Tuesday, July 4, 2017

ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము


- నారదుడు

ఆవిధముగా తపస్సు చేస్తున్నధృతరాష్ట్రుడి వద్దకు నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజాయనుడు అను మహర్షులు వచ్చారు. వారితో శతాయువు కూడా వచ్చాడు. కుంతి వారికి అతిథిసత్కారాలు చేసింది. తరువాత వారు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు వారికి సంభ్రమంతో నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించాడు. ధృతరాష్ట్రుడు వారికి దర్భాసనము ఇచ్చి కూర్చోమని చెప్పాడు. అప్పుడు నారదుడు " ధృతరాష్ట్రమహారాజా ! శతాయువు అని ఒక మహారాజు ఉండే వాడు. ఆయన తాత గారు సహస్రచిత్యుడు తన కుమారుడికి రాజ్యము ఇచ్చి అడవులకు వచ్చి ఇదే ప్రదేశములో తపస్సు చేసి ఇంద్రుడితో మిత్రుత్వము పొందాడు. ఆయన కాకుండా పృషధుడు, శైలాలయుడు, పురుకుత్సుడు ఇక్కడే తపసు చేసి స్వర్గలోకము పొందారు. నాకు వారందరూ తెలుసు. ఈ ఆశ్రమంలో తపసు చేయడము అందరికీ సాధ్యము కాదు. వ్యాసుడి దయ వలన నీకు ఆ అదృష్టము కలిగింది. ఇక్కడ తపసు చేయడము వలన నీవు కూడా వారి వలెనే ఉత్తమ గతులు పొదుతావు. నీ భార్య గాంధారి కూడా నిన్ను అనుసరించి వస్తుంది. మీకు సేవలు చేసినందుకు కుంతీదేవి కూడా ఉత్తమ గతులు పొంది తన భర్త పాండురాజును చేరుకుంటుంది. ఇప్పుడు పాండురాజు స్వర్గలోకములో ఉన్నాడు. సదా నిన్నే తలచుకుంటున్నాడు. యమధర్మరాజు ఆత్మగా కలిగిన విదురుడు కూడా యమధర్మరాజును చేరుకుంటాడు. సంజయుడు కూడా మిమ్ము అనుసరించి వస్తాడు " అని చెప్పాడు. ఆమాటలు విన్న ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతి ఎంతో సంతోషించారు. ఆ శతాయువు నారదుడిని " నారదమహర్షీ ! మీకు అన్నీ తెలుసు కదా ! నాకు ఒక సమాధానము చెప్పండి. మీరు కురుసార్వభౌముడికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పారు కదా అది ఎలాగో వివరించండి. అందుకు నారదుడు " శతాయువూ ! నేను ఒకసారి దేవేంద్రుడితో ముచ్చటిస్తున్న సమయములో ధృతరాష్ట్రుడి ప్రస్తావన వచ్చింది. ధృతరాష్ట్రుడి తీవ్రమైన తపసు గురించి దేవలోకము అంతా ప్రశంసించారు. అప్పుడు దేంద్రుడు " నారదా ! ఇంతటి తీవ్రమైన తపస్సు చేస్తున్న ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారితో సహా దేవలోకము చేరుకుంటాడు " అన్నాడు ఇంద్రుడు. ఆ సమయములో అక్కడ ఉన్న పాండురాజు అది విని చాలా సంతోషించాడు " అని నారదుడు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రాదులు సంతొషించారు. నారదాది మహామునులు అక్కడి నుండి తమ నివాసాలకు వెళ్ళారు.

పాండవులు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళుట

హస్థినాపురములో పాండవులు కూడా తనతల్లి కుంతీని తలచుకుని విచారిస్తున్నారు. పెదతండ్రి ధృతరాష్ట్రుడు, పెదతల్లి గాంధారి అడవిలో ఎన్ని కష్టాలు అనిభవిస్తున్నారో అని దుఃఖిస్తున్నారు. ముసలిప్రాయంలో సుఖపడవలసిన తరుణంలో అడవులలో కష్టములు అనుభవిస్తున్నారని కుమిలిపోతున్నారు. హస్థినాపుర ప్రజలు కూడా వారిని తలచుకుని ఎంతో బాధపడుతున్నారు. పాండవులు విదురుడిని, సంజయుడిని తలచుకుని కూడా దుఃఖిస్తున్నారు. రాచభోగములను వదిలి అడవులలొ ఆకులు అలములు తిని బ్రతకవలసిన అవరము ఏమున్నదని విలపిస్తున్నరు. వారినిచూసి ద్రౌపది, సుభద్ర కూడ బాధపడుతున్నారు. ఇక ఉండలేక పాండవులు అందరూ ధృతరాష్ట్రాదులను చూడడనికి అరణ్యముకు వెళ్ళడనికి నిశ్చయించుకున్నారు. ఆ సమయములో సహదేవుడు అన్నలకు నమస్కరించి " తల్లి కుంతీదేవిని చూడాలని నేను ముందె అనుకున్నను కాని మీరు ఏమి అంటారో అని చెప్పలేదు. మనతల్లి కుంతీదీవి తన బావ ధృతరాష్ట్రుడికి, తన అక్క గాంధారికి సేవలు చెయ్యడనికి వారితోపాటు అడవులకు వెళ్ళింది. అక్కడ నారచీరలు కట్టుకుని ఆకులు అలములు తింటూ ఎలా ఉందో అని నాకు బెంగగా ఉంది అన్నయ్యా ! అందుకని ఆలస్యము చెయ్యకుండా అరణ్యములకు వెళ్ళి వారిని చూసి రావడము మంచిది " అని అన్నాడు. ఆమాటలు విన్న ద్రౌపది కూడా " సహదేవుడు చక్కగా చెప్పాడు. మీరు తక్షణము కుంతీదేవిని చూడడానికి అడవులకు వెళ్ళడము సముచితము. కాని మరొక్క విషయము. మా కోడళ్ళము అందరమూ అత్తగార్లను చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నాము. మేమంతా ప్రయాణానికి సిద్ధముగా ఉన్నము " అన్నది. ధర్మరాజు అందుకు సమ్మతించాడు. ప్రయాణానికి తగిన సన్నహాలు చెయ్యమని ఆదేశాలు జారీ చేసాడు. హస్థినాపురప్రజలు ఎవరైనా తమతో రావచ్చని. అలావచ్చే వారికి తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశాలు ఇచ్చాడు. తాము లేని సమయములో నగరరక్షణార్ధము యుయుత్సుడిని, కృపాచార్యుడిని, ధౌమ్యుడిని నియమించాడు. అలా పాండవులు అడవులకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకున్నారు.

పాండవులు ఆశ్రమానికి చేరుట

భీముడు గజబలముతో, అర్జునుడు రధములతో, నకులుడు అశ్వబలముతో, సహదేవుదు కాల్బలముతో బయలు దేరారు. ద్రౌపది వంటి అంతఃపుర స్త్రీలు పల్లకీలలో, బంగారు రధములలో బయలుదేరారు. ధర్మరాజు 16 అశ్వములు కూర్చిన రధములో బయలుదేరాడు. అలా ధర్మరాజు గంగానదిని దాటి కురుక్షేత్రములో శతాయువు ఆశ్రమానికి సమీపములో ఉన్న ధృరాష్ట్రుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అందరూ తమ రధములు దిగి కాలినడకన ఆశ్రమము వద్దకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడ ఉన్న వారిని " ధృతరాష్ట్రుల వారు ఎక్కడ " అని అడిగాడు. వారు " యమునలో స్నానము చెయ్యడానికి వెళ్ళాడు " అని చెప్పారు. వెంటనే ధర్మరాజు మొదలైన వారు యమునా నదీతీరానికి వెళ్ళారు. అప్పటికే యమునలో స్నానము జపతపాదులు ముగించుకుని ధృతరాష్ట్రుడు మొదలగు వారు వారికి ఎదురు వచ్చారు. కుంతీదేవి పాండవులను చూసి పొదివిపట్టుకుని అందరినీ ఆశీర్వదించింది. సహదేవుడు కుంతీదేవి పాదాల మీదపడి ఏడ్చాడు. కుంతీదేవి గాంధారికి, ధృతరాష్ట్రుడికి తన కుమారులు వచ్చిన విషయము చెప్పింది. పక్కనే ఉన్న సంజయుడు పాండవులను చూసి సంతోషముగా పలకరించాడు. ద్రౌపది మొదలైన అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చి గాంధారికి, కుంతికి నమస్కరించారు. వారు అంతఃపురస్త్రీలను ఆదరించారు. తన వారు అందరూ చుట్టూ ఉండగా ధృతరాష్ట్రుడికి తాను హస్థినాపురములో ఉన్నట్లు అనిపించింది. అందరూ కలసి ఆశ్రమానికి వెళ్ళారు.

ధృతరాష్ట్రుడు ధర్మరాజును కుశలము విచారించుట

పాండవులు, ధర్మరాజు అరణ్యాలకు వచ్చారని తెలిసి చుట్టుపక్కల ఉన్న మునులు, ఋషులు వారిని చూడవచ్చారు. అక్కడకు వచ్చిన పాండవులు మునులకు పాదాభివందనము చేసారు. ఆ మునులు పాండవులను తమకు పరిచయము చెయ్యమని కోరారు. సంజయుడు " ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు, ఈయన నకులుడు, ఈయన సహదేవుడు, ఈమె ద్రౌపది. ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య అయిన సుభద్ర. ఉలూపి, చిత్రాంగదలు కూడా అర్జునుడి భార్యలు. ఈమె ఉత్తర. యుద్ధములో వీరమరణము పొందిన అభిమన్యుడి భార్య " తరువాత పాండవుల ఇతర భార్యలను కూడా వారికి పరిచయము చెసాడు. పరిచయాలు అయిన తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " ధర్మనందనా ! నీవు, నీ తమ్ములు, నీ మిత్రులు, బంధువులు అందరూ కుశలమే కదా ! నీ అంతరంగ పరిజనము సుఖముగా ఉన్నారా ! నీవు నీ పెద్దలు నడచిన మార్గమునే నడుస్తున్నావా ! దేవాలయములు, బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారములు మాన్యములు అన్యాక్రాంతము కాకుండా కాపాడుతున్నావా ! ప్రజకు బాధకలిగించని విధంగా పన్నులు విధించి కోశాగారాన్ని నింపుతున్నవు కదా ! నీవు నీ మిత్రులపట్ల స్నేహభావము శత్రువులపట్ల కాఠిన్యము ప్రదర్శిస్తున్నావు కదా ! నీకు మిత్రులు శత్రువులు కాక తటస్థముగా ఉన్న రాజుల పట్ల అప్రమత్తముగా ఉంటున్నావు కదా ! ఎందుకంటే వారు ఎప్పుడు ఏవైపు ఉంటారో తెలియదు కదా ! దేవతలను, పితృదేవతలను, అతిథులను నైవేద్యములు భోజనములు పెట్టి తృప్తిపరుస్తున్నావు కదా ! నీ రాజ్యములో నాలుగువర్ణాల వారు తమకు విధించిన వృత్తులు క్రమము తప్ప కుండా పాటిసున్నారు కదా ! నీ రాజ్యములో బాలలు, వృద్ధులు, స్త్రీలు, అందరూ, భయము లేకుండా జీవిస్తున్నారు కదా ! నీ ఆజ్ఞను పురప్రజలు కచ్చితముగా పాటిస్తున్నారు కదా ! " అని గబగబా ప్రశ్నించాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడిని కుశలము విచారించుట

ధృతరాష్ట్రుడు కుశలము విచారించిన దానికి బదులుగా ధర్మరాజు " పెదనానగారూ! మీరు నాకు చేసిన రాజనీతి ఉపదేశమువలన రాజ్యపాలన అంతా చక్కగా జరుగుతున్నది. కాని మా దిగులంతా తమరి గురించే. తమరి తపసు ఎలా కొనసాగుతుంది. మా తల్లి కుంతీదేవి తమకు సేవలు చేస్తున్నది కదా ! మా పెదతల్లి గాంధారి తపస్సు బాగా సాగుతుంది కదా ! విదురుల వారు ఇక్కడ లేరు ఎక్కడకు వెళ్ళారు ? నాకు వారిని చూడాలని ఉంది. నేను వెంటనే విదురుడిని చూడాలని అనుకుంటున్నను " అని అడిగాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " కుమారా ధర్మరాజా ! నేను ఇక్కడ బగానే ఉన్నాను. నా తపసు బాగా సాగుతుంది. కుంతి మాకు బాగా సేవలు చేస్తుంది. గాంధారి తపసు బాగా జరుగుతుంది. సంజయుడు కూడా తనకు తోచిన విధముగా తపసు చేస్తున్నాడు. కాని విదురుడు మాత్రము ఎక్కడ ఉంటాడో ఎక్కడ తిరుగుతుంటాడో తెలియదు. వేళకు ఆహారము తీసుకోడు. ఒక్కోసారి గాలి, నీరు మాత్రమే ఆహారముగా తీసుకుంటాడు. ఒక్కో సారి అది కూడా తీసుకోడు. చాలా విచిత్రముగా ప్రవర్తిస్తుంటాడు. మనుష్యులు తిరగడానికి భయపడే ఈ కారడవిలో ఒంటరిగా స్వేచ్ఛగా నిర్భయముగా సంచరిస్తుంటాడు. ఈ క్షణములో ఇక్కడ ఉంటాడు. మరు క్షణములో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు చూడు అని దూరముగ తిరిగుతున్న విదురుడిని ధర్మరాజుకు చూపించాడు ధృతరాష్ట్రుడు.

ధర్మరాజు విదురుని అనుసరించుట


విదురుడి నుండి తేజో రూపము ధర్మరాజులో ప్రవేశించుట
ధృతరాష్ట్రుడు చూపించిన వైపు చూసిన ధర్మరాజు అక్కడ విదురుడు ఉండడము చూసాడు. విదురుడి శరీరము అంతా మట్టి కొట్టుకుని ఉంది. దుస్తులు ధరించ లేదు. జుట్టంతా జడలు కట్టి ఉంది. ఆశ్రమ సమీపానికి వచ్చి అక్కడ అధికముగా జనము ఉండడము చూసి దూరముగా పోసాగాడు. ఇది చూసిన ధర్మరాజు " విదురా ! విదురా ! ఆగు. నేను ధర్మందనుడను నిన్ను చూడడానికి వచ్చాను " అని అరుస్తూ విదురుడి వెంట పరిగెత్తాడు. విదురుడు ఒక చెట్టూ కింద నిలబడ్డాడు. ధర్మరాజు పరుగున వెళ్ళి విదురుడి ముందు నిలబడ్డాడు. విదురుడు నిశ్చలంగా నిలబడ్డాడు. ధర్మరాజు " విదురా ! నేను ధర్మనందనుడను నిన్ను చూడ వచ్చాను. కళ్ళుతెరవండి " అని ప్రార్ధిచాడు. విదురుడు కళ్ళు తెరచి ధర్మరాజు వైపు తదేకంగా చూస్తూ తన యోగ బలముతో తన శరీరాన్ని విడిచి పెట్టాడు. విదురుడి ఇంద్రియములు, విదురుడి ప్రాణములు విదురుడిని విడిచి పెట్టి తేజో రూపములో ధర్మరాజులో ప్రవేశించాయి. విదురుడి పాంచభౌతిక శరీరము కింద పడిపోయింది. ధర్మరాజు అప్పుడు ఇనుమడించిన కాంతితో ప్రకాశించాడు. ఇది చూసిన ధర్మరాజు ఆశ్చర్యచకితుడై విదురుడికి అంత్యక్రియలు నిర్వర్తించాలని తలచాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినిపించింది " విదురుడు యతీశ్వరుడు. యతిధర్మము స్వీకరించాడు. అతడి శరీరానికి అగ్నిసంస్కారము చేయ కూడదు. కనుక అతడి శరీరాన్ని అక్కడే విడిచి పెట్టు " అని వినిపించింది. తరువాత ధర్మరాజ వడివడిగా నడుస్తూ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి జరిగినదంతా వివరించాడు. అది విని అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. తరువాత ధర్మరాజును చూడడానికి వచ్చిన తాపసులు అందరూ ధృతరాష్ట్రుడి వద్ద శలవు తీసుకుని అక్కడ నుండి వెళ్ళారు. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి " ధర్మనందనా ! నీకు ఫలములు, దుంపలు ఇస్తాను అహారముగా స్వీకరించు " అన్నాడు. అలాగే అని ధృతరాష్ట్రుడి ఆతిథ్యాన్ని ధర్మరాజు సంతోషంగా స్వీకరించాడు. అందరూ ధృతరాష్ట్రుడు భోజనముగా ఇచ్చిన ఫలములను, కందమూలములను సంతోషముగా స్వీకరించారు. ఆ రోజు రాత్రి ఆశ్రమంలో నిద్రించారు. తెల్లవారిన తరువాత కాలకృత్యములు, సంధ్యావందనము మొదలైన కార్యక్రమమాలు పూర్తిచేసుకున్న తరువాత భార్య ద్రౌపది, తమ్ములతో, పరివారముతో కలసి ఆశ్రమము అంతా తిరిగి చూసారు. తరువాత ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి అతడికి నమస్కరించి ఎదురుగా ఒక ఆసనము మీద కూర్చుని ఇష్టాగోష్ఠి జరిపాడు. ఆ విధముగా ధర్మరాజు ఒక మాసము కాలము తన పరివారముతో అరణ్యములో గడిపాడు.

వ్యాసుడు ధృతరాష్ట్రుడి ఆశ్రయముకు వచ్చుట

ఒకరోజు ధృతరాష్ట్రుడు, ధర్మరాజు శతాయువు మొదలైన మహా మునులతో కుర్చుని సంభాషిస్తున్న తరుణములో అక్కడకు వ్యాసుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించారు. ధృతరాష్ట్రుడిని చూసి వ్యాసుడు " ధృతరాష్ట్రా ! నీకు వనవాసము అలవాటు అయ్యిందా ! తపసు ఆచరిస్తున్నవా ! తాపసులకు అనువైన పనులను నియమము తప్పక ఆచరిస్తున్నవా ! నీ పుత్రులు మరణించిన శోకమును నీ మనసులో నుండి తొలగి పోయిందా ! నీ భార్య గాంధారి దుఃఖమును మరచి పోయిందా ! నీకు నీ భార్యకు పరిపూర్ణ జ్ఞానము లభించిందా ! కుంతీదేవి మీకుసేవలు చక్కగా చేస్తుందా ! మీరు అడవిలో ఉంటే తాను రాజభవనములో ఉండలేనని కుంతి మీతో అరణ్యాలకు వచ్చింది. ఆమె త్యాగము వర్ణనాతీతము కదా ! నీవు ధర్మరాజు మీద, భీమార్జున నకుల సహదేవుల మీద ప్రేమానురాగాలు కలిగి ఉన్నావా ! నీ మనసు నిర్మలంగా ఉన్నదా ! నీ మనసు నిర్మలమైనదా ! ధృతరాష్ట్రమహారాజా ! శత్రుత్వము, ఒకరికి అపకారము చేసే గుణమును కలకాలము నిలుపుకోకూడదు. మనసు సదా నిర్మలంగా నిలుపుకున్నప్పుడే సంపదలు కలుగుతాయి. విదురుడు శరీరము వదిలాడని విన్నాను. విదురుడు ఎవరో కాదు. అతడు సాక్షాత్తు యమధర్మరాజు. మాండవ్యముని శాపము కారణంగా మానవజన్మ ఎత్తాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అనుసరించి అంబిక యొక్క దాసికి పుత్రుడిగా శూద్రగర్భమున జన్మించాడు. అతడే కాదు ధర్మరాజు కూడా యమధర్మరాజు ప్రతిరుపమే. అందుకే విదురుడు యోగబలముతో తన అంశను ధర్మరాజులో కలిపాడు. అటువంటి దేవతా స్వరూపుడైన ధర్మరాజు చేత సేవలు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందా ! " అన్నాడు.

ధృతరాష్ట్రుడి వైరాగ్యము

ధృతరాష్ట్రుడు వ్యాసుడితో వినయముగా " వ్యాసమునీంద్రా ! ఈ వనవాసము నాకు ఏమాత్రము బాధకలిగించడము లేదు. నా దేహము చిత్తము తపసు చెసుకోవడములో నిమగ్నము అయ్యాయి. నేను కాని గాంధారి కాని పుత్రశోకమును ఇసుమంత కూడా అనుభవించడము లేదు. ఆ దుఃఖమును మేము ఎప్పుడో మరచిపోయాము. నాకు ధర్మరాజు మీద, అతడి తమ్ముల మీద నాకు అంతులేని అనురాగము ఉంది. ఈ ధర్మరాజు సాక్షాత్తు ధర్మదేవతా స్వరూపుడని నాకు తెలుసు. ఆ మాటలను నేను ఎప్పటికప్పుడు నా మాటలతో చేతలతో ధర్మరాజుకు తెలియజేస్తున్నాను. కుంతి రాజభొగములు వదులుకుని మా వెంట అరణ్యాలకు వచ్చి మాకు సేవలు చెయ్యడము మాకు ఎంతో ఆశ్చర్యము కలిగిస్తుంది. తమరి దయవలన మాకు అధ్యాత్మపరిజ్ఞానము, మానసిక నిర్మలత్వము కలిగాయి " అని వినయముగా చెప్పాడు. ఆ సమయములో ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపురకాంతలు వ్యాసుడి దర్శనము కొరకు వచ్చి ఆయనకు భక్తితో నమస్కరించారు. వారిని అందరిని వ్యాసుడు ఆశీర్వదించాడు. తరువాత ధృతరాష్ట్రుని చూసి వ్యాసుడు " మీ అందరికి మీ మనసులలోని చింతలను తీర్చి మంచిబుద్ధి కలిగించే తలంపుతో ఇక్కడకు వచ్చాను. మీకు ఇష్టము వచ్చినది అడగండి. మీ కోరికలు తీరుస్తాను " అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు వ్యాసుడిని కోరిన కోరిక

వ్యాసుడికి బదులిస్తూ ధృతరాష్ట్రుడు " వ్యాసమునీంద్రా ! తమరు మా మీద దయతో మా వద్దకు రావడమే మహాభాగ్యము. ఇంతకంటే మేము కోరేది ఏముంటుంది. మీ దయ మాకు లభించింది అంతకంటే అధికమైనది ఏమున్నది. మీరు మా వద్దకు రావడము మమ్ము ఆదరించడముతో నా జన్మ ధన్యము అయింది. నాకు ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందో లేదో అన్న భయము పోయింది. నేను ధన్యులలో ధన్యుడిని అయ్యాను. అయినా మీరు కోరమన్నారు కనుక అడుగుతున్నాను. నా కుమారుడు దుష్టస్వభావము కలవాడు. పాండవులు పాపస్వభావము లేనివారు, పుణ్యాత్ములు. అటువంటి వారిని నీ కుమారుడు సుయోధనుడు పరాభవించాడు. తన మిత్ర రాజులందరిని ససైన్యముగా యుద్ధ భూమికి బలి ఇచ్చాడు. భీష్మ, ద్రోణ, కర్ణులను బలి ఇచ్చి చివరకు తాను కూడా బలి అయ్యాడు. అధముడైన సుయోధనుడి కొరకు తమ భార్యా, బిడ్డలను, రాజ్యాలను వదిలి వచ్చిన నానా దేశాల రాజులకు ఎటువంటి సద్గతులు లభించాయి. మరణించిన తరువాత వారు పొందిన లోకములు ఏమిటి వారు ఏమయ్యారో తెలియజేయండి " అని అడిగాడు.

గాంధారి కోరిన కోరిక

గాంధారి వ్యాసుడికి నమస్కరించి " వ్యాసమునీంద్రా ! భారతయుద్ధము జరిగి 16 సంవత్సరాలు అయ్యాయి. ఈ 16 సంవత్సరాలు నా భర్త ధృతరాష్ట్రుడు కొడుకుల కొరకు పరితపిస్తూ ఉన్నాడు. ఆయనే కాదు నేను, ద్రౌపది, సుభద్ర, కుంతి, నా కోడళ్ళు నూరుమంది, యుద్ధములో చనిపొయిన భూరిశ్రవుడు, సొమదత్తుడు, బాహ్లికుడి భార్యలు యుద్ధములో చనిపోయిన తమ భర్తలు, కొడుకులు ఎలా ఉన్నారో అని పరితపిస్తున్నారు. వారిని చూడాలని ఆతురతగా ఉన్నరు. ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్నీ నీ యోగశక్తితో చూపగల సమర్ధులు మీరు. మాకు ఈ మాత్రము చుపలేరా ! కనుక మాకు మా బంధువులు ఎక్కడ ఉన్నారో చూపండి. మా దుఃఖములు తొలగించండి. ఇదే మా కోరిక " అని అందరి కోరికగా గాంధారి చెప్పింది.

కుంతీదేవి సందేహము

కుంతీదేవి వ్యాసుడికి నమస్కరించిన సమయములో కుంతీదేవికి తన కుమారుడు కర్ణుడు మనసులో మెదిలాడు. కుంతి మనసు బాధపడింది. అది వ్యాసుడు గ్రహించి " అమ్మా కుంతీదేవి ! గాంధారి తన కోరిక తెలియజేసింది. నీ మనసులో కోరిక కూడా తెలియజేస్తే అది కూడా తీరుస్తాను " అని అన్నాడు. కుంతీదేవి వ్యాసుడికి నమస్కరించి " వ్యాసమునీంద్రా ! నీవు దేవతలకు దేవతవు. నీవు నా భర్తకు తండ్రివి. నిన్ను మామామగారుగా పొందడము మా అదృష్టము. నా మీద దయ ఉంచి నా విన్నపము ఆలకించు. నేను కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని మా తండ్రి వద్దకు వచ్చాడు. ఆయనకు సేవలు చెయ్యడానికి నా తండ్రి నన్ను నియమించాడు. నా సేవలకు దుర్వాసుడు మెచ్చుకుని " నీకు ఒక వరము ఇస్తాను కోరుకో " అన్నాడు. నేను " మహానుభావా ! మీ దయ మా మీద ఉన్నది నాకు అంతే చాలు. నాకు ఇక ఏ వరమూ అవసరము లేదు " అని అన్నాను. దుర్వాసుడు " నేను వరము ఇస్తానని అన్నప్పుడు నీవు కాదని అనకూడదు. అడుగు " అన్నాడు. నేను భయపడి " నాకు పుత్రుడిని ప్రసాదించమని అడిగాను " అప్పుడు ఆ ముని నాకు ఒక మంత్రము ఉపదేశించి " ఈ మంత్రము మననము చేసి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు పుత్రుడిని ప్రసాదిస్తాడు. కుంతీ ! సాక్షాత్తు యమధర్మరాజు నీకు కుమారుడిగా జన్మిస్తాడు " అని చెప్పాడు. తరువాత దుర్వాసుడు వెళ్ళిపోయాడు. నేను బాల్యచాపల్యము చేత ఆ మంత్రమును పరీక్షించాలని ఏ దేవతను పిలవాలా అని ఆలోచిస్తుండగా ఆకాశములో సూర్యుడు కనిపించాడు. నేను మంత్రము మననము చేసి సూర్యదేవుడుని ప్రార్ధించాను. నేను ఇది కేవలము వినోదము కొరకు చెసాను. కాని సుర్యదేవుడు నిజంగానే నా ముందు ప్రత్యక్షమై " నీకు ఏమి వరము కావాలో కొరుకో " అని అడిగాడు. నాకు భయము వేసి చేతులు జోడించి " అయ్యా ! మీరు ఎందుకు వచ్చారు ? వెళ్ళిపోండి " అని ప్రార్ధించాను. అందుకు సూర్యదేవుడు " కన్యామణీ ! వృధాగా ఎవరినైనా ఆహ్వానించడము తప్పు. నీకు మంత్రము ఎవురు ఉపదేశించాడో నేను వారిని శపిస్తాను " అని కోపంతో అన్నాడు. నేను భయముతో వణికిపోయను. నా బాల్యచాపల్యము వలన నిరపరాధి అయిన గురుదేవులు దుర్వాసులవారు శాపగ్రస్థులు కావడము ఇష్టపడక " దేవా ! తమరు నా మీద దయ ఉంచి తమరితో సమానతేజస్సు కలిగిన పుత్రుడిని ప్రసాదించండి " అని కోరాను. అప్పుడు సూర్యభగవానుడు " కన్యామణీ ! నీకు నా తేజోప్రభావముతో నాతో సమానుడైన తేజస్వి కుమారుడిగా జన్మిస్తాఅడు. నీవు కన్యవు కనుక నీ కన్యాత్వము చెడకుండా వరము పుత్రుడు కలిగేలా వరము ప్రసాదిస్తున్నాను " అని పలికాడు. తరువాత సూర్యభగవానుడు వెళ్ళి పోయాడు. నేను గర్భవతిని అయ్యాను. తల్లి తంద్రులకు తెలియకుండా అంతఃపురములో పుత్రుడిని ప్రసవించాను. కాని కన్యను అయిన నేను లోకనిందకు వెరచి కుమారుడిని పెంచలేక నదిలో విడిచి పెట్టాను. ఇది నాకు ఒక కలగా జరిగి పోయింది. తమరు జ్ఞానులు కనుక జరిగినది అంతా గ్రహించారు. కాని ఆ పుత్రుడు నాకు కలిగిన విధానము నదిలో వదిలిన విధానము నాకు ఇంకా బాధ కలిగిస్తుంది. నేను చేసింది పాపమో కాదో నకు తెలియక పోయినా నేను నా కుమారుడిని నిర్ధయగా నదిలో వదిలి వేసినందుకు ఇప్పటికీ నా హృదయము దహించుకు పోతుంది. ఆ భయము ఇప్పటికీ నన్ను వదలడము లేదు కనుక మీరు నా భయాన్ని పోగొట్టండి. మరణించిన తన కుమారుడు ఎటువంటి ఉత్తమ గతులు పొందారో తెలుకోగోరుతున్న ఈ ధృతరాష్ట్రుడి కోరికను తీర్చండి. ఇదే మీరు నాకు ఇచ్చే కోరిక " అని అని వేడుకొన్నది.

కురుక్షేత్ర రహస్యము

వ్యాసుడు కుంతీదీవితో " కుంతీ ! నీవు చెప్పినది యదార్ధము. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. దేవతలు ఇలాంటి అద్భుతాలు చేస్తూ ఉంటారు. కర్ణుడు అలా జీవించవలసి ఉన్నది. కనుక నీవు కర్ణుడిని నదిలో వదిలి పెట్టావు. కర్ణుడి పుట్టుక వలన నీ కన్యాత్వము భంగము కాలేదు కనుక నీవు స్త్రీలలో అగ్రగణ్యురాలవు. నీవు నిష్కలంక చరితవు అనడములో ఎటువంటి సందేహము లేదు. గాంధారీ నీవు కోరినట్లు నీ కుమారులను, బంధువులను, సోదరులను, కుంతి తన కుమారుడైన కర్ణుడిని, మీ మీ బంధువులను చుస్తారు. ద్రౌపది, సుభద్ర, మిగిలిన స్త్రీలు వారివారి పుత్రులను, కుమారులను, మనుమలను చూస్తారు. నేను ఈ పని చేయడానికే ఇక్కడకు వచ్చాను. నీ యొక్క, నీ భర్త యొక్క, కుంతి యొక్క, చింతలు పోగొట్టడానికి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాను. కాని గాంధారీ ! నీవు నీ కుమారుల గురించి, మనుమల గురించి చింతించ వలదు. వారు యుద్ధము చెసి వీరమరణము పొందారు. భారతయుద్ధము ఇలా జరగాలని ఎప్పుడో నిర్ణయించబదినది. ఎందరో దేవతలు తమ తమ అంశలతో ఈ భూమిమీద జన్మించారు. నీ భర్త పూర్వజన్మలో ధృతరాష్ట్రుడు అనే గంధర్వరాజు. అతదు ఈ జన్మలో అంధరాజుగా జన్మించాడు. యమధర్మరాజు అంశతో పుట్టిన వాడు ధర్మరాజు. వాయుదేవుడి అంశతో జన్మించిన వాడు పుట్టిన వాడు భీముడు, అశ్వినీ దేవుల అంశతో జన్మించిన వారు నకులసహదేవులు నరనారాయణులలో నరుడు అర్జునుడిగాను నారాయణుడు శ్రీకృష్ణుడిగాను జన్మించారు. ద్వాపరుడు శకునిగాను, కలి అంశతో సుయోధనుడు జన్మించారు. రాక్షసాంశలతో దుశ్శాసనాది నీ మిగిలిన కుమారులు జన్మించారు. సూర్యుడి అంశతో కర్ణుడు, చంద్రుడి అంశతో అభిమన్యుడు జన్మించారు. అగ్నిలో నుండి పుట్టిన ద్రౌపదికి అన్నగా అగ్ని దేవుడే ధృష్టద్యుమ్నుడుగా జన్మించాడు. వాయుదేవుడి అంశతో అతడి సోదరుడు శిఖండి జన్మంచాడు. బృహస్పతి అంశతో కులగురువు ద్రోణుడు జన్మించారు. అష్టవసువులలో ఎనిమిదవ వసువు శాపగ్రస్థుడై దేవవ్రతుడుగా జన్మించి భీష్ముడుగా ఖ్యాతి గాంచాడు. రుద్రుడి అంశతో అశ్వత్థామ జన్మించాడు. మిగిలిన రాజులంతా దేవతాంశలతో రాక్షసాంశలతో జన్మించారు. కనుక వీరంతా కారణజన్ములు. వారి వారి జన్మసాఫల్యము పొందగానే ఈ లోకాన్ని విడిచారు. కనుక ఎవరు ఎవరినీ చంపలేదు. ఇక మీరందరూ నాతో గంగాతీరానికి వచ్చారంటే అక్కడ మీ మనసులోని దుఃఖాన్ని పోగొట్టేలా మీ మీ మిత్రులను, కుమారులను, పౌత్రులను, బంధువులను చూపిస్తాను " అన్నాడు. అందరూ వ్యాసుడితో గంగాతీరానికి చేరారు. వారితో శతాయువు వంటి మునులు కూడా ఆ ఆశ్చర్యము చూడడానికి గంగాతీరము చేరారు. అప్పటికి సాయంత్రము అయింది. బంధుదర్శనము రేపు చేద్దామని వ్యాసుడు చెప్పాడు. అక్కడకు చేరిన వారంతా ఆ రాత్రి తమ వారిని చూడాలన్న ఉత్సుకతతో శతసంవత్సరాల పాటు ఎదురు చూసినట్లు ఎదురు చూసారు.

వ్యాసుడు చేసిన అద్భుతము


చనిపోయిన వీరులను పర్లోకముల నుండి ఆవాహన్ చేస్తున్న వ్యాసుడు
మరునాడు ఉదయమే అందరూ నిద్రలేచి ప్రాతఃకాలము నిర్వర్తించ వలసిన విధులను నిర్వర్తించారు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీ, పాండవులు ఉత్సాహంతో వ్యాసుడి వద్దకు పోయి ఆయన చుట్టూ చేరారు. సకల జన్సమూహము జరగబోవు అద్భుతము తిలకించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వ్యాసుడు గంగానదిలో దిగి ఒక్క మునక వేసి పైకిలేచి చేతులు చాచి " అందరూ రండి " అని ప్రేమగా పిలిచాడు. ఇంతలో పెద్దగా చప్పుడు వినిపించింది. బిల బిల మంటూ నీళ్ళలో నుండి యుద్ధములో చనిపోయిన దుర్యోధనుడు, అతడి నూరుగురు తమ్ముళ్ళు, అతడియావత్తు కుంటుంబము, అభిమన్యుడు, అశ్వత్థామ చేతిలో హతమైన ఉపపాండవులు, మొదలగు పాండురాజు సంతతి వారు, కర్ణుడు, బాహ్లికుడు, మొదలైన కురుప్రముఖులు, ద్రుపదుడు, అతడి సంతతివారు, విరాటుడు, అతడి కుమారులు, శకుని అతడి అన్నదమ్ములు, అతడి కుమారులు, వీరందరికి ముందు భీష్ముడు, ద్రోణుడు ముందు నడువగా గంగానది నుండి దివ్యశరీరధారులై వెలుపలికి వచ్చారు. ధృతరాష్ట్రుడు అంధుడు కనుక వారిని చూడలేదు. వ్యాసుడు అతడికి దివ్యదృష్టి ప్రసాదించాడు. గాంధారి కూడా తన కళ్ళకు కట్టూకున్న వస్త్రమును తొలగించింది. అందరూ తమ పుత్రపౌత్ర సమేతంగా బంధువులను చూసారు. వారంతా నవ్వుతు తుళ్ళుతూ ప్రేమగా హాయిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వీరేనా యుద్ధములో ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకున్నది. సుయోధనుడిలో పుర్వము ఉన్న అభిమానము, క్రౌర్యము మచ్చుకు కూడాలేవు. అంతా ప్రేమమయముగా ఉన్నారు. అందరూ కలసి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చారు. వారిరాక అక్కడి వారికి ఆశ్చర్యము ఆనందము కలిగించింది. చిన్న వారందరూ తమకన్నా పెద్ద వారికి నమస్కారాలు చేస్తున్నారు. పెద్ద వాళ్ళు చిన్న వారిని ఆశీర్వదించారు. అంతా ఆనందంగా ఉన్నారు. అక్కడ దివ్యశరీరులు మానశరీరులు కలసిమెలసి ఉన్నారు. భీష్ముడు తనకంటే చిన్న వారిని, ద్రోణుడు తన శిష్యులను, తమ తమ తండ్రులను, తల్లులను, కొడుకులను, కూతుళ్ళను, మనుమలను, మనుమరాళ్ళను, బావలను, మరుదులను, అన్నలను, తమ్ములను, అక్కల్ను, చెల్లెళ్ళను, అత్తగార్లను, మామగార్లను, కోడళ్ళను, అల్లుళ్ళను తదితర బంధువులను కలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేశుకున్నారు. ఆ రోజంతా అందరూ పూర్వ వైరములు మరచి హాయిగా గంగాతీరములో గడిపారు.

దివ్యశరీరులకు వీడ్కోలు

మరునాడు ఉదయము దివ్యశరీరులు మానవశరీరుల వద్ద వీడ్కోలు తీసుకున్నారు. తిరుగుప్రయాణానికి సిద్ధము అయ్యారు. దివ్యసరీరులు తమ తమ లోకాలకు వెళ్ళడానికి గంగానదిలో దిగారు. వారికి వీడ్కోలు పలకేసమయములో వ్యాసుడు " చనిపోయిన మీ భర్తలను కలుసుకున్నరు. మీలో ఎవరైనా మీ భర్తలను అనుసరించి వారితో దివ్యలోకాలకు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళవచ్చు అలాంటి వారు వచ్చి గంగానదిలో మునగండి. వెంటనే యుద్ధములో చనిపోయిన వీరుల భార్యలు అందరూ ధృతరాష్ట్రగాంధఅరీల అనుమతి తీసుకుని తమ భర్తలను అనుసరించడానికి గంగానదిలో మునిగారు. వెంటనే వారంతా తమ మానవశరీరలను వదిలి దివ్యసరీరాలను ధరించి తమ భర్తలను అనుసరించారు. ఆ దృశ్యమును చూసిన వారు ఆశ్చర్యచకితులు అయ్యారు. ఆ విధముగా అక్కడ వారికి వ్యాసుడి దయ వలన బంధు సమాగమము జరిగింది. ధృతరాష్ట్రుడికి తిరిగి అంధత్వము ప్రాప్తించింది. శతాయువు మొదలైన మహామునులు ధృతరాష్ట్రుడి వద్ద శలవు తీసుకుని తమ నివాసములకు వెళ్ళారు. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో " కుమారా ! చూసావా నీ కుమారులు ఈ లోకముకంటే పై లోకాలలో సుఖముగా ఉన్నరు. ఇకనైనా వారి మరణము గురించి చింతించ వలదు. ధర్మరాజు ఇక్కడకు వచ్చి ఒక మాసము అయ్యింది. అతడు నీవు వెళ్ళమని చెప్పే వరకు వెళ్ళడు. అతడు వెళ్ళక పోతే అక్కడ రాజ్యపాలన కుంటువడుతుంది " అని వ్యాసుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు " మునీంద్రా ! అలాగే చెప్తాను. మీ దయ వలన నాకు కుమారులను చూసే భాగ్యము కలిగింది. కృతార్ధుడను అయ్యాను " అన్నాడు.

ధృతరాష్ట్రుడు ధర్మరాజును రాజ్యముకు మరలమని చెప్పుట

ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " నాయనా ధర్మతనయా ! నీవు ఇక్కడకు వచ్చి చాలారోజులు అయింది. అక్కడ రాజ్యపాలన కూడా చెయ్యాలి కదా ! అక్కడ ఉంటేనే కదా అను దినము రాచకార్యములు సక్రమంగా నడిచేది. నీవు రాజనీతి గురించి భీష్మాదుల వలన తెలుసుకున్నావు. నేను ప్రత్యేకముగా చెప్పవలసినది ఏమీ లేదు. నీవు రాజధానిలో లేని సమయము చూసి శత్రువులు విజృంభించే ప్రమాదము ఉంది. కనుక నీవు నీ తమ్ములను తీసుకుని వెంటనే హస్థినాపురము వెళ్ళు. నీ రాకవలన నా మనసులో ఉన్నబాధ మయము అయ్యింది. ఇప్పుడు నా మనసు ప్రాపంచక విషయముల మీదలేదు తపస్సు చేయాలని మాత్రమే ఉంది. మీరు ఇక్కడ ఉంటే నా తపసుకు భంగము కలుగుతుంది. కనుక నీవు నీ అన్నదమ్ములు, అంతఃపుర స్త్రీలు, పరివారముతో సహా రాజధానికి తిరిగి వెళ్ళండి " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " పెదనాన్నా ! మీరు చెప్పినట్లే చెస్తాను. రాజ్యభారము వహించడానికి భీముడిని, అర్జునుడిని, నకులసహదేవులను పంపి నేను ఇక్కడే ఉండి మీ పాదసేవ చేసుకుని తరిస్తాను. నాకు అనుమతి ఇవ్వండి " అన్నాడు. ఆ మాటలకు గాంధారి " కుమారా ! ధర్మనందనా ! నీవు ఇలా మాట్లాడ తగదు. నీవు ఇక్కడ సన్యాసదీక్ష తీసుకుని ఇక్కడ ఉంటే అక్కడ రాజ్యపాలన ఎవరు చేస్తారు. నీ యొక్క మా యొక్క పితరులకు ఎవరు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. కనుక నీవు రాజధానికి వెళ్ళడమే ఉత్తమము " అని గాంధారి పలికింది. ధర్మరాజు " అమ్మా ! మీరు ఎన్ని చెప్పినా ఇంత ప్రశాంతముగా ఉన్న ఈ అరణ్యమును విడిచివెళ్ళడానికి నా మనస్సు ఒప్పడము లేదు. నా మనసులో ఇదివరకటిలా రాజ్యకాంక్ష లేదు. అమ్మా ! అటు పాంచాలవంశము లోనూ ఇటు మత్స్య వంశము లోనూ స్త్రీలు తప్ప పురుషులు అందరూ యుద్ధములో మరణించారు. కేవలము స్త్రీలు మాత్రమే మిగిలారు. ఇదంతా నా వలనేకదా జరిగింది. ఆ వంశములో కేవలము ఒక్క పురుషుడు కూడా లేని రాజ్యము నాకు అవసరము లేదు. భారతయుద్ధము జరిగినప్పటి నుండి నా మనసు రాజ్యపాలన మీద లేదు తపసు మీదనే లగ్నము అయి ఉంది. నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించండి. మరేమీ మాట్లాడకండి " అన్నాడు. వెంటనే సహదేవుడు ఇలా అన్నాడు " అన్నయ్యా ! నేను కూడా ఇక్కడే ఉండి తపసు చేసుకుంటాను. నా తల్లి కుంతికి, మా పెదనాన ధృతరాష్ట్రుడికి, గాంధారికి సేవలు చేసుకుంటూ ఉంటాను. తమరు అంతఃపుర కాంతలను తీసుకుని హస్థినాపురము వెళ్ళండి " అన్నాడు. తన చిన్న కుమారుడు అన్న మాటలకు పొంగి పోయిన కుంతీదేవి సహదేవుడిని గుండెలకు హత్తుకుని " నాయనా ! సహదేవా ! మీరు అందరూ రాజధర్మములో సమర్ధులు. మీరు సమర్ధవంతముగా రాజ్యపాలన చేయాలి కాని మాకు సేవలు చేస్తూ అరణ్యములలో ఉండ తగదు. ఇంకో మాట మీరు ఇక్కడ ఉంటే మాకు తపోభంగం కావడము నిశ్చయము. మాకు ఏకాగ్రత కుదరదు. మీరు ఇక్కడ ఉండడము మాకు కీడే కాని మేలు కాదు. కనుక మీరందరూ హస్థినకు వెళ్ళండి. ఇది నా మాట ఒక్కటే కాదు. బావగారు ధృతరాష్ట్రుడు, అక్క గాంధారుల మాట కూడా ఇదే. కనుక మీరిక పోయి రావచ్చును " అని చెప్పింది. ఇక చెసేది ఏమీ లేక ధర్మరాజు పెదతండ్రి వద్ద శలవు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు భీమార్జున, నకులసహదేవులను ఆలింగనము చేసుకుని ఆశీర్వదించాడు. పాండవులందరూ ధృతరాష్ట్రుడి పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత పాండవులు పెదతల్లి గాంధారికి తల్లి కుంతీదేవికి నమస్కరించి వారి దీవెనలు పొందారు. తరువాత ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపుర కాంతలు కూడా అందరి వద్దా శలవు తీసుకున్నారు. అందరూ తిరిగి హస్థినాపురము వెళ్ళారు.

నారడుడి రాక

తరువాత కొన్ని దినములు గదచిన తరువాత ధర్మరాజు తన తమ్ములతో ఇష్టాగోష్టి జరుపుతున్న సమయములో అక్కడకు నారదుడు వచ్చాడు. పాండవులు నారదుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి ఉచితాసనము మీద కూర్చుండబెట్టారు. ధర్మరాజు నారదుడితో " మహానుభావా ! తమరు ఎక్కడి నుండి వచ్చారు. తమరి రాకకు కల కారణము ఏమిటి ? " అని అదిగాడు. నారదుడు " ధర్మనందనా ! నేను లోకసంచారము చెస్తూ ఎన్నో దేశాలు తిరిగాను. నిన్ను చూసి చాలారోజులు అయింది కనుక నిన్ను చూడాలని వచ్చాను. గంగానది వద్ద ఉన్న మునుల వలన మీ పెదనాన ధృతరాష్ట్రుడి తపసు గురించి విన్నాను " అన్నాడు. అది విని ధర్మరాజు " మహాత్మా ! మా పెద తండ్రిగారూ, మా పెద తల్లిగారూ, మా తల్లి కుంతి క్షేమమేనా ? వారికి ఏ ఇబ్బంది కలగ లేదు కదా ! " అని అడిగాడు. నారదుడు " ధర్మనందనా ! నీకు అన్ని విసయాలు సవిస్తరముగా చెప్తాను. సావధాన చిత్తుడవై విను. మీరందరూ ధృతరాష్ట్రుడి ఆశ్రమము నుండి వచ్చిన తరువాత కొంత కాలము బాగానే జరిగింది. ఒక రోజు మీ పెద తండ్రి ధృతరాష్ట్రుడు, పెద తల్లి గాంధారి, మీ తల్లి కుంతి, సంజయుడు అగ్నిహోత్రముతో సహా తపసు చెసుకోడానికి గంగానదీ తీరములో ఉన్న అరణ్యాలకు వెళ్ళారు. అక్కడ ధృతరాష్ట్రుడు కేవలము గాలి మాత్రమే తింటూ తపసు చేయసాగాడు. గాంధారి కూడా కేవలము నీరు మాత్రమే ఆహారముగా తీసుకుని తపసు చెయసాగింది. మీ తల్లి కుంతి మాసముకు ఒకసారి మాత్రము ఆహారము తీసుకుంటూ తపసు చేయసాగింది. సంజయుడు వారముకు ఒకసారి మాత్రము ఆహారము తిని తపసు చెయసాగాడు. ఇలా యాజకులు నిత్యము అగ్నిహోత్రము రగిలిస్తూ ఉండేవారు. ఒక్కోసారి ధృతరాష్ట్రుడు ఒంటరిగా తిరుగుతూ ఉండే వాడు. ఒక రోజు వారందరూ గంగానదిలో స్నానము చేసి వస్తున్న సమయములో అడవికి నిప్పు అంటుకుని దావానలము తీవ్రముగా వ్యాపించింది. అడవి అంతా చుట్టుముట్టింది. పక్షులూ జమ్తువులు కకావికలు అయిపోయాయి. గాంధారీ, ధృతరాష్ట్రులు నిరాహారముగా ఉన్న కారణాన అక్కడ నుండి వేగంగా పరిగెత్తి ఆ మంటల బారి నుండి ప్రాణములు రక్షించుకొన లేక అక్కడె నిలబడిపోయరు. ధృతరాష్ట్రుడు సంజయుడితో " సంజయా ! నీవు అగ్నిజ్వాలలు లేని చోటుకు పారిపో. పారి పోవడానికి మాకు శక్తిలేదు కనుక మేము రాలేము. నివు పారిపొయి నీ ప్రాణములు రక్షించుకో " అని చెప్పాడు. సంజయుడు " మహారాజా ! జీవితమంతా కలసి ఉన్నాము. ఇక మీదటకూడా అలాగే ఉంటాము. నా ప్రాణాలు కాపాడుకోవడానికి మిమ్ము వదిలి వంటరిగా వెళ్ళ లేను. ధృతరాష్ట్రుడు " సంజయా ! మేము తప్పించుకునే పరిస్థిలో లేము. కాని నీవు తప్పించుకు పారి పోగలవు. ఇది పాపము కాదు వెళ్ళిపో " అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎలాగైతేనేం ధృతరాష్ట్రుడు సంజయుడిని అక్కడ నుండి పారిపోవడానికి సమ్మతింపజేసాడు. తరువాత ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీ ఆయన పక్కనే కూర్చున్నారు. సంజయుడు ఆ మంటలు తప్పించుకుని హిమాలయాలకు పారిపోయాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీలను ఆ మంటలు చుట్టుముట్టాయి. చివరకు వారు ముగ్గురూ మంటలకు ఆహుతి అయ్యారు. ఇదంతా నాకు గంగాతీరాన ఉండే మునులు చెప్పారు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీలు అడవులకు వెళ్ళడము. మీరు వారిని చూడడానికి రావడము. తిరిగి మీరు హస్థినకు వెళ్ళడము. ఆ మునుల వలన తెలుసుకున్నాను. తరువాత నేను ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీల మృతదేహాలను కూడా చూసాను. ఈ విషయము నీకు చెప్పి పోదామని వచ్చాను. వారంతా ఉత్తమలోకాలకు వెళ్ళారు. నీవిక బాధపదవలసిన అవసరము లేదు " అన్నాడు.

పాండవులు పెద్దలకు తిలోదకాలు సమర్పించుట

నారదుడు చెప్పిన విషయము విని ధర్మరాజు భీమార్జున నకులసహదేవులు దుఃఖముతో రోదించసాగారు. ఈ విషయము అంతఃపుర స్త్రీలకు తెలిసి అంతా శోకసముద్రములో మునిగి పోయారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి దావానలములో ఆహుతి అయ్యారు అన్న విషయము హస్థినాపురము అంతా వ్యాపించింది. జనులంతా తండోపతండాలుగా రాజప్రాసాదానికి రాసాగారు. అంతా తమమహారాజు మరణానికి ధుఃఖిస్తున్నారు. తన ఏడుపుని దిగమింగుకుని ధర్మరాజు నారదుడితో " మునీంద్రా ! ఎవరి చావు ఎక్కడ వ్రాసి పెట్టి ఉందో ఎవరికి తెలుసు. మేమంతా ఉండగా మా పెదనాన కురువృద్ధడు దిక్కు లేని చావు చచ్చాడు. నూరుగురు కుమారులు ఉండీ, వెయి ఏనుగుల బలము ఉండీ కూడా ధృతరాష్ట్రుడు నిస్సహాయంగా అగ్నికి ఆహుతి అయ్యారు. పట్టు పానుపు మీద హాయిగా నిద్రిస్తూ వంధిమాగధుల కైవారాలతో నిద్ర లేవవలసిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు కటిక నేల మీద పడి ఉండి నక్కలు తోడేళ్ళ ఊళలు వింటూ దిక్కు లేకుండా పడి ఉన్నాడు. నారదా ! గాంధారి తన భర్తతో మరణించింది. ఆమె గురించి చితించవలసిన పని లేదు. కాని మా తల్లి కుంతీదేవి మేమంతా రాజభోగాలు అనుభవిస్తుంటే అడవులకు వెళ్ళి అక్కడ అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె గురించే నా దుఃఖం అంతా. ఆమె కడుపున పుట్టిన భీమార్జునులు, నేను, మాద్రీ సుతులు నకులసహదేవులు ఇంతమంది కుమారులను పెట్టుకుని మా తల్లి అనాధగా దిక్కులేని చావుచచ్చింది. ఆమె గురింది దుఃఖించకుండా ఎలా ఉండగలను చెప్పు. నారదా ! తమరికి తెలుసు కదా ! ఖాండవనదహన సమయములో అర్జునుడు అగ్నిదేవుడికి చేసిన సాయము మరచి అగ్నిదేవుడు మా తల్లిని ఎలా దహించాడు. ఆఅగ్నిదేవుడికి కృతజ్ఞత లేదా ! అగ్నిదేవుడు ఇంత కృతఘ్నుడా ! మునీంద్రా ! ఇక ఎంత వగచి ఏమి ప్రయోజనము. మా పెదనాన, పెదతల్లి, మా తల్లి అగ్నికి ఆహుతి అయ్యారు కదా ! వారికి మేము ఏమి చెయ్యాలి చెప్పండి " అని అడిగాడు. నారదుడు " ధర్మనందనా ! నీకు మరో విషయము చెప్పాలి. ఇది జరిగిన ముందు రోజు ధృతరాష్ట్రునికి విరక్తి అధికమై అగ్నికి ప్రత్యేక పూజలు చేసి అగ్నిదేవుడి వద్ద శలవు తీసుకున్నాడు. ఆ అగ్నిని వేల్చిన ఋత్విక్కులు అగ్నికి అక్కడ ఉద్వాసన చెసి అగ్నిని అక్కడే వదిలి వెళ్ళారు. ఆ అగ్ని కార్చిచ్చుగా మారి ఆ అడవిని దహించి వేసింది. ఆ అగ్నిలో వారు ఆహుతి అయ్యారు. కనుక నీవు, నీ తమ్ములు, ద్రౌపది మొదలైన అంతఃపుర కాంతలు అందరూ గంగానదికి వెళ్లి స్నానము చేసి మీ పెదనాన ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతీదేవికి తిలొదకాలు ఇవ్వండి " అన్నాడు. వెంటనే పాండవులు, అంతఃపురకాంతలు, పురజనులు అంతా గంగాతిరానికి వెళ్ళి గంగా స్నానము చేసి తిలోదకాలు ఇచ్చారు. పదిరాత్రులు గంగాతీరమున కుటీరాలు నిర్మించుకుని అక్కడే నివసించారు. సమర్ధులైన వారిని పిలిపించి ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీదేవిల అస్థికలు సేకరించి వాటిని గంగానదిలో నిమజ్జనము చేసారు. శ్రాద్ధకర్మలు శ్రద్ధగా చేసారు. దానధర్మాలు విరివిగా చేసాడు. వారికి ఉత్తమలోక ప్రాప్తికి కావలసిన అన్ని కార్యక్రమములను శ్రద్ధగా చేసారు. శ్రాద్ధకర్మలు జరిగిన 12 రోజులు నారదుడు అక్కడే ఉండి అన్ని సక్రమంగా జరిపి ధర్మరాజును అతడి తమ్ములను ఆశీర్వదించాడు. తరువాత ధర్మరాజు తన తమ్ములతో అంతఃపురకాంతలతో హస్థినాపురము చేరాడు. ఈ విధముగా ధృతరష్ట్రుడు భారతయుద్ధము తరువాత 15 సంవత్సరములు హస్థినాపురములోను 3 సంవత్సరములు అరణ్యములోను గడిపి పరలోకము చేరుకున్నాడు " అని భారతకథను వైశంపాయనుడు జనమేజయుడికి వినిపించాడు.

మౌసల పర్వము

  • 1 మునులు యాదువంశమును శపించుట
  • 2 ద్వారకలో దుశ్శకునాలు
  • 3 సముద్రుడికి జాతర
  • 4 యాదవులలో చెలరేగిన స్పర్ధ
  • 5 సాత్యకి కృతవర్మను వధించుట
  • 6 యాదవకులములో అంతర్యుద్ధము
  • 7 బలరాముని పరలోక యాత్ర
  • 8 శ్రీకృష్ణుడి నిర్యాణము
  • 9 శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట
  • 10 దారుకుడు హస్థినకు చేరుట
  • 11 అర్జునుడి ద్వారక ప్రవేశము
  • 12 వసుదేవుడు విలపించుట
  • 13 వసుదేవుడు కృష్ణుడిని గురించి చెప్పుట
  • 14 అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్థినకు ఆహ్వానించుట
  • 15 వసుదేవుడు తనువు చాలించుట
  • 16 అర్జునుడు యాదవులకు దహన సంస్కారములు చేయించుట
  • 17 అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు వెదకుట
  • 18 అర్జునుడు శ్రీకృష్ణుడికి బలరామునికి దహనక్రియలు నిర్వహించుట
  • 19 యాదవుల హస్థిన ప్రయాణము
  • 20 హస్థినలో యాదవులకు తగిన ఏర్పాటు చేయుట
  • 21 శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎరిగించుట
  • 22 అర్జునుడు వ్యాసుడిని దర్శించుట

స్వర్గారోహణ పర్వము


-మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయనుడితో " మునివర్యా ! మాతాతలైన పాండవులు స్వర్గారోహణ చేసిన తరువాత. ఏలోకాలకు వెళ్ళారు ఎక్కడ ఉన్నారు తెలియజేయండి " అని అడిగాడు.

స్వర్గములో సుయోధనుడిని చూసి ధర్మరాజు కలత చెందుట

వైశంపాయనుడు " తన బంధువులను చూడవలెనని పట్టుబట్టిన ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నించాడు. వెంటనే ఒక దూతను పిలిచి " ఈయన ధర్మరాజు. ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకు వెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనము మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో " దేవమునులారా ! ఈ సుయోధనుడు పరమ లోభి. ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధముకు పిలిపించి వారి రధ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేసాడు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తునాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా ! వీలులేదు నన్ను నా తమ్ములు భీమార్జున నకుల సహదేవులు ఉన్నచోటికి తీసుకు వెళ్ళండి " అని వెనకకు తిరిగాడు.

నారదుడు ధర్మరాజును సమాధానపరచుట

అప్పుడు నారదుడు నవ్వి " ధర్మరాజా ! సుయోధనుడు లోపభూయిష్తమైన ఈ శరీరమును వదిలి పెట్టాడు. ఇప్పుడు దివ్యదేహముతో ప్రకాశిస్తునాడు. అందు వలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు. ఇతడు యుద్ధములో మరణించాడు. యుద్ధములో రాజులను చంపాడు. అది పాపము ఎలా ఔతుంది. భూలోకములో చేసిన పాపములు ఇక్కడ ఎందుకు తలచడము. ఇది పుణ్యలోకము. ఇక్కడ ఏ పాపము అంటదు. ధర్మరాజా ! నీవు స్వర్గలోకానికి వచ్చి కూడ మానవ సహజమైన ఈర్ష్యా ద్వేషాలను వదలక ఉన్నావు. ఇక్కడ వాటికి తావు లేదు. కనుక నీలోని కోపతాపములను, ఈర్ష్యా ద్వేషములను వదిలి సమత్వమును పొందుము. నీవు ఆడిన జూదము దాని వలన కలిగిన దుఃఖమును మరచి ప్రశాంత చిత్తుడవై ఉండు " అన్నాడు. ధర్మరాజు " మహర్షీ ! పుణ్యము చెసిన వారికి స్వర్గము పాపులకు నరకము ప్రాప్తిస్తుంది అని అంటారు కదా ! ఈ సుయోధనుడు పాపి. ఇతడు ఇతరులకు అపకారము తప్ప ఉపకారము ఎన్నడూ చేయ లేదు. ఇతడు కురువంశ వినాశకుడు. రాజులందరిలో అధముడు. వీడు స్వర్గములో ఉండడమా ! ఇతడు దేవతలకు పూజనీయుడా ! పోనీలే అది మీ స్వర్గవాసుల ఇష్టము. అతడు స్వర్గ సుఖములు అనుభవించనీ. నన్ను నా తమ్ములు, నా భార్య, నా కుమారుల వద్దకు తీసుకు వెళ్ళండి. నేను వారిని చూడాలి.

ధర్మరాజు కర్ణుడుదిని చూడడానికి తహతహలాడుట

ధర్మరాజు తిరిగి " మహాఋషులారా ! నేను తిలతర్పణము ఇస్తున్న సమయములో మా తల్లి కుంతీదేవి నా వద్దకు వచ్చి కర్ణుడు తన కుమారుడు అని తెలిపింది. అతడి జన్మరహస్యము కూడా చెప్పింది. అప్పటి నుండి నాకు కర్ణుడిని చూడాలన్న కుతూహలము కలుగుతుంది. ఆ పరాక్రమవంతుడు మేము కలసిన మమ్ము ఇంద్రుడు కూడా జయించ లేడు కదా ! కర్ణుడు మా అన్న అని తెలియక నేను కర్ణుడిని చంపమని అర్జునుడికి చెప్పి పాపము చేసాను. ఆ పాపము నన్ను ఇంకా వెన్నంటి వేధిస్తుంది. కర్ణుడిని చూడడానికి నా మనసు తహతహలాడుతుంది. దయచేసి నన్ను మా అన్న కర్ణుడి వద్దకు తీసుకు వెళ్ళండి. అది కాక నాకు ద్రుపదుడు, యుధామన్యుడు, విరాటుడు, శంఖుడు మొదలగు వారిని చూడాలని ఉంది. నేను మొదటి నుండి నా తమ్ములను, నా భార్యను చూడాలని అడుగుతున్నాను. ఒక వేళ వారు స్వర్గములో లేకుంటే వారులేని స్వర్గములో నేను ఉండలేను. వారికి లేని స్వర్గసుఖములు నాకు అవసరము లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గము. నన్ను త్వరగా అక్కడకు తీసుకువెళ్ళండి " అన్నాడు.

ధర్మరాజు నరకములో ప్రవేశించుట


ధర్మరాజుకు నరకమును చూపించున్న దేవదూత
ధర్మరాజు కోరిక విన్న దేవదూత " మహాత్మా ! నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతి ఇచ్చాడు. నేను అలాగే చేస్తాను. మీరు నాతో రండి " అన్నాడు. ధర్మరాజును దేవదూత తీసుకువెడుతున్న దారి అంతా దుర్గంధభూయిష్టముగా ఉంది. దారిలో వెండ్రుకలు, ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి. దోమలు, ఈగలు ముసురుతూ ఉనాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ శావాల కొరకు కాకులు తిరుగుతున్నాయి. శవాల మీది నుండి వచ్చే దుర్గంధము ముక్కులను బద్దలు కొడుతుంది. వారు వైతరణీ నదిని సమీపించారు. నదిలోని నీరు సలసలా కాగుతున్నాయి. దని ఒడ్డున సూదులవలె, కత్తుల వలె ఉన్న ఆకులు ఉన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ నానావిధములైన పాపములకు శిక్షను అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు " ఇంకా ఎంతదురము వెళ్ళలి " అని అడిగాడు. దేవదూత " ఇదంతా దేవతల ఆధీనములో ఉంది. మనము రావలసిన ప్రదేశముకు వచ్చాము " అన్నాడు. కాని ధర్మరాజుకు పాపులు అక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండడానికి మనస్కరించ లేదు. అందుకని అక్కడ నుండి వెళ్ళి పోవాలని అనుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి. " ఓ పుణ్యచరితా ! నీ రాకవలన మా పాపములు అన్నీ పోయాయి. నీ శరీరము నుండి వచ్చే పరిమళము వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా సుఖముగా ఉంది. నిన్ను చూడడము వలన మా బాధలు దూరము అయ్యాయి. నీవు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషము కలిగించు " అన్న మాటలు వినిపించాయి. అప్పుడు ధర్మరాజు " ఆహా ! వీరు ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తునారో కదా ! " అనుకుని అక్కడే నిలబడ్డాడు. ధర్మరాజు పెద్దగా " మీరు ఎవరు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తునారు? " అని అడిగాడు. వారు " మేము ఎవరమో కాదు. నీ అన్నదమ్ములము కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులము. మేమంతా ఇక్కడ నరకబాధలు అనుభవిస్తునాము " అని వినిపించింది. మరొకపక్క నుండి " మహారాజా ! నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడిని, మేము ద్రౌపది పుత్రులము " అన్న మాటలు వినిపించాయి.

ధర్మరాజు తనవారిని నరకములో చూసి కలత చెందుట


ధర్మరాజు తనవారిని నరకములో చూసి కలత చెందుట
ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై " అయ్యో భగవంతుడా ! మా తమ్ములకు, ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? వారు ఏపాపము చేసారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తునారు. ఇంద్రుడు దేవతలు పరమనీచులు కాకపోతే నా తమ్ములకు, ద్రౌపదికి ఇలంటి నరకబాధలు అనుభవించ వలసిన అగత్యము ఏమిటి. ఇక్కడ ధర్మము లేదు, న్యాయము లేదు. లేకున్న నా తమ్ములు, ద్రౌపది సామాన్యమైన వారా ! వారు పరమ నిష్ఠాగరిష్ఠులు, సత్యము, దయ కలిగిన వారు, దానశీలురు, యజ్ఞయాగములు చేసిన వారు. అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? కనీసము జీవితములో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధనుడికి స్వర్గసుఖాలా ! అతడి చుట్టూ అంతమంది దేవకాంతలా ! అంతులేని భోగాలా ! కనిసము వీసమెత్తైనా పాపము చెయ్యని నా వారికి నరకయాతనలా ! దైవము న్యాయము, ధర్మము మరచినట్లు ఉంది " అని చింతించసాగాడు. తిరిగి " ఇదంతా నిజమా ! లేక దేవతల మాయా ! నా భ్రాంతియా ! లేక నేను కలగంటున్నానా ! " అని పరిపరి విధముల చింతించసాగాడు. ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపము వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి " ఓ దేవదూతా ! ఇక నాకు నీ సాయము అవసరము లేదు. నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు. నా తమ్ములు, నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పని లేదు. వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా మాటలు యధాతధంగా ఇంద్రుడికి చెప్పు " అని అన్నాడు.

ఇంద్రాదులు ధర్మరాజు వద్దకు వచ్చుట

దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను, దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు. యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు. వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణము అంతా మారి పోయింది. నరకయాతనలు లేవు, దుర్గంధము లేదు. శవాలగుట్టలు మాయమయ్యాయి. ఎముకల పోగులు లేవు. పాపుల ఆక్రందనలు ఆగిపోయాయి. పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు. వైతరుణీనది జాడలులేవు. పిల్లతెమ్మెరలు వీచసాగాయి. అహ్లాదకరమైన చల్లని వాతావరణముతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొన్నది. ఆ సమయములో ధర్మరాజు వద్దకు రుద్రులు, గంధర్వులు, వసువులు, ఆదిత్యులు, నాగులు, సిద్ధులు ఆనందముగా వచ్చారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో " నీవు నరకములో ఉండడము ఏమిటి ? నిన్ను తీసుకు పోవడానికి దేవతలు అందరూ ఇక్కడకు వచ్చారు. నీకు శాశ్వతబ్రహ్మలోక పదవి లభించింది. నీలోని వికారములు అన్నీ నశించాయి. నీకు సద్భుద్ది కలిగింది. ధర్మనందనా ! ఒక్కమాట. రాజ్యంతే నరకం ధృవం అని వేదములు చెప్తున్నాయి. అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు. అందుకే నీకు నరకద్వార దర్శనము అయ్యింది. ధర్మనందనా ! పుణ్యము, పాపము ఒక దానిని వెన్నంటి ఒకటి ఉంటాయి. పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము, పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది. కొద్దిగా పుణ్యము చేసుకున్న వాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడా స్వర్గసుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలము నరకవాసము చెయ్యాలి. కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తరువాత స్వర్గసుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి. ఇది ఇక్కడి నియమము. నీవు చెసిన కొద్ది పాపముకు నీకు నరకద్వార దర్శనము అయింది. ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్థాపము వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ తమ్ములు భీమార్జున నకులసహదేవులకు ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. వారందరూ తమతమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నీవు వారిని అందరిని చూసి సంతోషించు. నీవు చేసిన స్వల్ప పాపముకు నీకు నరకద్వార దర్శనము నీవు చేసిన రాజసూయయాగము, అశ్వమేధయాగము, యజ్ఞములు, దానములు, ధర్మములు, వ్రతములకు నీకు ఉత్తమలోకప్రాప్తి కలిగింది. నీ పుర్వీకులు అయిన మాంధాత, నలుడు, హరిస్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమలోకాలు పొందారో అటువంటి ఉత్తమలోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గరుదులు, గంధర్వులు, నాగులు వచ్చారు అని వారిని అందరిని చూపాడు. ధర్మరాజు వారందరికి వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి " ధర్మరాజా ! ఇది ఆకాశగంగ. పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నీవు ఇందులో స్నానము చేసి దివ్యదేహముతో ప్రకాశించు " అన్నాడు.

యమధర్మరాజు ధర్మరాజుతో మాటాడుట

తరువాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి " కుమారా ! నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో, రెండవసారి మేరుపర్వతములో కుక్క రూపములోమూడోసారి ఇక్కడా నిన్ను పరీక్షించాను నీ మనసుచలించ లేదు. నీ మనసులో శమము, దమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి. నీవు జితేంద్రియుడవు. నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి. నీవు గెలిచావు. ఇక నీవు స్వర్గసుఖములు అనుభవించ వచ్చు. రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలసి నీకు నరకద్వార దర్శనము కలిగించాము. నీవు విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది ఆక్రందనలు అన్నీ మేము కల్పించినవి. నీ తమ్ములు, కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చెరుకున్నారు. ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునుగు. నీకు ఈ సంసారభావము నేను, నీవు అన్న భేదభావము నశిస్తాయి. మానవసహజమైన రాగముద్వేషము, సుఖముదుఃఖము నశిస్తాయి. దైవత్వము సిద్ధిస్తుంది. తరువాత స్వర్గసుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందంగా చూడు. ఆలస్యము ఎందుకు ఆకాశగంగలో స్నానము చెయ్యి " అని చెప్పాడు. తరువాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశగంగ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానము చేసాడు. వెంటనే తన మానుష శరీరమును వదిలి దివ్యశరీరము ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైరము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసి పోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్ని వలె ప్రకాశించ సాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుడిని, యమధర్మరాజును స్తుతించి వారితో కలసి ముందుకు సాగాడు.

ధర్మరాజు స్వర్గలోకములొ

స్వర్గములో అర్జునుడు చతుర్భుజములు, శంఖచక్రములు, గదాయుధములతో ప్రకాశిస్తున్న శ్రీమహావిష్ణువును సేవిస్తునాడు. ద్వాదశాదితుల పక్కన పదమూడవ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుడిని, మరుత్తులలో ఒకడుగా ప్రకాశిస్తున్న భీమసీనుడిని, అశ్వినీదేవతల వలె ప్రకాశిస్తున్న నకులసహదేవులను చూసాడు. కొంచము దూరములో మహారాణిలా దివ్యకాంతితో వెలిగి పోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో " దేవా ! ఈమె ఎవ్వరు ? " అని అడిగాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! ఈమె మహాలక్ష్మి ద్రుపదుడికి కుమార్తెగా అయోనిజగా జన్మించింది. మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవకాంతగా అవతరంచింది. ఆ పక్కన ఉన్న గంధర్వులు ఆమె కుమారులు ఉపపాండవులు. ఆ పక్కన ఉన్న వాడు గంధర్వరాజైన ధృతరాష్ట్రుడు. ఇతడు మీ పెదనాన ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తరువాత అయా అంశలతో యాదవవీరులైన సాత్యకి, కృతవర్మ అక్కడ స్వర్గ సుఖములు అనుభవిస్తున్నారు అదిగో చూడు. ధర్మనందనా ! సుభద్ర గర్భమున చంద్రాంశతో జన్మించిన వాడు అభిమన్యుడు రెండవ చంద్రుడివలె ప్రకాశిస్తునాడు చూడు " అని చెప్పాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానము చూపి ఇంద్రుడు " ధర్మనందనా ! అటు చూడు మీ తండ్రి పాండురాజుతన భార్యలైన కుంతి, మాద్రిలతో ఇటు వస్తునాడు " అని చూపించాడు. తరువాత అష్టవసువులలో ఒకడైన భీష్ముడిని, బృహస్పతి పక్కన కూర్చుని ఉన్న ద్రోణుడిని చూసాడు. తరువాత గంధర్వ, యక్ష, గుహ్యక గణములతో కలసి ఉన ద్రుపదుడిని, విరాటుడిని, వారి అన్నదమ్ములను, కుమారులను, బంధువులను, కేకయ, పాండ్యరాజులను నానాదేసముల నుండి వచ్చి మహాభారతయుద్ధములో ప్రాణములు విడిచిన రాజులను చూపించి " వీరంతా ఉత్తమ లోకాలు పొందారు " అని వివరించి చెప్పాడు.

వైశంపాయనుడు చెప్పిన దేవ రహస్యము

స్వర్గముములో కురుక్షేత్ర సమరములో మరణించిన రాజులను చూపించిన విషయము విన్న జనమేజయుడు వైంపాయనుడిని " మునివర్యా ! తమరు అందరి విషయములు చెప్పారు. వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంత కాలము స్వర్గములో ఉంటారు ? శాశ్వతముగా స్వర్గములోనే ఉండిపోతారా ! లేక కొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవజన్మ ఎత్తుతారా ! వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! అది దేవరహస్యము. దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు. అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిసాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ కుబేరలోకములోకి చేరారు. పాండురాజు కుంతీ, మాద్రిలతో కలసి స్వర్గములో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలసి పోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలసి పోయాడు. శకుని ద్వాపరుడిలో కలసి పోయాడు. సుయోధనుడు కొంత కాలము స్వర్గములో స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత నరకలోకములో తాను చెసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గసుఖములు, పాపకార్యములకు తగినంత నరకయాతనలు అనుభవించి తరువాత రాక్షస గణములలో ఐక్యము అయ్యారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలసి పోయాడు. భీష్ముడు అష్టవసువులలో చివరి వాడు అయి వసువులలో చేరాడు. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు వీరందరూ వీశ్వదేవతలలో కలసి పోయారు. ధృష్టద్యుమ్నుడు అగ్నిలో కలసి పోయాడు. అప్పటికే ధర్మరాజు శరీరములో కలసి పోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలసి పోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారము బలరాముడు అనంతుడిలో కలసి పోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలు సలిపిన 16 వేల గోపికలు సరస్వతీ నదిలో స్నానము చేసి అప్సరసలుగా మారి మహావిష్ణువును సేవిస్తునారు. శ్రీకృష్ణుడితో సహగమనము చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలసి పోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! మహాభారత యుద్ధములో చనిపొయిన వారు నేను చెప్పిన వారు చెప్పని వారు అందరూ వారి వారి అంశలు అయిన దేవతా, రాక్షస, యక్ష, గుహ్యక, గంధర్వ బృందములో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! కురుపాండవుల విషయములతో కూడిన ఈ భారత కథను ఉపకథా సహితముగా నికు వివరించాను. సర్పయాగ సందర్భములో భగవానుడైన వెదవ్యాస మహర్షి అనుమతితో నెను చెప్పిన ఈ భారత కథను నీవు శ్రద్ధతో విని జ్ఞానము సముపార్జించావు " అని అన్నాడు వైశంపాయనుడు.

భారతకథ

జనమేజయుడు చేసిన సర్పయాగములో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారము వైశంపాయనుడు ఈ మహాభారతకథను జనమేజయుడికి వివరించాడు. ఆ సమయములో అక్కడ ఉన్న వ్యాసమహర్షి శిష్యుడు ఉగ్రశ్రవసుడు ఈ భారత కథను ఆమూలాగ్రము విన్నాడు. నైమిశారణ్యములో శౌనకమహర్షి తలపెట్టిన సత్రయాగ సందర్భములో శౌనకాది మహర్షులు ఉగ్రశ్రవసుడిని పుణ్యకథను వినిపించమని కోరడముతో ఉగ్రసవసుడు తాను విన్న మహాభారతకథను రసవత్తరంగా వారికి వినిపించాడు. తరువాత వారితో " మహామునులారా ! నేను జనమేజయుడు సర్పయాగము చేసిన సందర్భములో వైశంపాయన మహర్షి ఈ భారత కథను వినిపించగా దానిని ఆమూలాగ్రము విన్నాను. ఆ కథను నేను మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. సత్రయాగము ఆస్థీకుని ప్రయత్నము వలన ఆగిపోయింది. సర్పయాగమును ఆపి సర్పములను రక్షించిన ఆస్తీకుడిని జనమెజయుడు పుజించి తగు విధముగా సత్కరించాడు. ఋత్విక్కులకు కానుకలను ఇచ్చాడు. తరువాత వేదవ్యాస మహర్షుని, వైశంపాయనుడిని వేదోక్తముగా సత్కరించిన తరువాత జనమేజయుడు హస్థినాపురము ప్రవేశించాడు. ఋషులారా ! ఈ భారతకథను రచించిన వేదవ్యాస మహర్షి ఋషులలో అగ్రగణ్యుడు సత్యము గ్రహించిన వాడు, వేదములే రూపుగా ధరించిన వాడు, విజ్ఞానఖని, బ్రహ్మజ్ఞాని, శౌచము, శాంతి, క్షమ, దాంతి, తపోనిష్ట కల వాడు. ధర్మములను ఉపదేశించదములో దిట్ట. పాండవుల కీర్తి ప్రతిష్తలను లోకముకు చెప్పడానికి, అనేకమంది రాజుల గురించి సామాన్య జనులకు తెలియ పరచడానికి, దేవదేవుడైన వాసుదేవుడి లీలా విశేషములను వివరించడనికి, సర్వ దేవజాతులు ఎలా పుట్టారు ఎలా లీనము అయ్యారు అన్న విషయము సామాన్యులకు అందించడనికి, సకల విధమైన ధర్మములను లోకానికి అందించడానికి పంచమ వేదముగా పేరు తెచ్చుకున్న ఈ భారతకథను రచించాడు. ఈ ఇతిహాసమును వ్యాసుడు మూడు సంవత్సరముల కాలము రచించాడు. ధర్మ, అర్ధము, కామము, మోక్షము అను పురుషార్ధములలో చెప్పబడిన ధర్మసుక్ష్మములు ఈ మహాభారత కథలో సమూలముగా చెప్పబడ్డాయి. ఈ మహాభారతకథలో చెప్పబడిన ధర్మాలు లోకములో ఎక్కడైనా చెప్పబడి ఉండ వచ్చు కాని ఈ కథలో చెప్పని ధర్మాలు లోకములో చెప్పలేదని వ్యాసుడు స్వయముగా చెప్పాడు. సర్పయాగ సందర్భములో వ్యాసుడి ఆదేశానుసారము వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన ఈ భారత కథను ఆమూలాగ్రము విని నేను ధన్యుడిని అయ్యాను. ఆ వెదవ్యాసుడి కరుణ వలన మీ అందరి ఆదరాభిమానాలతో నేను మీకు వినిపించాను.

ఫలములు

ఈ పుణ్యకథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తిశ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరకు మోక్షము పొందుతారు. వారు చేసిన బ్రహ్మహత్యా మొదలగు ఘోరపాపములు సహితము నశిస్తాయి. దైవకార్యములు, పితృకార్యములు జరిగే సమయములో ఈ మహాభారతకథను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పుణ్యకార్యములు చెసిన ఫలితము దక్కుతుంది. ఈ మహాభారతకథను పూర్తిగా వినకున్నా ఏ కొంచము అయినా చెవిసోకినా వారి సమస్త పాపములు నశిస్తాయి. మునులారా ! ముందు ఈ భారతకథను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. అందుకని క్షత్రియులు ఈ ఇతిహాసమును వింటే వారికి సదా జయము కలుగుతుంది. కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు. మునులారా ఈ భారత ఇతిహాసములో అత్యంత ముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసమును వింటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వ్యాసమహర్షి కరుణతో ఎవరికి ఈ ఇతిహాస అర్ధము స్పురిస్తుందో అట్టి వాడికి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, సకలశాస్త్రములు అవగతమౌతాయి. జనులు అతడిని కీర్తిస్తారు. అతడికి బ్రహ్మజ్ఞానము అలవడుతుంది " అని సుతుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు తృప్తికలిగేలా మహాభారతకథను చెప్పాడు. అది విన్న శౌనకాది మునులు పరమానందము చెంది ఉగ్రశ్రవసుడిని ఘనముగా సత్కరించాడు.

హరివంశ పర్వము

  • 1 చంద్రుడి జననము
  • 2 దేవదానవయుద్ధము
  • 3 భోజవంశము
  • 4 అంధకవంశము
  • 5 వృష్థి వంశము
  • 6 శ్యమంతకమణి కథ
  • 7 భూదేవి విలాపము
  • 8 సముద్రుడు శంతనుడు
  • 9 శ్రీకృష్ణుడి అవతారము
  • 10 పూతన వధ
  • 11 శకటాసుర సంహారము
  • 12 శ్రీకృష్ణుడి బాలక్రీడలు
  • 13 యమళార్జున భంజనము
  • 14 బృందావనముకు తరలుట
  • 15 కాలకలి నిర్మూలనము
  • 16 నీలాపరిణయము
  • 17 కాళీయమర్ధనము
  • 18 బలరాముని ప్రభావము
  • 19 బలదేవుడు
  • 20 గోవర్ధనోద్ధరణ
  • 21 రాసక్రీడలు
  • 22 వృషభాసుర వధ
  • 23 కంసుడి కలత
  • 24 కేశి సంహారము
  • 25 మధురకు పయనము
  • 26 మధురలో ప్రవేశించుట
  • 27 కుబ్జను అనుగ్రహించుట
  • 28 కంసుడి విల్లును విరచుట
  • 29 కంసుడి జన్మరహస్యము
  • 30 కంస వధ
  • 31 ఉగ్రసేనుడికి పట్టముగట్టుట
  • 32 గురుకుల వాసము
  • 33 జరాసంధుడి దండయాత్ర
  • 34 నృగాలవాసుదేవుడి సంహారము
  • 35 జరాసంధుడి దందయాత్ర
  • 36 కాలయవనుడి అంతము
  • 37 ద్వారక నిర్మాణము
  • 38 రుక్మిణీ కల్యాణము
  • 39 ప్రద్యుమ్నుడు
  • 40 శుభాంగి స్వయంవరము
  • 41 అనిరుద్ధుడి పరిణయము
  • 42 బలరాముడి జూదము
  • 43 నరకాసుర వధ
  • 44 సురకన్యల విముక్తి
  • 45 పారిజాతాపహరణము
  • 46 ఘంటాకర్ణ విముక్తి
  • 47 పౌండ్రుని వధ
  • 48 శివకేశవ సమాగమము
  • 49 బాణాసుర వృతాంతము
  • 50 శివకేశవ సంగ్రామము
  • 51 ఉషాపరినయము
  • 52 వరుణుని జయించుట

మహాప్రస్థానిక పర్వము


-శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్యాణము చెందారు. యాదవులు అందరూ మరణించారు. అర్జునుడిని వ్యాసుడు మహాప్రస్థానికి సిద్ధమవమని చెప్పాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! అన్నిభూతములను కాలుడు కాల్చకమానడు. మనము కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నము అయింది. మనము కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలము సమీపించింది. నీ అభిప్రాయము అదేకదా ! " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! మీరు చెప్పినది నిజము. కాలానికి సాటి కాలమే. మనము కూడా కాలముతో పయనించక తప్పదు " అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సదేవులను పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారము తెలిపారు.

ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట

ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురుసామ్రాజ్యానికి పట్టభిషిక్తుడిని చేసాడు. పరిక్షిత్తుని యువరాజుగా పట్టభిషిక్తుడిని చేసాడు. యుయుత్సుడికి రాజ్యపాలన గురించిన విషయములు అన్నీ వివరించాడు. తరువాత సుభద్రతో " అమ్మా సుభద్రా ! ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనమడు వజృడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవవంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి " అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తరువాత భారతయుద్ధములో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేసాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిగా చేసాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తరువాత హస్థినాపురప్రజలతో ఒక సభ ఏర్పాటు చేసాడు.

పాండవులు మహాప్రస్థానికి తరలుట

ధర్మరాజు హస్థినాపుర వాసులను పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్థినాపుర వాసులతో " హస్థినాపుర వాసులారా ! మా అయిదుగురికి బదులుగా అభిమన్యుడి కుమారుడిని మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానము చూపండి " అని చెప్పాడు. హస్థినపుర వాసులకు పాండవులు వెళ్లిపోతున్నారన్న విషయము అర్ధము అయింది. వారు " మహారాజా ! ఏమిటిది ? మమ్ములను ఇలా వదిలి పెట్టి వెళ్ళడము మీకు ధర్మమా ! నీవు ప్రేమమూర్తివి, కరుణామూర్తివి అంటారే ఇదేనా మీ కరుణ. మేమంతా నిన్ను చూసుకుని కదా బ్రతుకుతున్నది. మీరు లేక మేము ఎలా బ్రతుకగలము. మమ్ము వదిలి వెళ్ళడము భావ్యమా " అని ప్రార్థించారు. వారిని ధర్మరాజు అనునయ వాక్యాలతో అనునయించాడు. తరువాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకుని నారచీరలను, నారవస్త్రాలను, జింకచర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేసారు. తరువాత అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనము చేసారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడువగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. హస్థినాపురవాసులు వీధులకు అటూ ఇటూ నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్థినాపురవాసులకు జూదములో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యము గుర్తుకు వచ్చింది. వారి వెంట యుయుత్సుడు సైన్యముతో నడుస్తున్నాడు. అతడి వెంట విచారవదనముతో పరీక్షిత్తు నడుస్తున్నాడు. అందరూ హస్థినాపుర పొలిమేరలకు వచ్చారు. ధర్మరాజు హస్థినాపుర వాసులతో ఇక ఆగమని చెప్పాడు. వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేసారు. పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు. యుయుత్సుడు, పరీక్షిత్తు వెనుదిరిగి హస్థినాపురము చేరుకున్నారు. అర్జునుడి భార్య ఉలూపి తన పుట్టిల్లు అయిన నాగలోకము చేరింది. చిత్రాంగధ తన కుమారుడు అయిన బభ్రువాహనుడి వద్దకు చేరింది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారము హస్థినాపుర బాధ్యతలను స్వీకరించారు.

అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట


గాండీవమును విసర్జించుచున్న అర్జునుడు
పాండవులు ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగానదిని దాటి తూర్పు సముద్రతీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై " అర్జునా ! శ్రీకృష్ణుడి సుదర్శనచక్రము ఎప్పుడో వైకుంఠము చేరింది. నీవు ఇంకా ఈ గాండీవము వదలక ఉన్నావు. దుష్టసంహారణార్ధము నేను ఈ గాండీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకు ఇచ్చిన కార్యము నెరవేరింది కనుక దీనిని ఇక వరుణదేవుడికి అప్పగించు " అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాండీవమునకు నమస్కరించి దానిని సముద్రపునీటిలో వదిలాడు. గాండీవము వరుణుడిని చేరింది. తరువాత అగ్నిదేవుడు అదృశ్యము అయ్యాడు.

పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట


నడవలేక పడిపోయిన ద్రౌపది
పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడ నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్రతీరము చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారక సమీపముకు వెళ్ళారు. తరువాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్పర్వతము చేరుకున్నారు. అక్కడ నుండి ప్రయాణించి మేరుపర్వతము చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగసమాధిలో ఉన్నారు కనుక వారికి నడకశ్రమ తెలియడము లేదు. ముందుగా ద్రౌపదికి యోగసమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేలమీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో " భీమా ! పాంచాలరాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్య యంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటే అధికమైన ప్రేమ, అనురాగము. ఈమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడి పోయింది " అన్నాడు. భీముడు ద్రౌపది వంక చూసాడు. అప్పటికి ఆమె మరణంచింది. ధర్మరాజు నిర్వికారముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడము చూసిన భీముడు ధర్మరాజుతో " అన్నయా ! సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారము అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గచరితుడు. అతడిలా పడిపోవడానికి కారణము ఎమిటి ? " అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు " అతడికి తన కంటే ప్రాజ్ఞుడు ఈ లోకములోనే లేడన్న గర్వము ఉంది. ఆ గర్వాతిశయముతోనే అతడు కింద పడిపోయాడు " అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు సహదేవుడిని కూడా ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రము వారిని వదలకుండా వెన్నంటింది. మరి కొంత దూరము పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేక పోయాడు. ధర్మరాజుతో " అన్నయ్యా ! నకులుడు కూడా పడిపోయాడు. అతిసుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, సుగుణాలఖని, ధైర్యవంతుడు ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాశిపోసినట్లు ఉండే వాడు. ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు ? " అని అడిగాడు. ధర్మరాజు " భీమా ! నువ్వు చెప్పినది నిజమే ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకములో తన కంటే అందగాడు లేడని గర్వము ఉంది. ఆ కారణముగా ఇతడిలా పడి పోయాడు " అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వికారముగా ముందుకు సాగాడు. కుక్క కూడా వారిని వదలక వెంబడిస్తుంది. అప్పటివరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తరువాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కిందపడి మరణించారు. అది చూసి భీముడు " అన్నయ్యా ! అర్జునుడు కూడా పడి పోయాడు. ఎన్నడూ అబద్ధము ఆడి ఎరుగడు, అతడికి ఉన్న సుగుణములు, సౌర్యపరాక్రమములు ఎవరికి లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణము ఎమిటి ? " అని అడిగాడు. ధర్మరాజు కొంచెము ఆలోచించి " అవును ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వముకు మూల కారణము. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చ లేదు. అది నెరవేర్చ లేదు. అందుకే ఆడినమాట తప్పిన వాడు అయ్యాడు. అందుకే అతడికీ దురవస్థ " అని అర్జునుడిని అక్కడే మిగిలిన వారిలా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయము పట్టుకుంది. భయం భయంగా నడుస్తూనే నేలమీద కూలిపోతూ " ధర్మరాజా ! నేనుకూడా పడిపోయాను. నాలో ఉన్నలోపము ఏమిటి ? నాకు తెలియచెప్పు " అని అడిగాడు. ధర్మరాజు " భీమసేనా నీవు అత్యుత్తమ గధాదారివి, పరాక్రమవంతుడవు కాని తిండి పోతువు. అనవరంగా మాట్లాడతావు. నికు అనవసరమైన విషయాలన్ని మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురవస్థ " అని నిర్వికారముగా భీముడిని వదిలి ముందుకు సాగాడు. కుక్క మాత్రము అతడిని వెన్నంటి వెళుతూనే ఉంది.

ఇంద్రుడు ధర్మరాజును కలయుట


తంతో పాటు వాచ్చి కుక్క కోసం స్వర్గమును వద్దనుచున్న ధర్మరాజు
అలా ధర్మరాజు నిర్వికారముగా ముందుకు పోసాగాడు. కోత దూరము పొయిన తరువాత మహేంద్రుడు ధర్మరాజు ముందు రథముతో వచ్చి నిలిచాడు. ఇంద్రుడిని చూసి ధర్మరాజు వినయముతో నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథము మీద కూర్చోమని చెప్పాడు. ధర్మరాజు బాధతో " మేము అయిదుగురు అన్నదమ్ములము ద్రౌపది బయలుదేరాము. నా నలుగురు తమ్ములు ద్రౌపది నేలకూలారు. వారు లేనిది నేను ఎక్కడకు రాను. వారు కూడా నాతో వచ్చేలా చెయ్యి " అన్నాడు. అప్పుడు ఇంద్రుడు " ధర్మనందనా ! వారందరూ వారివారి శరీరమును వదిలిపెట్టి స్వర్గలోకము చేరుకున్నారు. వారిని అందరిని నీవు స్వర్గలోకములో చుస్తావు. వారు మానవ దేహాలను వదిలారు కనుక తిరిగి ఆ దేహమును పొందడము అసాధ్యము కనుక నాతో నీవిప్పుడు స్వర్గానికి రా " అని అన్నాడు. ధర్మరాజు ఇంద్రుడితో " మహేంద్రా ! మేము హస్థినాపురము నుండి బయలుదేరినప్పటి నుండి ఈ శునకము నన్ను వెన్నంటి వస్తుంది. దీనిని వదిలి పెట్టి నేను మాత్రము స్వర్గానికి ఎలా రాగలను కనుక నాతో పాటు ఈ శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకుని వెడదాము " అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వి " ధర్మనందనా ! అది ఎలా సాధ్యము. నీ వెంట వచ్చిన కారణముగా శునకానికి ఎలా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. దీనిని స్వర్గానికి తీసుకు పోకూడదు కనుక నీవు మాత్రము రధము ఎక్కు " అన్నాడు. ధర్మరాజు " మహేంద్రా ! లోకపాలకుడవు అయిన నీకు తెలియనిది ఏమున్నది. ఈ శునకము అత్యంత భక్తిశ్రద్ధలతో నన్ను వెన్నంటి వచ్చింది. ఇప్పటి వరకు నన్ను వెన్నంటి వచ్చి నన్ను సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రము ఎలా స్వర్గానికి రాగలను. నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రము స్వర్గ సుఖములను అనుభవించగలను " అని అన్నాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! కుక్కలకు స్వర్గలోక ప్రాప్తి లేదు. నీకు శుభము కలుగు తున్నప్పుడు దీనిని వదిలి పెట్టడము న్యాయమే. ఇందులో దోషము ఏమి లేదు " అన్నాడు. ధర్మరాజు " భక్తితో సేవించిన వారిని వదిలిరావడము బ్రహ్మహత్యాపాతకముతో సమానము అంటారు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడివి కనుక నీకు చెప్పే పని లేదు కదా ! " అన్నాడు. కనుక కేవలము స్వర్గసుఖాలను అనుభవించడానికి నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి స్వర్గానికి రాజాలను " అన్నాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! ఏదైనా వ్రతము చెసేవాడు కుక్కను ముట్టుకుంటే వ్రతభంగము అయినది అనుకుంటాడు. మహాపాపమని అనుకుంటాడు. అలాంటి సమయాన నీవు ఈ కుక్క గురించి ఎందుకు పట్టుబడుతున్నావు. దీనిని వదిలి వచ్చి హాయిగా స్వర్గసుఖములను అనుభవించు. అయినా ధర్మనందనా ! నీ భార్య ద్రౌపది, నీ నలుగురు తమ్ములు నీ కళ్ళ ఎదుటే మరణించినా చలించని వాడివి ఈ కుక్కను మాత్రము ఎందుకు వదలనంటున్నావు ? " అని అడిగాడు. ధర్మరాజు " మహేంద్రా ! నీవు సకలలోకపాలకుడవు. అన్ని ధర్మములు ఎరిగిన వాడవు, ధర్మదేవతవు. నీతో వాదించగల అర్హత కలిగిన వాడిని కాదు నేను. అయినా నాకు తోచిన ధర్మము నేను చెప్తాను. నాకు తోచిన ధర్మము చెప్పడము తప్పు కాదు. ద్రౌపది, భీమార్జున, నకులసహదేవులు నా కళ్ళెదుటే చనిపోయారు. వారి కొరకు ఎంత ఏడ్చినా వారు తిరిగిరారు. అది లోకథర్మము జగమెరిగిన సత్యము. మమ్ము వెన్నంటి వచ్చిన ఈ కుక్కమాత్రము మరణించ లేదు. కనుక దీనిని వదిలిరావడము ధర్మమా ! శరణు వేడిన వారిని వదలడము, మంచి మిత్రుడికి ద్రోహము చెయ్యడము, స్త్రీలను చంపడము, బ్రాహ్మణుల ధనము అపహరించడము వలన ఏ పాపము వస్తందో నన్ను నమ్మి వెన్నంటి వచ్చిన ఈ శునకమును వదిలిన ఆ పాపము వస్తుంది. అమ్త పాపమును నేనిప్పుడు ఎలా మూట కట్టుకోను. నెను అనుభవిమ్చ వలసిన స్వర్గ సుఖముల విషయము వదిలి పెట్టండి. నేను ఇంత వరకు సంపాదించిన పుణ్యము ఈ శునకమును ఆదరంచిన కారణముగా నశించినా ఫరవా లేదు నాకు స్వర్గసుఖములు వద్దు. నన్ను ఇలా వదిలిపెడితే ఈ అరణ్యములో తపసు చేసుకుంటాను. నాకిది చాలు " అన్నాడు.

యమధర్మరాజు

అప్పటి వరకు శునకరూపములో ఉంది ధర్మరాజు చెప్పేది వింటున్న యమధర్మరాజు తన నిజరూపమునుదాల్చి అతడి ముందు సాక్షత్కరించాడు. ధర్మరాజు సంభ్రమాశ్చర్యాలతో తన ముందు నిలచిన యమధర్మరాజుకు నమస్కరించాడు. యమధర్మరాజు " నాయనా ధర్మతనయా ! నీ పుణ్యచరిత్ర, నీ ధర్మనిరతి, నిర్మలమైన బుద్ధి, భూతదయ, నీ దయాగుణము నాకు ఎంతగానో నచ్చాయి. భూలోకములో నీ వంటి వారు ఉంటారా అని నాకు సందేహము కలుగుతుంది. ఇందుకు ముందు నీవు ద్వైతవనములో ఉండగా నీ యొక్క ధర్మనిరతిని నేను పరీక్షించాను. నీకు గుర్తుందా ! నీ తమ్ములు నీటి కొరకు వచ్చి నా ఆధీనములో ఉన్న సరసులో నా ప్రశ్నలకు సమాధానము చెప్పకనే దిగి స్పృహతప్పి పడిపోయారు. అప్పుడు వారిని వెతుకుతూ నీవు వచ్చావు. అప్పుడు నేను వారిలో ఒకరిని బ్రతికిస్తాను నీకు ఎవరు కావాలో కోరుకొమ్మని అన్నప్పుడు నీవు చెప్పిన సమాధానము నాకు ఎంతగానో నచ్చింది. కుంతీ తనయులలో నీవు బ్రతికి ఉన్నావు కనుక మాద్రీ తనయులలో నకులుడిని బ్రతికించమని అడిగావు. అలా ధర్మనిరతిని ప్రదర్శించడము లోకములో ఎక్కడైనా ఉంటుందా ! నిన్ను విశ్వాసముతో వెన్నంటి వచ్చిన కుక్క కొరకు సాక్షాత్తు ఇంద్రుడు దిగి వచ్చి రథము ఎక్కమని చెప్పినా నిరాకరించిన నీ ధర్మనిరతి కొనియాడ తగినది. నీకు సాటి అయిన వాడు స్వర్గలోకములో లేడు. నీ ధర్మనిరతిని ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంక నీవు ఈ శరీరముతో సిద్ధ పధములో పుణ్యలోకాలకు వెళ్ళు. అక్కడ నీకు సకలసౌఖ్యాలు లభిస్తాయి " అని అన్నాడు యమధర్మరాజు. ఆ సమయములో అక్కడకు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు పరమానందముతో వచ్చారు. వారంతా ధర్మరాజును ఇంద్రుడు తీసుకు వచ్చిన రధము మీద కూర్చుండబెట్టారు. రధము కదిలింది. వారంతా వెంటరాగా ధర్మరాజు పుణ్యలోకాలకు వెళ్ళాడు.

నారద మహర్షి ధర్మరాజును స్వర్గములో కలయుట

స్వర్గలోకములో ధర్మరాజును చూసి నారదమహర్షి " దానాలతో, ధర్మాలతో, తపసులతో పుణ్యాన్ని అర్జించిన వారిని గురించి విన్నాను. కాని ధర్మరాజు కీర్తి కాంతుల ముందు అవి వెల వెల పొతున్నాయి. ఆ రాజులలో ఎవ్వరూ కూడా శరీరముతో స్వర్గానికి రాలేదు. ఆ గౌరవము కేవలము ధర్మరాజుకు మాత్రమే దక్కింది " అని ధర్మరాజును ప్రశంసించాడు. ధర్మరాజు నారదుడిని చూసి " నారదమునీంద్రా ! నేను నా తమ్ములను చుసే వరకుీ సుఖాలు అనుభవించ లేను. ఇంతకూ వారు ఎక్కడ ఉన్నారు. అది ఎంత దుర్గమమైనా నాకు చూపించండి. నన్ను అక్కదకు తీసుకు వెళ్ళండి. నాకు నా తమ్ములను యుద్ధములో నా కొరకు పొరాడిన రాజులను చూడాలన్న కోరికగా ఉంది " అని అడిగాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! నీవు చేసిన పున్యకార్యముల వలన నీవు సశరిరముగా స్వర్గానికి రాగలిగావు. స్వర్గానికి వచ్చినా నీవు మానవమాత్రులకు ఉండే స్నేహభావాన్ని వదలలేక ఉన్నావు. అదుగో అటుచూడు దేవఋషులు, గంధర్వులు, దేవతలు ఎంత ఆనందముగా ఉన్నారో. వారిని చూసి అయినా నీ మనసులో దుఃఖమును వదిలి సుఖముగా ఉండు. నీవు చేసిన పుణ్యవిశేషము చేతనువ్వు పొందిన ఈ పదవిని నీ తమ్ములు ఎలా పొందగలరు. మానవలోకమును వదిలి దేవలోకము వచ్చిన నీవు మానవ సంబంధాల కొరకు ఇలా తపించడము తగనిపని. ఇప్పుడు నువ్వు దివ్యరూపములో ఉన్నావన్న విషయము మరువ వద్దు " అన్నాడు. ఆ మాటలు ధర్మరాజును సమాధానపరచ లేకపోయాయి. " మహేంద్రా ! మీరు ఎంతచెప్పినా నేను నా సొదరులను బంధు మిత్రులను ద్రౌపదిని చూడకుండా ఉండలేను. ఒక్కసారి వారిని అందరిని చూసిన తరువాత మీరు చెప్పినట్లు చేస్తాను. నాకు అదే ఆనందాన్ని కలుగచేస్తుంది " అని అన్నాడు. " అని వైశంపాయనుడు జనమేజయుడికి మహాప్రస్థాన కథ వినిపించాడు.

స్వర్గారోహణ పర్వము

  • 1 స్వర్గములో సుయోధనుడిని చూసి ధర్మరాజు కలత చెందుట
  • 2 నారదుడు ధర్మరాజును సమాధానపరచుట
  • 3 ధర్మరాజు కర్ణుడుదిని చూడడానికి తహతహలాడుట
  • 4 ధర్మరాజు నరకములో ప్రవేశించుట
  • 5 ధర్మరాజు తనవారిని నరకములో చూసి కలత చెందుట
  • 6 ఇంద్రాదులు ధర్మరాజు వద్దకు వచ్చుట
  • 7 యమధర్మరాజు ధర్మరాజుతో మాటాడుట
  • 8 ధర్మరాజు స్వర్గలోకములొ
  • 9 వైశంపాయనుడు చెప్పిన దేవ రహస్యము
  • 10 భారతకథ
  • 11 ఫలములు

Monday, July 3, 2017

మౌసల పర్వము


-ధర్మరాజుకు పట్టాభిషేకము జరిగి 35 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత 36వ సంవత్సరములో కొన్ని ఉత్పాతాలు జరిగాయి. ఉదయము పూట తీవ్రమైన గాలులు వీచాయి, ఇసుక తుఫానులు వీచాయి, ఆకాశము నుండి ఉల్కలు రాలి పడ్డాయి. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. సూర్యుడికి, చంద్రుడికి చుట్టూ ఎర్రటి వలయాలు ఏర్పడ్డాయి, మంచుకురిసింది, వేసవి కాలములో కూడా చలిగాలులు వీచాయి. ఇలా అనేక ఉత్పాతాలు సంభవించాయి. ప్రతిరోజూ ఎదో ఒక ఉత్పాతము కనపడసాగింది. ఈ ఉత్పాతాలకు కారణము తెలియక ధర్మరాజు మనసు కలవరపడ సాగింది. కొంత కాలానికి ధర్మరాజుకు ఒక దుర్వార్త అందింది. దాని సారాంశము ఏమిటంటే శ్రీకృష్ణుడు, బలరాముడు తప్ప మిగిలిన యాదవులు అందరూ ఒకరితో ఒకరు కలహించుకుని మరణించారన్నది. ఈ దుర్వార్తను విన్న ధర్మరాజు వెంటనే తమ్ములను పిలిచి ఈ వార్త తెలిపాడు. ఈ దుర్వార్తను విన్న అందరూ శోకసముద్రములో మునిగి పోయారు " ఇలా వైశంపాయనుడు ఈ మాట చెప్పగానే జనమేజయుడు " మునీంద్రా ! యాదవులు అందరూ కలహించుకుని మరణించటము ఎమిటి ? ఇలా ఎలా జరిగింది ? " అని అడిగాడు.
మునులు యాదువంశమును శపించుట


మునులకు సాంబుని స్త్రీ అని చూపుతున్న యాదవులు
జనమేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ఈ విషయము ఇప్పటిది కాదు. చాలాకాలము కిందట జరిగిన దానికి ఇది ఫలితము. చాలాకాలము కిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మొదలైన మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చారు. ఈ మునులను చూసిన యాదవులకు ఆ మునులను ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే వారు వారిలో చిన్న వాడైన సాంబుడికి ఆడవేషము వేసి అతడిని మునుల వద్దకు తీసుకు వచ్చి " మునులారా " ఈమె మా స్నేహితుడు బభ్రుడి భార్య. వారికి చాలా రోజులుగా సంతానము లేదు. అసలు వారికి సంతానము కలుగుతుందా లేదా ? తెలియజేయండి " అని అడిగారు. వారి మిఖాలు చూడగానే మునులు వారు తమను హేళన చేస్తున్న విషయము గ్రహించి " వీడు శ్రీకృష్ణుడి కుమారుడు ఇతడు మగవాడు. వీడు ఒక ముసలమును కంటాడు. ఆ ముసలము శ్రీకృష్ణుడు, బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరిని సర్వనాశనము చేస్తుంది. బలరాముడు మాత్రము యోగనిష్టతో సముద్రములో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడు నేలమీద పదుకుని ఉండగా జర అను రాక్షసి శ్రీకృష్ణుడిని చంపుతుంది. మీ

రోకలిని రుద్దుతున్న యాదవులు
కపటనాటకముకు ఇది తగినశిక్ష " అని శపించిన ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండా వెళ్ళిపోయారు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసినా జరగనున్నది జరగక మానదు అని మిన్నకుండి పోయాడు. మరుసటి రోజే మునుల శాపము ఫలించి సాంబుడు ఒక ముసలమును ప్రసవించాడు. అది చూసి యాదవులు ఆశ్చర్యచకితులై ముసలమును సాంబుడిని వసుదేవుడి వద్దకు తీసుకు వెళ్ళారు. వసుదేవుడు భయభ్రాంతుడు అయ్యాడు. వసుదేవుడు ఆ ముసలమును చూర్ణము చేసి సముద్రములో కలపమని యాదవులకు చెప్పాడు. అందువలన వసుదేవుడు ఇక ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు. యాదవులు వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయము అంతటితో మరచిపోయారు. కాలము గడచింది మహాభారత యుద్ధము జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల వలెనే యాదవులు అందరూ దుర్మరణము పాలు కాగలరని శపించింది. తరువాత కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాశము ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది. అది విన్న యాదవులు భయభ్రాంతులు అయ్యారు.

ద్వారకలో దుశ్శకునాలు

ద్వారకలో అనేక దుశ్శకునాలు పొడచూపసాగాయి. చిలుకలు రాత్రుళ్ళు గుడ్లగూబలలా వికృతముగా అరవసాగాయి. మేకలు నక్కల వలె పగటి వేళలో ఊళ వేయసాగాయి. యాదవులందరూ దుర్వ్యసనాలలో మునిగి తేలుతూ మునులను, బ్రాహ్మణులను అవమానించసాగారు. యదవులు త్రాగుడు, జూదానికి బానిసలు అయ్యారు. యాదవ స్త్రీలు భర్తలను లెక్కచేయక బానిసల వలె ప్రవర్తించసాగారు. తినే ఆహారములో అప్పటికి అప్పుడే పురుగులు వస్తున్నాయి. ఈ అశుభములను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. నాడు గాంధారి ఇచ్చిన శాపము 35 సంవత్సరముల అనంతరము పని చేయడము మొదలైంది. యాదవులకు ఇక సర్వనాశనము తప్పదు. ఒకరితో ఒకరు కలహించుకుని మరణించక తప్పదు. అది ఒక పుణ్యభూమిలో కొట్టుకుంటే పుణ్యము వస్తుంది అనుకుని యాదవులతో ఒకసభ చేసి " యాదవులారా ! మనము అందరము కలసి సముద్రుడికి ఒక జాతర చేయాలి. ఈ విషయము అందరికీ తెలిసేలా ఒక చాటింపు వేయించండి " అని ఆదేశించాడు. అలా సముద్రుడికి జాతర చేసే విషయము ద్వారకావాసులు అందరికి తెలిసింది. ఆ రోజు రాత్రి యాదవులు అందరికి వింత స్వప్నములు వచ్చాయి. నల్లగా భయంకరముగా ఉన్న స్త్రీలు ఇళ్ళలోకి జొరబడి తమ స్త్రీలను బలవంతముగా ఈడ్చుకు వెళ్ళారు. వారి ఆయుధములను నాశనము చేసారు. వారి ఆభరణములను దొంగలు ఎత్తుకు పోయారు. మరునాడు శ్రీకృష్ణుడి చక్రాయుధము, గరుడధ్వజము, శ్రీకృష్ణుడి రధముకు కట్టే అశ్వములు శైభ్యము, వలాకము, సుగ్రీవము, మేఘపుష్పము అనే నాలుగు, ఆయన రధము అన్ని ఆకాశములోకి ఎగిరి పోయాయి. ఇంతలో ఆకాశము నుండి " యాదవులు అందరూ సముద్రతీరానికి బయలుదేరండి " అని బిగ్గరగా వినిపించింది.

సముద్రుడికి జాతర

యాదవులకు శ్రీకృష్ణుడి ఆయుధములు , రధము ఆకాశముకు ఎగిరి పోయినా, వారి ఆయుధములు నాశనము అయినా, ఆభరణములు దొంగలు ఎత్తుకు పోయినా ఇసుమంత కూడ బాధ కలగ లేదు. వారంతా మద్య మాంసములు భుజించడములో మునిగిపోయారు. వివిధములైన భక్ష్య, భోజ్యములను తయారు చేసుకున్నారు. ఆహారపదార్ధములను, మద్యమును బండ్లకు ఎక్కించుకుని సముద్రతీరానికి బయలుదేరారు. అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వికారముగా బయలు దేరాడు. బలరాముడు కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరముగా కాలి నడకన వారి వెంట నడిచాడు. యాదవస్త్రీలంతా చక్కగా అలంకారములు చేసుకుని పల్లకీలలో బయలుదేరారు. అందరూ సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్ళలో కూర్చున్నారు. ఉద్ధవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు. బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని యోగ సమాధిలోకి వెళ్ళాడు. యాదవులు ఇవేమీ పట్టించుకొనక మద్యమాంసములు సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసిన పదార్ధములను కోతులకు పంచి పెట్టారు. అవి తినడము చూసి కేరింతలు కొట్టసాగారు. మద్యమాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించ సాగారు.

యాదవులలో చెలరేగిన స్పర్ధ

యాదవ ప్రముఖులు అయిన సాత్యకి, కృతవర్మ, గదుడు, చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు కూడా మద్యము సేవించి ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకూంటున్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి రోషముగా " ఒరేయ్ కృతవర్మా ! శత్రువులైనా ! నిద్రించేసమయాన చచ్చిన వారితో సమానము. అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడూ ప్రయత్నించడు. అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచకార్యానికి ఎలా ఒడిగట్టాడు రా ! ఏరా ప్రద్యుమ్నా ! అదీ ఒక వీరత్వమా ! అదీ ఒక శత్రుసంహారమా ! అది పాపకార్యమని నీకు తెలియదా ఏమి ? " అని హేళన చేసాడు. ప్రద్యుమ్నుడు " ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు వాదన ఎందుకు పోనివ్వు. ఈ కృతవర్మ చేసిన దానికి ప్రజలు అందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు. ఇంకా మీరు ఎందుకు తిట్టడము " అని అన్నాడు. సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపము నఫాళానికి అంటింది " ఒరేయ్ సాత్యకి ! నీకు సిగ్గు లేదురా ! నా సంగతి నేను చేసిన యుద్ధము సంగతి నీకు ఎందుకురా ! నీ సంగతి నీవు చూసుకో. అర్జునుడు చేయి నరికినందుకు భూరిశ్రవుడు యోగసమాధిలోకి వెళ్ళాడు. అటువంటి వాడి తల నరికిన విషయము అప్పుడే మరిచావా ! అదీ ఒక యుద్ధమేనా ! అప్పుడే ఆ విషయము మరిచావా ! పైగా శ్రీకృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు కదా " అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపము వచ్చింది. కోపముగా కృతవర్మ వంక చూసాడు. అప్పుడు " సాత్యకి " అన్నయ్యా ! వీడి సంగతి ఎవరికి తెలియదు. నాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణిని కాజేయడానికి వీడు తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా ! " అని అన్నాడు. ఆ మాటాలు విన్న సత్యభామ తన తండ్రి మరణము గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది. ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపముతో ఊగిపోయాడు.

సాత్యకి కృతవర్మను వధించుట

అది చూసిన సాత్యకి అన్నకు వదినకు సంతోషము కలిగించేలా ఒక్క ఉదుటున కృతవర్మ మీదకు దూకి " అందరూ వినండి ఈ దుర్మార్గుడు కృతవర్మ అశ్వత్థామతో చేరి నిద్రిస్తున్న ఉపపాండవులను నిర్దాక్షిణ్యముగా చంపాడు. వీడిని ఇక వదలకూడదు. వీడిక బ్రతక కూడదు. వీడు కూడా అలాగేచావాలి " అని అరచి వరలో నుండి కత్తిని బయటకులాగి ఒక్క ఉదుటున కృతవర్మ తల నరికాడు. సాత్యకి అంతటితో ఆగక కృతవర్మకు చెందిన భోజకులందరితో కలబడ్డాడు. అది చూసిన భోజకులు, అంధకులు విజృంభించి సాత్యకిని చుట్టుముట్టారు. ఇంత జరుగుతున్నా శ్రీకృష్ణుడు తన తమ్ముడు సాత్యకిని వారించడానికి కాని, రక్షించడానికి కాని ప్రత్నించక మౌనంగా చుస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్నుడు మాత్రము సాత్యకికి అండగా నిలిచాడు. ప్రద్యుమ్నుడి అండ చూసుకుని సాత్యకి విజృంభించి తన వారితొ కలసి భోజక అంధక కులముల వారితో యుద్ధముకు దిగాడు. ఇరువర్గాలకు యుద్ధము జరిగింది. అక్కడ ఏ ఆయుధములు లేవు. అక్కడ సముద్ర ఒడ్డు పొడుగున పెరిగిన తుంగ మొక్కలను పెరికి ఒకరితో ఒకరు కలబడ్డారు. చాలాకాలము కిందట యాదవులు చేసిన చిలిపిపనికి ఫలితముగా మునులు ఇచ్చిన శాపానికి పుట్టిన ముసలమును అరగదీసి సముద్రములో కలిపారు. అది సముద్రము నుండి కొట్టుకు వచ్చి ఒడ్డున ఇప్పుడు తుంగగా రూపుదాల్చి సముద్రపు ఒడ్డున మొలిచి ఉంది. ఆ తుంగలో ముసలము శక్తి నిక్షిప్తము అయి ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మునుల శాపము ఫలించింది. ఆ తుంగ మొక్కలతోనె యాదవులు ఇప్పుడు కొట్టుకుంటూన్నారు.

యాదవకులములో అంతర్యుద్ధము


ఘర్షణ పడుతున్న యాదవులు
ఆ సమయములో యాదవులు అందరూ మద్యము సేవించిన మత్తులో ఉన్నారు. ఆ తుంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు చస్తున్నాడు. ఈ విషయము వారికి ఆ మత్తులోఅవగతము కాలేదు. తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, బావమరిది అనే విచక్షణ లేకుండా కొట్టు కుంటూన్నారు. అంతా కింద పడుతున్నారు. తిరిగి లేచి చచ్చేలా కొట్టుకుంటున్నారు. కాని కృతవర్మకు చెందిన అంధక, భోజకులస్థులు ఎక్కువగా ఉండడముతో సాత్యకికి చెందిన వృష్టి వంశస్థులు అందరూ నశించారు. అనిరుద్దుడు, గదుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు సాంబుడు చచ్చి కింద పడ్డారు. ఇది చూసిన కృష్ణుడికి మునుల శాపము వలన అలవి మాలిన కోపము వచ్చింది. మిగిలిన తుంగకర్రలను తీసుకుని చావగా మిగిలిన భోజక, అంధక వంశస్థులను అందరినీ సమూలంగా నాశనము చేసాడు. యాదవ వంశము అంతా సమూలముగా నాశనము అయింది. ఆ రణభూమిలో కృష్ణుడు ఒంటరిగా నిలబడి పోయాడు. చావగా మిగిలిన వారిలో కృష్ణుడి రథసారథి దారుకుడు, బభ్రుడు మిగిలారు. వారు భయము భయముగా కృష్ణుడి వద్దకు వచ్చి " కృష్ణా ! యాదవులు అందరూ మరణించారు. బలరాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మనము వెంటనే బలరాముడిని వెదకటము మంచిది " అన్నారు.

బలరాముని పరలోక యాత్ర


బలరాముని పరలోక యాత్ర
అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్ళారు. ఆ సమయములో బలరాముడు ఒకచెట్టు కింద యోగ సమాధిలో కూర్చుని ఉన్నాడు. కృష్ణుడు దారికుని చూసి " దారుకా ! నీవు వెంటనే హస్థినకు వెళ్ళు. ఇక్కడ యాదవ కులము అంతా సర్వనాశనము అయింది అని చెప్పి అర్జునుడిని తీసుకురా ! " అని అన్నాడు. వెంటనే దారుకుడు రథము ఎక్కి హస్థినకు వెళ్ళాడు. కృష్ణుడు బభ్రుడిని చూసి " నీవు వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలను ద్వారకకు చేర్చు " అన్నాడు. సరే అని బభ్రుడు వెళ్ళబోతున్న సమయములో అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చెతిలోని తుమ్మపరక ఎగిరి వచ్చి బభ్రుడికి తగిలి బభ్రుడు అక్కడికక్కడే మరణించారు. ఋషుల శాప ప్రభావము చూసి కృష్ణుడు సైతము ఆశ్చర్యపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా ! నువ్వూ నేను తప్ప యాదవులు అందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు. తరువాత కృష్ణుడు సముద్రతీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. తరువాత తండ్రి వసుదేవుడి వద్దకువెళ్ళి " తండ్రీ ! నేను భారతయుద్ధము చూసాను. అక్కడ కురుపాండవులు నాశనము కావడము చూసాను. ఈ రోజు యాదవులు అందరు కొట్టుకుని మరణించడము చూసాను. మీరు, నేను, బలరాముడు తప్ప యాదవులు అందరూ మరణించారు. బంధువులు, మిత్రులు లేని చోట నేనిక ఉండలేను. నా కంటే ముందుగా బలరాముడు యోగసమాధి లోకి వెళ్ళాడు. నే కూడా వెళ్ళి అతడితో పాటు తపసు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి. నేడో, రేపో అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు " అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వసుదేవుడి పాదములకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణవార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి నిశ్చేష్టుడై స్ప్రృహ తప్పిపడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేసారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ " ఏడవకండి. అర్జునుడు ఇక్కడకు వస్తాడు. అతడు ఇక్కడ చెయవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెడతాను " అని చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా ! అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చాను. తండ్రిగారి అనుమతి తీసుకుని ఇక్కడకు వచ్చాను " అన్నాడు. బలరాముడిలో చలనము లేదు. బలరాముడి ముఖము నుండి ఒక పెద్ద నాగము వెలువడి బయటకు రాగానే బలరాముడు యోగశక్తితో ప్రాణములు శరీరము నుండి వదిలి పెట్టాడు. బలరాముడి ప్రాణాలు సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోయాయి. ఆదిశేషుడి అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతము పలికింది. నాగ ప్రముఖులు అందరూ బలరాముడి ఆత్మకు స్వాగతము పలికారు. అలా బలరాముడు విష్ణులోకములో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలసి పోయాడు.

శ్రీకృష్ణుడి నిర్యాణము


కృష్ణుడిపై బాణమును వేస్తున్న బోయవాడు
బలరాముడు ఈ తన అవతారము చాలించడము కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. తాను ఈ భూలోకములో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో అది ఎలా నిర్వహించాడో తలచుకుంటూ దిక్కుతోచకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు తాను ఎలా ఈ శరీరము వదిలి పెట్టాలో అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడికి గతము గుర్తుకు వచ్చింది. ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పూయమని కోరినప్పుడు తాను శరీరము అంతా పూసి అరికాలుకు పూయలేదు. అప్పుడు దుర్వాసుడు " కృష్ణా ! నీ మరణము అరికాలులో ఉంది " అన్నాడు. అది గుర్తుకురాగానే తాను ఎలా ప్రాణాలు వదిలి పెట్టాలో అర్ధము అయింది. శ్రీకృష్ణుడు నేలమీద పడుకుని ఇంద్రియములను నిగ్రహించి యోగసమాధిలోకి వెళ్ళాడు. అ సమయములో జర ఆరణ్యములో ప్రవేశించింది. జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది. అతడి కళ్ళకు పడుకుని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడి అనే భ్రాంతిని కలుగజేసింది. వెంటనే వేటగాడూ పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణమును వదిలాడు. ఆ బాణము పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి పాదములో గుచ్చుకుని బయటకు పొడుచుకు వచ్చింది. ఆహా జింక చచ్చింది అనుకుని దానిని తీసుకు పోవాలని అనుకుని దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలగిపోయి అక్కడ ఉన్నది జింక కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. అది చూసిన వేటగాడు భయముతో వణికి పోయి భోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి తాను ఈ మానవ శరీరమును వదిలి వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములో ఉన్న ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘనస్వాగతము చెప్పారు.

శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట

వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు " మహాత్మా ! ధర్మరక్షణలో ఒక భాగముగా నీవు ఆడే జగన్నాటకములో ఒక భాగంగా ఈ భూమిమీద అవతరించావు. కంసుడు, నరకుడు మొదలైన లోక కంటకులను సంహరించావు. భ్రష్టుపట్టిన భరత కులమును పరిశుభ్రము చేసావు. తిరిగి వైకుంఠము చేరుకున్నావు. నీవు ఆది పురుషుడవు, అజరామరుడవు నీకు ఆది అంతము లేదు. నీకు మరణము ఏమిటి. శ్రీకృష్ణుడిగా జన్మించడము, మరణించడము అంతా నీ లీల. ఓ మహాత్మా మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నీవు ప్రతి యుగములోను అవతరించాలి " అన్నాడు. ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేదమంత్రములతో స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరినీ చూసి " అనిరుద్ధమనే పేరు కలిగింది, ప్రద్యుమ్నమనే కాంతి కలిగింది, సంకర్షణమనే భావముతో ప్రకాశించేది, వాసుదేవుడు అనే నామముతో పిలువబడేది, అనన్యమైనది, అద్వితీయమైనది, జ్ఞానముతో కూడుకున్నది, ఏ దోషము లేనుది అయిన విష్ణుపదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను. పరమ మంగళకరమైన ఈ విష్ణు పదమును నేను స్వీకరిస్తున్నాను. ఒ సుకృతులారా మీరు అందరూ మీ మీ నెలవులకు వెళ్ళండి " అన్నాడు. అలా మునులను దేవతలను పంపిన తరువాత నారాయణుడు తన మూలస్థానము చేరుకున్నాడు.

దారుకుడు హస్థినకు చేరుట

శ్రీకృష్ణుడి ఆదేశముతో హస్థినకు చేరిన దారుకుడు హస్థినకు పోయి పాండవులను కలుసుకుని యాదవులకు వారి చిన్నతనములో మునులు ఇచ్చిన శాపము. ఆ శాపఫలితముగా యాదవులు అందరూ మద్యము సేవించి ఆ మత్తులో ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించడము. యాదవ కులము అంతా అంతరించడము అంతా వివరించి చెప్పాడు. బలరామ కృష్ణులు అడవిలోకి వెళ్ళిన విషయము చెప్పాడు. అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులు అందరూ నశించిన విషయము విన్న పాండవులు శోక సముద్రములో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర మొదలగు వారు పెద్ద పెట్టున ఏడవడము మొదలు పెట్టారు. అంతా సద్దుమణిగాక దారుకుడు " అర్జునా ! శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకకు రమ్మని ఆదేశించారు " అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని వెంటనే ద్వారకకు బయలుదేరాడు.

అర్జునుడి ద్వారక ప్రవేశము

అర్జునుడు దారుకుడితో వేగంగా ద్వారక చేరుకున్నాడు. ద్వారక అంతా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడా జనసంచారము లేదు. శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడా కనిపించ లేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో విపరీతము జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారుకుడు వెంటరాగా రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ భోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకో లేక శోకముతో కింద పడి పోయాడు. రుక్మిణీ, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖము ఎక్కువై కిందపడి ఏడుస్తున్నారు. వారిని అందరిని ఓదార్చడము అర్జునుడి వంతయింది.

వసుదేవుడు విలపించుట


వసుదేవునికి యాదవ వినాశనమును గురించి చెప్పుచున్న అర్జునుడు
తరువాత అర్జునుడు దారుకుడు వెంట రాగా వసుదేవుడిని చూదడానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహము పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడము ఒక విధముగా ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడము వేరు విధముగా ఉంది. ఇంతకూ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు. అతడికి ఏమైంది. అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు చూస్తున్నాడు. దారుకుడికి కూడా ఏమి తెలియక అతడు కూడా బిక్కమొఖము వేసుకుని చూస్తున్నాడు. వసుదేవుడు కూడా శయ్యమీద పడుకుని భోరున ఏడుస్తున్నాడు. అర్జునుడిని చూడగానే వసుదేవుడు పైకి లేచి అర్జునుడిని పట్టుకుని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ పేరుపేరున తలచుకుని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖము ఉపశమించింది. తరువాత వసుదేవుడు అర్జునుడితో " అర్జునా ! ఎంతో పరాక్రమవంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవవీరులు ఒకరితొ ఒకరు కలహించుకుని సమూలముగా నాశనము అయ్యారు. ఈ ఘోరము ఎక్కడైనా ఉందా ! నీకు ఒక విషయము తెలుసా ! నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు, సాత్యకి ముందుగా మరణించారు. ఇంత ఘోరము జరిగిన తరువాత కూడా నేనింకా బ్రతికి ఉన్నాను. నాదీ ఒక బ్రతుకేనా ! అయినా వీళ్ళకేమి చెడుకాలము దాపురించింది. సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారట. దానితో కొట్టుకోవడము మొదలైంది. ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనములో చేసిన పాపము మునుల శాపము ఇలా పరిణమించినది. యాదవకులము నాశనము అయింది. ఒకరిని అనుకుని ఎమి లాభము. నీ కొక విషయము తెలుసా అర్జునా ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షములో జరిగినది. శ్రీకృష్ణుడు తలచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా ! అయినా ఆపలేదంటే యాదవ కులనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు అందుకనే ఆపలేదు. ఇదంతా విధిలిఖితము. యాదవ నాశనము కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర గర్భములో ఉన్న పరీక్షిత్తును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయమా చెప్పు. విధి నిర్ణయము అని సరిపెట్టు కోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు " అన్నాడు.

వసుదేవుడు కృష్ణుడిని గురించి చెప్పుట

అర్జునుడు ఆలోచిస్తున్నాడు వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు కాని కృష్ణుడికి ఏమయ్యింది ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక శ్రీకృష్ణుడు క్షేమముగా ఉన్నాడు. అతడికి ఏమి కాలేదు అని తన మనసును సమాధాన పరచుకున్నాడు. అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయములో వసుదేవుడు తిరిగి అర్జునుడితో " ఏమి చెప్పను అర్జునా ! అలా యాదవులు తుంగకర్రలతో కొట్టుకుని మరణించిన తరువాత శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను వెంట పెట్టుకుని ద్వారకకు వచ్చాడు " అన్నాడు. అర్జునుడు ఇక ఆగలేక " అదిసరే ! ప్రస్తుతము కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు. నేను కృష్ణుడిని వెంటనే చూడాలి " అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు " ఇక్కడే ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకు వచ్చిన తరువాత నా వద్దకు వచ్చి " తండ్రీ ! ప్రస్తుతము భోజక, అంధక కుల యాదవులు వృష్టి వంశము వారు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలముగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారుకుడిని పంపాను. అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు. అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్ధుడు, కార్యదక్షుడు, పరాక్రమవంతుడు నాకు అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడూ అతడే నేను అతడి సాయంతో నీవు మిగిలిన యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలురను, వృద్ధులను కాపాడతాడు. ఇంక కొన్ని దినములలో సముద్రము పొంగి ద్వారకానగరము సముద్రములో కలసి పోతుంది. యాదవులు ఈ విధముగా కొట్టుకుని మరణిస్తున్న తరుణములో బలరాముడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని యోగసమాధిలో మునిగి పోయాడు. నాకు కూడా ఆ మార్గము ఉత్తమము అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపసు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి నేనిక అడవిలో తపమాచరిస్తాను. నీవు అర్జునుడు చెప్పిన విధముగా చెయ్యి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు. అంతే కాదు కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు " అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు నీవు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. అర్జునా ! ఏ కారణము లేకుండా కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హటాత్తుగా పీనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టు కోవడము నా వలన ఔతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడము లేదు. నా ప్రాణము మాత్రము ఈ దేహమును విడిచి పోవడము లేదు. ఏమి చెయ్యను ? నా వల్ల ఏమీకాదు. ఇక ఈ యాదవకుల స్త్రీలను, బాలురను, వృద్ధులను, అశ్వసంపదను నీవే కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కందముల మీద పెట్టాడుకదా ! " అన్నాడు.

అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్థినకు ఆహ్వానించుట

వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రము ఎలా ఉండగలను. వేంటనే హస్థినకు వెళ్ళాలి అనుకుని వసుదేవుడితొ " అనఘా ! ఈ విషయములో ధర్మరాజు ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆ నిర్ణయము ప్రకారము నేను అంతఃపుర కాంతలను, యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను తీసుకుని హస్థినకు వెళతాను. అక్కడ వారంతా సుఖముగా ఉండే ఏర్పాటు జరిపిస్తాము. మీరు దయచేసి నాతో హస్థినకు రండి. అంతా విధిలిఖితము అనుకుని ఊరడిల్లండి " అన్నాడు. తరువాత అర్జునుడు దారుకుడితో " దారుకా ! మనము శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిన వెళ్ళి శ్రీకృష్ణుడి కొరకు వెతుకుతాము. ఇక్కడ జరుగవలసిన పనులను అందరినీ పిలిచి ఆదేశాలు ఇస్తాము. అందు వలన అందరినీ పిలువు " అన్నాడు. దారుకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పుర ప్రముఖులను అందరినీ సుధర్మ అనే రాజమందిరముకు పిలిచి " ఈ రోజు మొదలు ఏడవనాటికి సముద్రము పొంగి ద్వారకసముద్రములో మునిగి పోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు. కనుక మనము అందరము ద్వారకను విడిచి ఇంద్రప్రస్థనగరానికి వెళదాము. అక్కడ మీరు అందరూ సుఖముగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నింటినీ సిద్ధముగా ఉంచుకుని ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధముగా ఉండండి. ధర్మరాజు పాలనలో మీరు అందరూ ద్వారకలో ఉన్నంత సుఖముగా ఉండగలరు " అని అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. వారందరూ వెళ్ళిన తరువాత మంత్రులతో సమాలోచన జరుపుతూ " ఏనుగులతోను, గుర్రాలతోను, లాగే బండ్లను, రధములను సిద్ధము చెయ్యండి. స్త్రీలను బాలురను తీసుకు వెళ్ళడానికి పల్లకీలను, బండ్లను ఏర్పాటు చెయ్యండి. ఏయే సామానులు ఎలా ఇంద్రప్రస్థము చేర్చాలో ప్రణాళిక వెయ్యండి. మీలో ఓర్పును నశింపజేయకండి. చనిపోయిన యాదవులు ఇక ఎలాగూరారు. ధర్మరాజు మీకు మీ దుఃఖాలను మరిపించే పాలన అందిస్తాడు. వసుదేవుడి మనుమడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా ధర్మరాజు నియమించ వచ్చు. కనుక ఈ విషయములో మీరు కలత చెందవలసిన పని లేదు " అన్నాడు.

వసుదేవుడు తనువు చాలించుట

ఆరోజు రాత్రికి కృష్ణుడు ఉన్న మందిరములోనే పూజలు భజనలతో కాలము గడిపాడు. మరునాడు సూర్యోదయము కాగానే కాలకృత్యాలు సంధ్యావందనాలు పూర్తిచేసుకుని బయటకు రాగానే వసుదేవుడు తన పాంచభౌతిక కాయాన్ని వదిలి పెట్టాడాన్న విషయము తెలిసింది. అప్పటికే అంతఃపుర స్త్రీలు వసుదేవుడి మరణానికి పెద్దపెట్టున శోకిస్తునారు. వసుదేవుడి భార్యలు వసుదేవుడితో సహగమనానినికి సిద్ధము ఔతున్నారు. అర్జునుడు భారమైన హృదయముతో వసుదేవుడి మందిరానికి వచ్చాడు వసుదేవుడి శరీరానికి పన్నీటిస్నానము చేయించాడు. వసుదేవుడికి పట్టువస్త్రాలను ధరింపజేసి ఆభరణాలతొ అలకంకరింప జేయించి పులమాలలతో అలంకరింప జేయించబడిన రథము మీదకు ఉంచారు. ముందు వేదపండితులు వేదమంత్రములు పఠిస్తూ నడువగా వసుదేవుడి శవయాత్ర సాగింది. అర్జునుడు పాదాచారియై రథము వెంట నడిచాడు. వసుదేవుడి భార్యలైన దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర చక్కగా అలంకరించికొని పల్లకీలలో కూర్చున్నారు. ఆ పల్లకీలు కూడా శవయాత్ర వెంట సాగాయి. ద్వారకా నగరవాసులు అందరూ శవయాత్రలో కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తూ వెంట నడిచారు. వసుదేవుడి ఉద్యానవనంలో మంచిగంధపు చెక్కలతో చితి పేర్చారు. వసుదేవుడి శరీరాన్ని చితి మీద ఉంచారు. అర్జునుడు శాస్త్రోక్తంగా శవదహన క్రియను జరిపించాడు. వసుదేవుడి వెంట వసుదేవుడి భార్యలు చితిలో ప్రవేశించారు. ఆ దృశ్యము చూసిన కంటతడి పెట్టని వారు లేరు. కొందరు చితిలో నెయ్యిపోసి మటలను ప్రజ్వలింపజేసాడు. జనము హాహాకారాలు చేసారు. ఆ విధముగా వసుదేవుడి అంత్యక్రయలు పూర్తి అయ్యాయి. తరువాత వజృడు మొదలైన వారు, ఆడవారు వసుదేవుడికి తర్పణములు వదిలారు. అందరూ ద్వారకకు చేరుకున్నారు.

అర్జునుడు యాదవులకు దహన సంస్కారములు చేయించుట

అర్జునుడు తరువాత యాదవులైన భోజక, అంధక, వృష్టి వంశాల వారు కొట్టుకుని మరణించిన ప్రదేశానికి బ్రాహ్మణులను, పండితులను తీసుకుని వెళ్ళాడు. వారితో పాటు ఆ కొట్లాటలో చనిపోయిన వారి బంధువులు కూడా వచ్చారు. ఒక్కొక్కరు తమ బంధువులను గుర్తుపట్తి ఏడుస్తునారు. కొందరు ముర్ఛపోయారు. అది చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై అక్కడ శోకిస్తున్నవారిని ఓదార్చాడు. తరువాత అక్కడ చనిపొయిన వారికి యదోచితముగా వేదోక్తముగా అగ్ని సంస్కారము చేయించాడు. చనిపోయిన వారి బంధువుల చేత వారికి తర్పణములు విడిపించారు. సామూహికంగా దశదిన కర్మలు చేయించాడు. అర్జునుడు ఆ విధముగా యాదవులందరికి ఉత్తమలోక ప్రాప్తి కలిగేలా చేసాడు. అర్జునుడి మనసులో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తామా అని ఆతురతగా ఉంది. అంతఃపుర స్త్రీలను, ద్వారకాపుర వాసులను, బాలురను, వృద్ధులను, సమస్త ద్వారకాపుర వాసులను ఇంద్రప్రస్థముకుచెర్చమని దారుకుదికి చెప్పాడు. అందుకు తగిన ఎర్పాట్లు చేసాడు.

అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు వెదకుట

అర్జునుడు ఆ తరువాత కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో " అయ్యో కృష్ణా ! నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్థిన నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణవార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా ! అయినా నేనిప్పుడు వసుదేవుడి మరణవార్తను బలరామ, కృష్ణులకు చెప్పడము ఎందుకు ? మీరు చెప్పిన పనిని సక్రమంగా పుర్తి చేసాను అని చెపితే సరిపోతుంది కదా ! " అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునుడికి గాంధారి ఇచ్చిన శాపము మనసులో మెదిలింది. గాంధారి శాపము ఇచ్చే సమయములో అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి " ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావు " అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుడి మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా ! ఇలా పరిపరి విధముల ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్ళకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించ లేక పోతున్నారు. అలా కొన్ని రోజులు వెదికిన తరువాత ఒక రోజు ఒక బోయవాడు వారితో " మీరు దేని కొరకు వెదుకుతున్నారు? "అని అడిగాడు. అర్జునుడు " ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు తపసు చేసుకుంటున్నాడట అతడి కొరకు మేము వెదుకుతున్నాము " అన్నాడు. ఆ బోయవాడు " నేను శ్రీకృష్ణుడిని చాలా రోజుల కిందట చూసాను. తరువాత చూడలేదు. నేను కూడా మీ వెంటవచ్చి వెతుకుతాను రండి " అన్నాడు. ఆ బోయవాడితో చేరి అర్జునుడు కృష్ణుడి కొరకు వెదకసాగాడు. ఆ బోయవాడూ చెప్పిన ఆధారాలను అనుసరించి వారు కృష్ణుడు పడిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని చూసారు. ఆ దృశ్యము చూసిన అర్జునుడు అక్కడకక్కడే మూర్ఛిల్లాడు. పక్కన ఉన్న వారు నీళ్ళు తీసుకువచ్చి అర్జునుడి ముఖము మీద చల్లారు. అర్జునుడు మూర్ఛ నుండి లేచి శ్రీకృష్ణుడి శరీరాన్ని కౌగలించుకుని భోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యమూ నిగ్రహము అతడిలో సడలిపోయాయి. కళ్ళ వెంట నీరు ధరాపాతంగా కారి పోతున్నాయి. నోటమాట రాలేదు. పక్కన ఉన్న వారికి అర్జునుడిని పలకరించే సాహసము చెయ్యలేక పోయారు. కొంచము సేపటికి తెప్పరిల్లిన అర్జునుడు " అయ్యో ! కృష్ణా ! నీకా ఈ దురవస్థ. నీ వంటి మహాత్ముడు ఇలా కటిక నేల మీద పడి ఉండడమా ! అంటూ కృష్ణుడి పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము గమనించాడు. అతడికి దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపొయాడు. కృష్ణుడి దేహము అంతా పరికించి చూసాడు. అరికాలు మాత్రము నల్లగా కమిలి ఉంది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది. నిదురిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుడిని అర్జునుడు కళ్లు ఆర్పకుండా చూడసాగాడు. పక్కన ఉన్న వాళ్ళు " అయ్యా ! తరువాత కార్యక్రమాలు చూడండి. మనము పోయి ద్వారకలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము. లేకున్న శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకు వెడదాము. ఎలా చెయ్యాలో మీరే శలవియ్యండి " అన్నారు.

అర్జునుడు శ్రీకృష్ణుడికి బలరామునికి దహనక్రియలు నిర్వహించుట

అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక మునిగి పోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట వచ్చిన వారితో " రేపు ఉదయము ద్వారక సముద్రములో మునుగుతుంది. కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వేళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచి పెట్టాలి. లేకున్న అంతు లేని ప్రాణనష్టము జరుగుతుంది కనుక మనము శ్రీకృష్ణుడి నిర్యాణము గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతము శ్రీకృష్ణుడి అంత్యక్రియలు మనము నిర్వహిస్తాము " అన్నాడు. బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేసాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని వేదోక్తంగా దహనము చేసాడు. బలరాముడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుపక్కల వెదుకసాగారు. కొంత సేపటికి వారిశ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగసమాధిలో ప్రాణములు వదిలిన బలరాముడి పార్ధివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయము చిక్కలేదు. భక్తిశ్రద్ధలతో బలరాముడికి దహన సంస్కారము చేసాడు. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తిశ్రద్ధలతో దహనసంస్కారములు చేసాడు. తరువాత తనవెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు వేళ్ళాడు. మార్గమధ్యములో దారుకుడితో " దారుకా ! మనము చేసిన పని సరి అయినది అని నేను నమ్ముతునాను. లేకున్న శ్రీకృష్ణుని మరణవార్తను విన్న రుక్మిణీ, సత్యభామ మొదలైన భార్యల దుఃఖము ఆపడము మనతరమా చెప్పు. వారంతా సహగమనము చేస్తాము అంటే మనము ఆపగలమా ! రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము పొంగి ద్వారక మునిగి పోతుంటే ద్వారకవాసులను కాపాడ లేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుడి మాట తప్పిన వాడిని ఔతాను. కనుక మనము వడిగా ద్వారకకు చేరుకుంటాము " అన్నాడు. అందరూ కలసి త్వరగా ద్వారక చేరుకున్నారు.

యాదవుల హస్థిన ప్రయాణము


యాదవ స్త్రీల అపహరణ
అప్పటికి ద్వారకలో ప్రయాణఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి మొదలైన అష్టభార్యలు, 16 వేల భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపుర వాసులు అందరూ పల్లకీలలోను, రథముల, బండ్ల, ఏనుగుల, అశ్వముల మొదలైన వాహనముల మీద ద్వారకను దాటడానికి సిద్ధముగా ఉన్నారు. అర్జునుడు, దారుకుడు రాగానే అందరూ కదిలారు. అర్జునుడి నాయకత్వములో దారుకుడు అందరినీ ద్వారక నుండి ప్రయాణము చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలు 16 వేల మంది, 8 మంది భార్యలు, బలరాముని నలుగురు భార్యలు, పల్లకీలలో కుర్చున్నారు. వారివెంట సేవకులు నడుస్తున్నారు. వారివెంట బండ్లలో వారికి కావలసిన సామానులు తీసుకుని వెళుతున్నారు. వారి వెనుక ద్వారకాపురి వాసులు అందరూ తమతమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికి వెనుకగా అర్జునుడు తన రథము మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకను దాటగానే సూర్యోదయము అయింది. సూర్యుడు రాగానే సముద్రము ఒక్కసారిగా పొంగింది. ద్వారకానగరాన్ని సముద్రపు అలలు ముంచెత్తాయి. అర్జునుడు యాదవులు ఒక్కసారి వెనుతిరిగి చూసారు. సముద్రము ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడము చూసి గగ్గోలుపెట్టారు. అర్జునుడి నేతృత్వములో వారంతా ఇంద్రప్రస్థము వైపు ప్రయాణము సాగించారు. అందరూ దారిలో విడిది చేసారు. ఆ రాత్రి దొంగల దండు ఒకటి వారి మీద దాడి చేసింది. కేవలము యాదవులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారి వెంట ఒక్క వీరుడు మాత్రమే ఉన్నాడు. అతడిని కట్టడిచేస్తే అపారమైన ధనసంపద దోచుకోవచ్చు అనుకున్నారు. ఒక్కసారిగా నిద్రిస్తున్న స్త్రీల మీద, యాదవుల మీద పడి వారి వద్ద ఉన్న నగలు, ధనము అపహరించడము మొదలు పెట్టారు. ఇంతలో అర్జునుడు అక్కడకు వచ్చి వారిని మర్యాదగా వెళ్లిపొమ్మని హెచ్చరించాడు. అయినా దొంగలు వినక స్త్రీల నుండి నగలు అపహరించడము ఆపలేదు. అర్జునుడు కోపించి వారి మీద బాణములు ప్రయోగించాడు. మొరటుతనముతో రాటుదేలి ఉన్న దొంగలను ఆబాణములు ఏమాత్రము గాయపరచ లేకపోయాయి. అర్జునుడు తమమీద బాణములు వెయ్యడము చుసి దొంగలు అర్జునుడి మీద ఎదురు దాడి చేసారు. అర్జునుడు ఎదురు దాడికి దిగ లేదు. అతడికి ఏ అస్త్రములు స్పురించ లేదు. అందు వలన మామూలు బాణములు ప్రయోగించడము మొదలు పెట్టాడు. అర్జునుడి తూణీరములో బాణములు అయిపోయాయి కాని దొంగలు దోపిడీ చేయడము ఆపలేదు. అర్జునుడికి ఇదంతా దైవలీల అని అర్ధము అయింది. ధనము, నగలు వదిలి పెట్టి రుక్మిణీ మొదలైన స్త్రీలను రక్షించాడు. దొంగలు దొచుకున్న నగలు, ధనముతో పారి పోయారు. రథములు, బండ్లు తీసుకు వెళ్ళడానికి వీలు కాక అక్కడే వదిలి వెళ్ళారు. అలా సర్వమూ కోల్పోయి కట్టుబట్టలతో వారంతా కురుక్షేత్రము చేరుకున్నారు. వారి రాక విన్న హస్థినాపురవాసులు అక్కడకు వచ్చారు. జరిగిన విషయాలను అర్జునుడు వారికి వివరంచాడు.

హస్థినలో యాదవులకు తగిన ఏర్పాటు చేయుట

అన్న ధర్మరాజు ఆజ్ఞానుసారము అర్జునుడు యాదవ స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు తగిన ఏర్పాట్లను చేసాడు. కృతవర్మ కుమారుని అతడి తల్లి, కుమారులతో మృత్తికావత పురములో నివసించడానికి ఏర్పాటు చేసాడు. మృత్తికావత పురానికి కృతవర్మ కుమారుడిని పట్టాభిషిక్తుడిని చేసాడు. సాత్యకి కుమారుడిని సరస్వతీ నగరానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. మిగిలిన వారిని ఇంద్రప్రస్థముకు తీసుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడి మనుమడు వజృడిని ఇంద్రప్రస్థానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. అక్రూరుడి భార్యను, అతడి కుమారులను వజృడి సంరక్షణలో ఉంచాడు. అందరిని తగు ప్రదేశములలో సురక్షితముగా ఉంచాడు. ఇక శ్రీకృష్ణుడి అష్టభార్యలు, బలరాముడి భార్యలు అర్జునుడితో ఉన్నారు. వారికి బలరామ, శ్రీకృష్ణుల నిర్యాణ వార్తను ఎలా చెప్పాలా అని ఆలోచించ సాగాడు.

శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎరిగించుట

అర్జునుడు ఒకరోజు మనసు దిటవు చేసుకుని రుక్మిణి, సత్యభామ తదితరులను సమావేసపరిచి తాను దారుకుడితో బలరామ శ్రీకృష్ణులను వెదకడము అక్కడ బోయవాడు కనిపించడము అతడిని స్రీకృష్ణుని గురించి అదగడము వరకు చెప్పి ఆ తరువాత ఏడుస్తూ ఉండి పోయాడు. వారందరికి బలరామ శ్రీకృష్ణులు పరమ పదించారు అన్న విషయము అర్ధము అయింది. అందరు పెద్ద పెట్టున రోదించడము మొదలు పెట్టారు. కొంతసేపు అయిన తరువాత వారు మనసు దిటవు చేసుకుని " నాయనా ! అర్జునా ! అయినది ఏదో అయినది. తరువాత ఏమి జరిగినదో చెప్పు " అన్నారు. అర్జునుడు " దారుకుడు నేను బలరామ, కృష్ణులను వెదుకుతూ ద్వారకానగరము మరిచాము. రోజులు లెక్కించి ఆ మరునాడు ద్వారక మునిగి పోతుంది అని తెలుసుకున్నాము. ఈ విషయము మీకు చెబితే మీరు చేయవలసిన కార్యక్రమాలలో మునిగిపోయి ద్వారకానగరముతో సహా మునిగి పోతారని భావించి మేమే బలరామ క్రిష్ణులకు అంత్యక్రియలు నిర్వహించాము. ఆ రాత్రికి రాత్రి మిమ్ములను ద్వారకానగరము దాటించాము. మీ అందరి ప్రాణాలను రక్షించాలని ఇలా చేసాము కాని నా మనసులో ఏదో తప్పు చేసానన్న బాధ వేధిస్తున్నది. ఏమీ చేయలేని పరిస్థితి. మీరంతా నన్ను మన్నించి నాకు ఏపాపము అంటకుండా చూడడండి " అని వారికి ప్రణామము చేసాడు. రుక్మిణీ తదితరులు అర్జునుడిని లెవనెత్తి " నాయనా అర్జునా ! విధి నిర్ణయము అలా ఉంటే నీవు మాత్రము ఏమి చేస్తావు ? నీవేమి కావాలని చెయ్యలేదు కదా ! ఇక జరగవలసిన కార్యక్రమాలు చూడు " అన్నారు. శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో రుక్మిణీ, జామవతి తదితరులు శ్రీకృష్ణుడితో సహగమనము చెస్తామని అన్నారు. అది విని బంధువులు అందరూ ఏడ్చారు. వారిని వారించడానికి ప్రయత్నించారు. కాని వారు వినలేదు. వారిని పల్లకీలలో ఊరేగించి చితి వద్దకు తీసుకు వచ్చారు. మంచి గంధపు చెక్కలతో చితిపేర్చి బ్రాహ్మణులు అగ్ని కార్యము నిర్వహించారు. సహగమనము చెయదలచిన వారు చితిలో దూకారు. సత్యభామ తదితరులు తపసు చెసుకోవడనికి అడవులకు వెళ్ళారు.

అర్జునుడు వ్యాసుడిని దర్శించుట

రుక్మిణి తదితరుల సహగమనము తరువాత అర్జునుడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళి అతడిని దర్శించుకున్నాడు. అర్జునుడు వ్యాసుడికి భక్తితో నమస్కరించి " మహాత్మా ! యాదవులు అందరూ తమలో తాము కొట్టుకుని మరణించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు పాంచభౌతిక శరీరాలను వదిలి తమ స్వస్థానము చేరారు. ద్వారకానగరము సముద్రములో మునిగి పోయింది. నేను అంతఃపురస్త్రీలను, యాదవులను తీసుకు వస్తుండగా దారి మధ్యలో దొంగలు మా సర్వస్వము దోచుకుని వెళ్ళారు. ఆ సమయములో నాకు ఏ అస్త్రము మంత్రసహితముగా స్పురణకు రాలేదు. గాండీవము దాని శక్తి చూప లేదు. నాకు మాత్రము కారణము తెలియ లేదు. అమ్ములపొదిలో అమ్ములు అయిపోయాయి. కేవలము మనుషులను మాత్రమే కాపాడి వారిని ఇంద్రప్రస్థము చేర్చాను. సాత్యకి, కృతవర్మ సంతతిని రాజ్యాభిషిక్తులను చేసి యాదవులను వారి స్థానములలో నిలిపాను. తమవద్దకు వచ్చాను. తరువాతి కర్తవ్యము భోదించండి " అని ప్రార్థించాడు. వ్యాసుడు " అర్జునా ! దుర్వాసుడి పలుకులు, యాదవులకు మునులు ఇచ్చిన శాపము, గాంధారి శాపము వృధా పోదు కదా ! అంతా విధివిలాసము ఎవరికి తప్పింపశక్యము కాదు. యాదవనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసుకనుకనే వారు కలహించుకునే సమయములో తటస్థంగా ఉన్నాడు కాని వారిని వారించడానికి ప్రయత్నము చెయ్యలేదు. శ్రీకృష్ణుడికి మునుల శాపమును నివారించడము తెలియదా ! అలా చెయ్యడము శ్రీకృష్ణుడికి ఇష్టము లేదు కనుకనే ఉపేక్ష వహించాడు. యాదవనాశనము జరగాలన్నది శ్రీకృష్ణుడి సంకల్పము. నీవు యుద్ధము చేస్తున్నప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు రధము మీద కూర్చుని రుద్రుడి సాయముతో నీ శత్రువులను చంపాడు. నీవు నీ పరాక్రమంతో చంపానని అనుకున్నావు. అలాంటి కృష్ణుడు కాలము కలసి రాకుంటే దొంగలబారి నుండి నిన్ను రక్షించలేదు. శ్రీకృష్ణుడు అవతారపురుషుడు. భూభారము తగ్గించి ధర్మరక్షణ చేయడానికి అవతారము ఎత్తాడు. తాను సంకల్పించిన కార్యక్రమాలు నెరవేర్చి అవతారము చాలించి స్వస్థానము చేరుకున్నాడు. అటువంటి కృష్ణుడి వలన గీతాభోద విన్న నీవు దుఃఖించ తగదు. శ్రీకృష్ణుడి సాయంతో భూభారాన్ని తగ్గించడానికి మాత్రమే నీ అక్షయ తుణీరాలు, గాండీవము ఉపయోగపడ్డాయి. ఆ కార్యము నెరవెరగానే అవి నిర్వీర్యము అయ్యాయి. అస్త్రములు కాని, శస్త్రములు కాని పురుషప్రయత్నము కాని దైవానుగ్రహము ఉంటేనే ఫలిస్తాయి. నీవు జ్ఞానివి దీనికి శోకించతగదు. నా వలననే అంతా జరిగిందని గర్వించకూడదు. మీ పాండవులు కూడా ఈ శరీరము వదల వలసిన సమయము ఆసన్నము అయింది. అందుకు తగిన ప్రయత్నములు చేసి ఉత్తమగతులు పొందండి " అని వ్యాసుడు పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో శోకము, మోహము దూరము అయ్యాయి. అతడి మనసు నిశ్చలానందముతో తొణికిసలాడింది. ఆతరువాత అర్జునుడు హస్థినాపురముకు వచ్చాడు. ధర్మరాజు తదితరులకు అప్పటి వరకుజరిగిన విషయాలు బలరామ, శ్రీకృష్ణుల నిర్యాణము, తాను వ్యాసుడిని దర్శించడము అంతా సవివరముగా చెప్పాడు " అని వైంపాయనుడు జనమేజయుడికి భారతకథను చెప్పసాగాడు.

మహాప్రస్థానిక పర్వము

  • 1 ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట
  • 2 పాండవులు మహాప్రస్థానికి తరలుట
  • 3 అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట
  • 4 పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట
  • 5 ఇంద్రుడు ధర్మరాజును కలయుట
  • 6 యమధర్మరాజు
  • 7 నారద మహర్షి ధర్మరాజును స్వర్గములో కలయుట

Featured Post

RAMAYANAM - రామాయణము