-దేవతారాధన పూజకు తగిన పూలు
ధర్మరాజు " పితామహా ! దేవతలను దీప ధూప నైవేద్యములతో ఆరాధిస్తారు కదా ! ఆవిశేషములు ఏమిటో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు సువర్ణుడు అనే మహామునికి, సువర్ణుడు నారదుడికి, నారదుడు
నాకు చెప్పారు. నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఈ భూమిమీద ఓషధులు
అత్యత్తమమైనవి. ఓషధీవృక్షాలలో పూలుపూసే చెట్లు ఇంకా ఉత్తమమైనవి. ఆ
పుష్పములతో దేవతలను అర్చించిన మానవులకు శుభములు మనస్సు వర్ధిల్లుతాయి. అందు
వలన పూలను సుమమనస్సులు అని అంటారు. పూలతో దేవతలను అర్చించిన
దేవతలుహర్షించి మన కోరికలు తీరుస్తారు. అందువలన దేవతలను సుమమనస్కులు అని
అంటారు. మంచిసువాసన కలిగి, మంచిరూపము కలిగి, తెలుపువర్ణము కలిగి ముళ్ళులేని
చెట్లకు పూచినపూలు దేవతారాధనకు మేలైనవి. అటువంటి పూలను దేవతలు ప్రీతితో
స్వీకరిస్తారు. తామరలు, సన్నజాజులు, తులసీదళాలు, దేవతలకు మిక్కిలి
ఆనందాన్ని ఇస్తాయి. యక్షులకు నీటిలోపుట్టిన పూలు అధిక ఆనందం కలిగిస్తుంది.
ముళ్ళ చెట్లకు పూసినవి, ఎర్రనివి, ఘాటైనవాసనకలిగిన పూలు శత్రువులను
చంపడానికి అధర్వణ వేదములో చెప్పబడిన మంత్ర, తాంత్రిక పూజలు మరియు
ప్రయోగాలలో వినియోగిస్తారు. ఘాటైనవాసన కలిగిన పూలు రాక్షసులను, భూతగణములను
ఆకర్షిస్తాయి. నలుపు, తెలుపు కలిగిన మంచి పరిమళాలను వెదజల్లు పూలు మానవులు
ఇష్టపడతారు. దేవాలయములలో, పితృవనంలో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకొన
కూడదు. పూలవాసనతో దేవతలు, పూలనుచూసినంతనే యక్షులు, పూలవాసన ఆస్వాదిస్తూ
సర్పములు ఆనందిస్తాయి. మంచిపూలతో దేవతలను అర్చించిన దేవతలు తృప్తిపొంది
మానవుల కోరికలు తీరుస్తారు.
ధూపము
ఇక ధూపము గురించి చెప్తాను. సల్లకీ
అనే చెట్టునుండి తీసినపొడితో వచ్చే ధూపము దేవతలకు ప్రీతి కరమైనది. అగరు
ధూపము యక్షులకు, గంధర్వులకు నాగజాతికి ప్రీతికరమైనది. అన్నింటి కంటే
శ్రేష్టమైనది కర్పూరముతో వేసే ధూపము. తియ్యనివాసన వచ్చే ధూపము దేవతలకు
ప్రీతికరం. ఘాటైనవాసన వచ్చే ధూపం రాక్షసులకు ప్రీతికరం. కారమైన ధూపం అంటే
కళ్ళ మండి నీళ్ళు వచ్చే ధూపము యక్షులకు ప్రీతికరం. కనుక దేవతలకు
ప్రీతికరమైన వేసిన ధూపము మానవులకు పరమపుష్టిని ఆయుష్షును పెంచుతుంది. అలాగే
యక్షులు, రాక్షసులు, నాగులు మానవులు వేసిన ధూపముతో తృప్తి చెంది వారి
కోరికలను తీరుస్తారు. మంచిగంధము అగరు ధూపములు మానవుల మనసుకు ఆహ్లాదం
కలిగిస్తాయి.
దీపారాధన
దేవతలను
పూజించే సమయంలో దీపారాధన చేయాలి. దాని వలన అక్కడ ఉన్న భూతములు, రాక్షసులు
మొదలైన కుత్సితమైన జాతులు పారిపోతాయి. దీపం వెలిగిస్తే బాహ్య అంతర చీకట్లు
తొలగిపోతాయి. దీపారాధన వలన చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుంది.
మనసు ధర్మచింతన వైపు మరలుతుంది. ప్రమిదలో నెయ్యి తక్కువ ఉండకూడదు. వత్తి
సన్నగా ఉండకూడదు. సగం సగం వెలిగించ కూడదు. దీపారాధన చేసిన చక్కటి వెలుగు
రావాలి. చీకట్లు పూర్తిగా తొలగి పోవాలి. దేవుడి వద్ద ఉన్న దీపము
దొంగిలించిన వాడికి కళ్ళుపోయి గుడ్డివాడు ఔతాడు. నలుగురు కూర్చొను చావడి
లోను, కొండమీద, దేవుడిగుడిలో దీపము వెలిగించిన వాడు ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఆవునెయ్యి దీపము ఆత్యంత శ్రేష్టము. తరువాత' బర్రె, మేకల నెయ్యితో
కూడా దీపము పెట్టచ్చు. జంతువుల కొవ్వుతోను, ఎముకలరసము తోను, మాంసమురసముతో
దీపము వెలిగించిన మహాపాపము. దీపములను దానం చేసిన వాడికి ఉత్తమ లోకాలు
ప్రాప్తిస్తాయి.
నైవేద్యము
తయారుచేసిన
ఆహారం ముందుగా దేవతలకు నివేదన చేసి తరువాత భుజించాలి. నివేదన చెయ్యక తిన్న
ఆహారం రాక్షసాహారం ఔతుంది. అందు వలన మానవుడు తన ఇంట తయారు చేసుకున్న
ఆహారమును ముందుగా దేవుడికి నివేదించి తరువాత భుజించాలి. నువ్వులపిండి, పాలు, పెరుగు, నెయ్యి మరియు సువాసన ద్రవ్యములు
వేసి కమ్మటివాసన వచ్చే పదార్ధములు దేవతలకు ప్రియము చేకూరుస్తాయి.
ప్రతిరోజు దేవతలకు నివేదనచేయు వ్యక్తికి సకల విధ శుభములు కలుగ గలవు. ఉరగములకు, యక్షులకు, అసురులు మొదలైన భూతములకు రక్తము మాంసము కలిపిన పిండములు మధ్యము
అమిత ప్రీతిని కలిగిస్తాయి. సాత్వికులు సాత్వికాహారము (సౌమ్యబలి), తామసులు
తామసాహారము (అసౌమ్యబలి) వారి వారి ఇష్ట దేవతలకు బలి ఇచ్చి వారి కోరికలను
విన్నవించి అందుకు తగిన ప్రతిఫలము పొందుతారు " అని చెప్పాడు భీష్ముడు.
దేవతారాధనా ఫలము
ధర్మరాజు " పితామహా ! పూలు, ధూపము, దీపము, బలి ప్రదానము వీటిని దేవతలకు అర్పించడం వలన కలిగే ఫలములను వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! పూర్వము నహుషమహారాజు ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. ఆయనకు తను
రాజు అనే గర్వములేదు. సత్వనిష్టతో దేవతలను, పుష్పములతోను, ధూప, దీప
నైవేద్యములతో అర్చిస్తూ ఉండే వాడు. అలాగే పితృ దేవతలను కూడా తగు విధముగా
తర్పణాది కార్యములతో అర్చించే వాడు. అలాగే రాక్షసులను, యక్షులను, భూతములను,
భుజంగములను, పూలతోను వివిధములైన ద్రవ్యములతోను అర్చించే వాడు. ఈ పూజ
ఫలితంగా నహుషుడు దేవేంద్ర పదవిని కూడా పొందగలిగాడు. తుదకు నహుషుడు
సప్తర్షులు మోసే పల్లకిలో కూడా ఊరేగినప్పటికి తాను నిత్యము చేసే
పూజానుష్టానములు విడువ లేదు. నహుహుడు బ్రహ్మసభకు కూడా వెళ్ళగలిగాడు అంటే
అతని నిత్యపూజా విధానమే కారణము. అయినా నహుషుడు చేసిన చిన్న తప్పిదము
కారణంగా ముని శాపానికి గురై భూపతనం చెందాడు. ధర్మనందనా ! దీపారాధన అత్యంత
శ్రేష్టమైనది. దైవ సన్నిధిలో ఎంత సేపు దీపము వెలుగుతుందో అన్ని దేవతా
సంవత్సరాలు మానవుడు సుఖ సంతోహాలతో జీవిస్తాడు. స్వర్గలోకప్రాప్తి కూడా
పొందగలడు " అని భీష్ముడు చెప్పాడు.
బ్రాహ్మణుడి ధనము
ధర్మరాజు " పితామహా ! నాది ఒక చిన్నసందేహము. బ్రాహ్మణుడి ధనము హరించిన వాడు ఏ గతి పొందుతాడు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! మానవులు ఈ లోకాలన్నింటా చేసే పాపములలో బ్రాహ్మణుడి ధనము
దొంగిలించడం మహాపెద్దది. బ్రాహ్మణుడి ధనమును హరించినవాడి కులము సర్వనాశనం
అవడం తథ్యము. అతడు మరుజన్మలో నీచకులమున జన్మిస్తాడు.
క్షత్రబంధు
పూర్వము
క్షత్రబంధు అనే రాజు ఉండేవాడు. అతడు ఒక రోజు రాజ్యపర్యటన చేయసాగాడు. ఊరి
చివర ఒక కడజాతి వాడు పోతున్న సమయంలో పక్కనే ఉన్న బ్రాహ్మణుడి పొలములో నుండి
ధాన్యపు గింజలు ఎగిరి పడుతున్నాయి. కడజాతి వాడు నేర్పుగా ఆ గింజలు మీద
పడకుండా వెళ్ళసాగాడు. రాజు ఆ కడజాతి వాడిని పిలిచి " నీవు ఎందుకు ఆ ధాన్యపు
గింజలు మీద పడకుండా వెళుతున్నావు " అని అడిగాడు. కడజాతి వాడు " అయ్యా
పూర్వజన్మలో నేను బ్రాహ్మణ కుమారుడను. బ్రహ్మచర్య వ్రతమును నిష్టతో
ఆచరిస్తున్నాను. ఒక రోజు భిక్షాటన చేసి భిక్ష తెచ్చి ఒక నది ఒడ్డున
కూర్చుని ఆ భిక్ష తినసాగాను. ఆ పక్కనే ఒక బ్రాహ్మణుడి పొలము ఉంది. గాలి
బలంగా వీచడం వలన ఆ పొలంలో నుండి వచ్చిన ధూళి నేను తినబోయే అన్నము మీద
దట్టంగా పడింది. ఆ విషయము తెలియని నేను ఆన్నము భుజించాను. ఆ కారణంగా నేను ఈ
జన్మలో కడజాతి వాడిగా పుట్టాను. నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము
కారణంగా నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ
కలలో నాకు ఒక బ్రాహ్మణుడు కనిపించి " రేపు క్షత్రబంధు అనే రాజుతో
చేయబోయే సంవాదంతో నీకు కలిగిన కష్టం తొలగిపోతుంది " అని చెప్పాడు. ఆ స్వప్న
ఫలితంగా మీరు నాకు కనిపించారు " అని చెప్పాడు. తరువాత ఆ కడజాతి వాడు
మరణించి ఉత్తమ గతులు పొందాడు " అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.
స్వర్గలోకము
ధర్మరాజు
" పితామహా ! స్వర్గలోకము అని అంటారు కదా ! అక్కడ సుఖసంతోషాలు ఒకే విధంగా
ఉంటాయా ! లేక పలురకాల సుఖసంతోషాలు ఉంటాయా వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! పుణ్యకర్మలు అనేక విధాలుగా ఉంటాయి కదా ! అలాగే ఒక్కొక్క
రకమైన పుణ్యకర్మకు ఒక్కొక్క రకమైన స్వ్వర్గ సుఖము లభిస్తుంది. ఒక్క మాటలో
చెప్పాలంటే స్వర్గంలో సుఖమేకాని దుఃఖం అసలు ఉండదు.
గౌతముడు ఇంద్రుడు
ధర్మనందనా ! గౌతముడు
అనే బ్రాహ్మణుడు ఒకవనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు అతడికి తల్లిలేని
ఏనుగు పిల్ల కనిపించింది. గౌతముడు ఆ ఏనుగు పిల్లను తీసుకు వచ్చి తానే
దానికి తల్లి తండ్రి అయి పెంచాడు. కాలక్రమంలో అది పెరిగి పెద్ద ఏనుగు
అయింది. ఒక నాడు దేవేంద్రుడు ఆ రాజ్యమును ఏలుతున్న రాజు వేషంలో గౌతముడి
వద్దకు వచ్చి ఆ ఏనుగును తనకు ఇమ్మని అడిగాడు. గౌతముడు " రాజా ! నేను ఈ
ఏనుగును కన్నకొడుకు వలె పెంచాను. ఇది రోజు నాకు సేవ చేస్తుంది. నాకు సమిధలు
తెచ్చింది. నేను లేని సమయంలో పర్ణశాలను కాపాడుతుంది. కనుక నేను దీనిని
మీకు ఇవ్వ లేను " అని చెప్పాడు. దేవేంద్రుడికి కోపము వచ్చి " గౌతమా ! నీవు
తపస్సు చేసుకునే వాడివి. నీకు ఆవులు కావాలి కాని ఏనుగులు ఎందుకు ? నీకు
కావలసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు " అని అడిగాడు. గౌతముడు
అంగీకరించక " అయ్యా ! ఈ ఏనుగు తల్లి లేని పిల్లగా నా వద్దకు వచ్చింది. నేను
దీనికి తల్లినై పెంచాను. నాకు ఈ ఏనుగు మీద ఉన్న ప్రేమకు మీరు వెల
కట్టలేరు. కనుక మీరు పదివేల గోవులను ఇచ్చినా కోటి బంగారునాణాలను ఇచ్చినా ఈ
ఏనుగును నేను ఇవ్వను " అన్నాడు. రాజు " గౌతమా ! ఏనుగులు రాజులకు వాహనములు.
నాకు ఇది వాహనంగా కావాలి. దీనిని నేను బలవంతంగా నైనా తీసుకోగలను. కనుక నీవు
ఇష్టపూర్వకంగా ఈ ఏనుగును నాకివ్వడం మంచిది " అన్నాడు.
ఏనుగుని ఇవ్వడానికి గౌతముని షరతులు
చివరకు గౌతముడు
ఏనుగును ఇవ్వడానికి అంగీకరిస్తూ " రాజా ! పుణ్యకార్యములు చేసిన వాడికి
సుఖములు, పాపకార్యములు చేసిన వాడికి కష్టములు కలిగించగలిగిన ప్రదేశం అయిన యమసభకు వస్తే నేను ఈ ఏనుగును నీకు ఇస్తాను. ఆ మాటలకు రాజువేషంలో ఉన్న ఇంద్రుడు నవ్వి " గౌతమా ! పాపములు చేసిన వారు నాస్తికులు పోయే చోటు అయిన యమసభకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " రాజా ! అదేమిటి యముడు
పుణ్యాత్ముడు కదా ! అక్కడకు రానని చెప్పడం మర్యాదగా ఉంటుందా ! " అన్నాడు.
ఇంద్రుడు " అది కాదయ్యా ! యముడు తల్లి, తండ్రులని అక్కను భక్తితో పూజించి
పుణ్యాత్ముడయ్యాడు. అక్కడకు నేను రాను " అని అన్నాడు. గౌతముడు " సరేలే గంగానది
ఒడ్డుకు రా అక్కడ నేను ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " గౌతమా !
నదీతీరాన అతిథులను సత్కరించి పిదప భుజించేవారు, పరుల నుండి ఏమీ పుచ్చుకునే
వారు ఉంటారు కనుక అక్కడకు నేను ఎలా రాగలను ? " అని అడిగాడు. గౌతముడు " కానీ
మేరుపర్వతము వద్దకు రా అక్కడ నేను ఈ ఏనుగును ఇస్తాను. ఇంద్రుడు "
అదేమిటయ్యా ! మృదువుగా మాట్లాడే వారు, ఎల్లప్పుడు సత్యము పలికేవారు,
సర్వభూతములను ప్రేమించేవారు, అందరి మీద దయ కలిగినవారు ఉంటారు అక్కడకు నేను
ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " అయితే నారదుడు
విహరించే వనముకు రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడ
ఉన్న నృత్యకళా కోవిదులతో నారదుడు వినోదిస్తూ ఉంటాడు. అక్కడకు నేను ఎలా
రాగలను " అన్నాడు. గౌతముడు " పోనీ 'ఉత్తరకురుభూములకు రా అక్కడ
దేవతలు విహరిస్తుంటారు. దేవేంద్రుడు కూడా అక్కడకు వచ్చి దేవతల కోరికలు
తీరుస్తుంటాడు. అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది
కుదరదయ్యా ! అక్కడకు కామము, హింస విడిచి పెట్టిన వారు వస్తారు. ఆచోటుకు
రావడం నా తరంకాదు " అన్నాడు. గౌతముడు " చంద్రుడి ఇంటికి రా అక్కడ నీకు
ఏనుగును ఇస్తాను " ఇంద్రుడు " అక్కడ కుదరదులే. అక్కడ దానం చేసే వారు,
మరొకరి దానము పుచ్చుకొనని వారు అక్కడకు వస్తారు. నేను దానం తీసుకోవడానికి
అక్కడకు ఎలా రాగలను " అని అన్నాడు. గౌతముడు " పోనీ సూర్యలోకముకు
రా ! అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " మంచితపస్సు, సాధ్యాయనం చేసే వారు
వస్తారు. కనుక అక్కడకు నేను రాలేను " అన్నాడు. గౌతముడు " పోనీ వరుణలోకముకు
రా ! అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అని అన్నాడు. ఇంద్రుడు " యజ్ఞ,
యాగములు, నిత్యాగ్ని హోత్రములు చేసే వారు వస్తారు. అక్కడకు నేను రాను " అని
అన్నాడు. గౌతముడు " పోనీ ఇంద్రుడి వద్దకు రా అక్కడ ఇస్తాను " అన్నాడు.
ఇంద్రుడు " అమ్మో అక్కడకు యుద్ధ వీరులూ, యజ్ఞమును చేసిన సోమయాజులు,
నూరేండ్లు జీవించిన మానవులు ఉంటారు. అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు "
పోనీ ప్రజాపతి లోకానికి రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు అశ్వమేధయాగము చేసినవారు వస్తారు. నేను అక్కడకు రాను " అన్నాడు. గౌతముడు " పోనీ గోలోకముకు
రా అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు గోదానము చేసిన వారు,
తీర్ధయాత్రలు సేవించిన వారు, నిరంతరం బ్రహ్మచర్యము అవలంబించువారు వస్తారు.
అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు " రాజా ! శీతోష్ణములు, సుఖదుఃఖములు,
మిత్రులు శత్రువులు లేని ద్వదందములకు అతీతమైన బ్రహ్మలోకముకు రా !
అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది కుదరదులే ! అక్కడకు
సంగత్వము లేని వారు, ఆత్మజ్ఞానంతో ప్రకాశించే వారు, ఎల్లప్పుడూ వ్రతనిష్ట
కలిగిన వారు, ఆధ్యాత్మ విద్యయందు ఆసక్తికలవారు వస్తారు. అక్కడకు నేను
రాలేను " అన్నాడు.
గౌతముడు ఇంద్రుడిని గుర్తించుట
గౌతముడు
" మహాత్మా ! మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దేవేంద్రులు. లేని ఎడల సకల
లోకముల గురించి తెలియడం ఎలా సాధ్యం. దేవేంద్రా ! నీవు అన్ని లోకములు
తిరుగుతుంటావు కదా ! నీవు పోకూడని లోకము ఏది ? " అని అడిగాడు. ఆ మాటలకు
దేవేంద్రుడు సంతోషించి " మహాత్మా నీకు ఏమి కావాలో కోరుకో " అని అడిగాడు.
గౌతముడు " దేవేంద్రా ! నేను ఈ ఏనుగును బిడ్డలా పెంచుకున్నాను దీనిని నా
వద్ద ఉండనివ్వు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు
" గౌతమా ! నాకు ఆ మాత్రము తెలియదా ! ఆ ఏనుగు చూడు ప్రేమతో నీ తల మీద తన
తొండముతో తడుముతూ వాసన చూస్తుంది. నిన్ను నీ బిడ్డను ఎలా వేరు చెయ్యగలను.
మారు వేషములో ఉన్న నన్ను దేవతలు సహితం గుర్తుపట్ట లేరు. నీవు నీ పుణ్యవశమున
నన్ను గుర్తు పట్టగలిగావు. నీకు నీ ఏనుగుకూ స్వర్గలోకప్రాప్తి కలిగిస్తాను
నీవు నీ ఏనుగుతూ స్వర్గలోకములో శాశ్వతంగా ఉండండి " అని స్వర్గలోకానికి
ఆహ్వానించాడు. గౌతముడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఏనుగుతో స్వర్గలోకముకు
వెళ్ళాడు " ఇదీ స్వర్గలోకము కథ అని భీష్ముడు చెప్పాడు.
తపోధర్మము
ధర్మరాజు " పితామహా ! మీరు తపోధర్మము గురించి చెప్పారు కదా ! తపోధర్మము కంటే మించిన ధర్మము మరొకటి లేదా " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధర్మములన్నీ మంచివే అందులో తపోధర్మము మిక్కిలి శ్రేష్టము. తపస్సు అనగా ముఖ్యముగా మితంగా భుజించడం. ఒక సారి భాగీరధుడు బ్రహ్మసభకు వేళ్ళాడు. భాగీరధుడిని చూసిన బ్రహ్మ
" నిర్మల తపస్సు చేస్తే కాని ఇక్కడకు రావడం సాధ్యము కాదు. ఎలాంటి తపస్సు
చేయని నీవు ఎలా ఇక్కడకు వచ్చావు " అని అడిగాడు. భాగీరధుడు " బ్రహ్మదేవా !
నేను గోదానములు, భూదానములు, కన్యాదానము, రాజసూయయాగములు, అశ్వమేధయాగములు
ఎన్నో చేసాను. కాని నేను అవి చేసినంత మాత్రాన ఇక్కడకు రాలేదు. ఒకసారి
బ్రాహ్మణులు అంతా చేరి ఒక చోట యజ్ఞము చేస్తున్నారు. అప్పుడు వారి యజ్ఞానికి
ఎన్నో అవరోధాలు కలిగాయి. నేను ఆ అవరోధాలు తొలగించి వారి యజ్ఞం సక్రమంగా
జరిగేలా చూసాను. అందుకు వారు నన్ను " బ్రహ్మలోక ప్రాప్తి రస్తు " అని
దీవించారు. అందుకని నేను బ్రహ్మలోకానికి వచ్చాను. నేను ఆకలిదప్పులు మాని
బ్రాహ్మణులకు సేవ చేసాను. అందుకు మించిన తపస్సు ఏదైనా ఉందా " అని అన్నాడు. ఆ
మాటలు విన్న బ్రహ్మదేవుడు భగీరధుడిని ఎంతో ఆదరించాడు. ధర్మనందనా ! నీవు
కూడా బ్రాహ్మణులను భక్తితో సేవింపుము " అని అన్నాడు భీష్ముడు.
ఆశీర్వాదము ఆయుస్షు
ధర్మరాజు
" పితామహా ! శ్తాయుష్మాన్భవ అనేది వేద వాక్కు కదా ! అయినా చాలామంది
అల్పాస్కులుగా మరణించాడానికి కారణం ఏమిటి ? ఆయుస్షు వృద్ధి చెందడానికి
కారణం ఏమిటి ఆయుస్షు క్షీణించడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. భీష్ముడు
ధర్మనందనా ! సదాచారము, నియమబద్ధ జీవితము ఆయుస్షును పెంచి వాడికి సంపదలు,
కీర్తి కలిగిస్తుంది. దురాచారము, నియము లేని జీవితము ఆయువును
క్షీణింపజేస్తుంది. సృష్టిలోని సమస్త భూతములు వాడిని తిరస్కరిస్తాయి. కనుక
సదాచారము నియమబద్ధంగా జీవించుట మంచిది. ఉత్తములు నడచుమార్గమున నడిచిన
నియమబద్ధ జీవితము అలవడుతుంది.
ఆయువు క్షీణించే పనులు
గురువుగారి
మాటలను దిక్కరించడం, పిట్టలను చంపడం, పనీపాట లేక గోళ్ళుకొరకడం, పుల్లలను
తుంచడం, ఉదయము సాయంత్రము సూర్యుని వంక తేరిపార చూడడం ఆయువును
క్షీణింపజేస్తాయి. సత్యము పలకడము, ప్రశాంతంగా ఉండడం, జీవహింస మానడం,
త్రికాలములలో సంధ్యావందనం చేయడం, ప్రతిరోజు దేవతారాధన చెయ్యడం ఆయువును
వృద్ధిచేస్తుంది. ఇతరుల భార్యను కోరడం ఆయువును క్షీణింపచేస్తుంది. అందులో
మిత్రుడిభార్య, గురువుగారిభార్య, తనకంటే వయసులో పెద్ద వారిభార్య,
రాజులభార్యలు, తన కంటే చిన్నవారి భార్యలు, వైద్యుల భార్యలు, సేవకుల
భార్యలు, పనివారి భార్యలు, పండితుల భార్యలను కోరిన ఆయువు క్షీణిస్తుంది.
తను ఆచరించ తగనిది అయినా వ్రతాన్ని ఆచరించిన ఆయువును వృద్ధిచేస్తుంది.
గోశాలల దగ్గర, దేవాలయాల వద్ద, రచ్చబండల వద్ద మూత్రవిసర్జన చేయకూడదు. అలాగే
నిలబడి మూత్రవిసర్జన చేయరాదు. భోజనముకు ముందు కాళ్ళు చేతులుకడగాలి. నిలబడి
భోజనము చేయరాదు. ఎంగిలిచేత్తో బ్రాహ్మణుడుని, ఆవును, అగ్నిని తాకరాదు.
పెద్దవాళ్ళు కనపడినప్పుడు చిన్నవాళ్ళు నమస్కరించాలి. వేదాధ్యయనము
చేయునప్పుడు తలమీద చేతులు పెట్టుకోకూడదు. నిద్రపోయే ముందుగా స్నానము
చేయాలి. రెండు చేతులతో తలనుగోకరాదు. తలకు పూసిన నూనెను ఒంటికి రాయకూడదు.
గురువుల ఏడల శత్రుత్వము కూడదు. గురువులు కోపించినా సర్దుకు పోవాలి కాని
గురువును తిట్టరాదు. గురువుల విషయంలో అసత్యములు చెప్పరాదు. బ్రాహ్మణులు,
గోవులు, క్షత్రియులు, వృద్ధులు, బరువులు మోయు వారు, దుర్బలులు, గర్భిణీ
స్త్రీలు ఎదురుగా వస్తున్నప్పుడు తప్పుకుని దారి ఇవ్వాలి. బ్రాహ్మణులు,
మంగళకరమైన వస్తువులు, చెట్టు కనిపించిన ప్రదక్షిణ పూరితంగా నమస్కరించాలి.
పూర్ణిమ, అమావాస్య, చతుర్ధశి, అష్టమి, ద్వాదశి తిథులలో జన్మ తిథులలో
గృహస్థు బ్రహ్మచర్యము పాటించాలి. చాడీలు చెప్పక కూడదు, తగవులు పెట్టుకొన
కూడదు, ఒక కాలును మరొక కాలుతో తోమరాదు. ఈ పనులు ఆయువును క్షీణింప చేస్తాయి.
వికలాంగులను, దరిద్రుడిని, విద్యాహీనుని, అందవికారుని అపహాస్యము చేయుట
తిట్టుట మహా పాపము. వారిని నిందించడం దేవతలను నిందించడముతో సమానము. పళ్ళు
తోమునప్పుడు, మూత్ర విసర్జన చేయు సమయములలో మాటాడ రాదు. సూర్యోదయము,
సూర్యాస్తమయ కాలలలో నిద్రించరాదు. ప్రతిరోజు తండ్రికి నమస్కరించాలి. తరువాత
గురువులకు, బ్రాహ్మణులకు నమస్కరించాలి. ఉదయము దేవతార్చనకు ముందు ఎవరి
వద్దకు పోరాదు. వివాహానికి ముందు స్త్రీని కోరకూడదు, అవివాహతను కోరకూడదు.
ఉత్తరము, పడమర తలపెట్టి నిద్రించ రాదు. స్నానం చెయ్యక ముందు పై పూతలు
పుయ్యకూడదు. ఒకరు విడిచిన వస్త్రము కట్టరాదు. ఒకరు తిన్న పదార్ధమును
తినకూడదు. అన్యమనస్కగా భుజించకూడదు. భుజించే సమయంలో ఉద్రేకపూరితంగా మాటాడక
మౌనంగా భుజించాలి. ఒకరి చేతి నుండి ఉప్పు తీసుకొన రాదు. రాత్రి పూట తేనె,
పెరుగు తినరాదు. ఎదుటి వానికి పెట్టక తిన రాదు. పక్కవాడికి తక్కువ రకం భోజన
పదార్ధాలు వడ్డించి తాను శ్రేష్తామైన పదార్ధాలు తినకూడదు. నెయ్యి, తేనె,
పాయసము, నీరు తాను తినగా మిగిలినది మరొకరికి ఇవ్వరాడు. పితరులకు తర్పణము
వదిలే ముందు ఆచమనం చెయ్యాలి. పగటిపూట దాంపత్యము కూడనిది. అక్కచెళ్ళెళ్ళు,
గురువులు, మిత్రులు, పండితులు, దాయాదులు పేదవారుగా ఉన్న వారిని చేరతీసి
పోషించడం, సాయం చేయడం ఆయువును వృద్ధిచేస్తుంది. పావురాళ్ళు, చిలుకలు,
శార్ధీకములు, పుష్పలతలు, బంగారముతో చేసిన వస్తువులు, ఇంట్లో ఉండవలసిన మంగళ
వస్తువులు. గ్రద్ద, దీపము పురుగులు, గుడ్లగూబలు, ఇంట్లో ప్రవేశించరాదు. అలా
జరిగిన శాంతిచెయ్యాలి. సాయం సంధ్యాసమయంలో చదవడం తినడం పనికిరాదు. రాత్రి
పూట శ్రాద్ధములు పెట్ట రాదు. క్షురకర్మ, అభ్యంగన స్నానము, అమోద యోగ్యమైన
తిధులలోనే ఉత్తరముఖము, తూర్పు ముఖముగా కూర్చుని చెయ్యాలి. మనిషి చనిపోయిన
తరువాత 11, 12 రోజులలో సపిండీకరణ, ఏకోదిష్టము అనే కర్మలు చేస్తారు. ఆ
రోజుల్లో రాత్రిళ్ళు భోజనం చెయ్యకూడదు. పిలువకుండా ఎవరింటికీ భోజనముకు
పోరాదు. ఏదైనా ఒక కార్యమును సాధించే విషయంలో తల్లితడ్రులకు, కుమారులకు
హితబోధ చెయ్యవచ్చు. క్షత్రియుడు విద్యలు ఈ విధంగా ఆచరించాలి.
గుప్పపుస్వారీ, ఏనుగును ఎక్కడం, రథము తోలడం, నానా విధములైన ఆయుధములను
ప్రయోగించే నేర్పు, యుద్ధ తంత్రము గురించి తెలుసుకోవడం, దండనీతిని
అభ్యసించడం, అర్ధశాస్త్రము, ధర్మశాస్త్రము, కామశాస్త్రము, సర్వశాస్త్ర
అధ్యయనం, వేదాధ్యయనం, ప్రజాపాలన, యజ్ఞములు చెయ్యడం వంటి క్షత్రియోచిత
విద్యలను క్షత్రియులు విధిగా నేర్చుకోవాలి. రజస్వల అయిన స్త్రీని
ముట్టుకోరాదు. అన్ని ఆచారములలోకి ఇతరుల పట్ల దయకలిగి ఉండడం సదాచారము.
సదాచారముతో జీవించిన ఆయుస్షు పెరుగుతుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
అన్నదమ్ముల విధులు
ధర్మరాజు
" పితామహా ! ఈ లోకములో అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో తెలియజెయ్యండి " అని
అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చిన్న వాళ్ళయిన తమ్ములు పెద్ద వారైన
అన్నల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగాలి. అలాగే అన్నయ్యలు కూడా తమ తమ్ముల పట్ల
వాత్సల్యముతో ప్రవర్తించాలి. తమ్ములలో ఒకడు బుద్ధిహీనుడైనా పరవాలేదు కాని
అన్నమాత్రము బాధ్యతా యుతంగా ప్రవర్తించక ఉన్న ఆ కుంటుంబం నాశనం ఔతుంది.
అన్నదమ్ములు తమలో తాము తగవులు వదిలి పెద్దలు ఇచ్చిన ఆస్తిని సమంగా
పంచుకోవాలి. అలా చేసిన లోకము వారిని కీర్తిస్తుంది. అలా చేయక వారిలో ఏ
ఒక్కడైనా స్వార్ధంతో అంతా స్వాధీనం చేసుకున్న ఆ కుంటుంబం చిన్నాభిన్నంమై
అపకీర్తి పాలు ఔతుంది. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్నయ్య. ఆయన భార్య
తల్లి తరువాత తల్లి వంటిది. తల్లి తండ్రుల మరణానంతరం అన్నవదిన తల్లి
తండ్రులతో సమానము. అన్నదమ్ములు ఎవరైనా మిగిలిన అన్నదమ్ములకు ద్రోహం చేసిన
అతడు శిక్షార్హుడు ఔతాడు. తల్లి తరువాత అక్క తల్లి వంటిది. చిన్నతనంలో తనకు
పాలిచ్చి పెంచిన ఆయాలు దాదులు తల్లివంటి వారే. తండ్రి తొలి గురువు. తండ్రి
గురువుకంటే పదింతలు పెద్ద. తండ్రి కంటే తల్లి పదింతలు పెద్దది. తల్లి
తండ్రులు శరీరం ఇచ్చి ఈలోకలోకి తీసుకు వస్తారు. గురువు విద్యాబుద్ధులు
నేర్పి మరుజన్మ ప్రసాదిస్తాడు. గురువు ఇచ్చినజన్మ అజరామరమైనది కనుక గురువు
అధికంగా పూజించ అర్హుడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
ఉపవాస వ్రతము
ధర్మరాజు
" పితామహా ! ఉపవాసవ్రతము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే
నిర్దేశింపబడింది. మిగిలిన వర్ణములకు కాదు అంటారు కదా ! పైగా ఎక్కువ
ఉపవాసములు చెయ్యడం దోషము అంటారు కదా ! అసలు ఉపవాసము అంటే ఏమిటి ? దానికి
ఉండవలసిన యోగ్యతలు ఏమిటి ? ఉపవాసము వలన కలుగు ఫలితం ఏమిటి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నువ్వు అడిగినట్లే నేను అంగీరసుడు
అనే మునీశ్వరుడిని అడిగాను. ఆయన చెప్పినది నీకు చెప్తాను విను.
బ్రాహ్మణుడు, క్షత్రియుడు మూడు రాత్రులు ఉపవసించ వచ్చు. శరీరము సహకరించి
అనారోగ్యము పాలుకాకున్న మరి కొన్ని రోజులు ఉపవశించ వచ్చు. వైశ్యులు,
శూద్రులు నాలుగు పూటలు మించి ఉపవసించ రాదు. పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి,
చతుర్ధశి, శుక్లపక్ష పంచమి, షష్టి, అలాగే బహుళ పంచమి, షష్టి ఉపవాసముకు తగిన
పర్వ దినములు. రోజుకు ఒక రోజు మాత్రమే తిని ఉపవాసము ఉండు బ్రాహ్మణుడికి
అందమైన భార్య, సంతానం కలుగి ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఇలా ఒక్క సంవత్సరము
ఉపవాసము ఉన్న అతడికి ఈ లోకములోని సౌఖ్యములన్నీ పొందుతారు. ఎన్ని రోజులు
ఉపవాసము ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. ఒక సంవత్సరములో 15 రోజులు
ఉపవసించిన పుణ్యలోకప్రాప్తి కలిగుతుంది. ఒక మాసము ఉపవసించిన
బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. కాని ఎవరూ సంవత్సరంలో ఒక మాసము మించి
ఉపవసించ రాదు. యుగయుగానికి మనుష్యునికి ఉపవాస సామర్ధ్యము మారుతుంది కనుక
వారి కాల ప్రమాణం అనుసరించి ఉపవాస దినముల సంఖ్య మారుతుంటుంది. తల్లిని
మించిన గురువు, వేదముకు మించిన శాస్త్రము, ధర్మముకు మించిన లాభము లేదు.
పవిత్రములైన వాటిలోక్లెల్లా బ్రాహ్మణుడు పవిత్రుడు. కనుక బ్రాహ్మణుడిని
భక్తితో పూజించాలి. పూర్వము దేవతలు మునులు ఉపవాసధర్మము అనుసరించి
గొప్పవాళ్ళు అయ్యారు. విశ్వామిత్రుడు
తన జీవితమంతా ఏక భుక్త్వము చేసి బ్రాహ్మణత్వము పొందాడు. కనుక ఉపవాసముకు
మించిన వ్రతము లేదు. ఉపవాసవ్రతము అనుసరించడం వలన మనసు శరీరము పవిత్రమౌతాయి.
పైన చెప్పిన ఉపవాస ధర్మము లోకముకు అంగీరస మహర్షి అందించాడు. అంగీరసుడు
చెప్పిన విధంగా వ్రతాచరణ చేసిన మానవుడికి పాపములు అంటవు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
యజ్ఞ సమాన పుణ్యములు
ధర్మరాజు
" పితామహా ! యజ్ఞములు చేయవలెనని మీరు అనేకమార్లు చెప్పారు కాని యజ్ఞములు
చెయ్యడానికి ఎంతో ధనము కావాలి కదా ! మరి యజ్ఞములు చేయలేని వారి సంగతి
ఏమిటి ? వారు ఎలాంటి పుణ్యకర్మలు ఆచరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అందరికీ యజ్ఞములు యాగములు అందరికీ సాధ్యం కాదు కనుక అంగీరసుడు
ఉపవాస వ్రతం ఉపదేశించాడు. ఉపవాస వ్రతం చెయ్యడం కష్టమని కదా యజ్ఞముల
గురించి అడిగావు. ఉపవాసము చెయ్యడంలో తేలికైన విధము చెప్తాను విను. రోజుకు
రెండు సార్లు అనగా పగటి పూట ఒక సారి రాత్రి పూట ఒక సారి మాత్రమే భోజనము
చేసి భోజన సమయంలో మాత్రమే నీరుత్రాగి మధ్యలో ఏమీ తినకుండా త్రాగకుండా ప్రతి
రోజు అగ్నిని ఆరాధించే వారు ఉపవాస వ్రతము ఆచరించినట్లేనని పెద్దలు
చెబుతారు. ఇది కూడా ఆచరించండం కష్టమని తలచిన అంగీరసుడు చెప్పిన మిగిలిన
ఉపవాసవ్రతములు ఆచరించవచ్చు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
శ్రీకృష్ణుని తత్వము
ధర్మరాజు " పితామహా ! శ్రీకృష్ణుడు జ్ఞానప్రతీక అంటారు కదా ! ఆయన బోధనలు నాకు వినవలెనని కోరిక కలుగుతుంది. కనుక శ్రీకృష్ణతత్వము నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు హర, సనత్కుమార సంవాదానాన్ని వివరిస్తాను.
పూర్వము ఒక కోరికతో పరమశివుడు సనత్కుమారుడి వద్దకు వెళ్ళాడు. పరమశివుడికి సనత్కుమారుడు
అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు. పరమ శివుడు కొన్ని సందేహాలు తోర్చమని
సనత్కుమారుడిని అడిగాడు. సనత్కుమారుడు అది తన భాగ్యమని చెప్పాడు. శివుడు
" మహాత్మా ! ధ్యానముతో దర్శింపతగిన వస్తువేది ? తత్వములు ఎన్ని ? సాంఖ్యము
యోగము వాటి తత్వములు ఎన్ని ? సాంఖ్యము యోగము వాటి తత్వములు ఏవి ? ఇంకా
ఆధ్యాత్మిక విషయములను వివరించు " అని అడిగాడు. సనత్కుమారుడు " మహాశివా !
తత్వములు 24 అని కొందరు, 23 అని కొందరు, 25 అని కొందరు అంటారు. ప్రాకృతులు
23 అంటారు. వారు మనస్సు బుద్ధి ఒకటే అని అంటారు. అది సరి కాదు. పరిశుద్ధమైన
24 అనే వారు పరిశుద్ధమైన మనసే బుద్ధి అంటారు. నేను మాత్రము 25వ తత్వము
ఉంది అని నమ్ముతాను. అదే అధిష్ఠానము. 24 తత్వములు 25వ తత్వములో
లీనమైఉంటాయి. కనుక 24 తత్వాలు ఉన్నాయనడము, లేవు అనడము అంటారు. రెండూ
సంభవమే. ఈ లోకములో పంచభూతములు ఐదు. వాటి గుణములు అయిదు. ఇంద్రియములు పది.
ఇవి కాక బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి కలిపి మొత్తము 24. ఈ 24 నాలుగు
తత్వములను అధిష్ఠించి ఉండేది 25వ తత్వము. బాగా తెలిసిన వాడు 24 తత్వములు
కూడినది దేహము అని అంటారు. 25వ తత్వమైన పరమాత్మ కట్టెలో నిప్పు దాగి ఉన్న
చందాన శరీరమంతా ఆవహించాడు. కాని మానవుడితో ఉన్న సజమైన ఈర్ష్య, అసూయ,
దురభిమానము ఈ జ్ఞానమును అంట నీయదు. నేను నాది అనుకుంటూ నిత్యమూ ఈ దేహమే
తానని భ్రమిస్తూ సంసారంలో తిరుగుతుంటాడు. వేదము పరమాత్మతత్వము, బ్రహ్మమును
గురించి తెలియజేస్తుంది. దానిని అమృతత్వ తత్వము అంటారు. అమృతత్వతత్వము
అన్ని తత్వములకంటే మేలైనది. దానిని ఎరిగిన వాడు మృత్యుంజయుడు ఔతాడు. అది
తత్వములక్కన్నింటికీ ఈశ్వరుడు.
ఇంతకు మించిన ఈశ్వరుడు లేడు. ఇది సత్యము నిత్యము రహస్యము. పరమశివా ఈ
తత్వములు పైనుండి కిందకు వచ్చిన సృష్టి, కింద నుండి పైకి వెళ్ళిన లయము
అంటారు. వీటన్నింటినీ దాటన్నింటినీ దాటి బ్రహ్మపదము చేరడమే ఏకత్వము
అంటారు. శ్రద్ధలేని వాడికి, మనసులో ఏకాంతత లేని వాడికి, ఇంద్రియములను
జయించని వాడికి, వేదాధ్యయనము చేయని వాడికి ఈ జ్ఞానము సిద్ధించదు.
అధ్యాత్మము అధిభూతము అధిదైవతము
తరువాత సనత్కుమారుడు
పరమశివుడికి అధ్యాత్మము, అధిభూతము, అధిదైవతము గురించి చెప్పసాగాడు. "
ఈశ్వరా ! సకల జీవులలో ఈ అధ్యాత్మమము సమానంగా నిండి ఉంటుంది అని
తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. కాని ఈ జ్ఞానమును మునుపు దేవతలు, రాక్షసులు,
గంధర్వులు, మానవులు తెలుసుకోలేక అజ్ఞానంలో పడ్డారు. అసలు బ్రహ్మతత్వము
ఇంత వరకు ఎవరూ తెలుసుకొన లేదు. ఆ బ్రహ్మత్వత్వమే ఓంకారము. అహంకారము
పూర్తిగా నశించిన కాని బ్రహ్మతత్వము గోచరము కాదు. ఈ బ్రహ్మము నిష్కళంకము,
సుఖప్రథము, అఖిలము జ్ఞానదాహార్తిని తీర్చ కలిగిన సామర్ధ్యశాలి. ఈ బ్రహ్మము
అప్రమేయము, అవిజ్ఞేయము, అచలము, ఆది అంతము లేనిది, విమలము, అవ్యయము, ఇంద్రియ
గోచరము కానిది, అచ్యుతము, సత్ అసత్ కలిసి భాసించేది. ఈ బ్రహ్మ తత్వము
ముందు నారాయణుడికి తెలుసు నారాయణుడి వలన దేవతలు, మునులు, సిద్ధులు,
సాధ్యులు, గంధర్వులు తెలుసుకున్నారు. బ్రహ్మతత్వము అందరికీ గోచరము కాదు
బవబంధ విముక్తుడు మాత్రమే బ్రహ్మతత్వము తెలుసుకొన కలడు. ముందు జీవుడు
అహంకారము వదిలి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు చేసే పనులను వదిలి
వేయాలి. అప్పుడు అతడి మనసు బుద్ధి పరమాత్మలో లీనమౌతుంది. పరమ శివా ! ఇలా
23 తత్వములు పరమాత్మలో లీనమైన తరువాత ఇక పరమాత్మను చూచుట ఏముంది ? అదే
అద్వైత స్థితి.
మానవశరీరంలోని దేవతాస్వరూపములు
పరమశివా ! మానవశరీరంలో ఉండే దేవతా స్వరూపము వివరిస్తాను. నాలుక మీద చంద్రుడు, తలలోసరస్వతి, ప్రాణములలో వాయువు, ఉదానములో మెరుపులు, వ్యానములో పర్జన్యుడు, వక్షస్థలంలో ఆకాశం, బలములోకౌశికుడు, ఆపానములో ఈశానుడు, సమానములో మిత్రుడు, అప్సరసలు, కన్నులలో సూర్యుడు దేహములో భూమి, పాదాలలో విష్ణువు.
ప్రబుద్ధుడు, అబుద్ధుడు. యోగి అయిన వాడు. ఈ దేవతలందరినీ సమంగా ఆదరిస్తూ తన
ప్రాణములు ఊర్ధ్వ ముఖంగా ప్రయాణింపజేసి శిరస్సులో నిలుపుతాడు. ఆ సమయంలో
యోగి వ్యక్తమైన బ్రహ్మను
దర్శిస్తాడు. అదే అవ్యక్త స్థితి. అబుద్ధుడు వ్యక్త రూపం తెలుసుకుంటాడు.
ప్రబుద్ధుడు అవ్యక్త రూపం తెలుసుకుంటాడు. నిజానికి అబుద్ధుడు ప్రబుద్ధుడు
ఆత్మ యొక్క రెండు దశలు మాత్రమే. ఆత్మ ఒక్కటే. అవ్యక్త రూపము తెలుసుకున్న
యోగికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాటిరారు. యోగులకు తప్ప మిగిలిన వారికి ఆ స్థితి
దుర్లభం. ఆత్మ క్షరము, అక్షరము, పరము అనే మూడు స్థితులలో వ్యక్తమౌతూ
ఉంటుంది. 25వ తత్వమే ప్రబుద్ధము అంటారు. ఈ 25వ తత్వము ప్రకృతితీ కలిసిన అబుద్ధుడు
అంటారు. ఈ అబుద్ధుడిని 26వ తత్వముగా పిలుస్తారు. ఈ అబుద్ధుడు మాటకు మనసుకు
అందడు. ఈ అబుద్ధుడు తనకు తానుగా తెలుసుకుంటూ ప్రబుద్ధుడు ఔతాడు. లేక తనకు
తాను ప్రకృతిగా తలచిన అజ్ఞానంలో పడతాడు. ఆ అజ్ఞానము తొలగిన ప్రబుద్ధుడు
ఔతాడు.
మునిజన వృత్తి
పరమశివా ! ఇక మునిజనులు చేసే పనులను వివరిస్తాను. మునివృత్తిస్వీకరించిన
వాడు అడవులలో కొండ గుహలలో నివసించాలి. ఇంద్రియనిగ్రహము పాటించాలి.
విషయవాంఛలను వదిలి పెట్టిన అతడు యోగి ఔతాడు. గురువుగారి బోధనలను
పాటిస్తాడు. ఆహారాన్ని తగ్గిస్తాడు. తదనుగుణముగా మూత్ర విసర్జన కూడా తగ్గి
పోతుంది. క్రమంగా ఆహారం తీసుకోవడం ఆపి నిశ్చలుడౌతాడు. అప్పుడు ఆత్మ
సాక్షాత్కారం లభిస్తుంది. అందుకు నిర్జనమైన ప్రశాంత ప్రదేశము కావాలి.
అప్పుడే యోగి తమము, అస్తమము, జ్ఞానము, అజ్ఞానము వంటి ద్వందములు లేని
స్థితిని పొందుతాడు. అదే అధ్వైత స్థితి. ఈ అధ్వైతస్థితిని పొందిన యోగులు తమ
తమ దుఃఖముల నుండి విముక్తులౌతారు. జరామరణములు లేని స్థితిని పొందుతారు.
వారికి అణిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అటువంటి యోగులు యక్షులు,
గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన భూతకోటిని మించి పోతారు.
స్వేచ్ఛాజీవులుగా మారి పోతారు. ఈశ్వరా ! భవ్యయోగ తత్పరులమైన నేను, మా సహ
జన్ములైన సనక సనంద, సనత్సుజాతులు కూడా ప్రస్తుతము అదే స్థితిలో ఉన్నాము.
కనుక యోగధర్మము కంటే ఉత్తమమైన మార్గము వేరొకటి లేదు. మోక్షము పొందడానికి
యోగధర్మము నిచ్చెన వంటిది.
సాంఖ్యము
పరమశివా !
యోగము గురించి చెప్పాను. ఇప్పుడు సాంఖ్యం గురించి చెప్తాను. సాంఖ్యయోగులు
యోగము, సాంఖ్యము ఒకటే అని భావించి ఈ భవసాగరమును దాటి తరిస్తారు. ఇంద్రియముల
కంటే మనస్సు, మనస్సు కంటే అహంకారము, అహంకారము కంటే బుద్ధి, బుద్ధి కంటే
ప్రకృతి గొప్పవి. వీటన్నింటికీ అధికుడు పురుషుడు. పరమశివా ! పంచభూతములు
ఐదు, వాటి గుణములు ఐదు, ఇంద్రియములు పది, మనస్సు, బుద్ధి, అహంకారము,
ప్రకృతి నాలుగు. మొత్తము 24 తత్వములు. చేతనుడైన పురుషుని ఆశ్రయించుకుని
అచేతనమైన ప్రకృతి కూడా చైతన్యవంతం ఔతుంది. మొత్తము 23 తత్వములు 24 వ
తత్వమైన ప్రకృతి అనే మహాసముద్రపు అలల మీద తేలియాడుతూ ఉంటాయి. పురుషుడు
గుణరహితుడైనా ప్రకృతితో చేరిన పురుషుడు గుణములు కలవాడుగా ఔతాడు. అందు వలన
మిగిలిన 23 తత్వములు కూడా పురుషుడికి వాటి వాటి గుణములు ఆపాదిస్తాయి. తాను
వేరు ఈ ప్రకృతి వేరు వేరు ఈ 23 తత్వములు వేరు అని తెలుసుకుని ప్రకృతిని
ఉపేక్ష చేసి పొగలేని నిప్పులా ప్రకాశిస్తాడు. అలా కాక ఈ ప్రకృతే తానని
అహంకరించి తానే ఈ సృష్టికి లయకు కర్త అని భావించిన పురుషుడు వికారమును
పొంది ఈ ప్రకృతిని ఎదిరించ లేక దానికి వశుడై తమోగుణ ప్రధానములైన ఈ
ప్రాపంచిక సుఖములలో మునిగి పోతాడు. 25వ తత్వమైన పురుషుడు ప్రకృతిని
పట్టించుకొనక ఉపేక్షించిన 26వ తత్వమైన పరమానంద స్థితిని పొందుతాడు. కనుక
పురుషుడు సత్యగుణమును ఆశ్రయించి తత్వజ్ఞానము అలవరచుకుంటే ప్రకృతిలో
లీనంకాకుండా చిదానంద రూపుడౌతాడు. ఈ 26వ తత్వమే విద్య. కాని దానికి విద్య
అవిద్య అనే గుణములు లేవు. దానికి ఆది అంతము లేదు, మార్పు లేదు, అజామరుడు,
అనంతుడు, ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు
సాంఖ్యయోగుల గుణములు
మహాదేవా !
ఈ సాంఖ్యయోగమును అభ్యసించిన వారు చక్కని జ్ఞానసంపదతో ప్రకాశిస్తారు.
రాబోయే అరిష్టములను ముందుగా కనిపెట్ట కలిగిన పాటవము కలిగిఉంటారు. కనుక
రాబోయే అరిష్టములు అరికట్టగలుగుతారు. యోగాభ్యాసకులైన మునులు తమకు రాబోయే
అరిష్టములనుముందే తెలుసుకుని సర్వాంగధారణతో అన్ని తత్వములను ఏకంచేసి
మృత్యువును జయిస్తారు. నీటిలో చేప మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగే
తాను కూడా ఈ లోకములో సంచరిస్తుంటానని తెలుసుకున్న సాధకుడు ఈ ప్రకృతి నుండి
విడివడి అవ్యయత్వము పొందుతాడు. తామరాకు మీద నీటిబొట్టులా పురుషుడు ఈ
లోకములో సంచరిస్తూ కూడా తత్సంబంధమైన వికృతికి లోను కాకుండా నిర్లిప్తంగా,
నిశ్చలంగా, అజరామరంగా వెలుగొందుతాడు. ఈ ప్రకారంగా ప్రకృతిని వదిలి పెట్టిన
25వ తత్వమైన పురుషుడు 26వ తత్వమును పొంది విమల, శివ, నిరంజన స్వరూపుడై
వెలుగొందుతాడు. పరమశివా ఈ జ్ఞానమును నాకు, లోకానికి పూర్వము నా గురువైన
కపిలమహర్షి అనుగ్రహించాడు. ఆయన కింద శిక్షణపొందిన అనేక మంది శిష్యులు ఆయన
బోధనతో జ్ఞానవంతులు అయ్యారు. నేను కూడా అనేక మంది శిష్యులకు ఈ జ్ఞానాన్ని
బోధించాను. ఎందరో దివ్యమునులు దీనిని శ్లాఘించారు. గార్గ్యుడు, గౌతముడు,
కాత్యాయనుడు మొదలైన మహా మునులు ఈ బోధనతో తమ తమ మనసులోని సందేహాలను
తీర్చుకున్నారు. వారు ఈ ప్రకృతి సంపర్కము వదిలి దివ్యత్వము పొందారు.
పరమశివా పురుషుడు ప్రకృతితో కలవడమే బంధము కలవకుండా ఉండడమే మోక్షము " అని
చెప్పి సనత్కుమారుడు ఆకాశమార్గాన వెళ్ళి పోయాడు. శివుడు కూడా తన దివ్యమైన మనో పధంలో విహరించసాగాడు " అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.
పవిత్ర తీర్ధము
ధర్మరాజు " పితామహా ! ఎన్నోతీర్ధాలు ఉన్నాయి కదా ! అందులో పరమ పవిత్రమైన తీర్ధము ఏది వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తీర్ధములు అన్నీ మేలైనవే. అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమి లేదు. అన్ని తీర్ధములలో మానసతీర్ధము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానము ధృతి
అనే సరోవరము. ఎవరైతే రజస్సు, తమోగుణాలను పక్కననెట్టి సత్యాన్ని చేతధరించి ఆ
సరోవరంలో స్నానము చేస్తాడో అతడు పరిశుద్ధుడౌతాడు. రాగద్వేషములను వదిలి
ఇంద్రియనిగ్రహము పాటించు మహాత్ములందరూ పవిత్రతీర్ధముతో సమానులే. వారిని
సేవించడం ద్వారా మానవుడికి పుణ్యతీర్ధసేవనఫలం దక్కుతుంది. తపస్సుచేయడం,
ఇంద్రుయనిగ్రహము కలిగి ఉండడం, అహింసనుపాటించడం, మనస్సును నిగ్రహించడం,
శుభ్రతకలిగి ఉండడం ఇవన్నీ పుణ్యతీర్ధనసేవతో సమానములే. పైగుణములు లేకుండా
కేవలం నదీజలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్ధసేవన ఫలము దక్కదు. కేవలం
శరీరము శుభ్రపడుతుంది కాని మనసు శుభ్రపడదు కదా ! దొరకని వాటి కొరకు
ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడు తృప్తితో సంతృప్తితో
ఉండడం, ఆశాపాశములు విడిచి పెట్టడం పాటించే నరులకు వేరు తీర్ధములు అవసరం
లేదు " అని భీష్ముడు పలికాడు.
ఉత్తమ పదము
ధర్మరాజు
" తాతగారు ! మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమపదము చేరుకుంటాడు.
మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచి పెట్టి తనతో దేనిని సాయంగా తీసుకు
వెడతాడు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు"
ధర్మనందనా ! నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి
మాత్రమే తగిన వాడు. ఆయన ఇక్కడకు వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి
తెలుసుకో " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి
అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతడికి ఎదురేగి బృహస్పతికి
అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనము మీద ఆసీనుడిని చేసి ధర్మరాజు తాను ముందు
భీష్ముడిని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి " ధర్మనందనా ! పుట్టే ముందు,
చచ్చిన తరువాత, పుణ్య లోకములలోను, నరకంలోను జీవుడు ఉంటాడు. ఈ లోకంలో
తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు స్నేహితులు శ్మశానం
వరకు మాత్రమే వెళ్ళి తిరిగి పోతారు. నరుడు చనిపోయిన తరువాత అతడి ధర్మమే
అతడికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మకార్యములు
చెయ్యాలి. అలా ధర్మకార్యములు చేయని వాడు, ధర్మము వదిలి ప్రవర్తించే వాడు,
నరకానికి పోతాడు " అని పలికాడు బృహస్పతి.
జీవుడు ధర్మము
ధర్మరాజు " ఈ శరీరాన్ని వదిలపెట్టి వెళ్ళే జీవుడిని ధర్మము ఎలా అనుసరిస్తుంది ? " అని అడిగాడు. బృహస్పతి
" ధర్మనందనా ! పంచభూతములు, వాటి గుణములు అయిన శబ్ధ, స్పర్శ, రూప, రస,
గంధాదులూ బుద్ధి, ధర్మము జీవుడిని అనుసరించి వెడతాయి " అని పలికాడు.
ధర్మరాజు " మహాత్మా ! రేతస్సు ఎలా ఏర్పడుతుంది ? " అని అడిగాడు. బృహస్పతి "
ధర్మనందనా ! మానవుని శరీరము పంచభూతాత్మకము. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం
దేహాన్ని పోషిస్తుంది. మానవుడిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది.
స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భాశయము చేరిన రేతస్సు గర్భము ధరింపచేసి
పిండరూపము పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలముగా
సుఖములు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖములు అనుభవిస్తాడు.
పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు ధర్మాధర్మములు అతడికి సుఖదుఃఖములు
కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యములు చేయాలి. పాపకార్యములకు
దూరంగాఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యములు చేసిన వారు మానవజన్మకు
బదులు పశుపక్ష్యాదులుగా క్రిమి కీటకాలుగా జన్మిస్తాడు. అదే నరకము. నరకము
అంటూ వేరీది లేదు.
కర్మ సిద్ధాంతము
ఇక
నీకు కర్మ గురించి చెప్తాను విను. జననీ, జనకులు, గురువులకు మేలుచేస్తే
సుఖము వారికి కీడుచేస్తే దుఃఖము కలుగుతాయి. వీరు కాక తక్కిన విషయములలో
పాపముచేస్తే దానికి ప్రాయశ్చితము ఉంది కాని తల్లి, తండ్రి, గురువుల పట్ల
చేసిన అపచారమునకు, పాపముకు పరిష్కారము లేదు. ఆహారధాన్యమును అపహరించిన వాడు
మరుజన్మలో ఎలుకగాను, పందికొక్కుగాను, కుక్కగానూ జన్మిస్తాడు. పరులభార్యను
కోరువాడు తోడేలుగాను, రాబందుగాను, కోతిగాను, గ్రద్దగానూ పుడతాడు. చివరకు
పురుగుగాను పుడతాడు. అప్పటికి కాని ఆపాపముపోదు. ఎవరైతే తన కూతురును ఒకరికి
ఇచ్చి పెళ్ళి చేసి మరలా మనసు మార్చుకుని ఆమెను వేరొకరికి అప్పగిస్తాడో అతడు
పురుగుజన్మ ఎత్తుతాడు. దేవకార్యము చేసిన తరువాత పితరులకు నివేదనము
చేయకుండా భోజనము చేయువాడు కాకిజన్మ ఎత్తుతాడు. అన్నగారిని తిట్టిన వాడు
పక్షిజన్మ ఎత్తుతాడు. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని కోరిన అతడు పురుగుగా
పుడతాడు. చేసిన మేలు మరచినవాడు నరకబాధలు అనుభవిస్తాడు. ధనము మీద వాంఛతో
నిరాయుధుడిని చంపినవాడికి పక్షిజన్మ వస్తుంది. ఆ జన్మలో చావుదెబ్బలు తింటూ
మారణాయుధాల వలన మరణిస్తాడు. స్త్రీని చంపినవాడు మరుజన్మలో అనేక రకములైన
నరకబాధలు అనుభవిస్తాడు. అన్నము, పాలు దొంగిలించిన వాడు వాటిలో పురుగులుగా
జన్మిస్తాడు. పండ్లను, ఇనుమును, వెండి, బంగారమును దొంగలించిన వాడు వరుసగా
కోతి, కాకి, పక్షి, క్రిమిగా పుడతాడు. ఇతరుల దుస్తులు అపహరించిన వాడు
కుందేలుగా పుడతాడు. ఇతరులు తన వద్ద ధనమును అపహరించి వంచించిన నమ్మక ద్రోహి
చేప మొదలైన నీచ జన్మలు ఎత్తుతాడు. పైన చెప్పిన పాపాలు స్త్రీలు చేస్తే
పురుషులు ఎత్తిన జన్మలలో వారికి భార్యలైపుట్టి వారితోచేరి నరకబాధలు
అనుభ్యవిస్తారు .
పాపపరిహారము
బృహస్పతి
" ధర్మనందనా ! చేసిన పాపములు దానధర్మము వలన నశిస్తుంది. అన్ని దానములలో
అన్నదానము శ్రేష్టము. న్యాయముగా సంపాదించిన ధనముతో అన్నదానము చేసిన అది
అన్ని పాపములను హరిస్తుంది. చివరకు తాను భిక్షగా తీసుకు వచ్చినది అయినా
బ్రాహ్మణుడికి పెట్టి అతడి ఆకలి తీర్చిన అతడికి పుణ్యలోకములు కలుగుతాయి.
బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసినందు వలన, తాను నేర్చుకున్నది పదిమందికి
బోధించడం వలన, క్షత్రియుడు అటువంటి బ్రాహ్మణులను పోషించడం వలన ఉత్తమ
లోకాలను పొందుతాడు. వైశ్యుడు ధర్మంగా చేసిన ఆర్జనతో అనన్నదానము చేసి పుణ్యం
సంపాదించ వచ్చు. శూద్రుడు తాను శ్రమపడి తెచ్చిన ధనముతో అనన్నదానము చేసి
పుణ్యలోకములకు పోతాడు. ఏ కులము వాడైనా తాను తినబోయే ముందు ఇతరులకు పెట్టి
తినిన సద్గతి కలుగుతుంది. కనుక ధర్మనందనా అన్ని దానములలో అన్నదానము
గొప్పది. దాని వలన సర్వ పాపములు నశిస్తాయి " అని అన్నాడు బృహస్పతి.
అహింస
ధర్మరాజు
" మహాత్మా ! ధ్యానము, ఇంద్రియనిగ్రహము, గురువులను భక్తితో సేవించుట,
అహింసను పాటించుట, నిత్యము దేవుడిని పూజించడం, తపస్సు వీటన్నింటిలో
మిక్కిలి సేవించవలసినది ఏది ? వివరించండి " అని అడిగాడు. బృహస్పతి
" ధర్మనందనా ! నీవు చెప్పిన ఆరుమార్గములు మంచివే. కాని వీటి అందు అహింస
పరమధర్మము. అహింస సకలవ్రతములను ప్రకాశింపజేస్తుంది " అని చెప్పి బృహస్పతి
స్వర్గలోకముకు వెళ్ళి పోయాడు. తరువాత ధర్మరాజు
" పితామహా ! సర్వదేవతలు, బ్రాహ్మణులు, మునులు అందరూ అన్ని ధర్మములలో అహింస
పరమధర్మమని చెప్తారు కదా ! ఆ అహింస గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ధర్మాలు అహింస అనే ధర్మంలో
ఇమిడి ఉన్నాయి. ఈ అహింస నాలుగుపాదములతో నడుస్తుంటుంది. ఆ పాదములలో ఏ ఒక్కటి
కుంటుపడినా ధర్మము కుంటుపడుతుంది. మనసుచేత కాని, వాక్కుచేత కాని,
శరీరముచేత కాని పరులను హింసించడం, మాంసముతినడం ఇవి హింసామార్గాలు. మాంసం
తినడం హింసాత్మకమైనదే. కనుక ఈ నాలుగు మార్గాలలో హింసను వదలాలి. ఆంసం తినడం
మీద మక్కువ వదలడమూ అహింసయే " అని భీష్ముడు చెప్పాడు.
పితృకార్యము మాంసము
ధర్మరాజు
" పితామహా ! పితృకార్యములలో మాంసము ప్రధానంగా వాడతారు కదా ! మరి మృగములను
చంపకపోతే మాంసము ఎలా వస్తుంది " అని ఎదురు ప్రశ్న వేసాడు " అని ఎదురుప్రశ్న
వేసాడు. భీష్ముడు " ధర్మనందనా ! మాంసము తినడం మానడము అశ్వమేధయాగముతో
సమానము. మాంసముతినడం కోసము జంతువులనుచంపడం, చంపించడం మహాపాపము. కాని
శ్రాద్ధాలలో, యాగాలలో వేదవిధిని అనుసరించి మాంసభక్షణ జరుగుతుంది. దానివలన
దోషము ఉండదు. కాని రుచికొరకు కడుపు నింపుకొనుట కొరకు మాంసంతినడము జంతువులను
చంపడం మహాపాపము. మాంసము తినడం ఆపితే అదే ఒక తపస్సు అని శాస్త్రాలు
చెప్తున్నాయి. మాంసమురుచి అన్ని రుచులకన్నా ఎక్కువ. కనుక మాంసముతినడం ఆపిన
అతడు దేవతాసమానుడు. సాటి ప్రాణులనుకాని మాంసము రాదు. అంతే కాని రాళ్ళనుండి
చెట్లనుండి మాంసము వస్తుందా ! మాంసము కొరకు ప్రాణులను వేటాడే సమయంలో
ప్రాణులను చంపుసమయంలో చంపే వాడికి చిన్న దెబ్బ తగిలినా అతడు
విలవిల్లాడుతుంటాడు కదా ! అదే నొప్పి చంపబడే ప్రాణులకు ఉంటుంది కదా ! ఆ
మాత్రము గ్రహించక ప్రాణులను చంపితినడం పాపము కాదా ! ఆ మాత్రము గ్రహించ
కుండా మాంసంకొరకు ప్రాణులను చంపడం ఏమి న్యాయం ? కనుక మాంసం తినడము కొరకు
జీవహింస మానడం ఉత్తమలక్షణం. మానవులు మాంసం తినడం మానుకుంటే జంతువులు భయం
లేకుండా బ్రతుకుతాయి. స్వాయంభువ మనువు కూడా ఇదేమాట చెప్పాడు. మార్కండేయ
మహర్షి కూడా మాంసము తినడం మానిన ఆయుర్ధాయము పెరుగుతుందని చెప్పాడు. మాంసము
తినే వాడు రాక్షసుడితో సమానుడు. మాంసముతినడం మానిన తరువాతనే దేవతలకు
దేవత్వము కలిగింది. మాంసభోజనం మానడము నూరేళ్ళు తపస్సు చేసిన దానితో సమానము.
తపస్సుచేసినా దానధర్మములు చేసినా బ్రహ్మలోక నివాసము ప్రాప్తింస్తుందో లేదు
చెప్పలేము కాని మాంసము తినడం మానివేసిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
ఆషాఢము, శ్రావణము, బాద్రపదము, ఆశ్వీజము ఈ నాలుగు మాసాలలో మాంసము తినడము
మానిన రోగములు రావు, ఆయుస్షువృద్ధి చెందుతుంది, బలవంతుడు ఔతాడు సగరుడు, దిలీపుడు, నలుడు, నృగుడు, భగీరధుడు మొదలగు చక్రవర్తులు వర్షాకాలము నాలుగు నెలలు మాంసాహారము మానివేసి కీర్తిమంతులయ్యారు " అన్నాడు భీష్ముడు.
మాంసాహారము మీద మక్కువ
ధర్మరాజు
" పితామహా ! మాంసభక్షణం ఇంత పాపం అని తెలుసి కూడా మానవులు కాయకూరలు,
పండ్లు భక్ష్యములు ఎందుకు తినరు. మాంసాహారము మీద మక్కువ ఎందుకు చూపిస్తారు "
అని అడిగాడు. ఆ మాటలకు భీష్ముడు
నవ్వి " ధర్మనందనా ! ఒక సారి మాంసమును భుజించిన వాడు దాని రుచికి దాసోహం
అయి దాని నుండి తప్పించుకో లేడు. మాంసము తినడం వలన వీర్యశక్తి పెరుగుతుంది,
పనిచేసి అలసిన వాడికి నూతనశక్తి ఇస్తుంది, గాయములను శీగ్రగతిన మాన్పుతుంది
ఫలములలో, భక్ష్యములలో, కాయకూరలలో ఈ శక్తిలేదు. మాంసభక్షణ వలన కలిగే దోషము
దానము వలన పోతుంది. యజ్ఞయాగాదులలో మాంసభక్షణ వలన దోషములేదు అని శాస్త్రాలు
చెప్తున్నాయి. అగస్త్యుడు మాంసభక్షణ గురించి చెప్తూ ఇలా అన్నాడు. వేటాడడం
పరమధర్మము. అందులో పక్షులు, మృగములను చంపడం ధర్మము. ఆ మాంసముతో
దేవకార్యములు, పితృకార్యములను నిర్వర్తించడం కూడా ధర్మమే. కాని కేవలము
రుచిగా తినడం కొరకు దేహాన్ని పెంచుకొనడం కొరకు మాంసం తినడం జంతువులనుచంపడం
పాపమే. ఇతర జంతువుల పక్షులమాంసంతో దేహాన్ని పోషించడం మహాపాపము. మాంసంతినడం
వలన వచ్చేపాపము దానధర్మము వలన పోవడం నిజమే అయినా ఆతరువాత మాంసభక్షణ నిలిపి
వేయకున్న పాపము పోదు కనుక అహింసకు మించిన పరమధర్మము వేరొకటి లేదు. దయకల
వాడు ప్రాణుల అందు ప్రాణభయాన్ని చూడగలడు. అందువలన దయకలిగి ఉంటాడు. ప్రాణుల
ఎడల క్రూరత్వాన్ని చూపిస్తే అవి కూడా అతడి అందుక్రూరత్వము చూపిస్తుంది.
కనుక మానవుడు ప్రాణుల అందు దయకలిగి అహింసను పాటించుట పరమధర్మము " అని
భీష్ముడు చెప్పాడు.
ఊర్ధ్వలోకములు
ధర్మరాజు
" పితామహా ! మేము చేసిన యుద్ధములో ఎంతోమంది మరణించారు కదా ! వారికి ఏ
లోకములు ప్రాప్తిస్తాయి తెలపండి. ఎందుకంటే మానవులు అందరూ బ్రతకడం సుఖాలు
అనుభవించడానికి అని చావడం దుఃఖహేతువు అని భావిస్తారు కనుక ఎవరు తమతమ
ప్రాణములను వదలుటకు సులభముగా అంగీకరించ లేరు. అందుకని అడిగాను " అన్నాడు ధర్మరాజు. భీష్ముడు
" ధర్మనందనా ! నీకు ఈ సందర్భంలో ఒక కీటకముకు వేదవ్యాసుడికి మధ్యజరిగిన
సంభాషణ చెప్తాను విను. ఒకసారి వేదవ్యాసుడు బండ్లు పోయే దారిలో వేగంగా
పరుగెడుతున్న ఒక పురుగును చూసి " ఓ పురుగా ! ఎందుకు అలా వేగంగా ఎందుకు అలా
భయంతో వేగంగా పరుగెడు తున్నావు " అని అడిగాడు. ఆ పురుగు " ఓ మహాత్మా !
చూసారా ఈ దారిలో అతి వేగంగా బండ్లు వస్తున్నాయి. ఈ బండ్లశబ్ధము, ఎద్దుల
రంకెలు మనుష్యుల అరుపులు నాకు బెదురు పుట్టిస్తున్నాయి. బ్రతకడం సుఖం,
చావడం దుఃఖంకదా ! అందుకని ఆ బండ్ల కిందపడి చావకుండా ఇంకా కొంత కాలం
బ్రతుకుదామని వేగంగా పరుగెడుతున్నాను. ఏమైనా ప్రాణులకు ప్రాణభీతి ఎక్కువ
కదా ! " అన్నది. వ్యాసుడు
" నీవా చిన్న పుగువు. నీవు సుఖములు అనుభవించ లేవు. అటువంటి సమయంలో నీకు
ప్రాణభయం ఎందుకు ? నీకు చావే సుఖముకదా ! అప్పుడు ఈ భయాలు ఉండవు " అన్నాడు. ఆ
మాటలకు ఆ పురుగు నవ్వి " మహాత్మా ! పురుగులకు కీటకములకు ఇంద్రియ సుఖములు
లేవని మీరు ఎలా చెప్పగలరు. మా పద్ధతిలో మేము కూడా మానవుల వలె మా దారిలో
ఇంద్రియ సుఖములను అనుభవిస్తాము. అందుకే మాకుకూడా ప్రాణభయము బ్రతుకు మీద ఆశ
ఉన్నాయి. అయినా మునీంద్రా ! నా మనసు తెలుకుకోవాలని అడుగుతున్నావు కాని ఆ
మాత్రము నీకు తెలియదా చెప్పు.
పురుగు పూర్వజన్మ
నేను
పోయిన జన్మలో శూద్రుడను చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలాక్రూరుడను,
అనాచారిని, అతిలోభిని. దయ, జాలి లేని వాడిని. దురుసుగా ఉండే వాడిని. అన్ని
దుర్గుణములు కలిగినవాడిని. కాని నేను నా తల్లిని భక్తితో సేవించే వాడిని.
ఒక నాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతడిని భక్తితో
పూజించాను. అందువలన నాకు పునర్జన్మస్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు
మంచిపనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్మురణ కలిగింది. కనుక మునీంద్రా !
నాకు ఆ విషయముల గురించి సవిస్త్రరంగా వివరించండి " అని అడిగింది. వ్యాసుడు
" ఓ కీటకమా ! నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు
గతజన్మలో పాపములు చేసినందు వలన నీకు పురుగుజన్మ వచ్చిందని నాకు తెలుసు.
అలాగే నీవు కొన్ని పుణ్య కార్యములు కూడా చేసావు. అందు వలననే నేను నీతో
మాట్లాడుతున్నాను. నా తపోబలము చేత నేను నీకు ఈ పురుగుజన్మ నుండి విముక్తి
కలిగిస్తాను. నీకు మనుష్యజన్మ ఎత్తి పుణ్యకార్యములు చేయవలెనన్న కోరిక కలగడం
కూడా గతజన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే ! మానవులు తాముచేసిన
పుణ్యకార్యములవలన దేవతలౌతారు. తాము చేసిన పాపకార్యముల వలన ఇలా కీటకముల జన్మ
ఎత్తుతారు. నీవు గతజన్మలో చేసిన పుణ్య కార్యముల వలన నీకు గతజన్మస్మృతి
కలగడమే కాక నా దర్శనభాగ్యము కూడా కలిగింది. నేను నీకు ఉత్తమగతులు
ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య,
క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణజన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో
పూర్వ జన్మస్మృతి ఉంటుంది " అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుడి
పాదాలు తాకి ప్రాణాలువదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళి పోయాడు.
పురుగు తరువాత జన్మలు
కాలక్రమేణా !
ఆ పురుగు వరుసగా అన్ని జన్మలు ఎత్తుతూ క్షత్రియ జన్మలో ఒక రాజ్యానికి
రాజయ్యాడు. రాజ్య సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక రోజు ఆ రాజు వ్యాసుడి
ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. వ్యాసుడు
రాజుకు తగు విధంగా మర్యాదచేసి " రాజా ! ఈ జన్మలో నీవు తపస్సు చెయ్యి. ఆవుల
కొరకు, బ్రాహ్మణుల కొరకు యుద్ధములో ప్రాణములు వదులు. నీకు బ్రాహ్మణజన్మ
వస్తుంది " రాజు కూడా వ్యాసుడు చెప్పినది చేసి యుద్ధములో ప్రాణాలు వదిలి
మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆ బ్రాహ్మణజన్మలో ఎన్నో యజ్ఞయాగాలు
చేసాడు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు, దానధర్మాలు చేసాడు. తరువాత ఒక సారి
వేదవ్యాసుడిని దర్శించుకున్నాడు. వ్యాసుడు సంతోషించి అతడిని కీర్తి
ప్రతష్ఠలతో అలరారమని దీవించాడు. ధర్మనందనా ! కనుక ధర్మనందనా ! యుద్ధములో
మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించుట తధ్యము. ఇందు అనుమానము ఏదీ లేదు "
అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
విద్య తపస్సు దానము
ధరరాజు " పితామహా ! విద్య, దానము, తపస్సు వీటిలో ఏది మంచిది వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు వ్యాసుడు మైత్రేయుడు మధ్య జరిగిన సంవాదము వినిపిస్తాను. ఒక సారి వ్యాసమహాముని కాశీనగరానికి వెళ్ళి ఆ సమయంలో కాశీ నగరంలో ఉన్న మైత్రేయమహర్షి
వద్దకు వెళ్ళాడు. మైత్రేయుడు వ్యాసుడికి తగు మర్యాదలు చేసి తృప్తిగా భోజనం
పెట్టాడు. వ్యాసుడు ఆ మర్యాదలకు తృప్తి చెంది " మైత్రేయా ! దానములలో
అన్నదానము శ్రేష్టమైనది. నువ్వు నాకు అన్నదానము చేసి తృప్తిపరచావు. దానము
ఇవ్వతగిన వస్తువులలో అన్నము చాలా శ్రేష్టమైనది. ఈ దేహము అందులో ఉన్న
ప్రాణులు దేహములో ఉన్న బలము అన్నీ అన్నమువలన కలిగివే కదా ! మైత్రేయా !
తపస్సు చేస్తే మనసులో ఉన్న కల్మషములన్నీ తొలగి పోతాయి. ఆ తపస్వి అంతకు
ముందు చేసిన దానము వలన విద్య నేర్చుకొనడం సులభం ఔతుంది. అతడు నేర్చిన విద్య
అతడి తపస్సును వృద్ధిచేస్తుంది. కనుక తపస్సు విద్యాదానముల వలన
పెంపొందుతాయి. దానములలో కెల్లా అన్నదానము గొప్పది. ఎంతటి దుష్టుడైనా అతడు
చేసిన దానముల వలన పవిత్రుడౌతాడు " అని వ్యాసుడు మైత్రేయుడికి చెప్పాడు.
కనుక ధర్మనందనా ! అన్నీ ధర్మమములలో అన్నదానము గొప్పది. దానములలో అన్నదానము
గొప్పది " అని భీష్ముడు చెప్పాడు.
స్త్రీ
ధర్మరాజు
" పితామహా ! మీరు అన్ని విషయములు చెప్పారు కాని స్త్రీల గురించి చెప్ప
లేదు. స్త్రీల గురించి వినవలెనని కోరికగా ఉంది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు కైకేయీ శాండిలీ సంవాదము గురించి చెప్తాను. కేకయరాజకుమారి సుమన దేవలోమలో ఉన్న శాండిలిని
చూసి " కాంతామణి నీకు దేవలోకనివాసము ఎలా కలిగింది " అని అడిగింది. అందుకు
శాండిలి ఇలా బదులు చెప్పింది " కైకేయీ ! నేను అత్తగారికి మామగారికి ఎదురు
చెప్పకుండా వారినిసేవించాను. దేవతారాధనలు, పితృశ్రాద్ధములు, అతిథిపూజలు
చెయ్యడంలో అలసత్వము చూపించ లేదు. అన్నీ శ్రద్ధగాచేసాను. నేను ఎప్పుడూ వీది
వాకిట నిలుచో లేదు. నేను వీధి మొహము చూడ లేదు. అందరి ముందు బిగ్గరగా
నవ్వలేదు. విద్యార్ధులకు విద్యావంతులకు బిక్ష పెట్టడంలో ఏ మాత్రం అశ్రద్ధ
చూప లేదు. భర్త ఇంటికి రాగానే సపర్యలు చేసాను. నా పిల్లలను మంచి వారుగా
పెంచాను. నా భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము అంతే కాని నాకని వేరు
ఇష్టాలు లేవు. నా భర్త బయటకు వెళ్ళినప్పుడు నేను ఆయన తిరిగి వచ్చే వరకు
నేను పూలు పెట్టుకోను. మంచి బట్టలు ఆభరణాలు ధరించను. రుచి కలిగిన
పదార్ధములను చేసుకుని తినను. పొదుపుగా ఉంటాను. మా బంధువులను అందరిని సమంగా
ఆదరిస్తాను. మా ఇంట్లో ఉన్న ఆవులను స్వయంగాపోషిస్తాను. ఇంటి వ్యవహారములో
భర్తకు ఎదురు చెప్పను. మా ఇంట ఉన్న నిత్యాగ్నిహోత్రమును జాగ్రత్తగా
కాపాడుతుంటాను. మా ఇంటి రహస్యములను రచ్చకీడ్చను. నేను గర్భిణీస్త్రీగా
ఉన్నప్పుడు రుచి కలిగిన భోజనము మాని ఏది అవసరమో అదే భుజిస్తాను. కనుక నాకు
దేవలోకప్రాప్తి కలిగింది " అని శాండిలిని కైకేయికి చెప్పింది. ధర్మనందనా ! నీ సందేహము తీరింది కదా ! " అన్నాడు భీష్ముడు.
శ్రేష్టమైనది
ధర్మరాజు " పితామహా ! సర్వశాస్త్రములలో చెప్పబడినది శ్రేష్టమైనది అయిన కార్యము ఏదీ " చెప్పండి అని అడిగాడు. భీష్ముడు " పితామహా ! ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు నారదుడు, పుండరీకుడు
వీరి మధ్యజరిన సంభాషణ గురించి చెప్తాను. శ్రద్ధగావిను. ఒకప్పుడు
పుండరీకుడు నారదుని నీవు నన్ను అడిగిన ప్రశ్న అడిగాడు. నారదుడు "
పంచభూతములు 5, వాటి గుణములు 5, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5,
మనసు, బుద్ధి, అహంకారము ఇవి 23. 24వ తత్వము ప్రకృతి. 25వ తత్వము పురుషుడు.
అతడు సర్వాభూతాత్మకుడు. అతడిని నరుడు అని కూడా అంటారు. ఆ నరుని వలన కలిగిన
తత్వమే నారములు. ఆ నారములకు అధిపతి నారాయణుడు. ఆ నారాయణుడు అనంత విశ్వమును తన అందు ఆవిర్భవించపజేసి లయంచేస్తుంటాడు. విభుడుగా విరాజిల్లుతుంటాడు. ఈ నారాయణుడినే పరబ్రహ్మ, పరతత్వము, పరమపదము, ఈశ్వరుడు, విష్ణువు అని పిలుస్తుంటారు. అఆ నారయణుడే జగత్తు అంతా నిండి ప్రకాశిస్తుంటాడు. ఇంకా ఆ నారాయణుడు, వాసుదేవుడు,
ఆత్మ అనే వేదాంతవిషయములలో సంభోదించబడుతూ ఉంటాడు. నరుడికి కూడా అవే పేర్లు
ఉంటాయి. నరనారాయణుడికి భేదము లేదు. సర్వ శాస్త్రములను పరిశీలించిన పిమ్మట,
దృఢమైన విచారము చేసిన పిమ్మట నారాయణుడిని స్మరించ వలెనని చెప్పబడింది. కనుక
నారాయణుడే అనుష్టించ తగినవాడు. మానవులు కొంచము సమయమైనా నారాయణుడిని
తలచుకుంటే అతడికి ఉత్తమగతులు కలుగుతాయి. ఇంక సదా నరనారాయణుడిని తలిచే
వారిగురించి చెప్పను అలవి కాదు. కనీసం మరణ సమయంలో అయినా " ఓం నమో నమో
నారాయణా " అని స్మరిస్తే చాలు అతడికి ఉత్తమపధము లభిస్తుంది. నారాయణశబ్ధమే
బ్రహ్మము. కనుక నిరంతరం నారాయణ నామస్మరణ చేసే వాడు తమ పాతకములు
పోగొట్టుకొనుటే కాక తనను ఆశ్రయించిన వారి పాతకము కూడా పోగొట్ట కలిగిన
శక్తివంతుడు ఔతాడు. ఇది బ్రహ్మ వాక్కు. మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ నారాయణ నామస్మరణ ఏమరక చెయ్యడం అతడి విధి. లేని ఎడల అతడికి ఉత్తమగతులు కలుగవు. ఈ విష్ణువు భక్తితో తప్ప వేరు విధముగా గోచరము కాడు. అందుకే విష్ణువుకు భక్తవత్సలుడు అనే నామము సార్ధమైనది " అని నారదుడు
పుండరీకుడికి విష్ణుమహిమను వివరించాడు. పుండరీకుడు విష్ణువును భక్తితో
అర్చించాడు. అప్పుడు పుండరీకుడికి కలలో శంఖు, చక్ర, గదా, శార్గము నాలుగు
చేతులలో ధరించి వక్షస్థలమున శ్రీవత్సము అను పుట్టు మచ్చతో తామరరేకుల వంటి
కన్నులు కల వాడు, కిరీటము, కుండలములు ధరించిన వాడు, కౌస్థభమణిని ధరించిన
వాడు అయున శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఆ రూపము పుండరీకుని మనసులో
శాశ్వతముగా నిలిచి పోయింది. ధర్మనందనా నీవు కూడా ఆ విష్ణుస్వరూపమును
నిరంతరము మనసులో నిలిపుకొని ధ్యానించు. నీకు సకల శుభములు కలుగుతాయి " అని భీష్ముడు చెప్పాడు.
దానధర్మము ప్రియభాషణ
ధర్మరాజు
" పితామహ ! సాధారణంగా మానవులు దానధర్మములు చేస్తుంటారు. ఇతరులతో ప్రియంగా
మాట్లాడుతుంటారు రెండింటిలో ఏది గొప్పది ? తెలియ చెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! రెండూ మంచివే. ఈ రెండూ ఎదుటి వాడి మనసును బట్టి చేయాలి.
దానము గురించి చెప్పనసరం లేదు దానము సదా శ్లాఘనీయమే. ప్రీతికరంగా మాట్లాడడం
గురించి నీకు ఒకకథ చెప్తాను విను. ఒక బ్రాహ్మణుడు పనిమీద నిర్మాన్యుష్యమైన
అడవిలో వెళుతున్నాడు. అప్పుడు ఒక రాక్షసుడు అతడిని చంపి అతడి మాంసము
తినవలెనన్న తలంపుతో ఆ బ్రాహ్మణుడిని పట్టుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు భయము
చెందక నిర్మలంగాను నిశ్చలంగాను ఉన్నాడు. అతడి ధైర్యానికి ఆశ్చర్యపోయిన
రాక్షసుడు " బ్రాహ్మణోత్తమా ! నీవు నా ప్రశ్నలకు జవాబు చెపితే నిన్ను
విడిచి పెడతాను. లేని ఎడల నిన్ను చంపితింటాను " అన్నాడు. బ్రాహ్మణుడు
అందుకు అంగీకరించాడు. రాక్షసుడు " నా శరీరము డస్సిపోయింది అలసి పోయింది
అందుకు కారణం ఏమిటి ? " అని అడిగాడు. బ్రాహ్మణుడు " మహాత్మా ! నీవంటి
మహాత్ముడు అడిగితే చెప్పక ఊరుకుంటానా ! నీవు చెడ్డవాడివి అని తెలిసి నీ
బంధువులు అందరూ నిన్ను వదిలి వెళ్ళారు. అందుకు నీవు బాధ పడుతున్నావు. నీవు
దరిద్రంతో బాధపడుతూ నీకు లభించని ధనము గురించి చింతిస్తున్నావు.
మొహమాటానికి పోయి ఇతరుల చేతిలో ఓడిపోయిన అదిచూసి వారు అది తమ ప్రతాపమని
పొంగిపోవడం చూసి ఓర్వలేకున్నావు. దుర్మార్గులు నీ చుట్టూచేరి పొగడుతుంటే
పండితులు నిన్ను పొగడలేదని మనసులో బాధపడుతున్నావు. ఈ బాధలవలన నీవు మనసులో
కృశించిపోతున్నావు. నీవు చెప్పిన మాటలను సభ ఆమోదించకపోవడం, నీవు చేసిన పాడు
పనులకు నీ భార్య బాధపడుతుంటే ఆమెను నీవు అనునయించ లేని దుస్థితిలో
ఉన్నావు. నీ సొమ్మును ఇతరులు ఎత్తుకు పోతున్నారని తెలిసి నీ సొమ్మును
రక్షించు కోలేక బాధపడుతున్నావు. చాటు మాటుగా నిన్ను గురించి చెప్పే మాటలు
నీ బంధువులు నిజమని నమ్మడం దాని వలన కలిగే దుఃఖాన్ని నీవు మనసులో దాచుకోలేక
బయటకు చెప్ప లేక కుమిలి పోతున్నావు. ఇవి నీ క్షీణతకు కారణాలు. నీ భార్యా
బిడ్డలు వారి దుష్ప్రవర్తనతో నిన్ను ఇబ్బంది పెట్టడం, నీ తల్లి తండ్రులు,
సోదరులు రోగములతో బాధపడం నీ పూర్వ జన్మలో నీవు ఒక బ్రాహ్మణుడికి చెందిన
ఆవును చంపడం, దుష్టబుద్ధితో బ్రాహ్మణుల సొమ్మును, దేవుడిసొమ్మును
అపహరించడం, నీ ధనమును పోగొట్టుకుని పరితపించడం, నీ బంధువులు చనిపోవడం,
దుర్మార్గుడైన నీ సేవకుని వలన కలిగిన నష్టానికి నీవు బాధ్యుడవు కావడం వీటి
వలన కూడా ఒక మానవుడు కృంగి కృశించి పోతాడు " అని బ్రాహ్మణుడు రాక్షసుడికి
చెప్పాడని భీష్ముడు చెప్పాడు.
పురాణగాధ
ధర్మరాజు సందేహాలు ఇక లేనట్లు " పితామహా ! అందరికీ వినిపించేలా ఒక ప్రాచీన గాధ ఒకటి వినిపించండి " అని అడిగాడు. భీష్ముడు
" ధర్మనందనా ! నీకు ఉమామహేశ్వర సంవాదము వినిపిస్తాను. ఈ సంవాదం
శ్రీకృష్ణుడి సన్నిధానంలో వినిపించడం నా పూర్వ పుణ్యపుణ్యవిశేషంగా
భావిస్తున్నాను. శ్రీకృష్ణా ! నీ అనుమతితో ఈ కథను ధర్మరాజుకు వినిపిస్తున్నాను. పుత్రసంతానంకోరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితోసహా
హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరములు అత్యంత దీక్షతో వ్రతంచేసాడు.
వ్రతదీక్షవలన శ్రీకృష్ణుడు చాలా నలిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని
చూడడానికి నారదుడు, వ్యాసుడు, వాల్మికి, దేవలుడు, కశ్యపుడు మొదలగు
వారు తమ తమతమ శిష్య బృందముతో అక్కడకు వచ్చారు. వారికి శ్రీకృష్ణుడు
అర్ఘ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించి ఇష్టాగోష్టి జరుపుతున్నాడు.
అప్పుడు శ్రీకృష్ణుడి ముఖము నుండి ఒక మహాగ్ని వెలువడింది. ఆ అగ్ని
అక్కడ ఉన్న అడవిని కాల్చింది. ఆ అడవులలోఉన్న మృగములు, పక్షులు, తపస్సు
చేసుకుంటున్న సిద్ధులు, సాధ్యులు, మునులు ఆందోళన చెందుతున్నారు. అది
గమనించిన శ్రీకృష్ణుడు తన శుభప్రథమైన చూపులతో ఆ మంటలను ఆర్పి వేసాడు.
అడవులు మరలా యధాస్థితికివచ్చాయి. ఈ సంఘటన చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు.
వారిని చూసి శ్రీకృష్ణుడు " మీరు ఈ అగ్నిని చూసి ఏమనుకున్నారు ఉన్నది
ఉన్నట్లు చెప్పండి " అని అడిగాడు. మునులంతా ముక్త కంఠముతో ఇలా అన్నారు.
దేవా ! ఈ సమస్త జగతి నీ నుండి సృష్టించబడి నీలోనే లయం ఔతుంది. సకల
చరాచరజీవజాలము నీ ఆధీనములో ఉన్నాయి కదా. అంతా నీ సంకల్పము వలనే
జరిగిఉంటుంది. కనుక ఇది ఎలా జరిగిందో నీవు చెపితే కాని మాకుతెలియదు. అందుకే
ఇది చూసి ఆశ్చర్యపోయాము " అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు " మహా
మునులారా ! మీరు ప్రసన్నంగా ఉండడమే ఈ సృష్టికి ఆధారము. కనుక మీకు ఆ అగ్ని
గురించి చెప్తాను వినండి. పూర్వము అస్త్రవిద్యా ప్రవీణుడైన ఒక రాక్షసుడు
ఉన్నాడు. వాడి అస్త్రవిద్య నా ముఖం నుండి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళింది.
బ్రహ్మదేవుడు నాకు మన్మధుడిని కొడుకుగా ప్రసాదించాడు. నా ముఖం నుండి
పుట్టిన అగ్ని పోతూ పోతూ ఈ అడవిని కాల్చింది. నేను నా చల్లని చూపులతో
తిరిగి ఈ అడవిని పునరుజ్జీవింప చేసాను. మీరు చూసింది అదే " అని అన్నాడు.
పురాణకథ
శ్రీకృస్ఘ్ణుడు మునులతో " మునిసత్తములారా ! మీ సందర్శన భాగ్యము కలగడం నా
అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా ఒక పుణ్యకథను నాకు వినిపించండి " అని
అడిగాడు. మునులు " మహాత్మా ! మీరు ముల్లోకాలకు పెద్దలు. మీకు తెలియనిది
ఏముంది. నీకు ఈ మూడు యుగములలో తెలియని కథ ఈ భూమండలములో ఏముంది ? " అన్నారు.
అందుకు మునులు నవ్వి " మహా మునులారా ! నేను మానవ గర్భసంజాతుడను కనుక మానవ
మాతృడను. నా బుద్ధికూడా అదే స్థితిలో ఉన్నది. కనుక మీరు ఆ విషయము
మరువకూడదు. ఈ పరిస్థితిలో మీరు చెప్పే కథ నాకు తెలియనిదే ఔతుంది " అని
అన్నాడు. మునులంతా " శ్రీకృష్ణా ! నీకు చెప్పగల సమర్ధుడు నారదుడే కనుక
నారదుడే ఒక కథ చెప్తాడు " అని వారు నారదుడిని చూసి " నారదా ! నీవు ఇంతకు
ముందు చూసినది విన్నది అయిన ఒక కథను శ్రీకృష్ణుడికి వినిపించండి " అన్నాడు.
నారదుడు
పరమసంతోషంతో శ్రీకృష్ణుడికి మునులకు భక్తితో నమస్కరించి వారికి ఉమామహేశ్వర
సంవాదము వినిపించ సాగాడు " నేను ఒక సారి తీర్ధసేవనము చేస్తూ తిరుగుతూ
తిరుగుతూ హిమవత్పర్వతానికి వచ్చి అక్కడ ఒక అందమైన ఉద్యానవనంలో ప్రధమ గణములు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, మునులు, భూతగణములు
మొదలైన వారితో కొలువు తీరిన మహేశ్వరుడిని చూసాను. నేను కూడా ఈశ్వరుడికి
నమస్కరించి వారితో పాటు అక్కడ కూర్చున్నాను. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి
పరిహాసంగా వెనుక నుండి ఈశ్వరుడి కన్నులు మూసింది. ఆ హటాత్పరిణామానికి
జగమంతా చీకటి అయిపోయి సూర్యుడు చంద్రుడు కళతప్పి లోకములన్నీ అంధకారంలో
మునిగి పోయాయి. ఆ సమయంలో పరమేశ్వరుడు తన మూడవ కంటిని తెరిచాడు. పరమేశ్వరుడి
మూడవ కంటి నుండి అగ్ని జ్వాలలు చెలరేగి హిమవత్పర్వతాన్ని దహించసాగాయి.
హిమవంతుడు పార్వతీదేవి తండ్రి. అందువలన తన తండ్రికి కలిగిన కష్టానికి
పార్వతీదేవి తల్లడిల్లి పోయింది. వెంటనే పార్వతీదేవి శివుడి పాదాల మీద పడి
నమస్కరించింది. శివుడు
ప్రసున్నుడై మూడవ కన్ను మూసాడు. అప్పుడు హిమవత్పర్వతం మీద చెలరేగిన మంటలు
చల్లారిపోయాయి. అప్పుడు పార్వతి శివుడితో " పరమేశ్వరా ! ఈ సమయంలో నీవు
నొసటి కన్ను తెరవడానికి కారణం ఏమిటి ? ఇది రహస్యము కాకపోతే నాకు చెప్పండి.
పరమేశ్వరుడు " పార్వతీ ! నీకు చెప్పడానికి వీలు కాని రహస్యములు ఏమున్నాయి ?
నేను లోకపాలకుడను. నాకు ఏది జరిగితే లోకాలకు అదే జరుగుతుంది. నీవు నా
కళ్ళు మూసినప్పుడు నాకు ఏమీ కనిపించ లేదు కనుక లోకాలు అంధకారంలో మునిగి
భయభ్రాంతం అయిపోయాయి. నీ చేతులు తియ్యకుండా ఈ లోకాల అంధకారము పోగొట్టడానికి
నేను మూడవ కన్ను తెరవవలసి వచ్చింది " అని అన్నాడు. వెంటనే పార్వతి "
పరమేశ్వరా ! నీకు నాలుగు ముఖాలు ఉండడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది.
శివుడు " పార్వతీ ! సుందోపసుందులు అని భుజబలసంపన్నులైన ఇద్దరు రాక్షసులు
ఉన్నారు. వారు ఏ అస్త్రశస్త్రములకు చావు రాకుండా వరం పొందారు. వారిని
చంపడానికి మయుడు లోకములో ఉన్న అందచందాలను, లావణ్యాలను పోగుచేసి అందాల రాశి అయిన తిలోత్తమను
సృష్టించాడు. అతడు ఆమెను నా వద్దకు తీసుకు వచ్చాడు. తిలోత్తమ నా చుట్టూ
ప్రదక్షిణం చేసింది. దేవకార్య నిమిత్తము సృష్టించబడిన ఆమె నా చుట్టూ తిరిగే
సమయంలో నేను ఆమెను నాలుగు వైపుల నుండి ఆమెను చూసాను. అందుకని నాకు నాలుగు
ముఖాలు ఏర్పడ్డాయి " అన్నాడు. పార్వతి " ఈశ్వరా ! నీకు కంఠంలో నలుపు ఎలా
కలిగింది " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! పూర్వము దేవతలు, దానవులు
అమృతం కొరకు పాల సముద్రాన్ని మధించే సమయంలో ముందుగా పుట్టిన హాలాలం లోకాలను
దహించడం ఆపడానికి దేవతల వేడుకోలు మన్నించి ఆ విషాన్ని నేను మింగి దానిని
లోకరక్షార్ధం మింగకుండా కంఠములో ఉంచిన కారణంగా నా కంఠము నలుపు అయింది " అని
చెప్పాడు. పార్వతి " మహాదేవా ! నీకు అన్ని ఆయుధములో పినాకిని అంటే ఎందుకు
అంత ఇష్టము " అని అడిగింది. శివుడు " పార్వతీ ! కృతయుగంలో కణ్వుడు
అనే మహాముని తపస్సు చేస్తున్నాడు. అతడి మీద పుట్టాలుపెరిగాయి. ఆ పుట్టమీద
ఒక వెదురుగడ పెరిగింది. ఆ వెదురుగడ లోకములో లేని విధంగా పొడవుగా పెరుగింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కణ్వుడికి వరాలు ప్రసాదించాడు. అతడి
మీద పెరిగిన వెదురుతో బ్రహ్మ
విష్ణువుకు శార్ఘము, నాకు పినాకము చేసి మిగిలిన ముక్కతో గాండీవము చేసి
దానిని తాను తీసుకువెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఇచ్చినది కానుక నాకు పినాకము
అంటే ఇష్టము. పార్వతి " ఈశ్వరా ! ఈ భూమి మీద ఇన్ని జంతువులు ఉండగా నీవు
మాత్రము ఎద్దును వాహనముగా చేసుకోవడానికి ఏమి కారణము ? " అని అడిగింది. "
పార్వతీ ! పూర్వము నేను హిమాలయము మీద తపస్సు చేసుకొను సమయంలో నా చుట్టూ
ఆవులు మేస్తూ నా తపస్సుకు భంగం చేసిన తరుణంలో నేను వాటిని కోపంగా చూడగా అవి
బాధ పడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వాటిని ఓదార్చి నాకు ఒక ఎద్దును
దానంగా ఇచ్చాను. అప్పటి నుండి ఎద్దు నాకు వాహనం అయింది. పార్వతి " దేవా ! ఈ
భూమి మీద ఇన్ని భవనములు, నివాస స్థలాలు ఉండగా ఎప్పుడూ వెండ్రుకలు,
కపాలాలు, ఎముకలు, దుర్ఘంధం నిండి మురికిగా ఉండే శ్మశానంలో ఎందుకు
నివసిస్తున్నారు " అని అడిగింది. శివుడు " పార్వతీ ! క్రూరమైనభూతములు
జనులను బాధపెడతాయి. ఆ భూతకోటి ధాటికి ప్రాణికోటి అంతా నాశనం అయింది. ఈ
విషయం తెలుసుకున్న బ్రహ్మ నా వద్దకు వచ్చి దీనికి ప్రతీకారం చేయమని నన్ను
వేడుకున్నాడు. నేను కూడా ఆ భూతముల నుండి జనులను కాపాడాలని నిశ్చయించుకుని ఆ
భూతములు నివశించు శ్మశానంలో నివసించి వాటిని నాశనం చేస్తుంటాను.
లోకరక్షణార్ధమై నేను శ్మశానవాశిని అయ్యాను. మునులు సహితం శ్మశానంలో
నివసించడానికి ఇష్టపడతారు " అని చెప్పాడు. పార్వతి " నాధా ! నీవు బూడిద
శరీరానికి పూసుకుని, ఎముకలను పాములను ఆభరణంగా చేసుకుని, త్రిశూలధారి అయి
భీకర రూపంలో ఉండడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. శివుడు " పార్వతీ ! ఈ
లోక స్వరూపము రెండు విధములుగా ఉంటుంది కదా ! శీతలము, ఉష్ణములతో సకల
లోకములు నిండి ఉన్నాయి. ఈ జగత్తు అంతా సౌమ్యము, ఆగ్నేయము అనే రెండు యోగముల
సంయోగము. అందులోని సౌమ్యతను విష్ణువు
భరించాడు, ఉగ్రతను నేను భరించాను. అందుకని నేను ఉగ్ర స్వరూపముతో ఉంటాను.
ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా " అని అడిగాడు. పార్వతి " ఈశ్వరా వర్ణాశ్రమ
ధర్మాలు తెలపండి ఈ లోకాలు తరిస్తాయి " అని అడిగింది అని నారదుడు మునులకు చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము
- 1.1 వర్ణాశ్రమ ధర్మాలు
- 1.2 విప్రులు
- 1.2.1 విప్రుల ధర్మాలు
- 1.3 క్షత్రియధర్మాలు
- 1.4 వైశ్యధర్మాలు
- 1.5 ఆశ్రమవాస ధర్మాలు
- 1.6 మునులు తపస్సు
- 1.7 వనవాసం
- 1.8 భిక్షాటన
- 1.9 వైఖాసననులు
- 1.10 ధర్మము
- 1.10.1 గృహస్థు చేయవలసిన పనులు
- 1.11 రాజు యొక్క గొప్పతనం
- 1.12 పరమ ధర్మము
- 1.13 అహింస
- 1.14 క్షత్రియులు హింస
- 1.15 లోక జీవనం
- 1.16 కర్మ పరిపక్వత
- 1.17 సంపదలు దరిద్రము
- 1.18 రాజదండన
- 1.19 కర్మ ప్రేరణ
- 1.20 మరణం
- 1.21 జీవాత్మ స్త్రీ పురుషులు
- 1.21.1 పూర్వ జన్మ స్మృతి
- 1.22 కర్మకు బాధ్యులు
- 1.23 జీవుడు గర్భప్రవేశము
- 1.24 పునర్జన్మ
- 1.25 నరకము
- 1.25.1 పాపములు
- 1.26 పుణ్యములు
- 1.26.1 ఔపకరణము
- 1.26.2 నిరుపకరణము
- 1.26.3 స్నానములు
- 1.26.4 సోపకరణము
- 1.26.5 దానము ఇవ్వతగిన వస్తువులు
- 1.26.6 యజ్ఞములు వాటి ఫలములు
- 1.26.7 పితృ యజ్ఞములు
- 1.26.8 పిండప్రధానం
- 1.27 ధర్మములు
- 1.27.1 పుణ్యము లోకములు
- 1.27.2 సుగతి దుర్గతి
- 1.28 ఉత్తమ ధర్మము
- 1.28.1 ఆశ
- 1.29 సాంఖ్యము
- 1.29.1 త్రిగుణములు
- 1.30 యోగము
- 1.31 పరమాత్మలో లీనం
- 1.32 స్త్రీ ధర్మము
- 1.32.1 బ్రాహ్మణుడి భార్యలు
- 1.33 పరమ పదము
- 1.34 మానవుడు శాంతి
- 1.34.1 నారాయణ జపం
- 1.35 మహనీయ దైవము
- 1.36 పూజార్హులు
- 1.36.1 బ్రాహ్మణుల మహిమ
- 1.36.2 ఉచధ్యుని వృత్తాంతం
- 1.36.3 దేవతలను రక్షించిన బ్రాహ్మణులు
- 1.37 బ్రాహ్మణ పూజ
- 1.37.1 శ్రీకృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ మహిమ
- 1.37.2 రుక్మిణి దుర్వాసుడి రధములాగుట
- 1.37.3 దుర్వాస జనం
- 1.38 శివపూజ
- 1.39 అనుష్టించ తగిన ధర్మము
- 1.40 సాధువులు
- 1.41 పూర్వజన్మ సుకృతము
- 1.42 వ్యాసుడు
- 1.43 ఉత్తరాయణము
- 1.44 భీష్ముడి చివరి బోధ
- 1.45 భీష్ముడి స్వర్గలోకయాత్ర
- 1.46 భీష్ముడి దహన సంస్కారం
- 1.47 గంగాదేవి రోదించుట
- 1.48 వ్యాసుడు గంగాదేవిని ఓదార్చుట
No comments:
Post a Comment