- ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కథను సవిస్తరంగా
వివరించసాగారు. కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన
అనుచరుడైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు
బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు.
బ్రహ్మదేవుడు " మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి
దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని
చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి " అని చెప్పాడు. దేవతలు దధీచి
మహర్షి ఎముకలను దానంగా అడగగానే ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలను దానంగా
ఇచ్చాడు. వాటితో త్వష్ట ప్రజాపతి వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇచ్చాడు.
ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని సంహరించాడు. వృత్తాసురుని అనుచరులైన
కాలకేయులు సముద్రగర్భంలో దాగి రాత్రివేళలో బయటకు వచ్చి జనులను ఋషులను
బాధిస్తుండే వాళ్ళు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు.
విష్ణుమూర్తి దేవతలతో " కాలకేయులు మహా బలవంతులు. పైగా సముద్ర గర్భంలో
ఉన్నారు కనుక సంహరించడం వీలు కాదు. సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు.
కనుక మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళి తరుణోపాయం అడగండి " అని చెప్పాడు.
దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి " పూర్వం వింధ్య పర్వతం పెరిగి జగత్తుకు
విపత్తుగా పరిణమించినప్పుడు తమరి వలన ఆ కీడు తొలగింది. అలాగే ఇప్పుడు కూడా
మా కష్టాన్ని మీరే పోగొట్టాలి " అని అడిగారు.
వింధ్యపర్వతం పెరుగుట
అగస్త్యుని గురించి వింటున్న ధర్మరాజు రోమశుని చూసి " అయ్యా! వింధ్య
పర్వతం పెరగటం ఏమిటి? వివరించండి " అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో "
ప్రతి రోజు సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాడు. అది చూసి
వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. " సూర్యదేవా! నేను పర్వతాలకు రాజును,
నువ్వు నాకు ప్రదక్షిణం చేయకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు
చేస్తావు? " అని అడిగాడు. సూర్యుడు " బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇలా
చేస్తున్నాను " అని పలికాడు. ఆ మాటకు వింధ్యపర్వతానికి ఆగ్రహం కలిగింది.
అలా అలా పైపైకి ఎదుగుతూనే ఉన్నాడు. అలా సూర్యచంద్రుల మార్గాలను
నిరోధించాడు. లోకాలు అంధకారంలో మునిగి పోయాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు
వెళ్ళి మొరపెట్టుకున్నారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో వింధ్యపర్వతం
వద్దకు వెళ్ళి " వింధ్యపర్వతమా ! నేను దక్షిణదిక్కుగా వెళుతున్నాము మాకు
దారి ఇచ్చి తిరిగి వచ్చేవరకు అలాగే ఉండు " అన్నాడు. అలాగేనని అంగీకరించిన
వింధ్య పర్వతం భూమికి సమానంగా దిగి వచ్చాడు. అప్పటి నుండి పెరగడం
ఆపివేసాడు. తరువాత రోమశుడు కథను పొడిగిస్తూ " అగస్త్యుడు దేవతల కోరికపై
సముద్ర జలాలను త్రాగి వేసాడు. దేవతలు కాలకేయుడు మొదలైన వారిని సంహరించారు.
చావగా మిగిలిన వారు పాతాళానికి పారి పోయారు.దేవతలు " మహర్షీ! మీ దయ వలన
మాకు రాక్షస బాధ తప్పింది. మరల సముద్రాలను జలంతో నింపండి " అని
ప్రార్థించారు. అగస్త్యుడు " దేవతలారా! అది నాకు సాధ్యం కాదు. సముద్రజలం నా
పొట్టలో ఇంకి పోయాయి " అన్నాడు. అగస్త్యుడు సముద్ర జలాలను తిరిగి
ఇవ్వలేనని చెప్పడంతో దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి
మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు " సముద్ర జలాలను రప్పించడం ఇప్పుడు సాధ్యం
కాని పని. చాలా కాలం తరువాత భగీరధుడు ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు, అని
బ్రహ్మదేవుడు చెప్పాడు " అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.
భాగీరధుడు
రోమశుని
మాటలు విని ధర్మరాజు " మహర్షీ ! భగీరధుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు? "
అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో " ధర్మజా! పూర్వం ఇక్ష్వాకు వంశంలో
సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్బి, శైబ్య అనే ఇద్దరు భార్యలు.
అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసు కున్నాడు.
సగరుడు సంతానం కావాలని శివుని కోరాడు. శివుడు అలాగే వరమిచ్చాడు. సగరుని
భార్యలు ఇద్దరు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలబూఫలం (ఆనపకాయ)
పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి "
రాజా ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే నీకు అరవైవేల మంది
కుమారులు జన్మిస్తారు " అని పలికింది. సగరునికి అరవై వేల మంది కుమారులు
జన్మించారు. సగరుని కుమారులు లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను
బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు.
బ్రహ్మదేవుడు దేవతలతో " వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వారు
చనిపోతారు " అని చెప్పాడు.
సగరుని అశ్వమేధయాగ సంకల్పం
సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను
కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది.
సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి
ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ
అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని
కోపాగ్నితో సగరకుమారులను భస్మంచేసాడు. నారదుని వలన ఆ విషయం సగరునికి
తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి
పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుని చూసి "
నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో
ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి " అని కోరాడు. అలాగే అని
అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు.
కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని "
అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు. నీ
మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు "
అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధం పూర్తిచేసాడు. సముద్రాన్ని తన
కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరం అనేపేరు వచ్చింది.
భాగీరధుని తపసు
అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరధుడు
రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరధుడు జనరంకంగా రాజ్యం చేసాడు. సగరుని
వృత్తాంతం తెలుసుకున్న భగీరధుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు.
హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోరతపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం
చేసుకున్నాడు. భగీరధుడు గంగాదేవిని " అమ్మా! నీవు దేవమార్గాన్ని వదిలి
భూమికి రావాలి సాగరాన్ని జలంతో నింపాలి. సగర పుత్రులకు మోక్షం కలిగించాలి "
అని కోరాడు. గంగాదేవి " అలాగే, వస్తాను కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి
ఒక్క పరమ శివునికే ఉంది. కనుక నువ్వు శివుడిని ప్రసన్నుని చేసుకో " అని
చెప్పింది. తరువాత భగీరధుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్ధించాడు.
శివుడు భగీరధుని కోరిక మన్నించి " నీవు గంగను తీసుకురా నేను భరిస్తాను "
అన్నాడు. మరల భగీరధుడు గంగను ప్రార్ధించాడు. గంగ భగీరధుని వెంట భూమికి దిగి
వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు.
తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగానదికి
భాగీరధి అనే నామం వచ్చింది " రోమశుడు గంగావతరణం గురించి ధర్మరాజుకు
వివరించాడు. తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద, నదులలో స్నానం చేసాడు.
తరువాత వారు హేమకూట పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని
పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమౌతున్నాయి. ఆ తరువాత వారు
విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని
సరోవరం చూసారు.
ఋష్యశృంగుడు
రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. " ధర్మరాజా !
కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరసులో స్నానం చేస్తున్నాడు.
అతనికి ఆ సమయంలో దేవ వేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహ
పీడితుడైన కారణంగా రేతఃపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన
నీటిని త్రాగిన దుప్పి గర్భందాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు
కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం
తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను
తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు
తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు
కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు " రాజా! ఋష్యశృంగుని నీ
రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి " అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని
రాజ్యాన్ని రప్పించటానికి కొంత మంది వేశ్యలను పంపాడు. ఒకరోజు విభాంకుడు
ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు, సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ
సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే
ఋషి కుమారుడు అనుకుని ఆమెకు అతిధి సత్కారం చేసాడు. ఆమె ఋష్యశృంగుని తనతో
స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళుతూ ఇంటికి
రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి
ఆహారపానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం
అడిగాడు. ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు " నాయనా! ఋషుల తపస్సు
చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతుంటారు. జాగ్రత్తగా ఉండు "
అన్నాడు. మరునాడు కూడా వేశ్య విభాంకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి
వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు.
ఋష్యశృంగుని రాకతో అంగ రాజ్యంలో వానలు కురిసాయి. రోమపాదుడు సంతోషపడి తన
కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసాడు. విభాండకుడు ఆశ్రమంలో
కుమారుని జాడ లేక పోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు
కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు " అని
చెప్పాడు.
పరశురాముడు
ఆ
తరువాత ధర్మరాజు కళింగదేశంలో ఉన్న వైతరణి నదిని దర్శించారు. అక్కడి నుండి
మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులను " మునులారా! ఇక్కడ పరశురాముడు
ఉంటాడు కదా మీరెప్పుడైనా చూసారా? " అని అడిగాడు. పరశురాముని శిష్యుడైన
అకృతవర్ణుడు అనే ముని " ధర్మజా! రేపు చతుర్ధశి మనం ఇక్కడ పరశురాముని
చూడవచ్చు" అన్నాడు. ధర్మరాజు " మహర్షీ! నాకు పరశురాముని గురించి వనాలని
ఉంది వివరిస్తారా? " అన్నాడు. అకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం
కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి.
ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు
వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు " మహాత్మా! ఒక
చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా
కూతురిని వివాహం చేసుకో " అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు
వరుణుని ప్రాంర్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు
కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్థం అనే పేరు
వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు.
ఒక సారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని
వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా
తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు "
మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని
కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది " అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం
చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున
కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో " అమ్మా! నీకు బ్రహ్మకుల
పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని
అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా
తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు " అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన
క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు
అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే
కుమారుని కన్నది. ఆ జమదగ్ని ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను
వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే
కుమారులు కలిగారు.
జమదగ్ని ఆగ్రహం
ఒకరోజు
జమదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు
అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం
కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన
కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట
మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా
తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు
ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి "
నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు. రాముడు "
తండ్రీ ! ముందు నా తల్లిని బ్రతికించండి. తరువాత నా అన్నలను శాపవిముక్తులను
చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం
ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు.
కార్తవీర్యార్జునుడిని సమ్హరించుట
ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి
జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేసాడు.
కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ
ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో
లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు
ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని
కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు
ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని
ధ్వంశం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని
కృద్ధుడై " అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి
పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను "
అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని
కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు
చేసుకుంటున్నాడు " అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు.
చతుర్ధశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణదిశగా ప్రయాణం
అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస
తీర్థం చేరాడు.
ప్రభాస తీర్థం
పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులను
వెంటపెట్టుకుని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు
అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళడం వారికి వివరించాడు. బలరాముడు " ఆ
ధృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడి గట్టాడు. కనుక మనమంతా
ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం " అని తనతో
వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి " అనుపమ
శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు
లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగటం భావ్యమా? భయంకర మైన
యాదసేనల ధాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు,
పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలసి శ్రీకృష్ణుని అనుమతితో
కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం. అభిమన్యుని
అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాం ఏమంటారు " అని ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు "
అయ్యా! మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి మీరు
శాంతించండి " అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు
ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలు దేరి పయోష్ణి నదిలో స్నానం
చేసాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరాడు. అక్కడ వారు
వైడూర్య పర్వతాన్ని చూసారు. రోమశుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని
చెప్పసాగాడు.
చ్యవనుడు
రోమశుడు
ధర్మరాజుతో " ధర్మరాజా! భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో
చాలాకాలం తపస్సు చేసాడు. దీర్ఘకాల తపస్సు కారణంలేత ఆ ముని శరీరం చుట్టూ
పుట్టలు వాటి పై తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె
సుకన్య చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న
చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను
తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం
బంధించాడు. ఈ విషయం తెలుసుకుని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె
తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి
వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు
అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేసాడు. సుకన్య చ్యవనుడికి
సేవలు చేస్తూ ఉంది.
అశ్వినీదేవతల ఆగమనం
ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను "
అమ్మా!నీవెవరు? " అని అడిగారు. సుకన్య " అయ్యా! నేను శర్యాతి మహారాజు
కుమార్తెను. చ్యవనుని భార్యను " అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి " నీ వంటి
అందెగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త. ఇంకనైనా తగిన వరుని కోరుకో.
మేము వాడిని తీసుకు వస్తాము " అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి " నాకు నా
భర్త మీద ప్రేమ ఉంది " అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి
చెప్పింది. చ్యవనుడు సుకన్యతో " వారు చెప్పినట్లు చేయవచ్చు కదా " అన్నాడు.
సుకన్య చ్యవనునితో " మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను " అన్నది. ఆమె
అశ్వినులతో " నాకు నవయవ్వన వంతుడైన వరుని ప్రసాదించండి " అని అడిగింది.
అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి
ముగ్గురు నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో " మాలో ఎవరు కావాలో
కోరుకో " అన్నారు. సుకన్య వారిలో చ్యవనుని గుర్తించి ఆయనను వరించింది.
చ్యవనుడు అశ్వినులతో " మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా
శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం
తాగిస్తాను " అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు.
అశ్వినులకు సోమపానము కలిగించుట
తన
అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడటానికి
వచ్చాడు. చ్యవనుడు శర్యాతితో " రాజా! నేను నీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను "
అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు
సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చ్యవనునితో " వారు దేవ వైద్యులే కాని దేవతలు
కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు " అన్నాడు. చ్యవనుడు
ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి
చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని
నిగ్రహించాడు. వెంటనే చ్యవనుడు హోమంచేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని
సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతిచెందాడు.
ఇంద్రుడు చ్యవనుడితో " మహర్షీ ! మీ తపశక్తి తెలియక అపరాధం చేసాను
క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు " అని అంగీకరించాడు.
చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోను, మద్యం లోనూ,
పాచికలలోను, మృగములలోను ప్రవేశించాడు " అన్నాడు.
మాంధాత
ఆ
తరువాత ధర్మరాజు సైంధవారన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న
యమునా నదిని చూసి రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా ఇది యమునా నది గంగా
నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేసాడు. ఆయన
చరిత్ర చెపుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు,
ధర్మశీలుడు, బలవంతుడూ అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండే వాడు. అతనికి సంతానం
లేదు. అతడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్ధించాడు. అతని
కోరిక మన్నించి భృగుమఝర్షి పుత్రకామేష్టి యాగం చేసాడు. మంత్రజలం నిండిన
పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్విక్కులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి
యవనాశ్వుడు దాహంవేసి తెలియక ఆ మంత్రజలం త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి
యవనాశ్వునితో " రాజా ! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని
నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీకు ఒక కుమారుడు పుడతాడు " అని
చెప్పాడు. యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమభాగాన్ని చీల్చుకుని
కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడు వచ్చాడు.
ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వ్రేలిని పెట్టి " ఇది అమృతమయము దీనిని
త్రాగుము " అని అన్నాడు. అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేసాడు.
మాంధాత ఎన్నో ఏళ్ళు రాజ్యపాలన చేసాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు
జయించాడు. యజ్ఞయాగాలు చేసాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో
వానలు కురిసేలా చేసాడు. మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మజా! సోమకుడు
మహర్షి యాగం చేసిన ప్రదేశం. ఇది నహుషుడు యజ్ఞం చేసిన ప్రదేశం. ఇది
అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి.ఇది సరస్వతీ వది నిషధ దేశంలో మాయమై ఇక్కడ
చమసోద్భేదం అనే చోట బయటపడింది. ధర్మజా ఇది విష్ణుప్రద తీర్థం, ఇది కాశ్మీర
మండలం, ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు
నిర్మించాడు.
శిబిచక్రవర్తి
ఒకరోజు ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలసి
తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు. డేగ రూపం లోని
ఇంద్రుడు పావురంరూపంలో అగ్నిదేవుని తరముతూ ఉన్నాడు. ఆ పావురం శిబి
చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ
శిబి చక్రవర్తిని చూసి " రాజా! ఇది నాకు ఆహారం. దీనిని నాకు ఇవ్వండి. ఈ
ఆహారం లేకుంటే నేను బ్రతకలేను " అని అడిగింది. శిబి చక్రవర్తి " ఈ పావురం
నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మంకాదు. నీవు
వేరే ఆహారం చూసుకో " అన్నాడు. డేగ శిబితో " రాజా! ఇది నాకు దేవుడిచ్చిన
ఆహారం. దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో " అని
చెప్పింది. అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి
మాంసం తీసి త్రాసులో వేసాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి
ఆశ్చర్య పడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు.
అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి "
రాజా! నీ త్యాగనిరతికి సంతోషించాము. నీకీర్తి అజరామరమై చిరకాలం
వర్ధిల్లుతుంది " అన్నారు.
అష్టావక్రుడు
ఆ
తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావకృడిని గురించి చెప్పసాగాడు. పూర్వం
ఏకపాదుడనే ముని ఉండే వాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమన తపస్సు
చేశాడు. తన శిష్యులకు సదా విధ్యాబుద్ధులు నేర్పుతుండే వాడు. కొంత కాలానికి
సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా
అన్నాడు. " మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా
వస్తుంది. వారికి నిద్ర లేక పోవడం చేత విశ్రాంతి లేక జఢులౌతారు. ఇది
మంచిదా? " అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి " నేను చేయించిన
వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టా వక్రడిగా పుట్టు " అని
శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు
జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు.
సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన
తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న
యజ్ఞానికి వెళ్ళాడు. కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి " మీరు బాలురు ఇది
విద్వాంసులు, పెద్దలు, రుత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు " అని
అడ్డగించారు. అష్టావక్రుడు " అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక
జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే? మేము ఈ మహారాఉజు కొలువులో ఉన్న
విద్వాంసులను జయించడానికి వచ్చాము " అని అన్నాడు. ఈ విషయం తెలిసి మహారాజు
వారిని లోనికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులంధర్ని
ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చెర నుండి విడిపించాడు. జనక మహారాజు
అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు. అష్టావక్రుడు తన తండ్రితో కలసి
స్వస్థలానికి వెళ్ళాడు.
యువక్రీతుడు
ఆ
తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రోమశుడు ధర్మరాజుకు రైభ్యాశ్రమం,
భరద్వాజాశ్రమం చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు. రైభ్యుడు,
భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో
తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు
ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు.
అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని
కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రిని గురించి తపస్సు
చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై "ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? " అని
అడిగాడు. యువక్రీతుడు " నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం
కావాలి " అని కోరాడు. ఇంద్రుడు " ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య
మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవడం
ఉత్తమం " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు. ఇంద్రుడు వెళ్ళి
పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ
రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో
ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి " వృద్ధుడా!
ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది " అన్నాడు. ఆ
వృద్ధుడు " నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను " అన్నాడు.
ఇంద్రుడు నిజరూపం చూపి " యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు
చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో " అన్నాడు. అందుకు
యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందే నని పట్టు పట్టాడు.
ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందని
గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు.
యువక్రీతుడు వధిమ్చబడుట
ఒకరోజు
యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ
రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు.
ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో
సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి
కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక
రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను
సృష్టించాడు. వారిరువురిని చూసి " మీరు యువక్రీతుని వధించండి " అని పంపాడు.
ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం
పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని
వధించాడు. ఆ తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు.
ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ
లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు.
పరావసు తంద్రిని చంపుట
తరువాత
కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి
పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక
రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావాసు
ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని పొరపాటు ఎదురుగా వస్తున్న రైభ్యుని
ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి
పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది
చెప్పి పరావసు తన అన్నఅర్ధవసుతో " అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని
నిర్వహించ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆ యాగాన్ని పోయి
ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి
పరిహారం చెయ్యి " అన్నాడు. అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని
ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు
బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు " మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి
అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత
కార్యం చేస్తున్నాడు " అన్నాడు. రాజు అనుచరులు అర్ధావసుని యాగశాలలోకి
రాకుండా అడ్డుకున్నారు.
అర్ధావసు కోరిక మీద రైభ్యాదులు బ్రతుకుట
అర్ధావసు
రాజును చూసి " రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన
బ్రహ్మ హత్యకు నేను ప్రాయశ్చిత కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యా పాతకము
నుండి విముక్తుడిని చేసాను " అని సత్యం చెప్పాడు. అందుకు దేవతలు సంతోషించి "
అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు
ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగారు. అర్ధవసుడు "
అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నా
తమ్మునికి దోషం కూడా పరిహరించండి " అని కోరుకున్నాడు. దేవతలు అందరిని
బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి " దేవతలారా! నేను ఎన్నో విద్యలు
చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? " అని
అడిగాడు. దేవతలు " యువక్రీతా! గురుముఖత॰ నేర్చుకున్న విద్య ఫలిస్తుంది,
తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి.
రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు.
అని పలికి స్వర్గాలికి వెళ్ళారు.
గంధమాధన పర్వతం
ఆ
తరువాత ధర్మరాజు తమ్ములతోనూ, ద్రౌపదితోనూ కలసి ఎన్నో ప్రయాసలకోర్చి
గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్ళతూనూ ముళ్ళతోనూ చేరి దుర్గమంగా
ఉంది. భీముడు తనకుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి
ముందుకు వచ్చి నులబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరిని
వీపుమీద ఎక్కించుకుని ఆకాశమార్గంలో బదరికావనం చేర్చాడు. రోమశుడు తన మంత్ర
మహిమతో ఆకాశమార్గాన బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు
చేసుకుంటున్న ఆశ్రమం చేరారు.
భీముడు ఆంజనేయుని కలుసుకొనుట
ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి
ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది
ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది
కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు
సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ
వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ
ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా
పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి
సింహనాదం చేసాడు. ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి " ఎవరయ్యా నీవు?
పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా?
అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు " అన్నాడు హనుమంతుడు.
భీముడు " నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజూ తమ్ముడిని. నా నామధేయం
భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు " అన్నాడు.
హనుమంతుడు " నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ
దారిన నీవు వెళ్ళచ్చు " అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను
ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని
ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు.భీముడు
హనుమంతునితో " అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను
మన్నించండి " అన్నాడు. హనుమంతుడు భీమునితో " భీమా! నేను హనుమంతుడిని, నీ
అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా
నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు
రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను
చిరంజీవిగా ఉండమని దీవించాడు " అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై
నివసిస్తున్నాను " అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించి " ఆంజనేయా!
నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క
సారి చూపించవా? " అని అడిగాడు. హనుమంతుడు " భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ
కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా , త్రేతాయుగంలో వేరేలా,
ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది "
అన్నాడు.
హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు
భీముడు
" అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? " అన్నాడు. హనుమంతుడు
ఇలా చెప్పసాగాడు " భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ
లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు
శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ,
క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు.
వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ
యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం,
సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది.
ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు
చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు
రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో
నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి.
కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు
కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో
ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం . ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో
నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు.
కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన
వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము,
దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం
విశేషంగా ఉంటాయి " అని హనుమంతుడు చెప్పాడు. భీముడు " ఆంజనేయా ! అలనాడు నీవు
సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను " అన్నాడు.
హనుమంతుడి బృహద్రూపం
ఆంజనేయుడు
సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని
భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని
ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి "
భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల,
గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ
పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక
ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం
ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు
సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి
చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో
వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నున్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి
కావాలో అడుగు. భీమా! నీకు, నీ వారికి అపకారం చేసిన కౌరవులు, దృతరాష్ట్రుడు
మొదలైన వారిని సంహరించి హస్థినా పురం నేల మట్టం చెయ్యమంటావా ? " అన్నాడు.
భీముడు " అమిత బలశాలివి అయిన నూకు అది అసాధ్యంకాదు. కాని మా శత్రువులను
మేమే జయించడం ధర్మం కదా " అన్నాడు. హనుమంతుడు " భీమా! యుద్ధభూమిలో నన్ను
తలచిన ఎడల నేను అర్జునిని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో
సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను " అన్నాడు.
తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు.
భీముడు సౌగంధికా పుష్పములు తెచ్చుట
హనుమంతుడు
చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధికా పుష్పముల
తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు.వారు భీమునితో "
అయ్యా ఇది కుబేరుని తోట కుబేరుడు ఇందులో విహరిస్తున్నాడు. ఇక్కడ ఉండటం
ప్రమాదం " అని హెచ్చరించారు. భీముడు " నేను పాండు రాజు కుమారుడిని. నాపేరు
భీమసేనుడు. నా భార్య ద్రౌపది ఈ సౌగంధికా పుష్పములు కావాలని కోరింది. వీట్ని
తీసుకు పోవడానికి వచ్చాను " అన్నాడు. వనరక్షకులు భీమునితో " అయ్యా! నూవు
ధర్మరాజు సోదరుడివి ధర్మం తెలిసి నడచుకో. నీవు కుబేరుని అడిగి ఈ పుష్పములను
తీసుకు పో " అన్నారు. భీముడు " ప్రకృతి స్సిద్దమైన ఈ కొలను కుబేరునికి
మాత్రమే స్వంతం కాదు అందరిది. నేను క్షత్రియుడను, ఎవ్వరినీ యాచించను, నా
భుజ బలంతో తీసుకువెళతాను " అని చెప్పి కొలనులో దిగి పుష్పములు కోయసాగాడు.
వనరక్షకులు భీమునితో యుద్ధానికి దిగారు. భీముడు వారినందరిని జయించాడు.వారు
కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుడు భీముని పరాక్రమం గురించి విని
ఉన్నాడు కనుక ఉదారంగా విడిచి పెట్టాడు. భీముడు సౌగంధికా పుష్పాలతో తిరిగి
వెళుతున్న సమయంలో ధర్మరాజు నకులసహదేవులు, ద్రౌపదితో కలసి భీమునికి ఎదురు
వచ్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధికా పుష్పాలను ఇచ్చాడు. ఇంతలో కొంత మంది
యక్షులు వారి వద్దకు వచ్చి " అయ్యా! ఈ ప్రదేశంలో యక్షులు రాక్షసులు
తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు " అని చెప్పారు. అందుకు
అంగీకరించి ధర్మరాజాదులు అక్కడి నుండి కొంతదూరం వెళ్ళి నివాసం
ఏర్పరచుకున్నారు.
జటాసురుడు
ఒకరోజు
జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరకు వచ్చారు. అతడు
పాండవులతో " నేను వేదాలను చదువుకున్నాను పరశురాముని శిష్యుడను " అని చెప్పి
వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒక రోజు భీముడు వేటకు
వెళ్ళాడు. జటాసురుడు ఇదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు. ధర్మరాజూ,
ద్రౌపదిని, నకులసహదేవులను తీసుకుని ఆకాశమార్గంలో పరుగెత్తసాగాడు. అక్కడ
ఉన్న బ్రాహ్మణులు అది చూసి భీతి చెందారు. నకులుడు రాక్షసునితో " అయ్యా!
ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలపెట్టడం భావ్యమా? " అని అడిగాడు.
ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. " అయితే నాతో యుద్ధం చెయ్యి " అని నకులుడు
అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయు వేగంతో అక్కడికి
వచ్చాడు. భీముడు రాక్షసునితో " మర్యాదగా ధర్మరాజును, ద్రౌపదిని,
నకులసహదేవులను విడిచి పెట్టు లేకుంటే బకాసురుడు, హిడింబుడు చచ్చినట్లు
చస్తావు " అని హెచ్చరించాడు. జటాసురుడు " ఓయి భీమా! నిన్ను యుద్ధంలో చంపి
బకాసురునికి, హిడింబునకు, కిమ్మీరునకు రక్త తర్పణం చేస్తాను " అని భీమునితో
యుద్ధానికి దిగాడు. ఇద్దర్కి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు
అలసిపోవడం గ్రహించిన భీముడు అదనుగా తీసుకుని జటాసురుని పై విజృంభించి
అతనిని వధించాడు. రోమశుడు, ధౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి
ప్రశంసించారు.
NEXT
వన పర్వము చతుర్థాశ్వాసము
- 1.1 ద్రౌపది భీమసేనుని పంచవర్ణ పుష్పములు కోరుట
- 1.2 అర్జునుని రాక
- 1.2.1 నివాతకవచులు
- 1.3 నహుషుడు
- 1.3.1 నహుషుని ప్రశ్నలు
- 1.4 శ్రీకృష్ణ సత్యభామల విజయం
- 1.5 మార్కండేయ మహర్షి రాక
- 1.5.1 కాలధర్మాలు
- 1.5.2 పాపుణ్యాలు ఫలితాలు
- 1.5.3 బ్రాహ్మణ ప్రభావం
- 1.5.4 బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు
- 1.5.5 సనత్కుమారుని తీర్పు
- 1.5.6 సరస్వతీ గీత
- 1.5.7 వైవస్వత మనువు
- 1.5.8 కల్పాంతం
- 1.5.9 వటపత్రశాయి
- 1.5.9.1 నారాయణ తత్వం
- 1.5.10 కలియుగ ధర్మం
- 1.6 కల్కి అవతారము
- 1.6.1 పరీక్షిత్తు వృత్తాంతము
- 1.6.1.1 వామదేవుడు
- 1.6.2 శలుడి గర్వభంగము
- 1.6.3 ఇంద్రద్యుమ్నుడు
- 1.6.4 దుంధుమారుడు
- 1.6.5 ఉదంకుడి కోరిక
- 1.6.6 మధు కైటబులు
- 1.6.1 పరీక్షిత్తు వృత్తాంతము