-ధర్మరాజుకు పట్టాభిషేకము జరిగి 35 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత 36వ సంవత్సరములో కొన్ని ఉత్పాతాలు జరిగాయి. ఉదయము పూట తీవ్రమైన గాలులు వీచాయి, ఇసుక తుఫానులు వీచాయి, ఆకాశము నుండి ఉల్కలు రాలి పడ్డాయి. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. సూర్యుడికి, చంద్రుడికి చుట్టూ ఎర్రటి వలయాలు ఏర్పడ్డాయి, మంచుకురిసింది, వేసవి కాలములో కూడా చలిగాలులు వీచాయి. ఇలా అనేక ఉత్పాతాలు సంభవించాయి. ప్రతిరోజూ ఎదో ఒక ఉత్పాతము కనపడసాగింది. ఈ ఉత్పాతాలకు కారణము తెలియక ధర్మరాజు మనసు కలవరపడ సాగింది. కొంత కాలానికి ధర్మరాజుకు ఒక దుర్వార్త అందింది. దాని సారాంశము ఏమిటంటే శ్రీకృష్ణుడు, బలరాముడు తప్ప మిగిలిన యాదవులు అందరూ ఒకరితో ఒకరు కలహించుకుని మరణించారన్నది. ఈ దుర్వార్తను విన్న ధర్మరాజు వెంటనే తమ్ములను పిలిచి ఈ వార్త తెలిపాడు. ఈ దుర్వార్తను విన్న అందరూ శోకసముద్రములో మునిగి పోయారు " ఇలా వైశంపాయనుడు ఈ మాట చెప్పగానే జనమేజయుడు " మునీంద్రా ! యాదవులు అందరూ కలహించుకుని మరణించటము ఎమిటి ? ఇలా ఎలా జరిగింది ? " అని అడిగాడు.
మునులు యాదువంశమును శపించుట
జనమేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ఈ విషయము ఇప్పటిది కాదు. చాలాకాలము కిందట జరిగిన దానికి ఇది ఫలితము. చాలాకాలము కిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు
మొదలైన మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చారు. ఈ మునులను
చూసిన యాదవులకు ఆ మునులను ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే
వారు వారిలో చిన్న వాడైన సాంబుడికి ఆడవేషము వేసి అతడిని మునుల వద్దకు
తీసుకు వచ్చి " మునులారా " ఈమె మా స్నేహితుడు బభ్రుడి భార్య. వారికి చాలా
రోజులుగా సంతానము లేదు. అసలు వారికి సంతానము కలుగుతుందా లేదా ? తెలియజేయండి
" అని అడిగారు. వారి మిఖాలు చూడగానే మునులు వారు తమను హేళన చేస్తున్న
విషయము గ్రహించి " వీడు శ్రీకృష్ణుడి కుమారుడు ఇతడు మగవాడు. వీడు ఒక
ముసలమును కంటాడు. ఆ ముసలము శ్రీకృష్ణుడు, బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరిని సర్వనాశనము చేస్తుంది. బలరాముడు మాత్రము యోగనిష్టతో సముద్రములో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడు నేలమీద పదుకుని ఉండగా జర అను రాక్షసి శ్రీకృష్ణుడిని చంపుతుంది. మీ
కపటనాటకముకు ఇది తగినశిక్ష " అని శపించిన ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండా
వెళ్ళిపోయారు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసినా జరగనున్నది జరగక మానదు
అని మిన్నకుండి పోయాడు. మరుసటి రోజే మునుల శాపము ఫలించి సాంబుడు ఒక
ముసలమును ప్రసవించాడు. అది చూసి యాదవులు ఆశ్చర్యచకితులై ముసలమును సాంబుడిని
వసుదేవుడి వద్దకు తీసుకు వెళ్ళారు. వసుదేవుడు భయభ్రాంతుడు అయ్యాడు.
వసుదేవుడు ఆ ముసలమును చూర్ణము చేసి సముద్రములో కలపమని యాదవులకు చెప్పాడు.
అందువలన వసుదేవుడు ఇక ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు. యాదవులు
వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయము అంతటితో మరచిపోయారు. కాలము గడచింది
మహాభారత యుద్ధము జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న
బాధతో గాంధారి
తన కుమారుల వలెనే యాదవులు అందరూ దుర్మరణము పాలు కాగలరని శపించింది. తరువాత
కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాశము ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది. అది విన్న యాదవులు భయభ్రాంతులు అయ్యారు.
ద్వారకలో దుశ్శకునాలు
ద్వారకలో
అనేక దుశ్శకునాలు పొడచూపసాగాయి. చిలుకలు రాత్రుళ్ళు గుడ్లగూబలలా వికృతముగా
అరవసాగాయి. మేకలు నక్కల వలె పగటి వేళలో ఊళ వేయసాగాయి. యాదవులందరూ
దుర్వ్యసనాలలో మునిగి తేలుతూ మునులను, బ్రాహ్మణులను అవమానించసాగారు. యదవులు
త్రాగుడు, జూదానికి బానిసలు అయ్యారు. యాదవ స్త్రీలు భర్తలను లెక్కచేయక
బానిసల వలె ప్రవర్తించసాగారు. తినే ఆహారములో అప్పటికి అప్పుడే పురుగులు
వస్తున్నాయి. ఈ అశుభములను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. నాడు గాంధారి
ఇచ్చిన శాపము 35 సంవత్సరముల అనంతరము పని చేయడము మొదలైంది. యాదవులకు ఇక
సర్వనాశనము తప్పదు. ఒకరితో ఒకరు కలహించుకుని మరణించక తప్పదు. అది ఒక
పుణ్యభూమిలో కొట్టుకుంటే పుణ్యము వస్తుంది అనుకుని యాదవులతో ఒకసభ చేసి "
యాదవులారా ! మనము అందరము కలసి సముద్రుడికి ఒక జాతర చేయాలి. ఈ విషయము
అందరికీ తెలిసేలా ఒక చాటింపు వేయించండి " అని ఆదేశించాడు. అలా సముద్రుడికి
జాతర చేసే విషయము ద్వారకావాసులు అందరికి తెలిసింది. ఆ రోజు రాత్రి యాదవులు
అందరికి వింత స్వప్నములు వచ్చాయి. నల్లగా భయంకరముగా ఉన్న స్త్రీలు ఇళ్ళలోకి
జొరబడి తమ స్త్రీలను బలవంతముగా ఈడ్చుకు వెళ్ళారు. వారి ఆయుధములను నాశనము
చేసారు. వారి ఆభరణములను దొంగలు ఎత్తుకు పోయారు. మరునాడు శ్రీకృష్ణుడి
చక్రాయుధము, గరుడధ్వజము, శ్రీకృష్ణుడి రధముకు కట్టే అశ్వములు శైభ్యము, వలాకము, సుగ్రీవము, మేఘపుష్పము
అనే నాలుగు, ఆయన రధము అన్ని ఆకాశములోకి ఎగిరి పోయాయి. ఇంతలో ఆకాశము నుండి "
యాదవులు అందరూ సముద్రతీరానికి బయలుదేరండి " అని బిగ్గరగా వినిపించింది.
సముద్రుడికి జాతర
యాదవులకు
శ్రీకృష్ణుడి ఆయుధములు , రధము ఆకాశముకు ఎగిరి పోయినా, వారి ఆయుధములు
నాశనము అయినా, ఆభరణములు దొంగలు ఎత్తుకు పోయినా ఇసుమంత కూడ బాధ కలగ లేదు.
వారంతా మద్య మాంసములు భుజించడములో మునిగిపోయారు. వివిధములైన భక్ష్య,
భోజ్యములను తయారు చేసుకున్నారు. ఆహారపదార్ధములను, మద్యమును బండ్లకు
ఎక్కించుకుని సముద్రతీరానికి బయలుదేరారు. అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వికారముగా బయలు దేరాడు. బలరాముడు
కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరముగా కాలి నడకన వారి వెంట నడిచాడు.
యాదవస్త్రీలంతా చక్కగా అలంకారములు చేసుకుని పల్లకీలలో బయలుదేరారు. అందరూ
సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్ళలో
కూర్చున్నారు. ఉద్ధవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి
హిమాలయాలకు వెళ్ళాడు. బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని యోగ
సమాధిలోకి వెళ్ళాడు. యాదవులు ఇవేమీ పట్టించుకొనక మద్యమాంసములు సేవించి
విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసిన
పదార్ధములను కోతులకు పంచి పెట్టారు. అవి తినడము చూసి కేరింతలు కొట్టసాగారు.
మద్యమాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించ సాగారు.
యాదవులలో చెలరేగిన స్పర్ధ
యాదవ ప్రముఖులు అయిన సాత్యకి, కృతవర్మ, గదుడు, చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు
కూడా మద్యము సేవించి ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకూంటున్నారు. అప్పుడు
సాత్యకి కృతవర్మను చూసి రోషముగా " ఒరేయ్ కృతవర్మా ! శత్రువులైనా !
నిద్రించేసమయాన చచ్చిన వారితో సమానము. అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడూ
ప్రయత్నించడు. అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచకార్యానికి ఎలా ఒడిగట్టాడు రా !
ఏరా ప్రద్యుమ్నా ! అదీ ఒక వీరత్వమా ! అదీ ఒక శత్రుసంహారమా ! అది
పాపకార్యమని నీకు తెలియదా ఏమి ? " అని హేళన చేసాడు. ప్రద్యుమ్నుడు "
ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు వాదన ఎందుకు పోనివ్వు. ఈ కృతవర్మ చేసిన
దానికి ప్రజలు అందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు. ఇంకా మీరు ఎందుకు
తిట్టడము " అని అన్నాడు. సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపము నఫాళానికి
అంటింది " ఒరేయ్ సాత్యకి ! నీకు సిగ్గు లేదురా ! నా సంగతి నేను చేసిన
యుద్ధము సంగతి నీకు ఎందుకురా ! నీ సంగతి నీవు చూసుకో. అర్జునుడు చేయి నరికినందుకు భూరిశ్రవుడు యోగసమాధిలోకి వెళ్ళాడు. అటువంటి వాడి తల నరికిన విషయము అప్పుడే మరిచావా ! అదీ ఒక యుద్ధమేనా ! అప్పుడే ఆ విషయము మరిచావా ! పైగా శ్రీకృష్ణుడు
కూడా పక్కనే ఉన్నాడు కదా " అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపము
వచ్చింది. కోపముగా కృతవర్మ వంక చూసాడు. అప్పుడు " సాత్యకి " అన్నయ్యా !
వీడి సంగతి ఎవరికి తెలియదు. నాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణిని కాజేయడానికి
వీడు తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా ! " అని అన్నాడు. ఆ
మాటాలు విన్న సత్యభామ తన తండ్రి మరణము గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది. ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపముతో ఊగిపోయాడు.
సాత్యకి కృతవర్మను వధించుట
అది చూసిన సాత్యకి అన్నకు వదినకు సంతోషము కలిగించేలా ఒక్క ఉదుటున కృతవర్మ మీదకు దూకి " అందరూ వినండి ఈ దుర్మార్గుడు కృతవర్మ అశ్వత్థామతో
చేరి నిద్రిస్తున్న ఉపపాండవులను నిర్దాక్షిణ్యముగా చంపాడు. వీడిని ఇక
వదలకూడదు. వీడిక బ్రతక కూడదు. వీడు కూడా అలాగేచావాలి " అని అరచి వరలో నుండి
కత్తిని బయటకులాగి ఒక్క ఉదుటున కృతవర్మ తల నరికాడు. సాత్యకి
అంతటితో ఆగక కృతవర్మకు చెందిన భోజకులందరితో కలబడ్డాడు. అది చూసిన భోజకులు,
అంధకులు విజృంభించి సాత్యకిని చుట్టుముట్టారు. ఇంత జరుగుతున్నా శ్రీకృష్ణుడు
తన తమ్ముడు సాత్యకిని వారించడానికి కాని, రక్షించడానికి కాని ప్రత్నించక
మౌనంగా చుస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్నుడు మాత్రము సాత్యకికి అండగా నిలిచాడు.
ప్రద్యుమ్నుడి అండ చూసుకుని సాత్యకి విజృంభించి తన వారితొ కలసి భోజక అంధక
కులముల వారితో యుద్ధముకు దిగాడు. ఇరువర్గాలకు యుద్ధము జరిగింది. అక్కడ ఏ
ఆయుధములు లేవు. అక్కడ సముద్ర ఒడ్డు పొడుగున పెరిగిన తుంగ మొక్కలను పెరికి
ఒకరితో ఒకరు కలబడ్డారు. చాలాకాలము కిందట యాదవులు చేసిన చిలిపిపనికి
ఫలితముగా మునులు ఇచ్చిన శాపానికి పుట్టిన ముసలమును అరగదీసి సముద్రములో
కలిపారు. అది సముద్రము నుండి కొట్టుకు వచ్చి ఒడ్డున ఇప్పుడు తుంగగా
రూపుదాల్చి సముద్రపు ఒడ్డున మొలిచి ఉంది. ఆ తుంగలో ముసలము శక్తి
నిక్షిప్తము అయి ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మునుల శాపము
ఫలించింది. ఆ తుంగ మొక్కలతోనె యాదవులు ఇప్పుడు కొట్టుకుంటూన్నారు.
యాదవకులములో అంతర్యుద్ధము
ఆ సమయములో యాదవులు అందరూ మద్యము సేవించిన మత్తులో ఉన్నారు. ఆ తుంగ
మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు చస్తున్నాడు. ఈ
విషయము వారికి ఆ మత్తులోఅవగతము కాలేదు. తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు,
బావమరిది అనే విచక్షణ లేకుండా కొట్టు కుంటూన్నారు. అంతా కింద పడుతున్నారు.
తిరిగి లేచి చచ్చేలా కొట్టుకుంటున్నారు. కాని కృతవర్మకు చెందిన అంధక, భోజకులస్థులు ఎక్కువగా ఉండడముతో సాత్యకికి చెందిన వృష్టి వంశస్థులు అందరూ నశించారు. అనిరుద్దుడు, గదుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు సాంబుడు
చచ్చి కింద పడ్డారు. ఇది చూసిన కృష్ణుడికి మునుల శాపము వలన అలవి మాలిన
కోపము వచ్చింది. మిగిలిన తుంగకర్రలను తీసుకుని చావగా మిగిలిన భోజక, అంధక
వంశస్థులను అందరినీ సమూలంగా నాశనము చేసాడు. యాదవ వంశము అంతా సమూలముగా
నాశనము అయింది. ఆ రణభూమిలో కృష్ణుడు ఒంటరిగా నిలబడి పోయాడు. చావగా మిగిలిన వారిలో కృష్ణుడి రథసారథి దారుకుడు, బభ్రుడు మిగిలారు. వారు భయము భయముగా కృష్ణుడి వద్దకు వచ్చి " కృష్ణా ! యాదవులు అందరూ మరణించారు. బలరాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మనము వెంటనే బలరాముడిని వెదకటము మంచిది " అన్నారు.
బలరాముని పరలోక యాత్ర
అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్ళారు. ఆ సమయములో బలరాముడు ఒకచెట్టు కింద యోగ సమాధిలో కూర్చుని ఉన్నాడు. కృష్ణుడు
దారికుని చూసి " దారుకా ! నీవు వెంటనే హస్థినకు వెళ్ళు. ఇక్కడ యాదవ కులము
అంతా సర్వనాశనము అయింది అని చెప్పి అర్జునుడిని తీసుకురా ! " అని అన్నాడు.
వెంటనే దారుకుడు రథము ఎక్కి హస్థినకు వెళ్ళాడు. కృష్ణుడు బభ్రుడిని
చూసి " నీవు వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలను
ద్వారకకు చేర్చు " అన్నాడు. సరే అని బభ్రుడు వెళ్ళబోతున్న సమయములో
అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చెతిలోని తుమ్మపరక ఎగిరి వచ్చి బభ్రుడికి
తగిలి బభ్రుడు అక్కడికక్కడే మరణించారు. ఋషుల శాప ప్రభావము చూసి కృష్ణుడు
సైతము ఆశ్చర్యపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా !
నువ్వూ నేను తప్ప యాదవులు అందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను
ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు.
తరువాత కృష్ణుడు సముద్రతీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకుని
ద్వారకకు వెళ్ళాడు. తరువాత తండ్రి వసుదేవుడి వద్దకువెళ్ళి " తండ్రీ ! నేను
భారతయుద్ధము చూసాను. అక్కడ కురుపాండవులు నాశనము కావడము చూసాను. ఈ రోజు
యాదవులు అందరు కొట్టుకుని మరణించడము చూసాను. మీరు, నేను, బలరాముడు తప్ప
యాదవులు అందరూ మరణించారు. బంధువులు, మిత్రులు లేని చోట నేనిక ఉండలేను. నా
కంటే ముందుగా బలరాముడు యోగసమాధి లోకి వెళ్ళాడు. నే కూడా వెళ్ళి అతడితో పాటు
తపసు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి. నేడో, రేపో అర్జునుడు
ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు " అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు
వసుదేవుడి పాదములకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణవార్త విన్న వసుదేవుడు
శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి నిశ్చేష్టుడై స్ప్రృహ
తప్పిపడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు హాహాకారాలు
చేసారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ " ఏడవకండి. అర్జునుడు ఇక్కడకు వస్తాడు.
అతడు ఇక్కడ చెయవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెడతాను " అని
చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా ! అంతఃపుర స్త్రీలను ద్వారకకు
చేర్చాను. తండ్రిగారి అనుమతి తీసుకుని ఇక్కడకు వచ్చాను " అన్నాడు.
బలరాముడిలో చలనము లేదు. బలరాముడి ముఖము నుండి ఒక పెద్ద నాగము వెలువడి బయటకు
రాగానే బలరాముడు యోగశక్తితో ప్రాణములు శరీరము నుండి వదిలి పెట్టాడు.
బలరాముడి ప్రాణాలు సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోయాయి. ఆదిశేషుడి
అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతము పలికింది. నాగ
ప్రముఖులు అందరూ బలరాముడి ఆత్మకు స్వాగతము పలికారు. అలా బలరాముడు
విష్ణులోకములో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలసి పోయాడు.
శ్రీకృష్ణుడి నిర్యాణము
బలరాముడు ఈ తన అవతారము చాలించడము కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు
తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. తాను ఈ
భూలోకములో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో అది ఎలా నిర్వహించాడో తలచుకుంటూ
దిక్కుతోచకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు తాను ఎలా ఈ శరీరము వదిలి పెట్టాలో
అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడికి గతము గుర్తుకు వచ్చింది. ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పూయమని కోరినప్పుడు తాను శరీరము అంతా పూసి అరికాలుకు పూయలేదు. అప్పుడు దుర్వాసుడు
" కృష్ణా ! నీ మరణము అరికాలులో ఉంది " అన్నాడు. అది గుర్తుకురాగానే తాను
ఎలా ప్రాణాలు వదిలి పెట్టాలో అర్ధము అయింది. శ్రీకృష్ణుడు నేలమీద పడుకుని
ఇంద్రియములను నిగ్రహించి యోగసమాధిలోకి వెళ్ళాడు. అ సమయములో జర ఆరణ్యములో
ప్రవేశించింది. జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది. అతడి కళ్ళకు
పడుకుని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడి అనే భ్రాంతిని కలుగజేసింది. వెంటనే
వేటగాడూ పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణమును వదిలాడు. ఆ
బాణము పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి పాదములో గుచ్చుకుని బయటకు పొడుచుకు
వచ్చింది. ఆహా జింక చచ్చింది అనుకుని దానిని తీసుకు పోవాలని అనుకుని
దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలగిపోయి అక్కడ ఉన్నది జింక
కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. అది చూసిన వేటగాడు భయముతో వణికి
పోయి భోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని
ఓదార్చి తాను ఈ మానవ శరీరమును వదిలి వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములో
ఉన్న ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘనస్వాగతము చెప్పారు.
శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట
వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు " మహాత్మా ! ధర్మరక్షణలో ఒక భాగముగా నీవు ఆడే జగన్నాటకములో ఒక భాగంగా ఈ భూమిమీద అవతరించావు. కంసుడు, నరకుడు
మొదలైన లోక కంటకులను సంహరించావు. భ్రష్టుపట్టిన భరత కులమును పరిశుభ్రము
చేసావు. తిరిగి వైకుంఠము చేరుకున్నావు. నీవు ఆది పురుషుడవు, అజరామరుడవు
నీకు ఆది అంతము లేదు. నీకు మరణము ఏమిటి. శ్రీకృష్ణుడిగా జన్మించడము,
మరణించడము అంతా నీ లీల. ఓ మహాత్మా మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు
కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నీవు ప్రతి యుగములోను
అవతరించాలి " అన్నాడు. ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతలో
బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేదమంత్రములతో స్తుతించాడు. అప్పుడు
శ్రీమహావిష్ణువు అందరినీ చూసి " అనిరుద్ధమనే పేరు కలిగింది, ప్రద్యుమ్నమనే
కాంతి కలిగింది, సంకర్షణమనే భావముతో ప్రకాశించేది, వాసుదేవుడు అనే నామముతో
పిలువబడేది, అనన్యమైనది, అద్వితీయమైనది, జ్ఞానముతో కూడుకున్నది, ఏ దోషము
లేనుది అయిన విష్ణుపదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను. పరమ మంగళకరమైన ఈ
విష్ణు పదమును నేను స్వీకరిస్తున్నాను. ఒ సుకృతులారా మీరు అందరూ మీ మీ
నెలవులకు వెళ్ళండి " అన్నాడు. అలా మునులను దేవతలను పంపిన తరువాత నారాయణుడు తన మూలస్థానము చేరుకున్నాడు.
దారుకుడు హస్థినకు చేరుట
శ్రీకృష్ణుడి ఆదేశముతో హస్థినకు చేరిన దారుకుడు
హస్థినకు పోయి పాండవులను కలుసుకుని యాదవులకు వారి చిన్నతనములో మునులు
ఇచ్చిన శాపము. ఆ శాపఫలితముగా యాదవులు అందరూ మద్యము సేవించి ఆ మత్తులో
ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించడము. యాదవ కులము అంతా అంతరించడము అంతా
వివరించి చెప్పాడు. బలరామ కృష్ణులు అడవిలోకి వెళ్ళిన విషయము చెప్పాడు.
అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు
రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులు అందరూ నశించిన విషయము విన్న
పాండవులు శోక సముద్రములో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర
మొదలగు వారు పెద్ద పెట్టున ఏడవడము మొదలు పెట్టారు. అంతా సద్దుమణిగాక
దారుకుడు " అర్జునా ! శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకకు రమ్మని
ఆదేశించారు " అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని వెంటనే ద్వారకకు బయలుదేరాడు.
అర్జునుడి ద్వారక ప్రవేశము
అర్జునుడు దారుకుడితో వేగంగా ద్వారక చేరుకున్నాడు. ద్వారక అంతా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడా జనసంచారము లేదు. శ్రీకృష్ణుడు
బలరాముడు ఎక్కడా కనిపించ లేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో
విపరీతము జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారుకుడు వెంటరాగా
రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ
భోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకో లేక శోకముతో కింద
పడి పోయాడు. రుక్మిణీ, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖము
ఎక్కువై కిందపడి ఏడుస్తున్నారు. వారిని అందరిని ఓదార్చడము అర్జునుడి
వంతయింది.
వసుదేవుడు విలపించుట
తరువాత అర్జునుడు
దారుకుడు వెంట రాగా వసుదేవుడిని చూదడానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక
సందేహము పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడము ఒక విధముగా
ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడము వేరు విధముగా ఉంది. ఇంతకూ శ్రీకృష్ణుడు
ఎక్కడ ఉన్నాడు. అతడికి ఏమైంది. అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు
చూస్తున్నాడు. దారుకుడికి కూడా ఏమి తెలియక అతడు కూడా బిక్కమొఖము వేసుకుని
చూస్తున్నాడు. వసుదేవుడు కూడా శయ్యమీద పడుకుని భోరున ఏడుస్తున్నాడు. అర్జునుడిని చూడగానే వసుదేవుడు
పైకి లేచి అర్జునుడిని పట్టుకుని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ
పేరుపేరున తలచుకుని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖము
ఉపశమించింది. తరువాత వసుదేవుడు అర్జునుడితో " అర్జునా ! ఎంతో
పరాక్రమవంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవవీరులు ఒకరితొ ఒకరు
కలహించుకుని సమూలముగా నాశనము అయ్యారు. ఈ ఘోరము ఎక్కడైనా ఉందా ! నీకు ఒక
విషయము తెలుసా ! నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు, సాత్యకి
ముందుగా మరణించారు. ఇంత ఘోరము జరిగిన తరువాత కూడా నేనింకా బ్రతికి
ఉన్నాను. నాదీ ఒక బ్రతుకేనా ! అయినా వీళ్ళకేమి చెడుకాలము దాపురించింది.
సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారట. దానితో కొట్టుకోవడము
మొదలైంది. ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనములో చేసిన పాపము
మునుల శాపము ఇలా పరిణమించినది. యాదవకులము నాశనము అయింది. ఒకరిని అనుకుని
ఎమి లాభము. నీ కొక విషయము తెలుసా అర్జునా ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షములో
జరిగినది. శ్రీకృష్ణుడు తలచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా ! అయినా ఆపలేదంటే యాదవ
కులనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు అందుకనే ఆపలేదు. ఇదంతా
విధిలిఖితము. యాదవ నాశనము కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర
గర్భములో ఉన్న పరీక్షిత్తును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయమా చెప్పు.
విధి నిర్ణయము అని సరిపెట్టు కోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు "
అన్నాడు.
వసుదేవుడు కృష్ణుడిని గురించి చెప్పుట
అర్జునుడు
ఆలోచిస్తున్నాడు వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు కాని
కృష్ణుడికి ఏమయ్యింది ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక శ్రీకృష్ణుడు
క్షేమముగా ఉన్నాడు. అతడికి ఏమి కాలేదు అని తన మనసును సమాధాన పరచుకున్నాడు.
అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయములో వసుదేవుడు తిరిగి అర్జునుడితో " ఏమి చెప్పను అర్జునా ! అలా యాదవులు తుంగకర్రలతో కొట్టుకుని మరణించిన తరువాత శ్రీకృష్ణుడు
అంతఃపుర కాంతలను వెంట పెట్టుకుని ద్వారకకు వచ్చాడు " అన్నాడు. అర్జునుడు
ఇక ఆగలేక " అదిసరే ! ప్రస్తుతము కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు. నేను
కృష్ణుడిని వెంటనే చూడాలి " అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు " ఇక్కడే
ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకు వచ్చిన తరువాత నా వద్దకు వచ్చి " తండ్రీ !
ప్రస్తుతము భోజక, అంధక కుల యాదవులు వృష్టి వంశము వారు ఒకరితో ఒకరు
కలహించుకుని సమూలముగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారుకుడిని పంపాను.
అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు. అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను
పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్ధుడు, కార్యదక్షుడు, పరాక్రమవంతుడు నాకు
అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడూ అతడే నేను అతడి సాయంతో నీవు మిగిలిన
యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలురను, వృద్ధులను
కాపాడతాడు. ఇంక కొన్ని దినములలో సముద్రము పొంగి ద్వారకానగరము సముద్రములో
కలసి పోతుంది. యాదవులు ఈ విధముగా కొట్టుకుని మరణిస్తున్న తరుణములో బలరాముడు
అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని యోగసమాధిలో మునిగి పోయాడు. నాకు కూడా ఆ
మార్గము ఉత్తమము అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపసు చేసుకోవడానికి
అనుమతి ఇవ్వండి నేనిక అడవిలో తపమాచరిస్తాను. నీవు అర్జునుడు చెప్పిన
విధముగా చెయ్యి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు.
అంతే కాదు కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు "
అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు
నీవు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. అర్జునా ! ఏ కారణము లేకుండా
కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హటాత్తుగా పీనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టు
కోవడము నా వలన ఔతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడము లేదు. నా
ప్రాణము మాత్రము ఈ దేహమును విడిచి పోవడము లేదు. ఏమి చెయ్యను ? నా వల్ల
ఏమీకాదు. ఇక ఈ యాదవకుల స్త్రీలను, బాలురను, వృద్ధులను, అశ్వసంపదను నీవే
కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కందముల మీద పెట్టాడుకదా ! "
అన్నాడు.
అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్థినకు ఆహ్వానించుట
వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు
మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రము ఎలా
ఉండగలను. వేంటనే హస్థినకు వెళ్ళాలి అనుకుని వసుదేవుడితొ " అనఘా ! ఈ
విషయములో ధర్మరాజు
ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆ నిర్ణయము ప్రకారము నేను అంతఃపుర కాంతలను,
యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను తీసుకుని హస్థినకు వెళతాను. అక్కడ
వారంతా సుఖముగా ఉండే ఏర్పాటు జరిపిస్తాము. మీరు దయచేసి నాతో హస్థినకు రండి.
అంతా విధిలిఖితము అనుకుని ఊరడిల్లండి " అన్నాడు. తరువాత అర్జునుడు
దారుకుడితో " దారుకా ! మనము శ్రీకృష్ణుడు
వెళ్ళిన దారిన వెళ్ళి శ్రీకృష్ణుడి కొరకు వెతుకుతాము. ఇక్కడ జరుగవలసిన
పనులను అందరినీ పిలిచి ఆదేశాలు ఇస్తాము. అందు వలన అందరినీ పిలువు "
అన్నాడు. దారుకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పుర ప్రముఖులను అందరినీ సుధర్మ
అనే రాజమందిరముకు పిలిచి " ఈ రోజు మొదలు ఏడవనాటికి సముద్రము పొంగి
ద్వారకసముద్రములో మునిగి పోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు.
కనుక మనము అందరము ద్వారకను విడిచి ఇంద్రప్రస్థనగరానికి వెళదాము. అక్కడ మీరు
అందరూ సుఖముగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు,
బాలురకు, వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నింటినీ సిద్ధముగా ఉంచుకుని
ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధముగా ఉండండి. ధర్మరాజు
పాలనలో మీరు అందరూ ద్వారకలో ఉన్నంత సుఖముగా ఉండగలరు " అని అందరికీ ఆదేశాలు
ఇచ్చాడు. వారందరూ వెళ్ళిన తరువాత మంత్రులతో సమాలోచన జరుపుతూ " ఏనుగులతోను,
గుర్రాలతోను, లాగే బండ్లను, రధములను సిద్ధము చెయ్యండి. స్త్రీలను బాలురను
తీసుకు వెళ్ళడానికి పల్లకీలను, బండ్లను ఏర్పాటు చెయ్యండి. ఏయే సామానులు ఎలా
ఇంద్రప్రస్థము చేర్చాలో ప్రణాళిక వెయ్యండి. మీలో ఓర్పును నశింపజేయకండి.
చనిపోయిన యాదవులు ఇక ఎలాగూరారు. ధర్మరాజు మీకు మీ దుఃఖాలను మరిపించే పాలన
అందిస్తాడు. వసుదేవుడి మనుమడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా
ధర్మరాజు నియమించ వచ్చు. కనుక ఈ విషయములో మీరు కలత చెందవలసిన పని లేదు "
అన్నాడు.
వసుదేవుడు తనువు చాలించుట
ఆరోజు రాత్రికి కృష్ణుడు ఉన్న మందిరములోనే పూజలు భజనలతో కాలము గడిపాడు. మరునాడు సూర్యోదయము కాగానే కాలకృత్యాలు సంధ్యావందనాలు పూర్తిచేసుకుని బయటకు రాగానే వసుదేవుడు
తన పాంచభౌతిక కాయాన్ని వదిలి పెట్టాడాన్న విషయము తెలిసింది. అప్పటికే
అంతఃపుర స్త్రీలు వసుదేవుడి మరణానికి పెద్దపెట్టున శోకిస్తునారు. వసుదేవుడి
భార్యలు వసుదేవుడితో సహగమనానినికి సిద్ధము ఔతున్నారు. అర్జునుడు
భారమైన హృదయముతో వసుదేవుడి మందిరానికి వచ్చాడు వసుదేవుడి శరీరానికి
పన్నీటిస్నానము చేయించాడు. వసుదేవుడికి పట్టువస్త్రాలను ధరింపజేసి ఆభరణాలతొ
అలకంకరింప జేయించి పులమాలలతో అలంకరింప జేయించబడిన రథము మీదకు ఉంచారు.
ముందు వేదపండితులు వేదమంత్రములు పఠిస్తూ నడువగా వసుదేవుడి శవయాత్ర సాగింది.
అర్జునుడు పాదాచారియై రథము వెంట నడిచాడు. వసుదేవుడి భార్యలైన దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర
చక్కగా అలంకరించికొని పల్లకీలలో కూర్చున్నారు. ఆ పల్లకీలు కూడా శవయాత్ర
వెంట సాగాయి. ద్వారకా నగరవాసులు అందరూ శవయాత్రలో కన్నీరుగా మున్నీరుగా
ఏడుస్తూ వెంట నడిచారు. వసుదేవుడి ఉద్యానవనంలో మంచిగంధపు చెక్కలతో చితి
పేర్చారు. వసుదేవుడి శరీరాన్ని చితి మీద ఉంచారు. అర్జునుడు శాస్త్రోక్తంగా
శవదహన క్రియను జరిపించాడు. వసుదేవుడి వెంట వసుదేవుడి భార్యలు చితిలో
ప్రవేశించారు. ఆ దృశ్యము చూసిన కంటతడి పెట్టని వారు లేరు. కొందరు చితిలో
నెయ్యిపోసి మటలను ప్రజ్వలింపజేసాడు. జనము హాహాకారాలు చేసారు. ఆ విధముగా
వసుదేవుడి అంత్యక్రయలు పూర్తి అయ్యాయి. తరువాత వజృడు మొదలైన వారు, ఆడవారు
వసుదేవుడికి తర్పణములు వదిలారు. అందరూ ద్వారకకు చేరుకున్నారు.
అర్జునుడు యాదవులకు దహన సంస్కారములు చేయించుట
అర్జునుడు తరువాత యాదవులైన భోజక, అంధక, వృష్టి
వంశాల వారు కొట్టుకుని మరణించిన ప్రదేశానికి బ్రాహ్మణులను, పండితులను
తీసుకుని వెళ్ళాడు. వారితో పాటు ఆ కొట్లాటలో చనిపోయిన వారి బంధువులు కూడా
వచ్చారు. ఒక్కొక్కరు తమ బంధువులను గుర్తుపట్తి ఏడుస్తునారు. కొందరు
ముర్ఛపోయారు. అది చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై అక్కడ శోకిస్తున్నవారిని
ఓదార్చాడు. తరువాత అక్కడ చనిపొయిన వారికి యదోచితముగా వేదోక్తముగా అగ్ని
సంస్కారము చేయించాడు. చనిపోయిన వారి బంధువుల చేత వారికి తర్పణములు
విడిపించారు. సామూహికంగా దశదిన కర్మలు చేయించాడు. అర్జునుడు ఆ విధముగా
యాదవులందరికి ఉత్తమలోక ప్రాప్తి కలిగేలా చేసాడు. అర్జునుడి మనసులో
ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తామా అని ఆతురతగా ఉంది. అంతఃపుర స్త్రీలను,
ద్వారకాపుర వాసులను, బాలురను, వృద్ధులను, సమస్త ద్వారకాపుర వాసులను
ఇంద్రప్రస్థముకుచెర్చమని దారుకుదికి చెప్పాడు. అందుకు తగిన ఎర్పాట్లు
చేసాడు.
అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు వెదకుట
అర్జునుడు
ఆ తరువాత కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో "
అయ్యో కృష్ణా ! నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్థిన నుండి
ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణవార్తను నీకు చెప్పడానికి
నీ వద్దకు వస్తున్నను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా ! అయినా
నేనిప్పుడు వసుదేవుడి మరణవార్తను బలరామ, కృష్ణులకు చెప్పడము ఎందుకు ? మీరు
చెప్పిన పనిని సక్రమంగా పుర్తి చేసాను అని చెపితే సరిపోతుంది కదా ! " అని
తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునుడికి గాంధారి
ఇచ్చిన శాపము మనసులో మెదిలింది. గాంధారి శాపము ఇచ్చే సమయములో అర్జునుడు
కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి " ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు
దిక్కు లేకుండా చస్తావు " అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుడి
మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా ! ఇలా పరిపరి విధముల ఆలోచిస్తూ అర్జునుడు
శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట
వస్తున్న వాళ్ళకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించ లేక పోతున్నారు.
అలా కొన్ని రోజులు వెదికిన తరువాత ఒక రోజు ఒక బోయవాడు వారితో " మీరు దేని
కొరకు వెదుకుతున్నారు? "అని అడిగాడు. అర్జునుడు " ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు
తపసు చేసుకుంటున్నాడట అతడి కొరకు మేము వెదుకుతున్నాము " అన్నాడు. ఆ
బోయవాడు " నేను శ్రీకృష్ణుడిని చాలా రోజుల కిందట చూసాను. తరువాత చూడలేదు.
నేను కూడా మీ వెంటవచ్చి వెతుకుతాను రండి " అన్నాడు. ఆ బోయవాడితో చేరి
అర్జునుడు కృష్ణుడి కొరకు వెదకసాగాడు. ఆ బోయవాడూ చెప్పిన ఆధారాలను
అనుసరించి వారు కృష్ణుడు పడిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు
దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుడి
పార్ధివదేహాన్ని చూసారు. ఆ దృశ్యము చూసిన అర్జునుడు అక్కడకక్కడే
మూర్ఛిల్లాడు. పక్కన ఉన్న వారు నీళ్ళు తీసుకువచ్చి అర్జునుడి ముఖము మీద
చల్లారు. అర్జునుడు మూర్ఛ నుండి లేచి శ్రీకృష్ణుడి శరీరాన్ని కౌగలించుకుని
భోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యమూ నిగ్రహము అతడిలో సడలిపోయాయి. కళ్ళ
వెంట నీరు ధరాపాతంగా కారి పోతున్నాయి. నోటమాట రాలేదు. పక్కన ఉన్న వారికి
అర్జునుడిని పలకరించే సాహసము చెయ్యలేక పోయారు. కొంచము సేపటికి తెప్పరిల్లిన
అర్జునుడు " అయ్యో ! కృష్ణా ! నీకా ఈ దురవస్థ. నీ వంటి మహాత్ముడు ఇలా కటిక
నేల మీద పడి ఉండడమా ! అంటూ కృష్ణుడి పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము
గమనించాడు. అతడికి దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుడు
ఒక్కసారిగా ఆశ్చర్యపొయాడు. కృష్ణుడి దేహము అంతా పరికించి చూసాడు. అరికాలు
మాత్రము నల్లగా కమిలి ఉంది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది.
నిదురిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుడిని అర్జునుడు కళ్లు ఆర్పకుండా
చూడసాగాడు. పక్కన ఉన్న వాళ్ళు " అయ్యా ! తరువాత కార్యక్రమాలు చూడండి. మనము
పోయి ద్వారకలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము. లేకున్న
శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకు వెడదాము. ఎలా చెయ్యాలో మీరే
శలవియ్యండి " అన్నారు.
అర్జునుడు శ్రీకృష్ణుడికి బలరామునికి దహనక్రియలు నిర్వహించుట
అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక
మునిగి పోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట
వచ్చిన వారితో " రేపు ఉదయము ద్వారక సముద్రములో మునుగుతుంది. కనుక మనము ఈ
రాత్రికి ద్వారకకు వేళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా
ద్వారకను విడిచి పెట్టాలి. లేకున్న అంతు లేని ప్రాణనష్టము జరుగుతుంది కనుక
మనము శ్రీకృష్ణుడి నిర్యాణము గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు.
ప్రస్తుతము శ్రీకృష్ణుడి అంత్యక్రియలు మనము నిర్వహిస్తాము " అన్నాడు.
బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేసాడు అర్జునుడు.
శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని వేదోక్తంగా దహనము చేసాడు. బలరాముడు
కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుపక్కల వెదుకసాగారు. కొంత సేపటికి
వారిశ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగసమాధిలో ప్రాణములు
వదిలిన బలరాముడి పార్ధివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి
కూడా సమయము చిక్కలేదు. భక్తిశ్రద్ధలతో బలరాముడికి దహన సంస్కారము చేసాడు. ఆ
విధముగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తిశ్రద్ధలతో
దహనసంస్కారములు చేసాడు. తరువాత తనవెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు
వేళ్ళాడు. మార్గమధ్యములో దారుకుడితో " దారుకా ! మనము చేసిన పని సరి అయినది
అని నేను నమ్ముతునాను. లేకున్న శ్రీకృష్ణుని మరణవార్తను విన్న రుక్మిణీ, సత్యభామ
మొదలైన భార్యల దుఃఖము ఆపడము మనతరమా చెప్పు. వారంతా సహగమనము చేస్తాము అంటే
మనము ఆపగలమా ! రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము
పొంగి ద్వారక మునిగి పోతుంటే ద్వారకవాసులను కాపాడ లేదన్న అపఖ్యాతి నాకు
వస్తుంది. పైగా శ్రీకృష్ణుడి మాట తప్పిన వాడిని ఔతాను. కనుక మనము వడిగా
ద్వారకకు చేరుకుంటాము " అన్నాడు. అందరూ కలసి త్వరగా ద్వారక చేరుకున్నారు.
యాదవుల హస్థిన ప్రయాణము
అప్పటికి ద్వారకలో ప్రయాణఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి
మొదలైన అష్టభార్యలు, 16 వేల భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపుర వాసులు
అందరూ పల్లకీలలోను, రథముల, బండ్ల, ఏనుగుల, అశ్వముల మొదలైన వాహనముల మీద
ద్వారకను దాటడానికి సిద్ధముగా ఉన్నారు. అర్జునుడు, దారుకుడు రాగానే అందరూ కదిలారు. అర్జునుడి నాయకత్వములో దారుకుడు
అందరినీ ద్వారక నుండి ప్రయాణము చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలు
16 వేల మంది, 8 మంది భార్యలు, బలరాముని నలుగురు భార్యలు, పల్లకీలలో
కుర్చున్నారు. వారివెంట సేవకులు నడుస్తున్నారు. వారివెంట బండ్లలో వారికి
కావలసిన సామానులు తీసుకుని వెళుతున్నారు. వారి వెనుక ద్వారకాపురి వాసులు
అందరూ తమతమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికి వెనుకగా అర్జునుడు తన
రథము మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకను దాటగానే సూర్యోదయము అయింది. సూర్యుడు
రాగానే సముద్రము ఒక్కసారిగా పొంగింది. ద్వారకానగరాన్ని సముద్రపు అలలు
ముంచెత్తాయి. అర్జునుడు యాదవులు ఒక్కసారి వెనుతిరిగి చూసారు. సముద్రము
ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడము చూసి గగ్గోలుపెట్టారు. అర్జునుడి
నేతృత్వములో వారంతా ఇంద్రప్రస్థము వైపు ప్రయాణము సాగించారు. అందరూ దారిలో
విడిది చేసారు. ఆ రాత్రి దొంగల దండు ఒకటి వారి మీద దాడి చేసింది. కేవలము
యాదవులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారి వెంట ఒక్క వీరుడు మాత్రమే ఉన్నాడు.
అతడిని కట్టడిచేస్తే అపారమైన ధనసంపద దోచుకోవచ్చు అనుకున్నారు. ఒక్కసారిగా
నిద్రిస్తున్న స్త్రీల మీద, యాదవుల మీద పడి వారి వద్ద ఉన్న నగలు, ధనము
అపహరించడము మొదలు పెట్టారు. ఇంతలో అర్జునుడు అక్కడకు వచ్చి వారిని మర్యాదగా
వెళ్లిపొమ్మని హెచ్చరించాడు. అయినా దొంగలు వినక స్త్రీల నుండి నగలు
అపహరించడము ఆపలేదు. అర్జునుడు కోపించి వారి మీద బాణములు ప్రయోగించాడు.
మొరటుతనముతో రాటుదేలి ఉన్న దొంగలను ఆబాణములు ఏమాత్రము గాయపరచ లేకపోయాయి.
అర్జునుడు తమమీద బాణములు వెయ్యడము చుసి దొంగలు అర్జునుడి మీద ఎదురు దాడి
చేసారు. అర్జునుడు ఎదురు దాడికి దిగ లేదు. అతడికి ఏ అస్త్రములు స్పురించ
లేదు. అందు వలన మామూలు బాణములు ప్రయోగించడము మొదలు పెట్టాడు. అర్జునుడి
తూణీరములో బాణములు అయిపోయాయి కాని దొంగలు దోపిడీ చేయడము ఆపలేదు.
అర్జునుడికి ఇదంతా దైవలీల అని అర్ధము అయింది. ధనము, నగలు వదిలి పెట్టి
రుక్మిణీ మొదలైన స్త్రీలను రక్షించాడు. దొంగలు దొచుకున్న నగలు, ధనముతో పారి
పోయారు. రథములు, బండ్లు తీసుకు వెళ్ళడానికి వీలు కాక అక్కడే వదిలి
వెళ్ళారు. అలా సర్వమూ కోల్పోయి కట్టుబట్టలతో వారంతా కురుక్షేత్రము
చేరుకున్నారు. వారి రాక విన్న హస్థినాపురవాసులు అక్కడకు వచ్చారు. జరిగిన
విషయాలను అర్జునుడు వారికి వివరంచాడు.
హస్థినలో యాదవులకు తగిన ఏర్పాటు చేయుట
అన్న ధర్మరాజు ఆజ్ఞానుసారము అర్జునుడు యాదవ స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు తగిన ఏర్పాట్లను చేసాడు. కృతవర్మ
కుమారుని అతడి తల్లి, కుమారులతో మృత్తికావత పురములో నివసించడానికి ఏర్పాటు
చేసాడు. మృత్తికావత పురానికి కృతవర్మ కుమారుడిని పట్టాభిషిక్తుడిని
చేసాడు. సాత్యకి
కుమారుడిని సరస్వతీ నగరానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. మిగిలిన వారిని
ఇంద్రప్రస్థముకు తీసుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడి మనుమడు వజృడిని
ఇంద్రప్రస్థానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. అక్రూరుడి భార్యను, అతడి
కుమారులను వజృడి సంరక్షణలో ఉంచాడు. అందరిని తగు ప్రదేశములలో సురక్షితముగా
ఉంచాడు. ఇక శ్రీకృష్ణుడి అష్టభార్యలు, బలరాముడి భార్యలు అర్జునుడితో
ఉన్నారు. వారికి బలరామ, శ్రీకృష్ణుల నిర్యాణ వార్తను ఎలా చెప్పాలా అని
ఆలోచించ సాగాడు.
శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎరిగించుట
అర్జునుడు ఒకరోజు మనసు దిటవు చేసుకుని రుక్మిణి, సత్యభామ
తదితరులను సమావేసపరిచి తాను దారుకుడితో బలరామ శ్రీకృష్ణులను వెదకడము అక్కడ
బోయవాడు కనిపించడము అతడిని స్రీకృష్ణుని గురించి అదగడము వరకు చెప్పి ఆ
తరువాత ఏడుస్తూ ఉండి పోయాడు. వారందరికి బలరామ శ్రీకృష్ణులు పరమ పదించారు
అన్న విషయము అర్ధము అయింది. అందరు పెద్ద పెట్టున రోదించడము మొదలు పెట్టారు.
కొంతసేపు అయిన తరువాత వారు మనసు దిటవు చేసుకుని " నాయనా ! అర్జునా !
అయినది ఏదో అయినది. తరువాత ఏమి జరిగినదో చెప్పు " అన్నారు. అర్జునుడు " దారుకుడు
నేను బలరామ, కృష్ణులను వెదుకుతూ ద్వారకానగరము మరిచాము. రోజులు లెక్కించి ఆ
మరునాడు ద్వారక మునిగి పోతుంది అని తెలుసుకున్నాము. ఈ విషయము మీకు చెబితే
మీరు చేయవలసిన కార్యక్రమాలలో మునిగిపోయి ద్వారకానగరముతో సహా మునిగి పోతారని
భావించి మేమే బలరామ క్రిష్ణులకు అంత్యక్రియలు నిర్వహించాము. ఆ రాత్రికి
రాత్రి మిమ్ములను ద్వారకానగరము దాటించాము. మీ అందరి ప్రాణాలను రక్షించాలని
ఇలా చేసాము కాని నా మనసులో ఏదో తప్పు చేసానన్న బాధ వేధిస్తున్నది. ఏమీ
చేయలేని పరిస్థితి. మీరంతా నన్ను మన్నించి నాకు ఏపాపము అంటకుండా చూడడండి "
అని వారికి ప్రణామము చేసాడు. రుక్మిణీ తదితరులు అర్జునుడిని లెవనెత్తి "
నాయనా అర్జునా ! విధి నిర్ణయము అలా ఉంటే నీవు మాత్రము ఏమి చేస్తావు ?
నీవేమి కావాలని చెయ్యలేదు కదా ! ఇక జరగవలసిన కార్యక్రమాలు చూడు " అన్నారు.
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో రుక్మిణీ, జామవతి తదితరులు
శ్రీకృష్ణుడితో సహగమనము చెస్తామని అన్నారు. అది విని బంధువులు అందరూ
ఏడ్చారు. వారిని వారించడానికి ప్రయత్నించారు. కాని వారు వినలేదు. వారిని
పల్లకీలలో ఊరేగించి చితి వద్దకు తీసుకు వచ్చారు. మంచి గంధపు చెక్కలతో
చితిపేర్చి బ్రాహ్మణులు అగ్ని కార్యము నిర్వహించారు. సహగమనము చెయదలచిన వారు చితిలో దూకారు. సత్యభామ తదితరులు తపసు చెసుకోవడనికి అడవులకు వెళ్ళారు.
అర్జునుడు వ్యాసుడిని దర్శించుట
రుక్మిణి తదితరుల సహగమనము తరువాత అర్జునుడు
వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళి అతడిని దర్శించుకున్నాడు. అర్జునుడు
వ్యాసుడికి భక్తితో నమస్కరించి " మహాత్మా ! యాదవులు అందరూ తమలో తాము
కొట్టుకుని మరణించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు
పాంచభౌతిక శరీరాలను వదిలి తమ స్వస్థానము చేరారు. ద్వారకానగరము సముద్రములో
మునిగి పోయింది. నేను అంతఃపురస్త్రీలను, యాదవులను తీసుకు వస్తుండగా దారి
మధ్యలో దొంగలు మా సర్వస్వము దోచుకుని వెళ్ళారు. ఆ సమయములో నాకు ఏ అస్త్రము
మంత్రసహితముగా స్పురణకు రాలేదు. గాండీవము దాని శక్తి చూప లేదు. నాకు
మాత్రము కారణము తెలియ లేదు. అమ్ములపొదిలో అమ్ములు అయిపోయాయి. కేవలము
మనుషులను మాత్రమే కాపాడి వారిని ఇంద్రప్రస్థము చేర్చాను. సాత్యకి, కృతవర్మ
సంతతిని రాజ్యాభిషిక్తులను చేసి యాదవులను వారి స్థానములలో నిలిపాను.
తమవద్దకు వచ్చాను. తరువాతి కర్తవ్యము భోదించండి " అని ప్రార్థించాడు. వ్యాసుడు
" అర్జునా ! దుర్వాసుడి పలుకులు, యాదవులకు మునులు ఇచ్చిన శాపము, గాంధారి
శాపము వృధా పోదు కదా ! అంతా విధివిలాసము ఎవరికి తప్పింపశక్యము కాదు.
యాదవనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసుకనుకనే వారు కలహించుకునే
సమయములో తటస్థంగా ఉన్నాడు కాని వారిని వారించడానికి ప్రయత్నము చెయ్యలేదు.
శ్రీకృష్ణుడికి మునుల శాపమును నివారించడము తెలియదా ! అలా చెయ్యడము
శ్రీకృష్ణుడికి ఇష్టము లేదు కనుకనే ఉపేక్ష వహించాడు. యాదవనాశనము జరగాలన్నది
శ్రీకృష్ణుడి సంకల్పము. నీవు యుద్ధము చేస్తున్నప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు
రధము మీద కూర్చుని రుద్రుడి సాయముతో నీ శత్రువులను చంపాడు. నీవు నీ
పరాక్రమంతో చంపానని అనుకున్నావు. అలాంటి కృష్ణుడు కాలము కలసి రాకుంటే
దొంగలబారి నుండి నిన్ను రక్షించలేదు. శ్రీకృష్ణుడు అవతారపురుషుడు. భూభారము
తగ్గించి ధర్మరక్షణ చేయడానికి అవతారము ఎత్తాడు. తాను సంకల్పించిన
కార్యక్రమాలు నెరవేర్చి అవతారము చాలించి స్వస్థానము చేరుకున్నాడు. అటువంటి
కృష్ణుడి వలన గీతాభోద విన్న నీవు దుఃఖించ తగదు. శ్రీకృష్ణుడి సాయంతో
భూభారాన్ని తగ్గించడానికి మాత్రమే నీ అక్షయ తుణీరాలు, గాండీవము
ఉపయోగపడ్డాయి. ఆ కార్యము నెరవెరగానే అవి నిర్వీర్యము అయ్యాయి. అస్త్రములు
కాని, శస్త్రములు కాని పురుషప్రయత్నము కాని దైవానుగ్రహము ఉంటేనే ఫలిస్తాయి.
నీవు జ్ఞానివి దీనికి శోకించతగదు. నా వలననే అంతా జరిగిందని గర్వించకూడదు.
మీ పాండవులు కూడా ఈ శరీరము వదల వలసిన సమయము ఆసన్నము అయింది. అందుకు తగిన
ప్రయత్నములు చేసి ఉత్తమగతులు పొందండి " అని వ్యాసుడు పలికాడు. ఆ మాటలు
విన్న అర్జునుడి మనసులో శోకము, మోహము దూరము అయ్యాయి. అతడి మనసు
నిశ్చలానందముతో తొణికిసలాడింది. ఆతరువాత అర్జునుడు హస్థినాపురముకు వచ్చాడు.
ధర్మరాజు తదితరులకు అప్పటి వరకుజరిగిన విషయాలు బలరామ, శ్రీకృష్ణుల
నిర్యాణము, తాను వ్యాసుడిని దర్శించడము అంతా సవివరముగా చెప్పాడు " అని
వైంపాయనుడు జనమేజయుడికి భారతకథను చెప్పసాగాడు.
మహాప్రస్థానిక పర్వము
- 1 ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట
- 2 పాండవులు మహాప్రస్థానికి తరలుట
- 3 అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట
- 4 పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట
- 5 ఇంద్రుడు ధర్మరాజును కలయుట
- 6 యమధర్మరాజు
- 7 నారద మహర్షి ధర్మరాజును స్వర్గములో కలయుట
No comments:
Post a Comment