి ఒప్పిస్తాను. ఆయన కూడా నిన్ను సంతోషముగా ద్వారకకు పంపుతాడు " అని అన్నాడు తరువాత కృష్ణార్జునులు రథము ఎక్కి హస్థినకు పయనమయ్యారు. మార్గమధ్యములో " కృష్ణా ! నీ దయ వలన కౌరవసైన్యము అనే సాగరమును దాటాము. యుద్ధములో శత్రువులను జయించాము. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహా వీరులను జయించాము. నీవు ముందుగా శత్రువులను చంపిన తరువాత మేము ఈ కీర్తి ప్రతిష్ఠలను పొందాము. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ జయము నీది. నీవు సర్వాంతర్యామివి. నీ మహిమగురించి పొగడటము మా తరమా ! దామోదరా ! నీవు ఈ విశ్వసంవిధాతవు. నీ తేజస్సే అగ్నిష్టోమము. నీవే కాలస్వరూపుడవు. నీ ఉఛ్వాసనిశ్వాసములే వాయువు. నీ క్రోధమే మృత్యువు. నీ అనుగ్రహమే లక్ష్మీకటాక్షము. నీ మూలముగానే మానవులకు జనన మరణాలు సంభవిస్తున్నాయి. ఈ చరాచరజగత్తు నీ వలనే ఉద్భవించింది. నీవు భావాతీతుడవు. నీవు సర్వజగత్పతివి. కృష్ణా ! నారదుడు, దేవలుడు, కౌశికుడు, వ్యాసుడు మొదలైన మహామునులు, భీష్ముడు, చెప్పిన మంచి మాటలు విని నీవు సకల ధర్మస్వరూపుడవని తెలుసుకున్నాను. నీవు నా మీద ఉన్న కరుణాకటాక్షముతో ఆధ్యాత్మవిద్యను బోధించావు. అది విని నేను బ్రహ్మానందం పొందాను " అని అర్జునుడు శ్రీకృష్ణుడిని భక్తితోస్తుతించాడు. ఆ మాటలు విన్న వాసుదేవుడు అర్జునుడిని అభినందిస్తూ ఆదరంగా చూసాడు. కృష్ణార్జునులు హస్థినాపురము పోయి ముందుగా ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ధృతరాష్ట్ర గాంధారీల ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత కుంతీదేవి ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత విదురుడు, ధౌమ్యుడు, యుయుత్సుడు, సంజయుడు మొదలగు వారిని కలుసుకుని తరువాత ధర్మరాజు వద్దకు వెళ్ళరు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఆలింగనము చేసుకున్నాడు. అర్జునుడు అన్నగారికి భక్తితో నమస్కరించాడు.

శ్రీకృష్ణుని ద్వారక ప్రయాణ ప్రస్థావన

మరునాడు కృష్ణార్జునులు కలిసి ఆస్థాన మండపములో ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళారు. అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! మన బావ శ్రీకృష్ణుడు హస్థినకు వచ్చి చాలా రోజులు అయ్యింది కదా ! ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు అతడి సోదరులు అతడి కొరకు ఎదురు చూస్తుంటారు కదా ! వారిని చూడాలని శ్రీకృష్ణుడు కూడా ఆతురతగా ఉన్నాడు. అందువలన తమరు అనుమతిస్తే శ్రీకృష్ణుడు ద్వారకకు బయలు దేరుతాడు. అక్కడ దేవకీ వసుదేలనూ అన్న బలరాముడిని చూసి వారితో కొంతకాలము గడిపి తిరిగి హస్థినకు వస్తాడు " అని అన్నాడు. ధర్మరాజు సంతోషముగా " తమ్ముడూ అర్జునా ! అలాగే చేస్తాము. కృష్ణా తమరు ద్వారకకు వెళ్ళి మా బదులుగా తమరి తల్లి దేవకీదేవికి తండ్రి వసుదేవుడికి మా నమస్కారములు తెలియజెయ్యండి. తక్కిన బంధువుల మిత్రుల యోగక్షేమును అడిగినట్లు చెప్పండి. కొన్నిరోజులు వారితో గడిపి తరువాత తమరు నేను చేయబోవు అశ్వమేధయాగముకు బంధుమిత్ర సమేతంగా సపరివారంగా రండి " అని సాదరంగా ఆహ్వానము తెలిపాడు. తరువాత శ్రీకృష్ణుడు కుంతీదేవి అనుమతి తీసుకున్నాడు. ద్రౌపది సుభద్రలను కలుసుకుని వారి అనుమతి తీసుకున్నాడు. సుభద్రను హస్థినకు తీసుకు వెళ్ళడానికి కుంతీదేవి అర్జునుల అనుమతి తీసుకున్నాడు.

శ్రీకృష్ణుడు ఉదంకుడిని కలుసుకొనుట

శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమయ్యాడు. రథము ముందుకు పోతుందే కాని శ్రీకృష్ణుడి మనసు మాత్రము అర్జునుడి మీద నుండి మరల లేదు. రథము ముందుకు పోతుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు కనిపించినంత సేపు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు సాత్యకి ఒక రథము మీద ఉంటే సుభద్ర వేరొక రథము మీద ప్రయాణం చేస్తున్నారు. అలా ద్వారకకు వెడుతూ శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమము చూసి అయన వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు శ్రీకృష్ణుడిని చూసి " కృష్ణా ! పాండవులు కౌరవులు ఇరువురి నడుమ సయోధ్య కుదిర్చావా ! కౌరవులు, పాండవులు ఎవరి రాజ్యములు వారు పాలిస్తూ క్షేమంగా ఉన్నారా ! " అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా ఏమీ ఎరుగని వాడిలా " మహర్షీ ! నేను కురు పాండవుల సంధి ప్రయత్నం చేస్తూ వారితో అనేక విధముల వాదించి నయానా భయానా చెప్పాను. కొంచం గద్దించి కూడా చెప్పాను. అయినా సుయోధనుడు అతడి తమ్ములు పెడచెవిన పెట్టారు. నాతోచేరి మహర్షులు, మునులు, భీష్ముడు, ద్రోణుడు సంధి చేసుకోవడమే మేలని పలు విధముల చెప్పారు. కాని సుయోధనుడు లోభత్వముతో సంధికి అంగీకరించాడు. కురుపాండవులకు జరిగిన యుద్ధములో కౌరవులు సమూలంగా నాశనం అయ్యారు. పాండవులు ఐదుగురు తప్ప ఇరువర్గాలలో ఎవరూ మిగల లేదు. కాల నిర్ణయమును ఎవరు తప్పించగలరు " అని చెప్పాడు.

ఉదంకుడి ఆగ్రహం

 
తన విశ్వరూపనును చూపించనమని శ్రీకృష్ణుడిని అడుగుతున్న ఉదంకుడు
ఈ మాటలకు ఉదంకుడు కోపంతో ఊగిపోతూ " కృష్ణా ! దీనికంతా నువ్వే కారణం. నువ్వు తలచు కుంటే సంధి కుదిరేది. నీకు శక్తి ఉండి కూడా ప్రయత్నించక నీ మోసంతో కౌరవులను సమూలంగా నాశనం చేసావు. ఇంత ఘోరము నీ వలననే జరిగింది కనుక నేను నిన్ను శపిస్తున్నాను " అని కోపంతో పలికాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " మహర్షీ ! నేను చెప్పబోవు మాటలు విని తరువాత మీ ఇష్టము వచ్చిన విధముగా చెయ్యండి. మహర్షీ మునులకు కోపంము తగదు. కనుక శాంతం వహించి ప్రశాంత చిత్తముతో నేను చెప్పేది వినండి. అనవసరంగా నాకు శాపం ఇచ్చి తమరి అమూల్యమైన తపోబలం వ్యర్ధము చేసుకోకండి " అని అన్నాడు. ఉదంకుడు శాంతించి " సరే నువ్వు చెప్పదల్చుకుంది ఏదో చెప్పు శాంతంగా వింటాను " అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి " ఉదంకా ! నేనెవరో నీకు తెలియచెప్తాను. సత్వరజోతమో గుణములు నా యందే ఉండి నా ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. మరుత్తులు, వసువులు మొదలైన దేవతాగణములన్ని నా అందే ఉద్భవించాయి. ఈ విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఈ సృష్టి అంతా నా అందే వ్యాపించి ఉంది. పర, అపర తత్వములు నేనే. ఓంకారము, వేదములు, నాలుగు వర్ణములు , నాలుగు విధములైన ఆశ్రమాలు, వాటికి సంబంధించిన సమస్త కర్మలు, స్వర్గము, మోక్షము అన్నీ నేనే నా రూపాలే. యజ్ఞయాగాలలో నన్ను స్థుతించి యజ్ఞఫలమును పొందుతుంటారు. పాపములు చేసిన వారు కూడా నన్ను భజించి వారి పాపములకు ప్రాయశ్చితము చేసుకుంటారు. ఈ లోకములో అధర్మము పెచ్చుపెరిగి పోయనప్పుడు నేను అవతరించి అధర్మమును రూపుమాపి ధర్మమును రక్షిస్తాను. నేను బ్రహ్మగా, ఈశ్వరుడుగా, విష్ణువుగా ఆయా విధులు నిర్వహిస్తూంటను. అంటే సృష్టి, స్థితి, లయములను నేను మూడు రూపములలో నిర్వర్తిస్తుంటాను. ధర్మముకు హాని జరిగినప్పుడు అధర్మవర్తకులను రూపు మాపి ధార్మికులను రక్షించి లోకోపకారము చేస్తాను. ఉదంకా నేను సర్వసమర్ధుడిని అయినా అధర్మవర్తనులైన కౌరవులతో ధర్మవర్తనులైన పాండవులను కలపడానికి ఎంతో ప్రయత్నము చేసాను. నేను చేసిన ప్రయత్నమును వ్యాసుడు, మొదలైన మహా మునులు కూడా ప్రశంసించారు. కాని దుర్మదులైన కరవులకు నా మాటలు రుచించ లేదు. అందువలన యుద్ధమే శరణ్యం అయినది. అధర్మవతనులైన కౌరవులు సమూలంగా నాశనం అయ్యారు. జరిగిన విషయం నీకు చెప్పాను. ఇక నీవు చెయ్యతలచినది చెయ్యి " అన్నాడు. ఉదంకుడు " శ్రీకృష్ణా ! నీవు ఎవరో నీ మహిమలు ఏమిటో నాకు ముందే తెలుసు. కాని నేను తాత్కాలిక కోపానికి గురి అయ్యాను. అందుకే నిన్ను నిందించాను. నీ అమృతతుల్యమైన వాక్కులతో నా మనసులోని మాలిన్యాలను కడిగివేసావు. కాని నాకు ఒక కోరిక ఉంది. మహోన్నతమైన నీ విశ్వరూపము చూడాలని కోరికగా ఉంది. నేను అందుకు అర్హుడిని అనుకుంటే నాకు నీ విశ్వరూపము చూపించు " అని ప్రార్థించాడు. ఉదంకుడి మాటలు మన్నించిన శ్రీకృష్ణుడు నాడు యుద్ధభూమిలో అర్జునుడికి చూపించిన విశ్వరూపమును ఉదంకుడికి చూపించాడు. అనిర్వచనము, అద్భుతమైన ఆవిశ్వరూపమును చూసిన ఉదంకుడు ఏకకాలమున భయము ఆనందము ఆశ్చర్యముకు లోనై చేతులు జోడించి శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు. " పుండరీకాక్షా ! ఈ భూమి అంతా నీ పాదపద్మములతో నిండి పోయింది. ఆకాశమంతా నీ శిరస్సులతో నిండి పోయింది. నీ యొక్క నడుము అంతరిక్షము అంతా నిండి పోయింది. నీ భుజములు, చేతులు అన్నిదిక్కులను ఆక్రమించాయి. లెక్క లేనన్ని శిరస్సులతో చేతులతో కాళ్ళతో ఈ విశ్వం అంతా నీవే నిండి ఉన్నావు. మహాత్మా ! నీ విశ్వరూపమును కళ్ళారా చూసి ధన్యుడిని అయ్యాను. నా మనస్సు తృప్తి చెందింది. లోకోత్తరమైన ఈ విశ్వరూపమును ఉపసంహరించి నీ జగన్మోహనాకారమైన నీ సహజరూపమును ధరించమని ప్రార్ధిస్తున్నాను కృష్ణా ! " అని ఉదంకుడు ప్రార్థించాడు.

ఉదంకుడు అమృతం

ఉదంకుడి ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఉపసంహరించి " ఉదంకా ! ఏదైనా వరము కోరుకో ఇస్తాను " అన్నాడు. ఉదంకుడు " మహాత్మా ! సామాన్యులకు దుర్లభమైన నీ విశ్వరూపమును కనులారా చూసాను. నాకు ఇంత కంటే ఏమి కావాలి. ఈ భాగ్యము నాకు చాలు " అన్నాడు. శ్రీకృష్ణుడు " ఉదంకా ! నా విశ్వరూపమును దర్శించిన నీకు శుభములు కలుగుతాయి. కాని నీకు ఒక వరము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అడుగు " అని కృష్ణుడు పలికాడు. ఉదంకుడు " కృష్ణా ! ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతం. వర్షపు జలము కాని భూగర్భజలము కాని దొరకవు. కనుక నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నాకు జలము లభించే వరము ప్రసాదించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ఉదంకా ! దానికేముంది నీకు నీరు కావాలని అనిపించినప్పుడు నన్ను స్మరించిన నీకు నీరు లభిస్తుంది " అని వరము ఇచ్చాడు. తరువాత శ్రీ కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ఒకరోజు ఉదంకుడికి దాహము వేసింది. అప్పుడు ఉదంకుడికి కడజాతి వాడు ఒకడు కనిపించాడు. అతడి ఒంటి మీద బట్టలు లేవు. చాలా మురికిగా ఉన్నాడు. అతడి చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. కాని అతడి ఒంటి మీద నిర్మలమైన జలము స్రవిస్తుంది. అతడు ఉదంకుడిని పిలిచి " ఉదంకా ! నీకు దాహము వేస్తుంది కదా నాశరీరము నుండి స్రవించే నిర్మలమైన జలము త్రాగు " అని అన్నాడు. ఉదంకుడు అది విని ఆగ్రహించి అతడిని అక్కడ నుండి వెళ్ళి పొమ్మని అరిచాడు. అప్పుడు ఆ కడజాతివాడు కుక్కలతో సహా మాయం అయ్యాడు. ఇంతలో కృష్ణుడు అక్కడ కనిపించాడు. ఉదంకుడు " కృష్ణా ! నిన్ను తలచుకుంటే జలము లభిస్తుందని అన్నావు కదా ! నీవేమో నన్ను ఈ కడజాతి వాడి శరీరము నుండి లభించే జలము త్రాగమని అంటున్నావు. ఇదేనా నీవు నాకు ఇచ్చే వరము " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " నీకు నేనిచ్చిన మంచి అవకాశము జారవిడిచావు. నేను నీకు అమృతము ప్రసాదించమని దేవేంద్రుడిని కోరాను. మానవులు అమృతము త్రాగడానికి అర్హులు కాదు అని దేవేంద్రుడు నాతో అని నా మాట కాదని అనలేక ఇంద్రుడు " దేవా ! నీవు కోరిన విధంగా నేను ఉదంకుడికి అమృతము ఇస్తాను కాని నేను అతడి వద్దకు కడజాతివాడి రూపములో వెడతాను. అతడు నేను ఇచ్చే అమృతమును ఇష్టపడ పోతే నేను చేయకలిగింది ఏమీ లేదు " అని అన్నాడు. ఇంద్రుడు నీ వద్దకు కడజాతివాడి రూపములో వచ్చి అమృతము త్రాగమని చెప్పాడు. దానిని నీవూ తిరస్కరించావు. ఇక నేను ఏమి చేయగలను. కాని నీకు నేను ఇంకొక వరము ఇస్తాను. నీకు సంవత్సరం పొడవునా ఎప్పుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు లభించే వరము ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్న వెంటనే మేఘములు నీ వద్దకు వచ్చి వర్షము కురిపిస్తాయి. అలా వర్షాన్ని కురిపించే మేఘాలను జనులు ఇక నుండి ఉదంక మేఘాలని పిలుస్తారు. నీ కోరిక ఈ విధముగా నెరవేర కలదు " అని పలికాడు " అని వైశంపాయనుడు జనమేజయుడికి ఉదంకోపఖ్యానము వినిపించాడు.

ఉదంకుడి వృత్తాంతం

ఉదంకుడి వృత్తాంతం
ఉదంకుని వృత్తాంతం విన్న జనమేజయుడు వైశంపాయనుడితో " మహాత్మా ! ఉదంకుడికి శ్రీకృష్ణుడిని కూడా శపించగలిగిన శక్తి ఎలా వచ్చింది? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! ఉదంకుడికి కల గురుభక్తి వలన గువుకు అతడు చేసిన శుశ్రూష వలన ఉదంకుడికి అంతటి శక్తి వచ్చింది. ఉదంకుడు గౌతమునికి శిష్యుడు. విద్యాభ్యాసము పూత్రి అయిన తరువాత మిగిలిన శిష్యులందరికి గౌతముడు ఎవరికి తగిన వరాలు వారికి ఇచ్చి పంపాడు. కాని ఉదంకుడికి మాత్రము ఏ వరము ఇచ్చి పంపలేదు. ఉదంకుడు గురువు వద్దనే ఉండి గౌతముడికి భక్తితో శుశ్రూష చేయసాగాడు. ఒకరోజు ఉదంకుడు మిక్కిలి బరువైన కట్టెలమోపు తీసుకు వచ్చి ఆశ్రమం వద్ద పడవేసే సమయంలో అతడి జడ ఒకటి ఆ కట్టెల మోపులో చిక్కి తెగిపోయింది. అతడి జడ లోని వెంట్రుక తెల్లగా మెరిసి పోవడము చూసిన ఉదంకుడు తనకు వయసు మీరి పోయిన విషయము గ్రహించి బాధను ఓర్వలేక ఏడవసాగాడు. అది చూసిన గౌతముడు ఉదంకుడి కన్నీళ్ళు భూమి మీద పడకుండా పట్టమని తన కుమార్తెను పంపాడు. తండ్రి ఆజ్ఞ మీద గౌతముడి పుత్రి ఆ కన్నీళ్ళను పట్టడానికి ప్రయత్నించి అవి సలసల కాగుతుండటము వలన వాటిని జారవిడిచింది. అది చూసి గౌతముడు " ఉదంకా ! ఎందుకు ఏడుస్తున్నావు ? " అని అడిగాడు. ఉదంకుడు " గురువుగారూ ! మీరు మిగిలిన శిష్యుల మీద చూపిన దయ నా మీద చూప లేదు. వారు వెళ్ళి హాయిగా గృహస్థులై సుఖపడుతున్నారు. నేను మాత్రము ఇలా ముసలివాడిని అయ్యాను. ఇక నాకు వివాహము కాదు. అందుకే ఈ ఏడుపు " అని చెప్పాడు. గౌతముడు " ఉదంకా ! దిగులుపడకు. నీకు మరలా యవ్వనం ప్రసాదిస్తున్నాను. అంతే కాక నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేస్తాను. నీవిక గృహస్థాశ్రమం స్వీకరించి సంతోషాన్ను అనుభవించు " అని అన్నాడు. గౌతముడు తన కుమార్తెకు కూడా అప్పటికే వయసు మీరి పోయిందని గ్రహించి ఆమెకు కూడా యవ్వనం ప్రసాదించి వారిరువురికి వివాహము చేసాడు.

ఉదంకుడి గురుదక్షిణ

గౌతముడుఉదంకుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేసిన పిదప ఉదంకుడు " గురువర్యా ! మీరు నాకు యవ్వనాన్ని యవ్వనవతి అయిన కుమార్తెను ఇచ్చి వివాహము చేసారు. మీ ఋణము ఎలా తీర్చుకోగలను. మీరు నాకు ఏదో ఒక పని చెప్పండి. అది నెరవేర్చి నా ఋణము తీర్చుకుంటాను. అదే నా గురుదక్షిణ " అన్నాడు. గౌతముడు " అదేమిటి ఉదంకా ! నీవు నాకు వేరే గురుదక్షిణ ఇవ్వాలా ! నీ గురుభక్తి మంచి నడవడిక ఇదే నీ గురుదక్షిణ " అని చెప్పి బయటకు వెళ్ళాడు. అప్పుడు ఉదంకుడు తన గురుపత్ని అహల్య వద్దకు వెళ్ళి " అమ్మా ! తమరైనా చెప్పండి తమకు నేను ఏ విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలో " అని అడిగాడు. అందుకు అహల్య " అదేమిటి మీ గురువుగారి మాటే కదా నామాట. అయినా నువ్వు అడిగావు కనుక నేను చెప్తున్నాను. నీవు మిత్రసఖుడు అను వాని వద్దకు వెళ్ళి అతడి భార్య వద్ద ఉన్న కుండలములు తెచ్చి నాకు ఇవ్వు " అని చెప్పింది. ఉదంకుడు కుండలములు తెచ్చే పనిమీద వెళ్ళాడు. కొంతసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతముడికి ఉదంకుడు కనిపించక పోయేసరికి భార్యను అడిగాడు. అహల్య ఉదంకుడిని కుండలములకు పంపిన విషయము చెప్పింది. గౌతముడు " సౌదాసుడు రాక్షసుడు. అతడు శాపవశాన మనుష మాంసము తింటూన్నాడు. ఈ విషయము ఉదంకుడికి తెలియదు కనుక ఏమి జరుగనున్నదో " అని గౌతముడు కలవర పడ్డాడు. ఆ మాటలకు అహల్య కలవర పడి " నాధా ! నాకు ఈ విషయము తెలియదు కనుక పంపాను. మీరు ఎలాగైనా ఉదంకుడిని కాపాడండి " అని ప్రార్థించింది. గౌతముడు నవ్వి " నువ్వు నిశ్చింతగా ఉండు ఉదంకుడికి ఎలాంటి ఆపదా రానివ్వను " అన్నాడు. అని భార్యను ఊరడించాడు.

సుదాసుడి భార్య

ఉదంకుడు ఒక అడవిలో సౌదాసుడిని కలుసుకున్నాడు. మిత్రసఖుడికి సౌదాసుడన్న పేరుకూడా ఉంది. ఉదంకుడు కలుసుకున్న సమయంలో సౌదాసుడు ఆ నిర్జన ప్రదేశంలో ఎర్రటి కళ్ళతో రక్తసిక్త శరీరముతో భయంకరముగా ఉన్నాడు. అయినా ఉదంకుడు సౌదాసుడిని చూసి భయపడ లేదు. ధైర్యంగా తన ముందు నిలబడిన ఉదంకుడిని చూసిన సౌదాసుడు " ఎవరు నువ్వు ఎక్కడకు వెడుతున్నావు. ఈ రోజు ఆహారము దొకక అవస్థ పడుతున్నాను. సరి అయిన సమయంలో వచ్చిన నిన్ను ఇక చంపి తినకవదలను " అన్నాడు. అందుకు ఉదంకుడు " రాజా ! నేను మాగురువు గారి పనిమీద వెళుతున్నాను. గురుకార్యము మీద వెళ్ళే నన్ను చంపుట మహా పాపము. ఇంతటి అధర్మకార్యానికి ఒడిగట్టుతావా " అని అన్నాడు. సౌదాసుడు " బ్రాహ్మణా ! నీకు దినములో మూడవ ఝామున మనుష్య మాంసము తినమని దేవతలు ఆదేశించారు. కనుక నా ఆకలిని నిన్నుతిని తీర్చుకుంటాను అని అన్నాడు. ఉదంకుడు " అలాగా సరే నేను ముందు నాగురువుగారి కార్యము నెరవేర్చి తరువాత నీ ఆకలి తీర్చగలను నన్ను నమ్ము. అయ్యా ! తమరు మిమ్మలిని యాచించిన వారి కోరికలను తీరుస్తారు కదా ! నేనిది నా కొరకు కోరడము లేదు. గురుపత్ని కొరకు అడుగుతున్నాను. కనుక నా కోరిక తప్పక తీరుస్తారని నమ్ముతున్నాను " అని అడిగాడు ఉదంకుడు. ఆ మాటలకు సౌదాసుడు " నీ కోరిక ఏమిటి ? " అని అడిగాడు. ఉదంకుడు " మహాత్మా ! నా గురుపత్ని తమరి భార్య కుండలములు కావాలని అడిగింది. అవి మీరు ఇప్పిస్తే నేను వాటిని గురుపత్నికి సమర్పించి తిరిగి వచ్చి మీకు ఆహారము కాగలను " అని అన్నాడు. అందుకు సౌదాసుడు " ఆ కుండలములు నావి కాదు కదా ! పరుల సొమ్ము నేను ఎలా ఇవ్వగలను " అన్నాడు. ఉదంకుడు " నేను మీ భార్య కుండలములు కోరుతున్నాను అది పరుల సొమ్ము ఎలా ఔతాయి " అన్నాడు. సౌదాసుడు " అయితే నువ్వు నా భార్య వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి కండలములు తీసుకో " అన్నాడు. ఉదంకుడు " అయ్యా మీ భార్య ఉండే ప్రదేశము నాకు చెప్పండి " అని అడిగాడు. సౌదాసుడు " ఆ కనపడేదే ఆమె నివాసము " అని చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య వద్దకు వెళ్ళి " మా గురుపత్ని అహల్య. మీ కుండలములు అడిగి తెమ్మని నన్నుపంపింది. మీరు కుండలములు ఇస్తే నేను వెడతాను " అని అన్నాడు. సౌదాసుడి భార్య " నువ్వు ఉదంకుడివి అని నా భర్త సౌదాసుడు నిన్ను పంపాడనినాకు నమ్మకము ఏమిటి ? " అని అడిగింది. ఉదంకుడు తిరిగి సౌదాసుడి వద్దము వెళ్ళి " నీ భార్య నన్ను గుర్తు తీసుకురమ్మని అడిగింది కనుక నాకు ఏదైనా గుర్తు ఇచ్చి పంపు" అన్నాడు. సౌదాసుడు "నేను చెప్పే మాటలు జాగ్రత్తగా చెపితే నా భార్య నిన్ను గుర్తించి కుండలము ఇస్తుంది" అన్నాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య వద్దకు వెళ్ళి సౌదాసుడి మాటలు చెప్పగానే సౌదాసుడి భార్య మదయంతి సంతోషముతో " కుమారా ! ఈ కుండలముల కొరకు దేవతలు, గంధర్వులు, నాగులు పొంచి ఉన్నారు. వారు ఈ కుండలములు పొందడానికి అనేక ఉపాయములు పన్నుతుంటారు. కనుక నీవు జాగ్రత్త వహించాలి. ఈ కుండలములను నీవు నేల మీద పెట్టినా, ఈ కుండలములకు ఎంగిలి సోకినా, ఏమరుపాటున నిద్రించినా వీటిని అపహరించే ప్రమాదము ఉంది. నీవు ఈ కుండలములను భక్తితో సేవించి పూజించిన నీకు ఆకలిదప్పులు ఉండవు. నీకు అగ్నివలన, విషమువలన, భూత ప్రేత పిశాచములవలన భయము ఉండదు. ఈ కుండలములను పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరికైనా ఖచ్చితంగా సరిపోతాయి. ఈ కుండలములు బంగారమును కురిపిస్తాయి. అందువలన వీటిని అత్యంత అప్రమత్తతతో తీసుకు వెళ్ళి నీ గురుపత్నికి సమర్పించాలి " అని మదయంతి తగు జాగ్రత్తలు చెప్పి కుండలములను ఉదంకుడికి ఇచ్చి ఆశీర్వదించి పంపింది.

ఉదంకుడు సుదాసుడిని ఓదార్చుట

సౌదాసుడి భార్య మదయంతి వద్ద కుండలములు తీసుకున్న ఉదంకుడు సౌదాసుడి వద్దకు వచ్చి " రాజా ! నీ దయ వలన నేను కృతార్ధుడను అయ్యాను. కాని నాకు ఒక సందేహము మిగిలి పోయింది. నీవు నీ గుర్తుగా చెప్పిన మాటలు నాకు అర్ధము కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే వాటి అర్ధము వివరించండి " అని అడిగాడు. సౌదాసుడు " బ్రాహ్మణ కుమారా ! లోకములో క్షత్రియులు బ్రాహ్మణులను పూజిస్తారు. నేను కూడా బ్రాహ్మణులను పూజిస్తాను. నేను బ్రాహ్మణులపట్ల చేసిన చిన్న అపరాధము నన్నిలా మానవ మాంసభక్షకుడిగా చేసింది. నేను చేసిన పాపముకు పరిహారము బ్రాహ్మణపూజ ఒక్కటే మార్గము. అది అంతగా పని చేస్తుందని తెలియకున్నా అంతకంటే వేరు మార్గము లేదు. ఇదే నేను చెప్పిన మాటలకు అర్ధము. బ్రాహ్మణుడవైన నీకోరిక మన్నించి నీకు కుండలములను ఇవ్వమని చెప్పాను. అందువలన నా పాపమును కరిగించాలని అనుకున్నాను " అనిచెప్పాడు. ఊదంకుడి దర్శనము వలన సౌదాసుడికి పూర్వజన్మ జ్ఞానము, దానము చెయ్యాలన్న బుద్ధి, వినయము కలిగాయి. ఉదంకుడు సౌదాసుడిని చూసి " మహానుభావా ! నీ దయ వలన నాకు కుండలములు లభించాయి. నేను వెళ్ళి వీటిని నా గురుపత్నికి సమర్పించి తిరిగి నీ వద్దకు వచ్చి నీ ఆకలి తీరుస్తాను " అని చెప్పాడు. సౌదాసుడు నేను చంపుతానని తెలిసీ నా వద్దకు తిరిగి వస్తానని అన్నావు. నేను నీ సత్యదీక్షకు ప్రీతి చెందాను నీ తపోమహిమ వలన నన్ను దుఃఖ విముక్తిడిని చెయ్యి " ఉదంకుడు " రాజా ! మంచి మనసు కల వారికి పొరపాటున ఆపద కలిగినా అవి వెంటనే తొలగి పోతాయి. నీ సుగుణములే నీ పాపములను పోగొడతాయి. నా గురువు కృప నీ మీద ప్రసరించింది. ఇక నీకు శుభము జరుగుతుంది " అని చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడి వద్ద సెలవు తీసుకుని జింకచర్మముతో చేసిన సంచిలో పెట్టిన కుండలములతో సహా గురుపత్ని వద్దకు ప్రయాణము వెళ్ళాడు.

ఉదంకుడి కుండలములను తస్కరించుట

ఉదకుండి కుండలములను తీసుకు వెళుతూ ఉదంకుడికి మార్గమధ్యంలో ఆకలి వేసింది. ఉదంకుడు కుండలములు ఉన్న సంచిని ఒక పండ్లచెట్టుకు తగిలించి చెట్టు ఎక్కి పండ్లను కోసి తినసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా వీచిన గాలికి చెట్టు ఊగడంతో నేలకు తగిలించిన సంచి కింద పడింది. అక్కడ పొంచి ఉన్న ఒక నాగపాము ఆ సంచిని నోటకరచుకుని వేగంగా పోసాగింది. ఉదంకుడు ఆ పామును వెంబడంచగా అది ఒక పుట్టలోకి దూరింది. ఉదంకుడు ఒక కర్రను తీసుకుని ఆ పుట్టను తవ్వసాగాడు. ఆ తవ్వకానికి భూమి కంపించింది. ఇంతలో దేవేంద్రుడు అక్కడకు బ్రాహ్మణవేషంలో వచ్చి " బ్రాహ్మణోత్తమా ! అంత చిన్నకర్రతో తవ్వి పాతాళమును చేరడము సాధ్యమా ? ఇక్కడి నుండి పాతాళముకు వెయ్యి యోజనముల దూరము ఉంది. నీ కుండలము తస్కరించిన నాగుపాము ఎవరో కాదు. అతడు నాగరాజు అయిన ఇరావంతుడి కుమారుడు. ఉదంకుడు " దేవా ! అతడు పాతాళానికివెళ్ళినా నేను అతడిని వెంబడించి వెళ్ళి కుండలములను తీసుకు వస్తాను " అన్నాడు. దేవేంద్రుడికి ఉదంకుడి పట్టుదల నచ్చింది. అందువలన ఉదంకుడి చేతి కొయ్యకు వజ్రాయుధానికి ఉన్న శక్తిని ప్రసాదించాడు. ఉదంకుడు ఆ కర్రతో ఒక్క పోటుపొడవగానే భూదేవీ వజ్రాయుధ దెబ్బకు భయపడి పాతాళానికి దారి ఇచ్చింది. ఆ దారిగుండా ఉదంకుడు పాతాంలో ఉన్న నాగలోకానికి వెళ్ళాడు. పటిష్ఠమైన కోటగోడలు, ద్వారములు, అగడ్తలు ఉన్న నాగలోకాన్ని చూడగానే ఉదంకుడికి తాను కుండలములు పొందడము అంత సులువైన పనికాదని తెలిసింది. ఇంతలో అతడి ఎదుట అరుణవర్ణములు కలిగిన ఒక గుర్రము కనిపించింది. నలుపురంగు దేహము, శ్వేతవర్ణ తోక కలిగిన ఆ గుర్రము ఉదంకుడితో " ఉదంకా ! నీవెవరో నాకు తెలుసు. నేను నీవు రోజూ ఆశ్రమంలో పూజించే అగ్నిహోత్రుడిని. నాకు కుండలములు ఎక్కడ ఉన్నాయో నీకు చెప్తాను. నీవు ఏమీ అనుకోకుండా నా వెనుక భాగంలొ ఉదు " అన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము వెనుక భాగంలో ఊదగానే ఆ గుర్రము శరీరము నుండి వచ్చిన సెగలుపొగలు నాగలోకమంతా వ్యాపించాయి. వాయుభక్షకులైన నాగులకు ఆ పొగవలన ఊపిరి ఆడలేదు. నాగులంతా విలవిలా కొట్టుకోసాగారు. కుండలములు దొంగిలించిన ఇరావంతుడి కుమారుడు కూడా గిలగిలా కొట్టుకోసాగాడు. వేరు మార్గాంతరము లేక నాగరాజులు కుండలములు తీసుకు వచ్చి ఉదంకుడికి ఇచ్చి శరణు వేడారు. ఉదంకుడు వారిని క్షమించి వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళి గురుపత్నికి కుండలములు అందచేసాడు. గౌతముడు ఉదంకుడిని చూసి " ఉదంకా ! రాక్షస ప్రవృత్తి కలిగిన సౌదాసుడిని ప్రసన్నము చేసుకుని కుండలములు సంపాదించడము. అగ్నిదేవుని ప్రసన్నము చేసుకుని కుండలములు నాగరాజుల నుండి సంపాదించడము నీవే చేయగలవు. ఇది వేరొకరు చేయలేరు " అన్నాడు. అని వైశంపాయనుడు జనమేజయుడికి ఉదంకుడి వృత్తాంతము చెప్పాడు.

శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుట

వైశంపాయనుడు జనమేజయునకు శ్రీకృష్ణుడు ద్వారకకు చేరిన వృత్తాంతము ఇలా చెప్పసాగాడు. " జనమేజయ మహారాజా ! ఉదంకుడి వద్ద నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో రైవతక పర్వతానికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ద్వారకాపురి వాసులంతా ఆ ఉత్సవానికి పోవడానికి సమాయత్తము కాసాగారు. శ్రీకృష్ణుడి రాకతో వారు ఆగి పోయి శ్రీకృష్ణుడికి స్వాగతము పలికారు. శ్రీకృష్ణుడు ముందు తల్లి తండ్రులైన దేవకీ వసుదేవులను అన్న బలరాముడిని కలిసి వారికి నమస్కరించాడు. వారికి ధర్మరాజు తరఫున ప్రణామములు అందించాడు. తరువాత తన తమ్ములను వారి భార్యలను కుమారులను వారి భార్యలను కలిసి వారికి ఆనందము కలిగించాడు.

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధవిశేషాలు వసుదేవుడికి ఎరిగించుట

కురుక్షేత్ర యుద్ధవిశేషాలను తన తల్లిదండ్రులకు చెప్పుచున్న శ్రీకృష్ణుడు
ఒక రోజు వసుదేవుడు శ్రీకృష్ణుడిని తన వద్ద కూర్చోబెట్టుకుని " నాయనా శ్రీకృష్ణా ! మహాభారత యుద్ధము జరిగిందని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. కాని పూర్తి విషయాలు తెలియ లేదు. ఆ యుద్ధ విశేషాలు వినాలన్న కుతూహలంగా ఉంది " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " తండ్రీ ! మహాభారత యుద్ధము 18 రోజులు జరిగింది. ఆ యుద్ధవిశేషాలు చెప్పాలంటే చాలారోజులు పడుతుంది. అందుకని ప్రముఖులు మాత్రము చేసిన యుద్ధవిశేషాలను క్లుప్తంగా వివరిస్తాను. ఇరువైపులా మొహరించిన సైన్యము 18 అక్షౌహినులు. అందులో కౌరవ సైన్యము 11 అక్షౌహినులు. పాండవుల సైన్యంలో 7 అక్షౌహినులు. కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముడిని పడగొట్టాడు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేవరకు అంపశయ్య మీద కాలము గడిపి తరువాత శరీరము వదిలి పెట్టాడు. భీష్ముడు పడిపోయిన పిదప ద్రోణుడు సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు. ద్రోణుడు అయిదు రోజుల వరకు సైన్యాలను నడిపించిన తరువాత ధర్మరాజు సహాయంతో దృపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపాడు. తరువాత అంగదేశాధ్యక్షుడు కర్ణుడు సర్వసైన్యాధ్యత వహించాడు. కర్ణుడు రెండు రోజులపాటు యుద్ధము కొనసాగించి తుదకు అర్జునుడి చేతిలో పరమపదించాడు. మరునాడు శల్యుడి సారథ్యములో కౌరవసేన యుద్ధముకు సమాయత్తము అయ్యింది. కాని సగము రోజులోనే ధర్మరాజు చేతిలో పరమపదించాడు. తరువాత వచ్చిన శకుని వచ్చీ రాగానే నకులుడి చేతిలో మరణించాడు. అప్పటికే సుయోధనుడి తమ్ములంతా యుద్ధములో మరణించారు. ఒంటరిగా మిగిలిన సుయోధనుడు అవమానభారంతో ఒక మడుగులో దాక్కున్నాడు. అతడి జాడ తెలుసుకుని ధర్మరాజు భీముని సహాయముతో సుయోధనుడి తొడలు విరిచి చంపాడు. సుయోధనుడి మరణంతో పాండవులకు సంపూర్ణ విజయము లభించింది. కాని అంతలో దొర్లిన అపశృతి వలన ఒకరోజు ద్రోణ పుత్రుడు అశ్వత్థామ పాండవశిబిరములో ప్రవేశించి దుష్టద్యుమ్న, శిఖండి, ఉపపాండవులతో సహా పాండవసైన్యాలను సర్వనాశనము చేసాడు. కృతవర్మ, కృపాచార్యులు ఈ యుద్ధములో అశ్వత్థామకు సహకరించారు. ఆ రోజు నేను సాత్యకి పాండవులతో ఓఘానదీ తీరానికి వెళ్ళినందు వలన మేము బ్రతికి బయటపడ్డాము. ఇలా 18 రోజుల కురుక్షేత్రయుద్ధము ముగిసింది. కౌరవ పక్షంలో కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు పాండవ పక్షములో చేరిన యుయుత్సుడు తప్ప మిగిలిని వారందరూ మరణించారు. ఇదీ భారత యుద్ధకథ " అని శ్రీకృష్ణుడు భారత యుద్ధ విశేషాలను క్లుప్తంగా వసుదేవుడికి వివరించాడు.

వసుదేవుడికి అభిమన్యుడి మరణవార్త తెలుపుట

కురుక్షేత్రయుద్ధ విశేషాలు విన్న వసుదేవుడు చింతాకాంతుడయ్యాడు. అభిమన్యుడి మరణవార్త వసుదేవుని ఇంకా క్రుంగదీస్తుందని చెప్పలేదు. కాని సుభద్ర దుఃఖం ఆపుకోలేక " అన్నా ! మీ తండ్రి వసుదేవుడు. అది విని దుఃఖిస్తున్న వసుదేవుడిని అక్కడ ఉన్న యాదవులను ఓదార్చడము కృష్ణుడివంతైంది. ధృతరాష్ట్రుడితో చేరి ధర్మరాజు కౌరవులందరికి అంతిమ క్రియలు జపించినతీరు బ్రాహ్మాణులకు దానములు ఇవ్వడము వారిపేరు మీద అనేక ధర్మకార్యాలు నిర్వహించడము సవిస్తరంగా వివరిండు. అందరూ మెల్లమెల్లగా ఆ దుఃఖమునుండి బయట పడ్డారు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ఆశ్వమేధయాగము

జనమేజయుడు " వైశంపాయన మహర్షీ ! వ్యాసుడు ధర్మరాజును అశ్వమేధయాగమును చేయమని ఆదేశించాడు కదా ! ధర్మరాజు ఆయాగమును ఎలా నిర్వహించాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! వ్యాసుడు తన మీద ఉన్న వాత్సల్యముతో అశ్వమేధయాగము చేయమని ఆదేశించిన తరువాత ధర్మరాజు తన తమ్ములను పిలిచి " భీమార్జున నకులసహదేవులారా ! వ్యాసుడి ఆదేశము విన్నారు కదా ! యాగనిర్వహణకు కావలసిన ధనము మన వద్దలేదు. కనుక వ్యాసుడు చెప్పినట్లు బ్రాహ్మాణులు దాచిన ధనము తీసుకురావలసిన అవశ్యకత ఉంది. హిమాలయములలో ఉన్న ఆ నిధిని తీసుకురావడానికి కావలసిన మార్గము గురించి, చేయవలసిన ఏర్పాటు గురించి మీరు నాకు మీ అభిప్రాయములు చెప్పండి " అని అడిగాడు. జవాబుగా భీముడు " అన్నయ్యా ! ధర్మనందనా ! మనము ఆ పరమేశ్వరుడిని నియమ నిష్టలతో పూజించి ఆయన కరుణ పొంది ప్రమధగణములను పూజించి, భూతబలులు సమర్పించి ఆ నిధిని తీసుకు వస్తాము. కనుక ధనముగురించిన చింతతో పనిలేదు. ఆ కార్యము సాధించడానికి సముచిత సైన్యము కావాలి " అని భీముడు చెప్పాడు. భీముని మాటలకు అర్జునుడు, నకులసహదేవులు తమ అంగీకారము తెలిపారు. తమ్ముల మాటలకు ధర్మరాజు సంతోషించాడు. అందరూ కలిసి హిమాలయములకు పోవడానికి నిశ్చయించుకున్నారు. తరువాత పెదనాన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడు తన కుమారులు లేనందుకు విలపించాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదములు పట్టుకుని గాంధారి వింటూ ఉండగా వ్యాసమహర్షికి తనకు జరిగిన సంభాషణ వ్యాసుడు తనను అశ్వమేధయాగము చేయమని చిప్పిన విషయము చెప్పి యాగము చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి పొందాడు. తరువాత తన తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు యాగము గురించి చెప్పాడు. ఆ మాటలు విని కుంతీదేవి సంతోషంతో యాగముకు అనుమతి ఇచ్చింది. కుంతీదేవి అనుమతి తీసుకున్న ధర్మరాజు ఆస్థానమండపానికి వెళ్ళి యుయుత్సుడికి హస్థినాపుర బాధ్యత అప్పగించి అతడికి తోడుగా విదురుడిని నియమించాడు. సైన్యాధిపతులను పిలిచి ప్రయాణసన్నాహములు చెయ్యమని ఆదేశించాడు. తరువాత సమస్తదేవతలకు, పితరులకు పూజలు చేసాడు. అగ్నికార్యము నిర్వహించాడు. ధౌమ్యుడికి నమస్కరించి తరువాత రథము మీద కూర్చున్నాడు. మార్గమధ్యములో బ్రాహ్మణుల వద్ద పుణ్యస్త్రీల వద్ద ఆశీర్వాదములు స్వీకరిస్తూ తన పూరోహితుడు ముందుగా నడువగా హిమాలయములకు పయనమయ్యాడు. ధర్మరాజు వెంట భీమార్జున నకులసహదేవులు రథముల మీద అనుసరించారు. మార్గమధ్యములో సామంతరాజులు కూడా వారితో కలిసారు. అందరూ కలిసి ఒక సమతలప్రదేశంలో విడిది చేసారు.

పాండవుల శివార్చన

ఆ సమయంలో అక్కడకు వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి స్వాగతము పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టాడు. తరువాత జరుగవలసిన కార్యక్రమము గురించి వ్యాసుడిని అడిగాడు. వ్యాసుడు " ధర్మనందనా ! ఈ రోజు రాత్రికి మీరందరూ ధర్భాసనము మీద పడుకోండి. రేపు ఉదయమే లేచి శివుని అర్చించండి " అని చెప్పాడు. మరునాడు ఉదయము పాండవులందరూ వేకువఝామునే నిద్ర లేచి స్నానాధికాలు కానిచ్చారు. తరువాత ధర్భాసనము మీద శివుని ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యములతో పూజించారు. పాయసమును సమర్పించారు. తరువాత ప్రథమగణములను ఆవాహన చేసి పూజించారు. కుబేరుడు, మణిభద్రుడు మొదలైన యక్షులను భక్తితో ఆవాహన చేసి పూజించారు. తరువాత పురోహితుడు ధౌమ్యుడు ముందు నడువగా ధర్మరాజు తన తమ్ములతో నిధి ఉన్న చోటుకు వెళ్ళాడు. నిధిని ఆవహించి ఉన్న భూతములను ఎర్రని పూలతో, మాంసముతో కూడిన అన్నముతో,పేలాలతో అర్చించారు.

పాండవులు నిధిని తీసుకుని మరల్చుట

భూతములను తృప్తిపరచిన తరువాత ఆ ప్రదేశములో తవ్వమని ఆదేశించాడు. కొంతలోతు త్రవ్వగానే ఆ నిధి బయటపడింది. ధర్మరాజు వ్యాసుడి పాదములకు నమస్కరించాడు. వ్యాసుడు ధర్మరాజును ఆశీర్వదించాడు. తరువాత ధర్మరాజు నిధికి బలులు సమర్పించి పూజలు చేసాడు. తరువాత నిధిని అనేక బండ్ల మీద ఎక్కించారు. బంగారు బిందెలు, చెంబులు, గృహోపకరణ వస్తువులు, రోళ్ళు, రోకళ్ళు ఉన్నాయి. ఇంకా బంగారు దిమ్మలు, కణికలు ఉన్నాయి. ధర్మరాజు వాటిని మూటలు కట్టించి సంచులతో ఎత్తించి బండ్ల మీద ఎత్తించాడు. వేలకొద్దీ వాహనములలో అక్కడక్కడా మజిలీలు చేస్తూ ప్రయాణము సాగించాడు.

పరీక్షిత్తు జననం

శ్రీకృష్ణుడు ద్వారకలో ధర్మరాజు చేయబోవు యాగము గురించి ధర్మరాజు యాదవ ప్రముఖులకు తెలిపిన ఆహ్వానము గురించి తెలిపాడు. తరువాత ధర్మరాజు హిమాచలముకు పోవుట నిధినితరలించుట విని సంతోషించాడు. శ్రీకృష్ణుడు,కృతవర్మ, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలగు యాదవ ప్రముఖులతోకలసి హస్థినాపురముకు వచ్చాడు. వారిరాక విని ధృతరాష్ట్రుడు, గాంధారి సంతోషించి యుయుత్సుడిని, విదురుడిని వారిని తీసుకురావడానికి పంపాడు. యుయుత్సుడు, విదురుడు శ్రీకృష్ణుడిని, బలరాముడిని మిగిలిన యాదవ ప్రముఖులను స్వాగతము పలికి అంతఃపురానికి తీసుకువచ్చారు. అత్తగారైన కుంతీదేవిని కలుసుకున్నారు. సుభద్ర తన అత్తగారైన కుంతీదేవి వద్దకు పోయి ఆమె ఆశీర్వాదము తీసుకుంది. యుయుత్సుడు, విదురుడు శ్రీకృష్ణ, బలరామ యాదవ ప్రముఖులకు తగిన విడిది ఏర్పాట్లు చేసారు. ఆ సమయంలో నిండు గర్భిణి అయిన అభిమన్యుడి ధర్మపత్ని ఉత్తర గర్భాన తమరి జనకుడు పరీక్షిత్తు జన్మించాడు అని దాసీలు ప్రసూతిగృహము నుండి వచ్చి చెప్పగానే అందరూ ఆనందోత్సాహాలలో తేలియాడారు. అంతలోనే గర్భములోనే బిడ్డ చనిపోయాడు అని తెలుసుకుని అందరూ దుఃఖసాగరంలో మునిగి పోయారు.

కుంతీ అభుమన్యుడి కుమారుడిని బ్రతికించమని వేడుకొనుట

పరీక్షిత్తు జననంలో జరిగిన అపసృతి గురించి విన్న శ్రీకృష్ణుడు, సాత్యకిని వెంట పెట్టుకుని కుంతీదేవి వద్దకు వెళ్ళాడు. అప్పుడు కుంతీ శ్రీకృష్ణుడితో " కృష్ణా ! నాకు నీవు తప్ప వేరెవరు లేరు నీవే శరణు. నీ మేనల్లుడు అభిమన్యుడికి కలిగిన కుమారుడు చనిపోయాడు. క్రూరాత్ముడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మహిమ వలన మాడి మసి అయ్యాడు. కృష్ణా ! బ్రతికించకలిగిన శక్తి నీక్లే ఉంది.ఆనాడు నీవిచ్చిన మాట చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకో. " ఉత్తర గర్భమును రక్షిస్తాను. గర్భములో శిశువును బ్రతికిస్తాను " అని నీవు ప్రతిజ్ఞ చేసావు. కృష్ణా ! నా ప్రాణములు, ద్రౌపది, సుభద్రల ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. బిడ్డ బ్రతికితే మేము బ్రతుకుతాము. లేకున్న మేము ప్రాణాలు విడిచి పెడతాము. ఈ బిడ్డ చనిపోయిన పాండవ వంశపితరులకు పిండప్రధానము చెయ్యడానికి, తిలోదకాలు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ మిగలరు. కనుక ఈ బిడ్డను బ్రతికించి మత్స్యరాజకుమారి శోకమును పోగొట్టు . కృష్ణా ! పాండవ వంశాన్ని రక్షించిన నీవే పాడవ వంశాంకురాన్ని కాపాడి వారి వంశాన్ని నిలబెట్టు " అని వేడుకుంటూనే శోకభారంతో నేలకు ఒరిగింది.

సుభద్ర తన మనుమడిని బ్రతికించమని వేడుకొనుట

అక్కడే ఉన్న సుభద్ర " అన్నా ! ఆ అశ్వత్థామ భీముడిని చంపడానికి బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించాడు. కాని ఆ అస్త్ర ప్రభావానికి నేను నా భర్త అర్జునుడు ఫలితము అనుభవిస్తున్నాము. వంశాంకురాన్ని పోగొట్టుకున్నాము. నీ మరిది అర్జునుడు ఇప్పటికీ అభిమన్యుడి మరణానికి తలచితలచి శోకిస్తున్నాడు. ఇప్పుడు మనుమడు కూడా చనిపోయాడని తెలిస్తే పరిస్థితి ఎమౌతుందో అని భయంగా ఉంది. ఇక ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటారో ? అన్నయ్యా ! అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించినప్పుడు నీవు దానిని నిర్వీర్యము చేస్తానని మాటిచ్చావు. మేము కూడా ఊరట చెందాము. నీ ప్రయత్నము ఫలించినట్లు లేదు. మా అందు దయ ఉంచి పాండవవంశాంకురాన్ని రక్షించి పాండవకులమును రక్షింఛు. అన్నయ్యా నీవు ఉండగా పాండవులకు భంగపాటులేదు. నీ ఎదురుగానే అశ్వత్థామ పాండవకుల వంశోద్ధారకుడిని నాశనం చేసాడు. భక్తవత్సలా ! ఈ చరాజరజగత్తులో చనిపోయిన బ్రతికించే శక్తి నీకే ఉంది అని నాకు తెలుసు అలాంటి నీవు నీ మేనత్త కొడుకు, ప్రియసఖుడు, ఆప్తుడు, బావ అయిన అర్జునుడి మనుమడు అకాల మరణాన్ని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్యా ! దుఃఖభారంతో మేము నీ శక్తి తెలియక ప్రవర్తించినందుకు మమ్ము క్షమించి ఈ బిడ్డను బ్రతికించు " అని దీనంగా వేడుకుంది.

శ్రీకృష్ణుడు పరీక్షిత్తుని బ్రతికించుట

పరెక్షిత్తును బ్రతికిస్తున్న శ్రీకృష్ణుడు
కుంతీ సుభద్రలు శోకించుట చూసిన శ్రీకృష్ణుడి మనసు ద్రవించింది. అందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు " ఎవరూ విచారించకండి. ఈ బిడ్డను నేను బ్రతికిస్తాను " అని పెద్దగా అన్నాడు. ఆ మాటలకు అందరూ ఊరట చెందారు. కుంతీ, సుభద్రల, ద్రౌపదీదేవి వెంటరాగా కృష్ణుడు ప్రసూతిగృహానికి వెళ్ళాడు. తెల్లటిపూలు, ఆవాలు, లాజలు, పూర్ణకుంభంతో పుణ్యజలాలు తెప్పించి అగ్నిహోత్రము జ్వలింపచేసాడు. పదునైన ఆయుధములను, లేజివుళ్ళను పేర్చారు. అందరికంటే ముందు ద్రౌపది " అమ్మా ! ఉత్తరా ! నిన్ను చూడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. లేచి కళ్ళు తెరచి చూడమ్మా ! " అన్నది. ఉత్తర కళ్ళు తెరచి భారంగా కూర్చుని కృష్ణుడికి నమస్కారము చేసి " దేవాదిదేవా ! నీవు నీ భక్తుల ఆర్తి బాపుతావని ప్రతీతి. ఈ మృతశిశువును బ్రతికించి ఈ వంశాన్ని రక్షించు. నీ దయ నా మీద చూపించు. ఈ మృతశిశువును పునరుజ్జీవితుడిని చెయ్యి. నేను భర్తను పోగొట్టుకున్నాను. తుదకు నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. ఇక నేను ఎలా బ్రకగలను. భక్తవత్సలా ! నీ మేనల్లుడి కుమారుడిని చంపకలిగిన సామర్ధ్యము అశ్వత్థామకు ఉందా ! కృష్ణా ! నా భర్త అభిమన్యుడు చనిపోయినప్పుడే నేను సహగమనము చేయవలసి ఉంది. కాని ఈ బిడ్డకోసము బ్రతికాను. ఇప్పుడు నేను చనిపోయి స్వర్గముకు పోయినప్పుడు నా భర్త అభిమన్యుడు తన కుమారుడిని గురించి అడిగితే ఏమని చెప్పను. పరంధామా ! నా కుమారుడిలా చనిపోతాడని అనుకుంటే ఆరోజే సహగమనము చేసేదానిని. నాకు కుమారుడు కలగగానే శ్రీకృష్ణుడికి చూసి పోవాలని అనుకున్నానే. ఆ క్రూరాత్ముడు అశ్వత్థామ నా కుమారుడిని చంపి నా ఆశలను వమ్ము చేసాడు " అంటూ బిడ్డను ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఉత్తర ఆ మృతశిశువును చూసి " కన్నా ! లేవరా నీ తాత శ్రీకృష్ణుల వారువచ్చారు. లేచి నమస్కారము చెయ్యి. పెద్దలు వచ్చినప్పుడు అలా పడుకుని ఉండడము తగునా ! " అంటూ మరణించిన కుమారుడిని తలచుకుని విలపించిన ఉత్తర సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె శోకమును చూసిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. శ్రీకృష్ణుడు " అమ్మా ఉత్తరా ! విలపించకు నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను " అని అన్నాడు. వెంటనే పాదప్రక్షాళన చేసాడు, ఆచమనము చేసి శుచి అయ్యి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును నిర్వీర్యము చేసాడు. మృతశిశువును శయ్యమీద ఉంచమని చెప్పాడు. శ్రీకృష్ణుడు అ శిశువును చూసి " ఈ శిశువును బ్రతికించి ఉత్తర, సుభద్ర, పాడవులకు ఆనందం కలిగిస్తాను " అని పలికాడు. తరువాత శ్రీకృష్ణుడు " నేను శత్రువులతో సైతము ఎన్నడూ అబద్ధము ఆడని వాడను అయితే, యుద్ధభూమిలో ఎన్నడూ వెనుకంజ వేయని వాడిని అయితే ఈ శిశువు పునరుజ్జీవితుడు ఔతాడు. బ్రాహ్మణుల ఎడల నా మనస్సు భక్తిప్రపత్తులు కలవాడిని అయితే ఎల్లప్పుడూ ధర్మము తప్పని వాడిని అయితే ఉత్తర కుమారుడు పునరుజ్జీవితుడు అగుగాక. అర్జుని ఎడల ఏనాడూ బేధభావము లేని వాడిని అయితే ఈ బాలుడు జీవించుగాక. ధర్మసంస్థాపన నిమిత్తము నేను కంసాదులను సంహరించింది నిక్కమైతే కంసాదులను నేను సంహరించింది జనులకు ఆమోదయోగ్యమైతే ఈ శిశువు జీవించు కాక . నేను సదాబ్రహ్మచర్యమును అవలంబించి, సత్యము పలుకుతూ, ధర్మము తప్పని వాడిని అయితే ఈ బాలుడు బ్రతుకుగాక " అని శ్రీకృష్ణుడు గాఢంగా పలికాడు. ఆ మాటలకు బాలుడిలో చలనము కలిగింది. మెల్లిగా కాళ్ళు చేతులు కదిలాయి. నెమ్మదిగా కళ్ళుతెరిచాడు. అది చూసిన కుంతీదేవి, సుభద్ర, ద్రౌపది మొదలగు వారు అమితానందము పొందారు. వారికళ్ళలో ఆనంద బాష్పాలు కురిసాయి. వారు పులకాకితులు అయ్యారు. అక్కడ ఉన్నవారు అంతా కేరింతలు కొట్టారు. ఆకాశము నుండి దివ్యవాణి శ్రీకృష్ణుడిని స్తుతించింది. జనమేజయా ! అప్పుడు మీ తండ్రిగారు ఉన్న ఆ పురిటిగది మీ తండ్రి గారి తేజస్సుతో ప్రకాశించింది. అప్పటి వరకు చలనము లేకుండా పడి ఉన్న శిశువులో చలనము కలగడము చూసిన ఉత్తర ఆనందము పట్టలేక బిడ్డను పొదివి పట్టుకుని శయ్యదిగి పరుగున వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయింది. శ్రీకృష్ణుడు ఆమెను ఆదరంతో లేవనెత్తాడు. యాదవులు అందరూ ఆ బిడ్డకు అనేక అలంకారాలు బహుమతులుగా సమర్పించారు. శ్రీకృష్ణుడు అందరూ వింటూ ఉండగా " పాండవవంశము అంతరించింది అనుకున్న తరుణంలో జన్మించిన ఈ బాలుడికి పరీక్షిత్తు అని నామకరణము చేస్తున్నాను " అని ప్రకటించాడు. ఆ విధంగా నీ తండ్రికి పరీక్షిత్తు అనే నామము సార్థకము అయింది. జనమేజయ మహారాజా మీ వంశము అలా శ్రీకృష్ణుడి కృప వలన వర్ధిల్లింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

పాండవులకు శ్రీకృష్ణాదులు స్వాగతం చెప్పుట

పరీక్షిత్తు జన్మించిన తరువాత ఒక మాసము తరువాత ధర్మరాజు ససైన్యముగా భీమార్జున నకుల సహదేవులతో వేలాది వాహనములకు ఎక్కించిన బంగారురాశులతో హస్థినాపురము చేరుకున్నారు. వారికి స్వాగత సన్నాహాలు చేయమని శ్రీకృష్ణుడు యుయుత్సుడు, విదురుని నియోగించాడు. హస్థినాపుర వీధులను శోభాయమానముగా అలంకరించారు. తోరణాలు కట్టారు, అరటి స్థంభాలు కట్టారు, కస్తూరితో కళ్ళాపి చల్లారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పూర్ణకుంభముతో పాండవులకు స్వాగతము పలికారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు, యుయుత్సుడు, విదురుడు పాండవులకు ఎదురేగి స్వాగతము చెప్పారు. పాండవులు సువర్ణరాశులతో సహా హస్థినాపురప్రవేశము చేసారు. ధర్మరాజు తన తమ్ములతో ముందుగా ధృతరాష్ట్ర, గాంధారులను దర్శించారు. తరువాత కుంతీదేవిని దర్శించుకుని తరువాత సభామండపము చేరారు. పాండవులు సభామండపము చేరి కొలువుతీరగానే పరీక్షిత్తు జననవిశేషాలను విన్నారు. ఉత్తర ప్రసవించిన మృతశిశువును శ్రీకృష్ణుడు పునరుజ్జీవితుడిని చేసి అతడికి పరీక్షిత్తు అని నామకరణము చేసిన విషయము విని పాండవులు ఆనందాశ్చర్యాలకు లోను అయ్యారు. తమ వంశమును నిలబెట్టిన శ్రీకృష్ణుడిని వారు వేనోళ్ళ కొనియాడారు.

అశ్వమేధయాగారంభం

ధర్మరాజుకు అశ్వమేధ యాగము చేయమని సలహా ఇస్తున్న శ్రీకృష్ణుడు
తరువాత కొన్ని రోజులకు పాండవుల వద్దకు వ్యాసుడు వచ్చాడు. పాండవులు అతడికి ఎదురేగి సత్కరించారు. ధర్మరాజు " వ్యాసుడిని చూసి " మునీంద్రా ! తమరి దయవలన అశ్వమేధయాగముకు కావలసిన ధనము సమకూరింది. తమరు అనుమతిస్తే యాగమును ఆరంభిస్తాను " అని అడిగాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీకు శుభము అగుగాక. అశ్వమేధయాగము నిర్విజ్ఞముగా నెరవేరుగాక " అని ఆశీర్వదించాడు. ధర్మరాజు " శ్రీకృష్ణా ! ఆపద్భాంధవా ! నీ కృపాకటాక్షములతో భారత యుద్ధములో విజయము సాధించాము. ఈ అశ్వమేధయాగము కూడా నీ చేతుల మీదుగా జరిపించి మమ్ము కృతార్ధులను చెయ్యి. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీనీవె. నీవు ఆజ్ఞాపించు మేము నీ అజ్ఞానువర్తులమై అశ్వమేధయాగమును నెరెవేరుస్తాము " అని శ్రీకృష్ణుడిని ధర్మరాజు ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! వ్యాసుడు ఆజ్ఞాపించాడు. మనము యజ్ఞము నిర్వహిస్తాము. ఈ యాగముతో నీ పరితాపము పటాపంచలు ఔతుంది. అన్ని ఫలముల కంటే అశ్వమేధయాగ ఫలము మేలైనది అని నేను నీకు ముందే చెప్పాను. నేను నిన్ను అశ్వమేధయాగము చెయ్యమని చెప్పాను అందుకని ఇక నా అనుజ్ఞ నీకు అవసరము లేదు. యజ్ఞకర్తవైన నీవు ,మమ్ము ఆజ్ఞాపించు. మేము నీ ఆజ్ఞానువర్తులమై యాగమును నిర్వహిస్తాము " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు వ్యాసుడితో " మహానుభావా ! యాగదీక్షకు తగిన ముహూర్తము మీరే నిర్ణయించి తగిన సంస్కారమును ఆచరించండి " అని ప్రార్థించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! ఈ యాగమును నేను, యజ్ఞవల్క్యుడు, పైలుడు ముగ్గురమూ కలిసి నిర్వహిస్తాము. రాబోవు చైత్ర మాసములో పౌర్ణమి నాడు దివ్యమైన ముహూర్తము. యజ్ఞాశ్వము కొరకు అశ్వ నిపుణులను నియమించు. యాగములో వెదోక్తముగా విడువబడిన అశ్వము ఈ భూమండలము అంతటా తిరుగుతూ ని యశస్సును భూమండలము అంతా వ్యాపింపచేస్తుంది. యాగముకు కావలసిన సంభారములు సిద్ధము చేయించు " అని ఆదేశించాడు వ్యాసుడు. ధర్మరాజు అశ్వశాస్త్రము తెలిసిన వారిని పిలిపించి సకల శుభలక్షణములు కలిగిన అశ్వమును ఎంపిక చేసి తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. యజ్ఞముకు కావలసిన పనిముట్లను బంగారముతో చేయించమని ఆజ్ఞలు జారీచేసారు. త్వరలోనే ఉత్తమాశ్వము యజ్ఞానికి కావలసిన పనిముట్లు తయారయ్యాయి. ధర్మరాజు వ్యాసుడి వద్దకు వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని తెలియచేసాడు. వ్యాసుడు అశ్వమును చూసి తృప్తి చెందాడు. ధర్మరాజు " మహర్షీ ! ఈ అశ్వమును వెదోక్తముగా అర్చించి వదలిన తరువాత దీని వెంట దీని రక్షణార్ధము వెళ్ళవలసిన వీరుడెవరో మీరు నిర్ణయించండి. వ్యాసుడు " ధర్మనందనా ! వేరెవరు దివ్యాస్త్రకోవిదుడు, బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, శౌర్యవంతుడు అయిన అర్జునుడే అందుకు సమర్ధుడు. నీవు యాగదీక్షలో ఉంటావు. భీముడు, నకులుడు రాజ్యరక్షణ భారము వహిస్తారు. సహదేవుడు అంతఃపుర రక్షణభారము వహిస్తాడు " అని వ్యాసుడు చెప్పాడు. ధర్మరాజు " అర్జునా ! వ్యాసుడి మాటలు విన్నావు కదా ! ఈ యాగశ్వమును రక్షించ వలసిన బాధ్యత నీదే. ఈ పని వేరెవరికి సాధ్యము కాదు. కనుక యాగాశ్వము రక్షణబాధ్యత వహిస్తూ అశ్వము సంచరించు ప్రాంతాలలో ఉన్న రాజులకు ఇది యాగదీక్షలో ఉన్న యాగాశ్వము అని చెప్పి దీనిని నిరాటంకంగా అన్ని ప్రాంతంలో తిరిగేలా చూడు. ఈ యాగాశ్వమును పట్టుకున్న రాజులను చంపక వారిని యాగముకు ఆహ్వానించు " అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. వ్యాసుడు ఆదేశించిన విధముగా రాజ్య రక్షణకై భీముని, నకులుని నియోగించి అంతఃపుర రక్షణకు సహదేవుడిని నియమించాడు. మిగిలిన పనులకు ఆయారంగాలలో నిష్ణాతులను నియమించాడు. ధృతరాష్ట్ర, గాంధారిల అనుమతి తీసుకున్నాడు. తల్లి కుంతీదేవి అనుమతి తీసుకుని ద్రౌపదితో చేరి యాగము చేయడానికి ఉద్యుక్తుడు అయ్యాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.

అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము

  • 1.1 ఆశ్వము త్రిగర్త దేశములో ప్రవేశించుట
    • 1.1.1 అశ్వము ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించుట
    • 1.1.2 అశ్వము సింధుదేశములో ప్రవేశించుట
  • 1.2 అశ్వము మణిపూర్వక నగరంలో ప్రవేశించుట
  • 1.3 బభ్రువాహనుడు అర్జునుడిని ఎదుర్కొనుట
  • 1.4 చిత్రాంగద దుఃఖించుట
  • 1.5 బభ్రువాహనుడు విలపించుట
  • 1.6 ఉలూపి బభ్రువాహనుడిని ఓదార్చుట
    • 1.6.1 ఉలూపి ఎరిగించిన రహస్యము
    • 1.6.2 అర్జునుడు చింత్రాంగాదులను విడిచి వెళ్ళుట
    • 1.6.3 అశ్వం రాజగృహనగరంలో ప్రవేశించుట
  • 1.7 యాగాశ్వదిగ్విజయ యాత్ర
  • 1.8 అశ్వము గాంధారదేశంలో ప్రవేశించుట
  • 1.9 యాగశాల నిర్మాణం
  • 1.10 అర్జునుడు హస్థినకు వచ్చుట
  • 1.11 అర్జునుడు హస్థినలో ప్రవేశించుట
  • 1.12 యాగదీక్ష
  • 1.13 యాగములో జరిగిన దానధర్మాలు
  • 1.14 యాగానంతరం రాజులను సత్కరించుట
  • 1.15 అశ్వమేధయాగములో జరిగిన విశ్మయం
  • 1.16 బ్రాహ్మణుడి కథ
    • 1.16.1 యముని ప్రశంస
  • 1.17 యాగము జంతుబలి
  • 1.18 అగస్త్యుని యాగం
  • 1.19 దానము ధనము
  • 1.20 అగస్త్యుడు మునులకు ధైర్యము చెప్పుట
  • 1.21 ముంగిస పూర్వ కథ

Featured Post

RAMAYANAM - రామాయణము