-వృత్త గీత
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Sanaka_and_other_sages_preaching_to_Shukracharya_and_Vrutrasura.jpg/220px-Sanaka_and_other_sages_preaching_to_Shukracharya_and_Vrutrasura.jpg)
సనకాది మునులను కలసిన శుకచార్య వృత్రాసురులు
ధర్మరాజు
" పితామహా ! నేను క్షత్రియుడిని పైగా చక్రవర్తిని, ఇంద్రియములను జయించి
రాజసము వదిలి త్రిగుణములను వదిలి శాంతి సుఖము ఎప్పుడు పొందుతానో కదా ! "
అని ధర్మరాజు ఆవేదన చెందాడు. దేవాసుర యుద్ధములో వృత్తాసురుడనే రాక్షసుడు
పడి పోయాడు. అప్పుడు రాక్షసులు అతడిని సురక్షిత స్థావరానికి తీసుకు
వెళ్ళారు. కాని వృత్తాసురుడి మొహంలో విషాదఛాయలు కనిపించక నిర్మలంగా
ఉన్నాదు. అప్పుడు రాక్షస గురువైన శుక్రుడు " వృత్తా ! శత్రువులు నీ రాజ్యము, సంపదలు అపహరించారు కదా ! నీకు ఏమాత్రము దుఃఖము కలుగక పోవడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. వృత్తాసురుడు
" కలిమి లేములు కాలవశాత్తు వస్తుంటాయి పోతుంటాయి. అజ్ఞానులు మాత్రమే కలిమి
ఉన్నప్పుడు దర్పము, పోయినప్పుడు దైన్యము అనుభవిస్తుంటారు. సంపదలు
అశాశ్వతము అని తెలిసిన వాడు సంపదలు ఉన్నా పోయినా బాధపడక నిర్మల మనస్కుడై
ఉంటాడు. లోకం లోని ప్రాణులన్నీ కర్మవశాన దేవతలు గాను, మనుష్యుల గాను,
జంతువులు గాను జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ఉంటారు. ఈ విషయము నాకు తెలుసు కనుక
నేను ఎందుకూ బాధ పడను " అని అన్నాడు వృత్తుడు. శుక్రాచార్యుడు వృత్తుని
గురించి మనశుద్ధి తెలుసుకోవాలని " ఓ వృత్తాసురా ! నీవు రాక్షసరాజువు నీవు
ఇంత విరక్తిగా పడడము తగదు " అని అతడిని రెచ్చగొట్టాడు. వృత్తుడు చలించక "
గురుదేవా ! పూర్వము నేను పూర్వము దేవతలను జయించాలని ఘోరమైన తపస్సు చేసి
విజయము సాధించి ముల్లోకాలు జయించి సమస్త సంపదలు అనుభవించాను. ఏదో పాపం
చేసాను కనుక అవన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడిక దుఃఖించడం ఎందుకు. ఇక నేను
సుకృత దుష్కృతముల జోలికి పోకుండా తటస్థుడనై నిర్మలచిత్తుడనై విష్ణువును
పూజిస్తాను. నేను ఇంద్రుడితో యుద్ధము చేసే సమయంలో అతడి పక్కన విష్ణుమూర్తిని
చూసి అతడి మహత్యానికి ఆశ్చర్య పోయాను. గురువర్యా ! నాకు విష్ణువు మహిమ
గురించి వివరించండి " అని అడిగాడు. అలాగే చెప్పబోతున్న సమయంలో అక్కడకు
వచ్చిన సనత్కుమారుడిని చూసి శుక్రాచార్యుడు " ఋషివర్యా ! ఈ దానవేంద్రుడికి
విష్ణుమహిమ గురించి వివరించండి " అని అడిగాడు. సనత్కుమారుడు "
సర్వవ్యాపి అయిన విష్ణువుకు భూమియే పాదాలు, ఆకాశమే తల, దిక్కులే భుజాలు అలా
విష్ణువు సర్వదేవమయుడై సర్వవ్యాప్తుడై ఉన్నాడు. ఈ చరాచర జూవులను
సృష్టించడం, పోషించడం, చంపడం ఆయన లీలామాత్రంగా చేస్తుంటాడు. మానవుని
జీవితంలో అనేక వర్ణములుగా వస్తుంటాయి. పూర్వజన్మ కర్మవిశేషము చేత అనేక
వర్ణములలో ఫలితము అనుభవిస్తుంటాడు. ఇలా జననమరణ చక్రంలో చిక్కుకుని నిరంతరము
జీవుడు పరిభ్రమిస్తుంటాడు. జీవుడు ఉత్తముడు, అధముడు, మధ్యముడు అను మూడు
విధములైన జన్మ ఎత్తుతుంటాడు. దేవతాజన్మ ఉత్తమం, మానవజన్మ మధ్యమం,
పశుపక్ష్యాదుల జన్మ అధమం. ఈ జన్మలో ఒకరికి ఉపకారము చేసిన వాడికి మరుజన్మలో
ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఈ జన్మలో పరులకు అపకారం చేసిన వాడికి మరు జన్మలో
అధమ జన్మ లభిస్తుంది. పుణ్యకార్యాచరణతో జీవుడు మాలిన్యము వదిలి
పవిత్రుడౌతాడు. ఎన్ని ఎక్కువ పుణ్య కార్యాలు చేస్తే అంత మంచి జన్మ
లభిస్తుంది. అప్పుడు అతడు దుఃఖము వదిలి నిర్మలానందాన్ని పొందుతాడు. ఏ
జీవుడు సదా తెల్లనివర్ణమును మనసున తలుస్తుస్తాడో అప్పుడు అతడికి విష్ణు
భావన కలుగుతుంది " అన్నాడు సనత్కుమారుడు. అమృతోపమాయమైన ఆమాటలు విన్న
వృత్తుడు శుద్ధమనస్కుడై విష్ణుసాయుజ్యం పొందాడు.
ఇంద్రుడు వృత్తాసురల మధ్య యుద్ధము
ధర్మరాజు " పితామహా ! వృత్తుడు ఇంతటి విష్ణుభక్తుడు కదా అతడికి ఇంద్రుడితో యుద్ధము ఎంద్సుకు సంభవించింది " అని అడిగాడు. భీష్ముడు"
ఇంద్రుడు అపారమైన దేవసేనతో రాక్షసరాజు వృత్తాసురుడి మీదకు వెళ్ళి
రాక్షససైన్యాలను చూసి జంకుతూ రాక్షసరాజైన వృత్తుడితో తలపడ్డాడు.
పర్వతాకారంతో యుద్ధము చేస్తున్న వృత్తుడిని చూసి ఇంద్రుడికి వణుకు
పుట్టింది. వృత్తుడు ఇంద్రుడిని మూర్ఛిల్లజేసాడు. అప్పుడు వశిష్ఠుడు తన తపో
మహిమతో ఇంద్రుడి మూర్ఛ నుండి కోలుకునేలా చేసి తిరిగి యుద్ధానికి
పురికొల్పాడు. దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి విజయం కలిగించమని ఈశ్వరుడిని ప్రార్ధించాడు. ఈశ్వరశక్తి ఇంద్రుడిలో ప్రవేశించింది. వృత్తుడిని చంపడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగానే విష్ణువు ఆ వజ్రాయుధంలో ప్రవేశించాడు. అప్పుడు శివుడు " ఇంద్రా ! ఈ వృత్తుడు 60,000 దివ్య సంవత్సరములు బ్రహ్మ
గురించి తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వృత్తుడికి మహోగ్రమైన
బలాన్ని ప్రసాదించాడు. ఆ బలాన్ని నేను నా తేజముతో నాశనం చేస్తాను. అనగానే
ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి పడగొట్టాడు. దేవతలు తూర్యనాదములతో, విజయఘోషతో
ఇంద్రుడిని పొగిడారు. వజ్రాయుధపు ఘాతముతో విష్ణువు వృత్తునిలో
ప్రవేశించాడు. విష్ణుస్పర్శ తగలగానే వృత్తుడు మాలిన్యము తొలిగి
పునీతుడయ్యాడు. ఇంద్రుడు శివుడికి నమస్కరించి " శంకరా నీ దయతో కదా నేను ఈ
విజయము సాధించాను " అని స్వర్గానికి వెళ్ళాడు.
బ్రహ్మహత్యా పాతకము
స్వర్గానికి వెళ్ళిన ఇంద్రుడికి మనశ్శాంతి లోపించింది. అతడికి బ్రహ్మహత్యాపాతక భయముపట్టుకుంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మ
వద్దకు వెళ్ళి తరుణోపాయము చెప్పమని అడిగాడు. బ్రహ్మ ఆ పాపమును అందరికి
పంచి విముక్తి పొందమని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకమును
పంచి ఇవ్వడానికి అగ్నిని,
గడ్డిని, ఓషధులను చెట్లను, జలమును, స్త్రీలను పిలిచి బ్రహ్మహత్యాపాతకమును
పంచుకొమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వారు భయముతో అంగీకరించారు. ప్రతిగా ఇంద్రుడు
వారికి కోరికలను ప్రసాదిస్తూ చెట్లను తుంచిన వాడికి నరికిన వాడికి,
అగ్నిని ప్రజ్వలింపచేయక హవిస్సులను వేసినవాడికి, జలములో మల మూత్రములను
విడిచిన వాడికి, నదిలో ఉమ్మి వేసిన వాడికి, బహిష్టు సమయంలో స్త్రీని చేరిన
వాడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుందని వరమిచ్చాడు. ఇంద్రుడు
బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడయ్యాడు. ఇంద్రుడు బ్రహ్మ అనుమతితో
అశ్వమేధయాగము చేసి స్వర్గాన్నిపాలించసాగాడు. వృత్తుడి శరీరము నుండి కారిన
రక్తము పుట్టగొడుగులుగా మారాయి. కనుక బ్రాహ్మణులు పుట్టగొడుగులను ఆహారముగా
స్వీకరించరు " అని చెప్పి భీష్ముడు " ధర్మనందనా ! నీవు కూడా ఇంద్రుడిలా
శత్రువులను జయించి కీర్తిని పొందు " అని చెప్పాడు.
జ్వరము
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/73/The_Destruction_of_Daksha%27s_sacrifice%2C_from_an_illustrated_manuscript_of_the_Razmnama.jpg/220px-The_Destruction_of_Daksha%27s_sacrifice%2C_from_an_illustrated_manuscript_of_the_Razmnama.jpg)
దక్ష యాగ విధ్వంసం
ధర్మరాజు సందేహంతో " పితామహా ! వృత్తుడికి జ్వరము వచ్చిందని విన్నాను. వృత్తాసురుడికి ఆజ్వరము వచ్చింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! వెండి కొండ మీద పార్వతీ సమేతంగా పరమశివుడు,
దేవతలు, మునులు, యక్షులు మొదలగు వారు సేవిస్తుండగా కొలువు తీరి ఉన్నాడు.
అప్పుడు సతీదేవి భర్తను చూసి నాధా ! వీరంతా ఎక్కడికి పోతున్నారు " అని
అడిగింది. శివుడు " దేవీ ! దక్షుడు చేయు యాగములో తమ తమ హవిర్భాగములు తీసుకొనుటకు వెడుతున్నారు " అన్నాడు. సతీదేవి
" నాధా ! మీరు ఎందుకు పోవడము లేదు మీ హవిర్భాగము మీరూ పొందాలి కదా ! " అని
అడిగింది. శివుడు " దేవీ ! దక్షుడు నన్ను యాగముకు పిలువ లేదు. నాకు
హవిర్భాగమునూ ఏర్పరచ లేదు. అందుకని నేను వెళ్ళ లేదు " అని చెప్పాడు. ఆ
మాటలకు కోపించిన సతీదేవి కోపమును నిగ్రహించుకుని
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9b/Shiva_appeared_in_Daksha_yagna.jpg/220px-Shiva_appeared_in_Daksha_yagna.jpg)
దక్షుని యాగములో శివుడు ప్రత్యక్షమగుట
మౌనంగా ఊగిపోయింది. భార్య అంతర్యము గ్రహించిన శివుడు తన ప్రమధ గణములతో
పోయి దక్షుడి యజ్ఞమును నాశనం చేసాడు. యజ్ఞమునకు విచ్చేసిన దేవతలు, మునులు,
యక్షులు తొక దిక్కుకు పారి పోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు
" పరమశివా ! నీకు ఈ యాగములో హవిర్భాగము కల్పిస్తాము శాంతించు " అన్నాడు. ఆ
మాటలకు శివుడు శాంతించాడు. బ్రహ్మదేవుడు " పరమేశ్వరా ! నీ నుదుటి నుండి
పుట్టిన స్వేదము నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు జ్వరము అనే
పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. అతడు జీవులను ఆవహిస్తాడు. అతడు ఏకరూపములో ఉంటే
ప్రజలుభరించ లేరు కనుక అతడికి వివిధ రూపాలను ప్రసాదించండి " అని అడిగాడు.
అప్పుడు శివుడు జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిలాగా, పాముకు కుబుసంగా, గోవులకు
పాదాల నొప్పిగా, లేళ్ళకు తన రూపము తాము చూడడానికి నిరోధంగా, గుర్రములకు
పార్శపు నొప్పిగా, నెమళ్ళకు ఈకలు రాలునట్లుగా, కోకిలలకు కళ్ళ వ్యాధిగా,
చిలుకలకు ఎక్కిళ్ళుగా, మేకలకు కంగారుతనంగా, పులులకు అలసటగా, మనుష్యులకు
చావు పుట్టులకు కలిగే వ్యాధిగా విభజిస్తున్నాను " అని చెప్పాడు.
ఆచరించవలసిన కర్మలు
ధర్మరాజు
" పితామహా ! శాస్త్ర తత్వము తెలిసిన వాడికి అనుమానాలు అధికము. పరమాత్మ
గురించి ఎవరికి తెలియదు. అలాంటి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి " అని
అడిగాడు. భీష్ముడు ధర్మరాజా ! గురుపూజ, వేదాధ్యయనము, వృద్ధులకు సేవ చెయ్యడము చేయవలసిన సత్కర్మలు. నారదుడు ఈ విషయము ఒక సారి గాలవుడికి చెప్పాడు. ఒక సారి గాలవుడు
నారదుడి వద్దకు వచ్చి " మునీంద్రా ! నేను చాలా శాస్త్రములు అధ్యయనము
చేసాను. కాని నా మనసులో ఏదోవెలితి ఉంది నాకు సంపూర్ణజ్ఞానము ప్రసాదించండి "
అని అడిగాడు. బదులుగా " నారదుడు గాలవా ! మానవుడు ముందు బ్రహ్మచర్య,
గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
పాపకర్మలను అన్నింటినీ వదిలి పుణ్యకర్మాచరణ చేయాలి. మనసు పరిశుద్ధం చేయాలి.
సమస్తప్రాణుల పట్ల దయకలిగి ఉండాలి. సజ్జనసాంగత్యము చేయాలి, ఎప్పుడూ
మధురంగా సౌమ్యంగా మాట్లాడాలి. దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. అహంకారమును
వదిలి పెట్టాలి. ఏ వస్తువు కొరకు ఎవరిని యాచించకూడదు. ఇంద్రియ నిగ్రహము
కావాలి. విషయ వాంఛలకు దూరంగా ఉండాలి. పరనింద, ఆత్మపొగడ్త మాని వేయాలి.
సోమరితనము, అధిక ప్రసగం, మాత్సర్యం, కోపము ఉండకూడదు. ఎల్లప్పుడూ అతిథి
సత్కారం చెయ్యాలి. వేదాధ్యయనము, వేదాంగచర్చలు, యజ్ఞయాగములు, బ్రాహ్మణ
సన్మానము జరిగే ప్రదేశములలో నివసించాలి. ఇలాంటి ఋజువర్తనుడికి సకల దోషములు
తొలగి జ్ఞానోదయం ఔతుంది " అని నారదుడు గాలవుడికి వివరించాడు " అని భీష్ముడు చెప్పాడు.
కాలపాశము
ధర్మరాజు
" పితామహా ! కాలము అవిచ్ఛన్నము కదా ! నా బోటి వాడు ఈ కాలపాశమును ఎలా
ఛేదించగలడు ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ విషయము పూర్వము
సగరమహారాజు అరిష్టనేమి అనే మునిని అడిగాడు. ఆముని చెప్పిన మాటలు
నేను నీకు చెప్తాను " మహారాజా ! మానవుడు ఎప్పుడూ భార్య, బిడ్డలు, ధనము,
ధాన్యము, పశువులు మొదలైన వ్యామోహములో పడి తన మనసును వ్యాకుల పరచుకుంటూ
ఉంటాడు. అటువంటి వాడికి మోక్షము దుర్లభము. వయసు ముదురిన తరువాత అయినా
భార్యను వదిలి ఏకాంత ప్రదేశముకు పోవాలి. ప్రశాంతమైన ఏకాంత ప్రదేశముకు
పోవాలి. అతడికి పుత్రులు ఉన్నా వారిని వదిలి వెళ్ళాలి. అప్పుడే అతడికి
వైరాగ్యము శాంతి కలుగుతాయి. కాని ఈ సంసార లంపటంలో ఉన్నవాడు " అయ్యో ! నేను
లేకపోయిన వీరు ఏమై పోతారు ? ఎలా బ్రతుకుతారు ? అని వాళ్ళకు సేవలు చేస్తూ
చస్తాడు. అప్పుడు బంధుమిత్రులు ఎవరూ అతడిని ఆదుకొన లేరు. ఈ విషయాన్ని
గ్రహించి ముందే వైరాగ్యము అలవరచు కోవాలి. అతడి సేవలను అందుకున్న
బంధుమిత్రులు అతడికి ముక్తి కలిగించ లేరు కనుక ముందే ఆ విషయము గ్రహించి
సంసారం నుండి బయటపడి జ్ఞానసముపార్జన చేయాలి . ప్రతిరోజూ ఎందరో పుట్టడము
మరణించడమూ కళ్ళారా చూస్తున్నాము. చచ్చేవాడు ఏదీ పట్టుకు పోడని గ్రహిస్తే
ఏదీశాశ్వతం కాదని అనుభవంలోకి వచ్చి ముక్తిమార్గంలోకి ప్రవేశిస్తాడు. అలాకాక
ఈ సంసార లంపటంలో కొట్టిమిట్టాడే వాడు ఎన్నటికీ ముక్తిమార్గము చేరలేడు.
మానవుడు ఈ ద్వందాల నుండి బయటపడి మృష్టాన్నము పచ్చడి మెతుకులు, కటికనేల
మృదువైన పట్టు పరుపులను, జింకచర్మమును చీనీ చీనాంబరములను, సమదృష్టితో
చూడాలి. అటువంటి వాడికి ముక్తి సులువుగా లభిస్తుంది. ఎంతో మంది చక్రవర్తులు
ఈ భూమండలాన్ని పాలించారు. వారంతా కాలగర్భంలో కలిసి పోతూ పూచికపుల్ల కూడా
తీసుకు పోలేదు. ఈ విషయము గ్రహించిన సాధకుడు మోక్షము పొందుతాడు. ధసంపాదన
కష్టము కాని దుఃఖములు మాత్రము అవలీలగా చుట్టుముట్టుతాయి. ఈ విషయము
తెలుసుకున్న వాడు తిరిగి జననమరణ ఉచ్చులో పడక మోక్షముకొరకు ప్రయత్నిస్తాడు.
కనుక మహారాజా ! నీవు గృహస్థాశ్రమంలో ఉన్నా తామరాకు వలె నీటి బొట్టులా అంటీ
ముట్టనట్లు ఉండు. అహంకారము లేక మమతలను మమకారములను వదిలిన మోక్షప్రాప్తి
నీకు సులువౌతుంది " అని అరిష్టనేమి బోధించాడు " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! నీ ప్రశ్నకు సమాధానము లభించింది కదా " అన్నాడు.
దానవులు శుక్రాచార్యుడు
ధర్మరాజు
" పితామహా ! దానవులు ధర్మద్వేషులు కదా ! వారికి శుక్రాచార్యులు గురువుగా
మంత్రిగా ఎలా ఉన్నాడు. ఆ శుక్రుడికి ఆపేరు ఎలా వచ్చింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! శుక్రుడి అసలు పేరు భార్గవుడు. భార్గవుడికి యోగ బలము ఎక్కువ. భార్గవుడు కుబేరుడిని మోసగించి అతడి సంపదలన్ని అపహరించాడు. కుబేరుడు ఈ విషయము ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. ఈ విషయము విన్న ఈశ్వరుడు
కుపితుడయ్యాడు. శివుడు కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ ఎక్కడా ఆ భార్గవుడు ?
అని హూంకరించాడు. అది తెలిసిన భార్గవుడు భయపడి ఒక పొదలో దాక్కున్నాడు.
శివుడు అతడిని పట్టుకుని మ్రింగివేసి తిరిగి శుక్లరూపములో బయటకు విడిచాడు.
అయినా శివుడి కోపము తీర లేదు. అప్పుడు పార్వతి
" పరమశివా ! ఈ భార్గవుడు నీ కడుపు నుండి బయటకు వచ్చాడు కనుక ఇతడు మనకు
పుత్రసమానుడు. పుత్రుడి మీద కాఠిన్యము తగదు కనుక అతడి మీద దయ చూపండి "
అన్నది. శివుడు శాంతించాడు. శివుడి శుక్లముగా వచ్చాడు కనుక అతడు ఆతరువాత శుక్రుడు అయ్యాడు " అని చెప్పాడు.
తపోధర్మము పరాశరగీత
ధర్మరాజు
" పితామహా ! మీరు చెప్తున్న కొద్దీ నాకు వినవలెనని కుతూహలము పెరగడము లేదు.
కాని ఏమి అడగాలో తెలియకున్నది కనుక మీరే నాకు మంచి ధర్మములు ఉపదేశించండి "
అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు పరాశరగీతను చెప్తాను. పూర్వము జనకమహారాజు కోరిక మేరకు పరాశరుడు
ధర్మబోధ చేస్తూ " మానవుడు ఇహలోక సౌఖ్యములు, పరలోక సౌఖ్యములు,
ధర్మకార్యములే అని తలచి చిన్న విత్తనము ద్వారా ఫలమును పొందినట్లు ధర్మాచరణ
వలన సుఖము పొందాలి. మంచి పనులకు సుఖము చెడ్డ పనులకు దుఃఖము కలుగుతుంది.
సుఖదుఃఖములు మానవుడిని వదలక వెన్నంటుతూ ఉంటాయి. మానవుడు త్రికరణశుద్ధిగా
అన్యాయము అధర్మము చెయ్యక ఉన్న సత్గతికలుగుతుంది. సత్పదమనగా సత్యము, మనో
నిగ్రహము, అహింస. మనోరధానికి కట్టిన కోరికలనే గుర్రాలు అన్ని వైపులా
పరుగెడుతుంటాయి. బుద్ధి అనే పగ్గములతో వాటిని అదుపులో పెట్టి మనసును
సన్మార్గములో నడపాలి. భగవంతుడు మానవుడికి ఇచ్చిన పూర్ణాయుస్షును
దుర్గుణాలతో మానవుడు మట్టిపాలు చేసుకుని అకాలమరణం పొందుతుంటాడు. అలాకాక
మంచి మార్గాన పయనించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అధర్మము, అక్రమము,
అవినీతి వలన ప్రాప్తించిన సంపదలవలన తాత్కాలిక సుఖము లభించినా అది శాశ్వతము
కాదు. ఆ సుఖములు పాము వలె కాటేసి దుఃఖాల పాలు చేస్తాయి. కనుక ధర్మకర్మాచరణ
ఉత్తమమైనది. విష్ణుస్థుతి, తపస్సు చేయడము, ధర్మప్రవర్తన వలన మనసుకు శాంతి
లభిస్తుంది. పై సుగుణముల వలన ఎంతటి దుర్మార్గుడు కూడా సన్మార్గుడౌతాడు.
గృహములో అగ్ని హోత్రము ఉన్న వాడిని వేదము పుణ్య పురుషుడు అంటుంది. ఎందుకంటే
తల్లి, తండ్రి, గురువు, సన్మార్గము, బలము, బుద్ధి ఇవన్నీ అగ్ని
స్వరూపాలు. సాధుజన సాంగత్యముతో ఎంతటి దుర్మార్గుడైనా సన్మార్గుడౌతాడు.
బ్రాహ్మణులను సేవించిన శూద్రులు కూడా ఇహలోక సుఖములు, పరలోక సుఖములు
పొందగలరు. ఈ మానవుడి శరీరము అనిత్యము. ఈ సత్యమును తెలుసుకున్న మానవుడు
సుఖదుఃఖములకు చలించక ధర్మమార్గమున పయనించాలి. ఇది ఏ జాతి వాడికైనా
అనుసరణీయము. ఎక్కువ ఫలము ఆశించి తక్కువ పాపమైనా చెయ్యకూడదు. ఫలము తక్కువని
పుణ్యకార్యాచరణ మానకూడదు. అందువలన ఇహపర సుఖములు కలుగుతాయి. ప్రతి మనిషి
స్వధర్మము పాటించాలి. స్వధర్మము విడిచి ఎన్ని ధర్మములు చెప్పినా అవి
వ్యర్ధమే. యజ్ఞములు చెయ్యని బ్రాహ్మణుడు, ప్రజారక్షణ చెయ్యని క్షత్రియుడు,
ధర్మమార్గమున విత్తము సంపాదించని వైశ్యుడు, విప్రుల సేవ చెయ్యని శూద్రుడు
అధర్మపరులే ! ధర్మముగా సంపాదించినది లేశమైనా అది అఖండ ఫలితాన్ని ఇస్తుంది.
అన్యార్జితమైన ఆస్తి, ధనము కోటి రెట్లు ఉన్నా అది నిష్ఫలమే అని పెద్దల
ఉవాచ. బ్రాహ్మణుడు పేదరికము చేత బాధించబడిబ అతడు క్షత్రియ ధర్మము, వైశ్య
ధర్మము ఆచరించ వచ్చు. కాని సేవకా ధర్మము ఆచరించిన అతడు నరకానికి పోతాడు.
శూద్రుడు తన జీవనాధారము నశించినప్పుడు వైశ్యధర్మము, పశుపోషణ, వ్యవసాయము
చేసి జీవించ వచ్చు.
పరమగతి
జనక
మహారాజా ! పూర్వము రాక్షసులు మానవులు చేస్తున్న ధర్మకార్యములు సహించ లేక
మానవులను ఆవహించారు. అందు వలన మానవులు అధర్మవర్తనులు అయ్యారు. మానవులలో
గర్వము, రోషము ప్రవేశించి యజ్ఞ యాగములు చెయ్యడము ఆపివేశారు. అది చూసి
దేవతలు చింతించి శివుడి వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. శివుడు దేవతల మొర
ఆలకించి తన త్రిశూలమును పంపాడు. ఆ త్రిశూలము శక్తి వలన మానవులలోని
రాక్షసత్వం నశించింది. అలా శివుడు ప్రజారక్షణ చేసిన తరువాత యజ్ఞయాగములు
యధావిధిగా జరిగాయి. కనుక జనకమహారాజా నీవు కూడా రాక్షసత్వము అణచి వేసి
వారిలో ధర్మనిరతిని పెంచు. ఇక తపసు గురించి చెప్తాను విను. పూర్వము
విద్యాధరులు, మునిపుంగవులు, దేవతాగణములు తపస్సు చేయడం వలననే వైభవం పొందారు.
బ్రహ్మదేవుడు
కూడా తపస్సు చేతనే సమస్త లోకములను సృష్టించాడు. రాజులు కూడా తపస్సు వలననే
కీర్తి గడించారు. మనకు సుగంధము, పట్టుపరుపులు తపసు వలనే ప్రాప్తించాయి.
మానవుడు భార్య, బిడ్డలు, ధనము, భోగములు, సంపదలతో విసిగి పోయినప్పుడు నిర్మల
మనసుతో చేసిన తపసు అతడికి ఉపశాంతి కలిగిస్తుంది. లోభము సుఖదుఃఖాలను
కలిగిస్తుంది. కాని ఆ సుఖదుఃఖాలు కూడా తపస్సు లేమి వలనే సంభవిస్తాయి. సుఖము
వచ్చినప్పుడు అహంకరించడం దుఃఖంకలిగినప్పుడు కుంగిపోవడం సహజం. కాని
తపమాచరించిన వాడు అన్నిటినీ సమానంగా చూడగలడు. తపస్సిద్ధి పొందిన మానవుడికి
ధర్మార్ధకామమోక్షములు ప్రాప్తిస్తాయి " అని పరాశరుడు జనకుడికి బోధించాడు.
చతుర్వర్ణాలు పుత్ర జననం
జనకుడు
పరాశరుడితో " ఓ మహర్షీ ! మానవుల కర్మలను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్య, శూద్ర అని నాలుగు చతుర్వర్ణాలుగా విభజన జరిగింది కదా ! మరి వారిలో
హెచ్చు తగ్గులు ఎందుకు. తండ్రి తానే పుత్రుడుగా జన్మిస్తాడు అంటారు కదా !
అది ఎలా అని వివరించండి ? " అని అడిగాడు. పరాశరుడు " జనక మహారాజా !
బ్రహ్మ ముఖము, భుజములు, తొడలు, పాదముల నుండి జన్మించారు. వారు జన్మించిన
ప్రదేశము అనుసరించి వారిలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తండ్రి తన మానసిక
శరీరస్థితిని తన తేజస్సులో నిక్షిప్తము చేసి భార్యద్వారా పుత్రుడికి జన్మ
ఇస్తాడు కనుక కుమారుడు తండ్రికి ప్రతి రూపము ఔతాడు. ఋష్యశృంగాదులు అలా
జన్మించిన వారే కదా ! " అని పరాశరుడు చెప్పాడు. జనకుడు " చతుర్వర్ణ ధర్మాలు
గుణగణాలు వివరించండి " అని జనకుడు అడిగాడు. పరాశరుడు " మహారాజా ! దానము
పుచ్చుకోవడము, యజ్ఞయాగాదులు చేయించడము, వేద విద్యలు బోధించడం బ్రాహ్మణుల
ముఖ్య విదులు. ప్రజారక్షణ రాజుకు విధించబడిన విశేష బాధ్యత క్షత్రియుడి
ముఖ్యవిధి. వ్యవసాయము, పశుపోషణ, వ్యాపారము, ధనార్జన వైశ్యుడికి విధించబడిన
ధర్మము. శూద్రులకు సేవా ధర్మము ముఖ్యము. కాని అన్ని వర్గముల వారికి సాధారణ
ధర్మాలు ఉన్నాయి. సత్యము, శుచి, అహింస, అసూయద్వేషములు లేకుండుట, అతిథి
సత్కారము, పితరులకు శ్రాద్ధకర్మలు చేయడము ప్రధానధర్మాలు. ఏ మానవుడికి
పరస్త్రీవ్యామోహము తగదు. విశేషధర్మాలు పాటిస్తూ సాధారణధర్మాలు ఆచరించే
మానవుడికి ఇహపర సుఖములు తధ్యము. విశేషధర్మాలను విడిచి పరధర్మమును ఆచరించిన
వాడికి పాపము తప్పదు.
అహింస
ఇక
హింస అహింస అహింసాకరమైన పనులగురించి చెప్తాను విను. మానవుడికి శమము, దమము
ముఖ్యము. అవి లేని వారికి హింసాప్రవృత్తి కలుతుంది. అహింస వలన శమము, దమము
ప్రాప్తిస్తాయి. ప్రజారక్షణ కొరకు యుద్ధము చెయ్యడములో క్షత్రియుడికి హింస
చేయక తప్పదు. అందుకు పరిహారం చెప్తాను. యుద్ధరంగములో శత్రువు కింద పడినా,
పారిపోతున్నా, రథము గుర్రము లాంటి వాహనము నుండి కింద పడినప్పుడు అతడిని
చంపకూడదు. కాని మానవుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి అహింసతో సాటిరావు.
న్యాయమార్గంలో అహింసాయుతంగా చేసిన యుద్ధములో మరణించిన వాడికి మోక్షము
లభిస్తుంది. యుద్ధంలో వీరుడు తన కంటే బలవంతుడిని కాని సమానబలవంతుడిని కాని
సంహరించిన అతడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. శరీరము త్రిగుణాలు,
పంచేంద్రియాలు, పంచభూతములతో చేయబడినదని తెలిసిన ఎవరైనా అధర్మకార్యాలు
చేయగలరా ! పుట్టిన వాడికి చావుతప్పదని తెలుసుకుని అశాశ్వతమైన ఈ శరీరం
అనుభవించే సుఖములు అశాశ్వతమైనవని తెలిసిన వాడు అధర్మానికి ఒడిగట్టడు.
సజ్జనుడు ధర్మాత్ముడు అయిన వాడు ఉత్తరాయణంలో జరిగే యుద్ధం మొదలైన కారణాల
వలన మరణిస్తాడు. దుర్జనుడు ఆత్మహత్య, విషప్రయోగము, ఉరి వేసుకోవడం, నీళ్ళలో
మునగడం వలన మరణిస్తాడు. మానవులకు తన అజ్ఞానమే తనకు బద్ద విరోధి. మానవుడు తన
అజ్ఞానం వలన అకృత్యాలకు అధర్మాలకు పాల్పడి నశించి పోతాడు. మానవ జన్మ
ఉత్తమమైనది ఏకులంలో జన్మించినా సరే ! మానవజన్మలోనే సద్గతి పొందే అవకాశం
ఉంది. ఫలాపేక్ష లేక చేసిన పుణ్యకార్యాలు, అతిథిపూజలు, పుణ్యయాత్రా స్నానము
శాశ్వత సుఖాన్ని ఇస్తుంది " అని పరాశరుడు జనకుడికి చెప్పాడు.
పరమగతి
జనకుడు
పరాశరుడిని " పరమగతి అంటే ఏమిటి ? ఏ పని చేస్తే మేలు కలుగుతుంది ?ఏ పని
చేస్తే నాశనం ఉండదు ? " అని అడిగాడు. జనకమహారాజా విషయవాంఛలకు లోను కాక
ఉండడమే మేలైనది. మంచిజ్ఞానం సంపాదించడమే పరమగతి. అన్ని కర్మలలోకి తపస్సు
నాశనంలేనిది. తెలివి కలిగినవాడు విషయవాంఛలలో మునిగి తేలుతున్నా తామరాకు వలె
నీటిబొట్టులా ఉంటూ ప్రాపంచిక విషయాలను వదిలి తటస్థంగా ఉంటాడు. జ్ఞానము
లభించినందుకు అది పర్యవసానం. అజ్ఞానులకు చిత్తము విషయవాంఛల వైపు లక్క
కర్రకు అతుక్కున్నట్లు గాఢతరంగా ఆకర్షితమై వాటిలో సదా మునిగి తేలుతుంది.
సూర్యకాంతశిల సూర్యకిరణాలకు ఆకర్షితమైనట్లు మంచి విషయాలకు మంచిమనసు
స్పందిస్తుంది. సదా భగవంతుడిని ధ్యానించే మనసు భగద్చింతనతో మునిగి
పోయినట్లు. అరటి చెట్టు బెరడులా ఈ ప్రపంచం నిస్సారమైనదని ఎరిగిన జ్ఞాని
చివరకు ముక్తి పొందగలడు. పుట్టినదాది ప్రాపంచిక విషయాలలో కొట్టుమిట్టాడే
మానవుడు ఆత్మను ఉద్ధరించ లేడు. గుడ్డివాడు అలవాటు పడిన పరిసరాలలో అనాయాసంగా
తిరిగిన విధంగా ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు కాని బయటపడడానికి
ప్రయత్నించడు. తామరతూడును నీటితో కడిగి బురదను వదిలించినట్లు జ్ఞానమనే
పవిత్ర జలముతో కడిగిన బుద్ధి దేదీప్యంగా ప్రకాశిస్తుంది. ఎలుకను పట్టి
తినడానికి పిల్లి ఉన్నట్లు మృత్యువు తనను కబళించడానికి పొంచి ఉన్న విషయం
ఎరగని మానవుడు కడుపు నింపుకోవడానికి కోరికలు తీర్చుకోవడానికి జీవిత
కాలాన్ని వెచ్చిస్తాడు. బరువు ఎక్కువైన పడవ సముద్రాన్ని ఎలా దాటలేదో
కోరికలు ఎక్కువైన జీవి సంసార సాగరాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేర లేడు. కనుక
కోరికలు, అత్యాశ ప్రతిబంధకాలని గ్రహించాలి. మానవుడు భార్యా, బిడ్డలు,
అన్నదమ్ముల కొరకు నిరంతరం శ్రమించినా ఆఖరి దశలో వారు ఆదుకుంటారన్న నమ్మకం
లేదు. మరణాంతరం ఆదుకునేది అతడి పుణ్యమూ, జ్ఞానమే అని గ్రహించి
జ్ఞానసముపార్జన చేసిన అది అతడిని ఆదుకుంటుంది. మబ్బు పట్టిన సమయాన
సూర్యకాంతి కనపడ పోయినా అది సూర్యుడిని ఎన్నటికీ వెన్నంటి ఉన్నట్లు
సమదృష్టి కలిగిన ధర్మాత్ముడిని జ్ఞానము ఎన్నడు వదలదు " ఇలా పలు విధముల
పరాశరుడు చేసిన బోధలకు జనకుడు పరవశించాడు " భీష్ముడు ధర్మజుడికి చెప్పాడు.
దమము సత్యము క్షమ హంసగీత
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Brahma_couselin_Sadhya_as_Swan_form.jpg/220px-Brahma_couselin_Sadhya_as_Swan_form.jpg)
సాధ్యులకు హంస రూపములోని బ్రహ్మ ఉపదేశము
ధర్మరాజు సందేహం తీరని మనసుతో " పితామహా ! మీరు చెప్పినట్లు దమమము, సత్యము, క్షమ అంతటి ఉత్తమమైన గుణాలా ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీవు హంసగీత వింటే నీ సందేహములు తీరగలవు. ధర్మరాజా ! ఒక సారి బ్రహ్మదేవుడు
హంసరూపంతో ఒక కొలనులో క్రీడించసాగాడు. అప్పుడు కొంత మంది సాధ్యులు ఆ హంసను
చూసారు. " హంసరాజమా ! మేము సాధ్యులము అనే దేవతలము. నీకు అన్ని విద్యలు
తెలుసు కనుక మా సందేహములు సమాధానం చెప్పండి. అన్నిటింటి కంటే ఉత్తమమైనది
ఏది ? చిత్తము ఎప్పుడూ దేని అందు లీనమై ఉంటుంది. పురుషుడు ఈ కర్మ బంధము వలన
ఎలా విముక్తుడు కాగలడు " అని అడిగారు. హంసరూపం లోని బ్రహ్మ ఉన్న బ్రహ్మ "
క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సత్యము పలకడము, అత్యంత మహిమ కలిగినవి.
సమస్త ధర్మములలో అవి కీర్తించ తగినవి. అవి నీతికరమైనవి, ఇతరులను
బాధపెట్టేవి, నిష్ఠూరమైన మాటలు, ధర్మకార్యముకు పనికి రానివి సత్యములు కావు
కనిక నిజమే అయినా సజ్జనుడు అలాంటి వాటిని పలకడు. సజ్జనుడు ఇతరుల నిందలకు,
అవమానములకు చలించక శాంతం వహిస్తాడు. అతడి కీడుచేసిన వాడికి మేలుచేస్తాడు,
కొట్టిన వాడిని కూడా క్షమిస్తాడు. వాదసారము సత్యము, సత్యసారము
ఇంద్రియనిగ్రహము, ఇంద్రియనిగ్రసారము మోక్షము. కనుక సత్యవ్రతుడికి మోక్షము
తధ్యము. పంచ జ్ఞానేంద్రియము, పంచ కర్మేంద్రియములను అదుపులో పెట్టుకున్న
వాడు సర్వ ధర్మములను ఆచరించినట్లే . ఇంద్రియనిగ్రహంతో పాపం నశించి ఆత్మ
నిర్మలమై మోక్షప్రాం ప్రాప్తిస్తుంది. మనసును అదుపులోఉంచిన వాడికి మోక్షము
కరతలామలకం అని పెద్దలు చెప్తారు. పరులను నిందించినప్పుడు అతడి పాపములు తనకు
అంటుకుంటాయి. కనుక ఇతరులను నిందించతగదు. కోపము అన్ని విధాలా అనర్ధం.
కోపిష్టి చేసిన తపసు, జపము, దేవతార్చన, వ్రతములు, దానములు, యజ్ఞము,
పితృకార్యములు మొదలైన పుణ్యకార్యములు నిష్ఫలములు. మౌనం కంటే మంచి పలుకు
మేలు. ఈతరులకు ప్రీతి కలిగించే సత్యము పలికే వాడిని దేవతలు కూడా
మెచ్చుకుంటాడు " అని హంస రూపములో ఉన్న బ్రహ్మ సాధ్యులకు చెప్పాడు. సాధ్యులు
" హంసరాజమా ! ఈ లోకము దేని వలన కప్పబడి ఉన్నది ? జీవుడు ఎందుకు ప్రాకాశ
హీనుడౌతాడు ? మిత్రులు విడి పోవడానికి కారణం ఏమిటి ? మోక్షం లభించడానికి
కారణం ఏమిటి ? అని అడిగారు. హంస రూపంలో ఉన్న బ్రహ్మ " సాధ్యులారా ! ఈ
లోకమంతా అజ్ఞానము చేత కప్పబడి ఉంది. మాత్సర్యముకు లోనైన జీవుడు ప్రకాశించ
లేడు. లోభి మిత్రులను కోల్పోతాడు. సదా విషయవాంఛలలో తేలే వాడికి మోక్షం
లభించదు " అని హంసరూపంలోని బ్రహ్మ చెప్పాడు. సాధ్యులు " తమలోతాము లీనం
అయ్యే వాడు ఎవరు ? అందరికీ ప్రీతి కలిగించే వాడు ఎవడు ? బలవంతుడు ఎవడు ?
కలహ మార్గము నుండి తొలిగి పోగలిగిన వాడు ఎవడు ? " అని అడిగారు. హంసరూపం
లోని బ్రహ్మ " ప్రాజ్ఞుడు తనలో తానే లీనమై బలవంతుడై కలహస్వభావమును వదిలి
వేస్తాడు " అని చెప్పాడు. సాధ్యులు " హంసరాజమా ! విప్రుడు దైవత్వం ఎప్పుడు
పొందగలడు ? ఎందు వలన సాధుత్వం పొందుతాడు ? ఎందు వలన దుర్జనుడౌతాడు ? ఎందు
వలన మనిషిగా చరిస్తాడు ? వివరించ గలరా ! " అని అడిగారు. హంసరూపం లోని
బ్రహ్మ " విప్రుడు వేదాధ్యనంతో దైవసమానుడౌతాడు. పుణ్యకార్యాచరణతో సాధుత్వం
లభిస్తుంది. దుర్మార్గము వలన దుర్మార్గుడు ఔతాడు. శుచిశుభ్రత విడిచి
విషయవాంఛలలో మునిగి పోయిన వాడు మానవుడౌతాడు " అని చెప్పి బ్రహ్మ తన నిజరూపం
ధరించి వారిని దీవించి బ్రహ్మలోకం వెళ్ళాడు " అని చెప్పిన భీష్ముడు "
ధర్మనందనా ! ఈ హంస గీత వలన నీ సందేహం తీరిందా ! " అని అడిగాడు.
సాంఖ్యము యోగము
ధర్మరాజు " పితామహా ! యోగశాస్త్రము, సాంఖ్యయోగము గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! సాంఖ్యులు తాము అను సరించేదే ఉత్తమమైనది అని చెప్తారు. కాని
నాకు రెండూ సమానవైనవే అని చెప్తారు. యోగులు ప్రత్యక్ష సాక్ష్యాన్ని నిజము
అని నమ్ముతారు. సాంఖ్యులు వేదములు, శాస్త్రములు ప్రమాణమని చెప్తారు. కానీ
ఆచరణలో రెండూ ఒకటే, ఇద్దరి లక్ష్యము ఒక్కటే శాస్త్ర రూపంలో రెండింటికీ భేదం
ఉన్నా ఫలితం ఒక్కటే. సర్వభూతముల అందు ప్రేమగా ఉండడం, నియమ నిష్టలు
పాటించడం, శుచి శుభ్రత పాటించడం రెండింటిలో ఉంటాయి కదా ! " అని భీష్ముడు
చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! భూతదయ, శౌచము, నియమ పాలన సాంఖ్యులకు
యోగులకు ఒకటే అయినా శాస్త్రములు మాత్రం రెండుగా ఎందుకు ఉన్నాయి ? " అని
అడిగాడు ధర్మరాజు. భీష్ముడు " ధర్మనందనా ! యోగులు తమ యోగ బలముతో కామము,
కాంక్ష, మోహము, రాగము తొలగించుకుని ఉన్నత స్థితిని పొందుతాడు. కనుక యోగికి
యోగబలం ముఖ్యము. బలహీనుడైన వాడు ప్రవాహ వేగానికి కొట్టుకు పోయినట్లు యోగబలం
లేని వాడు విషయవాంఛల ప్రవాహంలో కొట్టుకు పోతాడు. మదించిన ఏనుగు
ప్రవాహాన్ని అడ్డగించినట్లు యోగి యోగబలంతో విషయవాంఛల ప్రవాహాన్ని మళ్ళించి
చిత్తమును ముక్తిమార్గం వైపు మళ్ళించగలడు. మృత్యువు కూడా అటువంటి యోగి
వద్దకు రావడానికి భయపడతాడు. యోగి తన ఇచ్ఛకు వచ్చినట్లు ప్రవర్తించినా
సంసారంలో చిక్కుకొనడు. యోగి యోగములో నైపుణ్యం సాధించి మోక్షం అనే
లక్ష్యాన్ని చేదించి మోక్ష సౌధంపైన నిలువగలడు. రధికునకు సారధి వలె,
యోగమార్గంలో నిశ్చలుడైన యోగి ఆత్మను సరి అయిన మార్గంలో నడిపించగలడు. మనిషి
శిరస్సు, నాభి, హృదయము, పొట్ట, చెవులు, పక్కలు వీటి వలన ఆత్మను దర్శించ
వచ్చు " అని భీష్ముడు చెప్పాడు.
యోగి ఆహారము
ధర్మరాజు
" పితామహా ! యోగి తినవలసిన ఆహారం ఏమిటి ? తినకూడని ఆహారం ఏమిటి ? " అని
అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! యోగి నూనెతో చేసిన పదార్ధములను తినకూడదు.
ఆకలి తీరే విధంగా మితాహారం, జలము తీసుకోవాలి. రుచికరమైనవైనా పొట్ట నిండా
భుజించ కూడదు. కామము, క్రోధము, నిద్రను, ఆశను, భయమును వదిలి పెట్టాలి.
నిర్జనప్రదేశంలో కూర్చుని శ్వాశనిశ్వాశను అదుపులో పెట్టుకుని తనలోతాను
ఆనందం అనుభవిస్తూ మోక్షమును పొందాలి . ఇది అసిధారావ్రతం కత్తి మీద
సాము వంటిది ఆచరణకు అంత సులభమైనది కాదు. కాని చిత్తశుద్ధి కలిగిన యోగికి
అసాధ్యమైనది లేదు. యోగసిద్ధుడు అన్నిటికీ అనాసక్తుడు. యోగి పుట్టినప్పుడు
సంయోగము మరణించునప్పుడు దీనత్వం ఉండవు. భోగం వలన సుఖం భోగహీనత వలన దుఃఖం
కలుగదు. ధర్మనందనా ! నీకు యోగవిధానం చెప్పాను " అని చెప్పాడు.
సాంఖ్యయోగము
ధర్మరాజు
" పితామహా ! నాకు సాంఖ్య శాస్త్రం గురించి వివరిస్తాను " అని చెప్పాడు.
భీష్ముడు " ధర్మనందనా ! పూర్వం కపిలుడు చెప్పిన సాంఖ్య శాస్త్రం గురించి
నీకు వివరిస్తాను. మానవుడు ముందు జ్ఞానం సంపాదించాలి. తరువాత ప్రపంచ
విషయాలను జాగ్రత్తగా గ్రహించాలి. ఇది ఒక్కోదానికి ఒక్కో విధంగా ఉంటుంది.
పశువులు, పక్షులు, మానవులు, దేవతలు, గంధర్వులు, పితరులు, సిద్ధులు,
గరుడులు, కిన్నెరలు భిన్నంగా ప్రవర్తిస్తారు. వీరి గురించి తెలుసుకోవడం
అవసరమా ! అని నీవు అనుకోవద్దు. అన్నీ విషయములు తెలిసి ఉంటే వాటి నుండి
తప్పించుకోవడం తేలిక. ధర్మనందనా ! చెవికి శబ్ధం, కంటికి రూపం, చర్మానికి
స్పర్శ, నాలుకకు రుచి, ముక్కుకు వాసన, కడుపులో జఠరాగ్ని, ఆకాశంలో వాయువు,
అగ్నిలో జలం, జలములో భూమి, ఇంద్రుడిలో చేతులు, వామనుడి అందు కాళ్ళు, ధనంలో
లోభం, తమోగుణంలో బుద్ధి, రజోగుణంలో తమోగుణం, సత్వగుణంలో తమోగుణం ఉన్నాయి.
సత్వగుణం ఆత్మలో అను సంధానమై ఉంటుంది. ఆత్మ నారాయణుడు, పరమేశ్వర రూపంలో
లీనమై ఉంటుంది. ఆ పరమాత్మ మోక్షాసక్తుడు. ఆ మోక్షానికి దేనితో సంబంధం లేదు.
సత్వ, రజో, తమోగుణ ప్రధానమైన ప్రకృతిలో 16 వికారాలు ఉన్నాయి. మనలో ఉన్న
ఆత్మకు ఆధారం ఈ ప్రకృతియే. ఆత్మ స్వయం ప్రకాశితమైన ఒక తేజోమయరూపం. రెండు
రూపములుగా ప్రకాశించే ఈ ఆత్మ ఒక రూపంతో పంచేంద్రియాల ద్వారా ఈ లోకంలోని
విషయాలను అనుభవిస్తుంటుంది. ఇంకొక రూపం తటస్తంగా ఉండి సాక్షీ భూతంగా చూస్తూ
ఉంటుంది. మనలో ఉన్న వాయువు ఒకటే అయినా అది అయిదు విధాలుగా పనిచేస్తుంది.
మానవుడు ఈ వాయువులను నిశితంగా పరిశీలించిన ఆత్మ దర్శనం లభిస్తుంది. అటువంటి
మానవుడు తాను మాతృ గర్భంలో ఉన్నప్పుడు, జననకాలంలో పడే వ్యధ, బాల్యంలో ఉండే
మూర్ఖత్వము, యవ్వనంలోని రాగద్వేషాలు, విషయాసక్తి, వార్ధక్యము లోని
దీనావస్థ తెలుసుకుని వాటి నుండి విముక్తిపొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ
మానవుడు పుణ్యకార్యములు చేసి స్వర్గముకు వెళ్ళి అక్కడ పుణ్యము పాపము లేని
తటస్థజీవితము గడిపి పుణ్యము కరిగిపోయిన పిదప తిరిగి మానవుడిగా జన్మించి
విషయాలలో చిక్కుకుంటాడు. పాపకార్యములు చేసిన మానవుడు పశుపక్ష్యాది జన్మలు
ఎత్తుతాడు. జ్ఞాని ఈ రెండింట చిక్కక మోక్షంపొందుతాడు. అజ్ఞాని తనకు కలిగే
వృద్ధాప్యమూ, మరణము గురించి ఎరుగక ఎదుటి వాడికి వచ్చే వృద్ధాప్యము, చావు
గురించి చింతింస్తున్నాడు. మిగిలిన వారు తాము చిరకాలం జీవిస్తామని
విర్రవీగుతుంటాడు. ధర్మనందనా ! ఈ దేహములో కామము, క్రోధము, భయము, నిద్ర,
నిట్టూర్పు, అనే అయిదు దోషములు ఉన్నాయి. క్షమవలన కోపము, సంకల్పం లేనందున
కామము, ప్రమాదము లేనందు వలన భయము, సజ్జన సాంగత్యం వలన నిద్ర, మితభోజనం వలన
నిట్టూర్పులు నివారించ వచ్చు. ఇవీ సాంఖ్యయోగులు ఆచరించే విధానము.
సాంఖ్యయోగి ప్రాపంచిక విషయములు పక్కకు పెట్టి సాంఖ్యము అనే ఓడను ఎక్కి
జ్ఞానము అనే చుక్కానితో సంసార జీవితమును అవలీలగా దాటగలడు. ఈ సంసారం అనే
ఓడలో దుఃఖం అనే నీరు ఉంటుంది. అందులో వ్యాధులు, రోగములు అనే మొసళ్ళు, భయాలు
అనే పాములు సంచరిస్తుంటాయి. ప్రవాహమే హింస, విషయాసక్తి బురద, ఆశలు
సుడిగుండాలు. ఆ సముద్రంలో అట్టడుగున సుఖసంతోషాలు అనే రత్నాలు ఉన్నాయి. ఆ
సముద్రముకు తీరం సత్యం, ఈ సంసార సాగరమును దాటిన వాడిని సూర్యుడు
తన లోకముకు తీసుకు పోతాడు. తరువాత జీవుడు సూక్ష్మరూపంలో తామరతూడులో ఉన్న
సన్నని ద్వారము గుండా ప్రయాణిస్తాడు. ఆ జీవుని ప్రవాహుడు ఆకాశంలోకి
చేరుస్తాడు. తరువాత అతడు పరమాత్మలో ఐక్యం ఔతాడు " అని భీష్ముడు చెప్పాడు.
ముక్తి పొందిన జీవుడు
ధర్మరాజు
" పితామహా ! పరమాత్మలో చేరిన జీవుడు తన పూర్వ వృత్తాంతము గురించి
తలచుకుంటాడా లేక మరచిపోతాడా ! మోక్షము చెందిన తరువాత జీవుడి పరుస్థితి
ఏమిటి ? తన పూర్వస్థితికన్నా భిన్నంగా ఉంటాడా ? మోక్షం పొందిన జీవుడు
పూర్వచింత ఉంటుందా ! వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కపిలమహర్షి
ఈ విషయం గురించి వివరంగా చెప్పాడు. మానవుడు స్పర్శ చేత కాని వినడం చేత
కాని ఆత్మను తెలుసుకోలేడు. మనసు ద్వారానే ఇంద్రియములను తెలుసుకోగలడు.
జ్ఞానస్వరూపుడైన మానవుడు మనసు ద్వారా ఇంద్రియములను తెలుకున్నా లేకున్నా
ఒకటే. ముక్తి పొందిన మానవుడికి ఇంద్రియములు జడపదార్ధముతో సమానము. వాటిపని
అవి మనసుతో పని లేకుండా చేసుకు పోతుంది. సాధకుడు ఈశరీరములో ఉండగానే
మోక్షంపొందిన తరువాత ఇంద్రియములను అవి చేసే పనులను నిర్వికారంగా
చూస్తుంటాడు. సాధకుడు తన లోని పంచభూతములను, బుద్ధిని, మనసుని అణిచిపెట్టి,
పరమాత్మను చేరుకుంటాడు. అలా పరమాత్మను చేరుకున్న వాడికి ఇక జన్మ ఉండదు.
జన్మరాహిత్యం పొందడమే మోక్షం. ఇంతకు మించిన దశ వేరేలేదు. దీనిని మానవుడు
గురువు వద్ద ఉపదేశం పొంది నియమానుసారం సాధించాలి. ధర్మరాజా ! దీనిని సాంఖ్య
పద్ధతి అంటారు. పరమపదాన్ని చేరడానికి ఇంతకంటే ఉత్తమమార్గం వేరేలేదు. ఈ
పద్ధతిని బ్రహ్మదేవుడు
కూడా గౌరవిస్తాడు. నీవు కూడా ఇలా నిర్మల మనస్కుడవై మోక్షం పొందు.
ధర్మనందనా యోగులు జ్ఞానుల మధ్యతేడా చాలా స్వల్పం. యోగి చూసిన విధంగానే
సాంఖ్యుడు చూస్తాడు వారిద్దరి దృష్టికూడా ఒకటే. కనుక మునులు, యోగులు,
సాంఖ్యులు ఒకే మార్గంలో పయనిస్తాడు. వారి పేర్లలో బేధమే కాని అవి ఒక దానిలో
ఒకటి సంచరిస్తాయి. తత్వవేత్తలు కూడా దీనిలో అభేదం చూడరు. మానవుడు యోగ
మార్గం లేక సాంఖ్యమార్గమున సంచరిస్తూ మోక్షప్రాప్తికి ప్రయత్నించే సమయంలో
దారి తప్పి మోక్షముకు చేర లేకపోయినా అతడికి స్వర్గ ప్రాప్తి తదథ్యం. స్వర్గ
సుఖాలు అనుభవించిన తరువాత తిరిగి జ్ఞానుల ఇంట మానవుడుగా జన్మను ఎత్తి సాధన
కొనసాగించి మోక్షం పొందుతాడు. కనుక ధర్మజా ! నీవు కూడా ఈ మార్గమే
అవలంబించు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు భారత కథను చెప్పాడు.
శాంతి పర్వము షష్టమాశ్వాసము-ప్రధమ భాగం
- 1.1 అక్షరము
- 1.2 జంతుసృష్టి
- 1.3 ఆత్మ ఏకత్వము అనేకత్వము
- 1.4 విద్య అవిద్య
- 1.5 వసుమంతుడు
- 1.6 యాజ్ఞవల్క్యుడు
- 1.7 ప్రళయము
- 1.7.1 ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము
- 1.8 ప్రకృతి పురుషుడు
- 1.9 జీవుడు జీవాత్మ
- 1.10 యోగము ప్రాణాయామము
- 1.11 మరణం లోకాలు
- 1.12 మరణ సమయము
- 1.13 పరతత్వము
- 1.14 విశ్వావసుడు
- 1.15 పురుషుడు ప్రకృతి
- 1.16 యాజ్ఞవల్క్యుడు
- 1.17 గృహస్థధర్మము మోక్షము
- 1.18 సన్యాసము
- 1.19 పరిక్షార్ధం సులభ వాదన పొడిగించడం
- 1.20 శుకుడు వైరాగ్యము
- 1.21 శుకజననం
- 1.22 శుకుడు జనకుడు
- 1.23 ఆశ్రమధర్మాల అవసరం
No comments:
Post a Comment